అమ్మో అమ్మాయిలు 6

Listen Audio File :

అబ్బులు భూతద్దాల కళ్ళజోడులోంచి నాలుగు కళ్ళతో ఆ అమ్మాయిని ఎగాదిగా చూశాడు. వ్యాకర్ణ కళ్ళతోనే చూశాడు. అంటే వ్యాకర్ణ తక్కువ తినలేదు. తను ఆ అమ్మాయిని

ఎగాదిగా కిందనుంచి పైకి, పై నుంచి కిందకి చూశాడు. రెండు జడలు వేసుకుని ఆ అమ్మాయి అందంగా ముద్దుగా బొద్దుగా బాగుంది. ప్రస్తుతం ముఖం సీరియస్ గా బామ్మగారి ముఖంలో చూస్తూ నడుం చుట్టూచేతులు కట్టుకు నుంచుంది. “ఈ అబ్బాయిలు చాలా మంచివాళ్ళే జయా! మన తూర్పు భాగం రెండు గదులలోకి అద్దెకొచ్చారు" అంది బామ్మగారు.

“అద్దెకొచ్చారా? ఎవరినడిగి? ఎప్పుడు? ఎందుకు? ఎట్లా?” అంది మిత్రులను ముఖం ఎర్రజేసుకు చూస్తూ.

అబ్బులు, వ్యాకర్ణ గతుక్కుమన్నారు "ఈ పిల్లెవరురా బాబూ! ఉరవసి పిడుగులా వూడిపడింది. ఈ యిల్లు కూడా మనకి ప్రాప్తం లేదా" అనుకున్నారు. బామ్మగారిని పొగిడినట్లు ఎర్ర తేలులా వున్న ఈ పిల్లన్నీ పొగిడితే! జాలిగా అద్దె యిళ్ల కోసం తాము ఎన్ని విధాల బాధపడిందీ కథగా చెప్పేస్తే.. వ్యాకర్ణ, అబ్బులు కళ్ళతోనే మాట్లాడుకున్నారు. అలా మాట్లాడుకోవటం అప్పుడప్పుడు వాళ్ళ కలవాటే.

“అద్దెకి ఎప్పుడో న ఫ్రెండ్స్ కిచ్చాను.. మా నానమ్మకి తెలీదు. అందుకే మీకు మాటిచ్చింది. మీరు మరో యిల్లు చూసుకోవచ్చు" ఏమనుకుందోగాని బామ్మగారి మనుమరాలు జయ శాంతంగా చెప్పేసింది.

ఈ జయ అనే పిల్ల అబద్దమాడుతుందని గ్రహించారు మిత్రులు. లాభం లేదని రంగంలోకి దిగారు. “నా పేరు వ్యాకర్ణ" ఓ అడుగు ముందుకేసి పాంటు జేబులో చెయ్యి దూర్చుకుని గంభీరంగా అన్నాడు వ్యాకర్ణ.

“వ్యాకర్ణమో గోకర్ణమో మీ పేరెవడిక్కావాలి? నా పేరు జయచిత్ర. అయినా నా పేరు చెప్పుకున్నానా?” అంది జయచిత్ర.

“అవునవును. ముందుగా చెప్పుకోలేను గానీ యిప్పుడు మీ పేరేదో చెప్పేశారు.. ఓహో! ఎంత చక్కని పేరండి జయచిత్ర! అన్నట్లు జయచిత్ర అనే సినీతార మీ ఫేవరేట్ గాబోలు, జయచిత్ర నా ఫేవరేట్ కూడానండి. జయచిత్రంటే నే పడిచస్తాను.”

జయచిత్ర నిప్పులు కళ్ళనుంచి కురిపించలేదు గాని మొత్తానికి అలా చూసింది వ్యాకర్ణని. “నిజం చెప్పాలంటే జయచిత్ర నటించిన చిత్రం మొదటిరోజు మొదటి ఆట చూడాల్సిందే. బంగారు బొమ్మల్లో నాగేశ్వరరావు ప్రక్కన జయచిత్ర ఎంత గొప్పగా నటించింది! ఎ.ఎన్ . ఆర్. పందొమ్మిదేళ్ళ కుర్రాడిలా ఎలా నటించాడనుకుంటున్నారు. పక్కనే జయచిత్ర వుంది. ఆయనలో పడుచుదనం పరవళ్ళు తొక్కి.. తొక్కి....”

జయచిత్ర ముఖ కవళికలు చూసి తను తప్పు మాట్లాడుతున్నట్లు గ్రహించుకున్నాడు వ్యాకర్ణ. అప్పటికే ఆలస్యం అయిపోయింది. అబ్బులు వ్యాకర్ణ చెవిపుచ్చుకు వెనక్కులాగి భూతద్దాల కళ్ళజోడు సరిచేసుకుంటూ ముందుకొచ్చాడు. “క్షమించాలి జయగారూ! మా వాడికి పైత్యం చేస్తుంటుంది. బంగారు బొమ్మల్లో ఎ.ఎన్.ఆర్ పక్కన నటించింది వాణీశ్రీ అని తెలియక మీరనుకున్నాడు సో..... సారీ! మీ పేరు జయచిత్ర అనుకున్నాడు. వీడి ముఖం వీడికేం తెలుసండి. వాణిశ్రీ జయచిత్రకి భేదం తెలియకపోయే పైగా..........”

అబ్బులు మాట పూర్తిగాకముందే జయచిత్ర విరగబడి నవ్వింది. ఆ పిల్ల అలా పడిపడి నవ్వటం దేనికో వీళ్ళిద్దరికీ అర్థంకాలేదు. వేపకాయంత వెర్రి వుందేమో అనుకున్నారు.

“ఏమిటే ఆ వెర్రి నవ్వు?” అంటూ బామ్మగారు కోప్పడటంతో జయచిత్ర చప్పున నవ్వాపేసి "నాయనమ్మా, వీళ్ళద్దరూ పుట్టింది బందరులో" అంది.

“అరే, నీకెలా తెలుసే జయా?” అంది బామ్మగారు ముళ్ళ కిరీటాన్ని సరిచేసుకుంటూ, బోలెడంత ఆశ్చర్యంతో.

“బందరు పిచ్చాళ్ళని అంటుంటారు. నీవేప్పుడు వినలేదా నానమ్మ! ఇదిగో వీళ్ళు అలాంటి బాపతు. బంగారు బొమ్మల్లో జయచిత్రాలేదు వాణిశ్రీ లేదు. మంజుల వుంది" అంటూ మరోసారి విరగబడి నవ్వింది జయచిత్ర.