అమ్మో అమ్మాయిలు 35

Listen Audio File :

బిందురేఖ ఇంటర్వ్యూతాలుకా జాబ్ రాలేదు కాని. ఓ కంపనీలో టైపిస్ట్ గా టెంపరరీ జాబ్ దొరికింది. కంపనీలో అబ్బులుకి తెలిసిన ఓ పెద్దాయన ద్వారా ఆ జాబ్ బిందురేఖకు వచ్చింది.

బిందురేఖ తల్లిదండ్రులు కుటుంబ నియంత్రణ పాటించనందున అరడజను మందిని కన్నారు. అందుల్లో నలుగురు ఆడ, ఇద్దరు మగ, మధ్య తరగతికి చెందిన వారు. అలాంటిదే సంపాదన. బిందురేఖ వాళ్ళ అమ్మా నాన్నకి మూడో అమ్మాయి. ఇద్దరు పైవాళ్ళకి పెళ్ళయింది.

పెళ్ళికి అప్పయింది. ఇద్దరమ్మాయిలకి ఇద్దర మ్మాయిలు పుట్టారు. అప్పు తాలుకూ వడ్డీ పెరిగి ఇది పిల్లలని పెట్టింది. ఎలాగూ ఓ అప్పు వుందిగా మరో అప్పుచేసి అబ్బాయికోరిన కట్నం యిచ్చినీ పెళ్ళి చేస్తాను అన్నాడు బిందురేఖ తండ్రి. కానీ కట్నం తీసుకోని అబ్బాయినే పెళ్ళాడుతాను. అందాకా కన్యగానే వుండి నా కాళ్ళ మీద నే బ్రతుకుతానని ఉద్యోగం వేటలో పడిందిట బిందురేఖ.

“మీ ధర్మమా అని జాబ్ దొరికింది. మీ మేలు మరిచిపోలేను" అంటూ తన కథ చెప్పింది బిందురేఖ అబ్బులుకి.

"నన్ను మరిచిపోవద్దు" అన్నాడు అబ్బులు.

అబ్బులు మాటవిన్న బిందురేఖ కోపంగా అబ్బులి భూతద్దాల్లోకి చూడబోయింది. కాని సిగ్గు ఆల్చిప్పల్ని ఆవరించాగా రెప్పల్ని వాల్చేసింది.

అబ్బులు భూతద్దాల్లోంచి ఓసారి, భూతద్దాలు తీసి ఓసారి ఆల్చిప్పల్లోకి అనురాగంగా చూడబోయి కుదరక "టైమ్ రానీ" అనుకున్నాడు. అబ్బులు బిందురేఖ మొదట ముహమాట పడి తరువాత సిగ్గుపడి ఆ తర్వాత ధైర్యం తెచ్చుకుని ప్రేమలో పడిపోయారు. ఎలాగో అలా అంతవరకు వచ్చారు. వచ్చారు కాబట్టి ఒకరినొకరు చూసి నవ్వుకోవటం, మాట్లాడుకోవటం... చాటుగా ఓ రకంగా, నలుగురెదుట ఓ రకంగా... వుండటం, మొత్తానికి కొంత దూరం పోయారు.

ఓ రోజు......... అబ్బులు బిందురేఖతో అన్ని విషయాలు మాట్లాడటం కుదరక, ఎందుకంటే బిందురేఖ చుట్టాలయిన వేలు విడిచిన భజన భక్తబృందం అనుమానపుపీనుగలు. కాబట్టి బిందురేఖ ఓ బుల్లికాగితం మీద ప్రేమ (పైత్యం) కవిత్వంతో నాలుగు లైన్లు గీకాడు. ఏమని.....? నా అందాల రాజకుమారీ! రేపు సాయంత్రం ఊర్వశి థియేటర్ కి వచ్చేసెయ్.నీకోసం ఎదురు చూస్తూ వుంట. ఊర్వశీలో మాంఛీ పిక్చర్ ఆడుతున్నది. నీవు నేను కలిసి ఆ పిక్చర్ చూడాలి ప్రేమకి కొత్త అర్ధాలు తీయాలి.

ఊ... అను... ఊ. అన్నావా. వెరీగుడ్ మా మంచి అమ్మాయివి నీకోసం ఎదురుచూసే... నీ రాజకుమారుడు. ఆ రాత్రి అబ్బులు ఆ లెటర్ తీసుకుని జయచిత్రా వాళ్ళ వరండాలోకి వెళ్లాడు. అప్పుడు టైము ఒంటిగంటయింది. బామ్మగారు జయచిత్రా వాళ్ల వద్దనే రాత్రిళ్ళు బిందురేఖ పడుకుంటున్నది. అబ్బులుకి ఆ పగలంతా బిందురేఖకి లెటరందించటం పడలేదు. అందుకని అర్థరాత్రి ఎన్నుకున్నాడు. మెల్లమెల్లగా చల్లచల్లగా వరండా మెట్లెక్కి మంచం వద్దకెళ్ళి మెల్లగా తట్టి లేపాడు.

స్ట్రీట్ లైట్ వెలుతురు వరండాలోకి పడుతుంది. కాబట్టి రాత్రిళ్ళు బామ్మగారు వరండాలో లైటుంచదు. ఇంట్లో మాత్రం చిన్నలైటు వుంటుంది. ఆ రోజు స్ట్రీట్ లైట్ వెలగటం లేదు. ఓ పక్క వరండాలో చీకటి. మరోపక్క అబ్బులి మనసులో గాభరా బిందురేఖ మంచం వద్దకు పిల్లిలా నడిచి బిందురేఖను తట్టిలేపాడు. సరిగా అప్పుడే బామ్మగారు కదిలింది. బామ్మగారు లేవబోతున్నదని గ్రహించిన అబ్బులు బోలెడు కంగారుపడి బిందురేఖ చేతిలో తాను రాసిన లెటర్ వుంచి గుప్పెటి మూసి వరండలో కిందకి ఒక్క జంప్ చేసి నాలుఅంగల్లో తన గదిలోకి వచ్చిపడ్డాడు.

జయచిత్రకు ఎవరోతట్టి లేపినట్లయి ఉల్లికిపడి నిద్రలేచింది. లేపిందెవరో కనపడలేదు. ఓ పక్క బామ్మగారి గురక చిన్నగా వినిపిస్తున్నది బిందురేఖ అటుపక్క వత్తిగిలి పడుకుని వుంది. “నన్నేవరూ లేపలేదే! లేపినట్లు ఎందుకనిపించింది?” అని ఆలోచిస్తూ బుర్ర గోక్కోబోయింది జయచిత్ర. అప్పుడనిపించింది తన చేతిలో మడత పెట్టబడ్డ కాగితం వుందని.