అమ్మో అమ్మాయిలు 31

Listen Audio File :

“హిమబిందుని రాక్షసుడు తన యింట్లో దాచిపెట్టాడు. మెలకువ వచ్చిన రాజకుమారి రాక్షసుడిని చూసి భయంతో గజ... గజ... గజగజ... గజగజ... గ...”

"చాల్లెండి అర్థమయింది.”

“ఏమర్థమయింది? ఆ రాజకుమారి ఎంతసేపు వణికింది చెప్పొద్దేమిటి?”

“గంట వణికిందని చెప్పండి. లేకపోతే రెండు గంటలొణికిందని చెప్పండి. అంతేగాని గజగజ గిజగిజ అంటూ అంతసేపూ మిరొణికితే మేం భరించలేం" ఖచ్చితంగా చెప్పేసింది జయచిత్ర.

“సరే, హిమబిందు ఓ అయిదు నిమిషాలొణికి ఆ తర్వాత ధైర్యం తెచ్చుకుని "ఎవడవు నీవు? దుర్మార్గుడా ఏ దుష్ట తలంపుతో నన్నిచ్చటికి తెచ్చిటివి?” అంది.

రాక్షసుడు వికటాట్టహాసం చేసి, “ఓహో! అందాల చిన్నదానా! ఏమి నీ పలుకులు! ఎంత మధురంబుగనున్నవి? నీ మోము చూడకడు దివ్యంబుగనుంది. సుందరీ! నీ పొందు కూడని నా జన్మ ఏల రమ్ము. ఒక పర్యాయంబు చాలు. నా కౌగిలిలో వచ్చి వాలుము. భయమేలనే బేలా!”

“ఇదేం భాష! గ్రాంధికమా? సంశ్వతమా? రాక్షసమా?” అంది జయచిత్ర.

“అవునూ! రాజకుమారి ఆకారం ఆరడుగుంటే రాక్షసుడి ఆకారం పెద్ద కొండంత వుంది కదా? వీళ్ళిద్దరూ ఎలా కౌగిలించుకుంటారు. ఇంపాసిబుల్" ఆవేశంగా అని ఆపై బోలెడు సిగ్గుపడింది బిందురేఖ.

“ఎట్టాగోఅట్టా. కథ కానీండి" అంది జయచిత్ర.

“ఇంతలో రాక్షసుడిని ఎవరో పిలవటం వల్ల రాజకుమారిని గదిలోపెట్టి తాళంవేసి వెళ్ళిపోయాడు. ఈ కథ ఇక్కడ యిలా వుంటే అక్కడ అవంతీపురంలో రాజు బెంబేలుపడి యిలా ప్రకటించాడు. “మా హిమబిందువుని ఎవరైతే సురక్షితంగా తీసుకొచ్చి మాకప్పగిస్తారో వారిని నా అల్లుడిగా చేసుకునేదేగాక నా అర్థరాజ్యం యిస్తానోహో" అని నలువైపులా చాటింపు వేయించాడు. ఆ చాటింపు విన్న విక్రమపురం రాజకుమారుడు విజయకేతుడు ముందుకొచ్చి రాజకుమారిని తాను తెస్తానని చెప్పి బయలుదేరాడు.

“అవునా, నాకో అనుమానం రాజకుమారి గుంటూరులో వుందో తెలియదు. గూడూరులో వుందో తెలియదు. ఏ గుహలో వుందో తెలియదు. ఇతగాడు ఏ ధైర్యంతో తగుదునమ్మా అని బయలుదేరాడు" అంది జయచిత్ర.

“ఇట్లా అయితే నేను కథ పూర్తిచేయను. చేయనుగాక చేయను" అని అబ్బులు భీష్మించుకుని కూర్చున్నాడు.

“ఎట్టాగో అట్టా వింటాం. ఎట్టాగొట్టా పూర్తి చేయండి" అంది జయచిత్ర.

“బ్రతిమిలాడుతున్నారు పాపం సాంతం కథ చెప్పేయమ్మా అబ్బూ!” అన్నాడు వ్యాకర్ణ.

“సరే చెపుతాను. కథ మధ్యలో నోరు మెదపరాదు" అన్నాడు అబ్బులు.

“కథంతా పూర్తిగా విని మా అనుమానాలు తీర్చుకుంటాం. అభ్యంతరమాండి?” అంది బిందురేఖ.

“లేదండీ"

“సరే ఎలాగోలా తొందరగా కథ కానీండి"

“ఆ తర్వాతేం జరిగిందంటే....!” అంటూ మొదలుపెట్టి అరగంటలో మొత్తం కథ చెప్పేశాడు అబ్బులు. చెప్పి.... “కథెట్లావుంది?” అని అడిగాడు.

“నా ముఖంలా వుంది" అందిబిందురేఖ.

“అబ్బో! అయితే నా కథ చాలా చాలా బాగుందన్నమాట!”

“అయితే బిందురేఖ ముఖం చాలా చాలా బాగుందన్నమాట మీకు!” అంది జయచిత్ర.

“అచ్చం రాజకుమారైలా వుంది" అన్నాడు అబ్బులు.

“ఛీ...ఆ సొగరాలు కట్టేదానితో నన్ను పోల్చకండి" అంది బిందురేఖ.

వ్యాకర్ణ పైకే నవ్వేశాడు. "రాజకుమారైకు మా మంచి పేరు తలిగించారు" అన్నాడు