అమ్మో అమ్మాయిలు 7

Listen Audio File :

ఎవరి నాలుక వాళ్ళే కొరుక్కున్నారు అబ్బులు, వ్యాకర్ణలు. 'ఈ పిల్ల పిల్లకాదు పిగుడు. చూస్తుంటే మతిపోతున్నది. మాటలు వింటుంటే ఎదుటి వారికే నాలుక తిరగబడుతున్నది. బామ్మగారికి తగ్గ మనవరాలు కాదు కాదు. పిల్ల రాక్షసి. కాకపొతే అందంగా వుంది. అంతే'' అనుకున్నారు. బామ్మగారి యింటిమీద కూడా నీళ్ళు వదులుకున్నారు.

“అన్నట్లు సినిమా అంటే గుర్తొచ్చింది. దానవీరశూరకర్ణ ఆడుతున్నదా జయా!”

“నాకన్నా వీళ్ళకే సినిమాల విషయం బాగా తెలుసు. వీళ్ళనడుగు నానమ్మా"

“ఏ హాలులో ఆడుతుంది నాయనా ఆ సినిమా?”

బామ్మగారికి సినిమా పిచ్చివున్నట్లు గ్రహించి "సినిమా హాలులో ఆడుతుందండి" అన్నాడు వ్యాకర్ణ.

“పోనీలెండి. ఇదయినా కరెక్టుగా చెప్పారు" అంది జయచిత్ర నవ్వాపుకుంటూ.

“కర్ణంటే గుర్తుకొచ్చింది. నీ పేరు వ్యాకర్ణ కదూ. కర్ణుండంటే మీవాళ్ళకిష్టమా?” అంది బామ్మగారు.

“కర్ణుడంటే మావాళ్ళకిష్టం కాబట్టే నాకా పేరు పెట్టారండి. మా యింటి పేరు వ్యామోహం వారు. కర్ణ నా పేరు. పేరు పెట్టగానే సరాండి. ఆ పేరు నిలుపుకోవాలి కదా. ఎలాగూ దానవీరశూరకర్ణుడ్ని కాలేను. ఆఖరికి ఉత్త కర్ణకి కూడా పనికిరాను కాబట్టి మా యింటి పేరులో మొదటక్షరం కలుపుకుని వ్యాకర్ణ అని చెప్పుకుంటున్నాను. మా అబ్బులు వున్నాడాండీ. మీదు మహ టక్కరి. ఏదో ఒకటి అడిగి తీసుకుంటాడు. తిరిగి అడిగితే కర్ణ పేరుకే అపకీర్తి తెస్తున్నావురాఅంటూ నోరు మూయిస్తాడు. నా పేరుకన్నా వీడి పేరు వెయ్యి విధాల నయమనుకోండి" అంటూ ముగించాడు వ్యాకర్ణ.

“అబ్బులు అంటే ముద్దు పేరా నాయనా?” అని అడిగింది బామ్మగారు.

అబ్బులు కాలరు, కంఠము ఒకేసారి సవరించుకుని తర్వాత కళ్ళజోడు సవరించుకుని నుంచుని చెప్పాడు "బామ్మగారూ! నా అబ్బులి పేరు వెనుక ఓ బుల్లికథ వుంది. నా నామకరణ మహోత్సవం బంధు మిత్రుల సమక్షంలో చిన్న పెళ్ళికి అయ్యేటంత ఖర్చుతో అయింది. మా నాన్నగారికి బోలెడు ముఖమాటం. చచ్చిన బతికినా బందువులందరి పేర్లు కలిపి ఎవరి మనసు నొప్పించకుండా వుండటానికి పద్నాలుగు కిలోమీటర్ల దూరం రాసేటంత పేరు పెట్టారు! ఏ దేవుడికి ఏ బంధువుకి అన్యాయం జరక్కుండా నా పేరులో అందరి పేర్లు కలిశాయి. శ్రీ శాయి వెంకట శ్రీనివాస మధుమోహన దురగా గోవింద సీతాకృష్ణ రామాంజనేయ విరూపాక్ష నారాయణ నర్మదేవ వీరవిక్రమ సూర్యచంద్ర విఠల మనోహరసుబ్రహ్మణ్య శంకరప్రకాశ విష్ణువర్ధన......”

“నానమ్మా ! నీ దగ్గర దేవుడి దండకాల పుస్తకాలున్నాయి. దాంట్లో చూడు, ఈయన గారి నామ ధేయం తెలుస్తుంది" అంది మధ్యలో అడ్డు తగిలిన జయచిత్ర.

బామ్మగారు చిద్విలాసంగా మనుమరాలి మాటలకు నవ్వి ఓ పర్యాయం ముళ్ళకిరీటం సరిచేసుకుని "అబ్బులనే పేరు నీ పేరులోచివరి భాగమా?” అంది.

“కాదు" అన్నాడు అబ్బులు.

“మధ్య భాగమా?” అంది జయచిత్ర నవ్వాపుకుంటూ.

అబ్బులు లోలోపల ఉడుక్కుని పైకి అమాయకంగా ముఖంపెట్టి "నా పేరుంది చూశారూ?” అన్నాడు.

“ఏంటీ, మీ పేరు మళ్ళీ మొదలు పెట్టబోతున్నారా?” అంది జయచిత్ర బోలెడు కంగారు పడిపోతూ.

“లేదులెండి అసలు విషయానికొస్తాను. నా పేరు పెద్దది కావటానికి కారణం చెప్పాకదా! ముద్దు పేరు విషయానికొస్తాను. మా అమ్మ నా పేరుని రకరకాలుగా పిలిచేది. ఓసారి కృష్ణా అంటే ఓసారి రామా అనేది. అలాగే ఎవరితో అయినా మాటల మధ్యలో కూడా చెప్పేది. ఓసారి కొత్తగా మా యింటి కొచ్చిన ఓ ఆవిడతో మా అమ్మ యిలా అంది. “మా రామం ఉత్త కొంటె కోణంగి అనుకోండి. పేరు కృష్ణుడు చేసేవి దొడ్డ పనులు. మా చంద్రానికోసారి జ్వరం వచ్చింది. డాక్టరుగారిహస్తవాసి మంచిది కాబట్టి మంచానికంటుకుపోయిన మా సూర్యం లేచి కూర్చున్నాడు. శంకరాయ్ విషయంలో......”

మా అమ్మ వాక్ ప్రవాహానికిఅడ్డుపడుతూ వచ్చినావిడ అడిగింది "మీకెంతమంది కొడుకులండీ?” అంది. “ఒక్కడే అబ్బాయండి" అంది మా అమ్మ. అసలు విషయం విన్న ఆవిడ అరగంటదాకా నవ్వుతూనే వుందిట. అప్పటినుంచీ మా అమ్మ ఏదో ఓ పేరుతోనే పిలవటం మొదలుపెట్టింది. దానికీ చుక్కెదురే అయింది" అంటూ ఆగి ఖర్చిఫ్ తీసి నుదుట పట్టిన చెమటని తుడుచుకున్నాడు అబ్బులు.