అమ్మో అమ్మాయిలు 5

Listen Audio File :

మిత్రులు ఓపిగ్గా నుంచుని కథ విన్నారు. కథ పూర్తి చేసిన బామ్మగారు నెత్తిన గుడ్డ సవరించుకుని యిలా అంది - “మీ కష్టమేమిటో నాతో చెప్పనేలేదు. చెప్పేలోపలే కళ్ళు - కళ్ళ జోళ్ళు - కష్టనష్టాలు చెప్పుకున్నాము. ఎంతటి వారికయినా తప్పవు నాయనా! మా తల్లిదండ్రులు (ఎంతమంది తండ్రులు) నాకు ద్రౌపది అని పేరు పెట్టారు. ఆయన సాక్షాత్తూ ధర్మరాజే అనుకో. (చూళ్ళేదుగా! అనుకుంటాం) నన్ను దేవతలా చూసుకున్నారు. కాలు కిందపెట్టనిచ్చేవారు కాదు. (నెత్తిన పెట్టుకు తిరిగేవాడా?)

ఏ కష్టం ఎరక్కుండా ఏడేళ్ళు కాపురం చేశాను. ఆ తర్వాత ఓ రోజు నన్నన్యాయం చేసి వారిదోవ వారు చూసుకున్నారు. (లేచిపోయాడా ఏం ఖర్మ?) బామ్మగారు తన కథ చెపుతుంటే అర్థమయిందా? అన్నట్టు చూశాడు వ్యాకర్ణ. “సేమ్ టు సేమ్" అన్నాడు అబ్బులు. వెంటనే బామ్మగారు "ఏంటి నాయనా అన్నావ్?” అంది.

“అబ్బే ఏం లేదు. విచారిస్తున్నాం" అన్నాడు అబ్బులు విచారంగా ముఖంపెట్టి. తప్పదన్నట్లు వ్యాకర్ణ కూడా బోలెడు విచారంగా ముఖం పెట్టాడు. “చూశారా చూశారా! మొగపిల్లకాయలు నా కథ మీకే విచారం కలిగిస్తున్నదంటే ఆ సమయంలో నా కెంత విచారం కలిగించి వుండాలి? చా.....లా... అవును కదా? ఏం చేస్తాను. తప్పుతుందా? నా నుదుట గీత అలా వుంది. ఓ పక్క ఆయన అన్యాయం - మరోపక్క ఏడాది పసిగుడ్డు - మరో పక్క నెత్తిన ఈ ముళ్ళ కిరీటం - నా సంగతి నా దుఃఖం ఆ పరమాత్ముడి కెరుక.

ఆయన బ్రతికుండగా సర్వ సౌఖ్యాలు చూపించారు. పోతూ పోతూ 'ఇహ నీ ఏడుపు నీవేడుపు' అని ఈ ముళ్ళ కిరీటం నెత్తిన పెట్టి దీవించి మరీ పోయారు. ఏం చేస్తాను. నాకు ఆయుష్షు వుండబట్టి యింకా బతికి వున్నాను. మనిషన్న తర్వాత కష్టాలు తప్పవు. ఇంతకు మీ కష్టం చెప్పారు కాదు" అంటూ బామ్మగారు ముక్కు చీదుకుని నెత్తిన చెంగు సవరించుకున్నారు. అబ్బులికి, వ్యాకర్ణకి బాగానే అర్థమయిందిబామ్మగారి కథ.

బామ్మగారి భర్త బామ్మగారితో ఏడేళ్ళుమాత్రమే కాపురం చేసి చనిపోయారని. బామ్మగారు ఉన్న ఒక్క కొడుకుని పెంచి పెద్దచేసింది. ఆవిడ మాటకు ముందు నెత్తిమీద గుడ్డ సవరించుకుంటూ లేక ముందుకు లాక్కుంటూ బహు ముచ్చటగా అనేమాట ముళ్ళకిరీటం (నెత్తిన ముసుగ) అని. ముసుగు అంటే నచ్చక కిరీటం అంతే గుండుకి తగిలించుకోరు కాబట్టి ముళ్ళకిరీటం అంటూ వుంటుందని గ్రహించారు. బామ్మగారు అమాయకురాలు, అల్ప సంతోషి అని గ్రహించి బామ్మగారి కొచ్చిన కష్టానికి ఒక్కొక్కరూ విచారం వెలిబుచ్చి, జాయింటుగా కూడా వెలిబుచ్చి, చివరికి వీళ్ళ కష్టం అసలా అద్దెకి గది కావాలని అడిగారు.

బామ్మగారు వీళ్ళిద్దరికీ రెండు గదులున్న ఖాళీ వాటాను చూపించింది. అబ్బులుకి వ్యాకర్ణకి గదులు నచ్చాయి. రెండు గదులు కాబట్టి రేటెక్కువ అనుకున్నారు. కాని బామ్మగారు అద్దె తక్కువే చెప్పింది. మిత్రులకి బోలెడు సంతోషం వేసింది. ఎందుకయినా మంచిదని బ్రహ్మచారులమని చెప్పాడు అబ్బులు. “మంచితనం చెడ్డతనం మనిషిలో వుంటుంది. బ్రహ్మచారయినా, పెళ్ళయిన వాడయినా, నలుగురు బిడ్డలా తండ్రయినా మంచివాడు ఎప్పుడూ మంచివాడే" అంది బామ్మగారు.

బామ్మగారి మాటలు విన్న వ్యాకర్ణ, అబ్బులు బామ్మగారి రెండు కాళ్ళూ పట్టుకుని గాని లేక చెరో కాలు పట్టుకుని గాని నమస్కారం పెడుదామనుకున్నారు. సినిమాలో అయితే బాగుంటుంది గాని నిజ జీవితంలో ఎలా బాగుంటుందని మానివేశారు. ఎందుకయినా మంచిదని బామ్మగారిని పొగడటం మొదలుపెట్టారు. అప్పడే "ఎవరు వీళ్ళూ? ఎందుకొచ్చారు?” అంటూ ఓ టీనేజ్ అందమైన అమ్మాయి వచ్చింది అక్కడికి.