అమ్మో అమ్మాయిలు 4

Listen Audio File :

అబ్బులు, వ్యాకర్ణ మరో నాలుగు వీధులు తిరిగారు. అక్కడో టులెట్ బోర్డు మెరుపులా కనబడింది. ఈ రోజుకి ఈ ఒక్క టులెట్ చూసి కొంపకి చేరుకుందాం అనుకుని తలుపు తట్టారు. తలుపు తట్టేముందు అనుకున్నారు నమస్కారం పెట్టకూడదు తిక్కగా మాట్లాడకూడదు అని. “ఎవరది? వచ్చె వచ్చె" అంటూ లోపలినుంచి వినపడింది. ఆ వెంటనే తలుపులు తెరుచుకున్నాయి. ఓ గుండు బామ్మగారు గుండు మీద వుండనంటూ జారిపోతున్న మల్లుగుడ్డని ముఖం మీదకు లాక్కుంటూ వాకిట్లోకొచ్చింది. గుండు బామ్మగారు అక్షరాల గుండేసుకుని వుండటమే గాక గుండులా ఉంది.

తెల్లగా అందంగా వుంది. మొఖానికి రోల్డుగోల్డు ఫ్రేముగల కళ్ళజోడు వుంది. పూర్వాశ్రమంలో అందగత్తెననిపించే విధంగా ఇప్పుడూ బాగుంది. అమాయకంగా ఉంది. గుండు బామ్మగారికి నమస్కారం పెట్టాలో అక్కరలేదో అసలేం మాట్లాడాలో తెలియక కంగారుపడ్డారు అబ్బులు, వ్యాకర్ణ.

“ఎవరు కావాలి నాయనా!” చాలా శాంతంగా అడిగింది గుండు బామ్మగారు.

“తాతగారు" అనబోయి నాలుక్కొరుకున్నాడు అబ్బులు.

“ఆయనే వుంటే మంగలెందుకు నాయనా?” అన్న సామెత గుర్తుకొచ్చింది.

“ఎవరూ అక్కరలేదండి" అన్నాడు వ్యాకర్ణ.

“దాహం కావాలా నాయనా!” అంది బామ్మగారు వీళ్ళ ముఖాన పట్టిన చెమట చూసి.

"దాహం అంటే ఏమిటబ్బా?” అన్నట్లు అబ్బులు, వ్యాకర్ణ ముఖముఖాలు చూసుకుని, దాహం అంటే మంచినీళ్ళని గుర్తుకు తెచ్చుకుని వాళ్ళ ముఖాలు చూసుకోటం మానేసి బామ్మగారు ముఖం చూస్తూ "కావాలండీ" అన్నారు.

బామ్మగారు మంచినీళ్ళు ఓ పెద్ద మర చెంబు నిండా తెచ్చి యిచ్చింది. మంచినీళ్ళు గడగడ తాగింతర్వాత కంగారు, బుర్ర తిరుగుడు తగ్గాయి మిత్రులకి. “బామ్మగారూ!” అంటూ ఆప్యాయంగా అతి వినయంగా పిలిచాడు అబ్బులు

. 'బామ్మగారు!” వెంటనే వ్యాకర్ణ భక్తిశ్రద్ధలతో అన్నాడు.

“ఏం కావాలి నాయనా?” అంది బామ్మగారు.

“మీరు క్షమిస్తానంటే ఓ మాట అడుగుతాను " అన్నాడు వ్యాకర్ణ.

“ఏం తప్పు చేశావు నాయనా క్షమించడానికి" అంది బామ్మగారు.

“నీ బొంద? నీకు మాట్లాడడం రాదు, చావదు" అని అబ్బులు పైకే కసురుకుని వ్యాకర్ణని పక్కకి లాగి బామ్మగారి ముందు నుంచున్నాడు వినయంగా.

“బామ్మగారూ!” అన్నాడు అబ్బులు అతి అమాయకంగా.

“ఏంటీ నాయనా, నిన్ను క్షమించాలా?” అంది బామ్మగారు.

కిసుక్కున నవ్వాడు వ్యాకర్ణ. అబ్బులు గతుక్కుమని, ఆపై కళ్ళజోడు తీసి నిప్పులు కక్కే కళ్ళతో వ్యాకర్ణని చూసి మళ్ళీ కళ్ళజోడు తగిలించుకుని బామ్మగారివైపు తిరిగి వినయమూ చిరునవ్వూ తనకే తగునన్నట్లు ముఖం పెట్టి - "బామ్మగారూ! నా ముఖం యిప్పుడెలా వుంది!” అన్నాడు సీరియస్ గా.

“వాడిపోయింది నాయనా!” అంది బామ్మగారు.

“కరెక్ట్. బామ్మగారు కాబట్టి అదీ పెద్దావిడ అన్నీ తెలిసిన ఆవిడ కాబట్టి వెంటనే నా ముఖారవిందం ఎలా వుందో కనిపెట్టగలిగింది" అని వ్యాకర్ణతో ఆపై బామ్మగారితో, “బామ్మగారూ! నా ముఖం వాడిపోయిందని పెద్దవారు మీరొప్పుకున్నారు. మీరొప్పుకున్నారంటే అందులో అణు మాత్రం అబ్బాడం లేనట్లే (కొయ్ కొయ్) నా ముఖం వాడిపోయింది. ఇహ కుమిలిపోవటం ఆపై హ్హో హ్హో....” అని. కళ్ళజోడు తీసి జేబులోంచి కర్చీఫ్ తీసుకుని కళ్ళు తుడుచుకుని కర్చీఫ్ జేబులో పెట్టుకొని కళ్ళకి జోడు పెట్టుకుని దీనంగా కళ్ళజోడులోంచి బామ్మ గారిని చూస్తూ ఉండిపోయాడు.

“వీడి ముఖం. వీడి ప్లాను ఏడ్చినట్లే వుంది. వీడు నాటకాలలో తెరవెనుక పాత్రకి కూడా పనికి రాదు. నా ప్రతాపం చూపిస్తాను" అనుకుని వ్యాకర్ణ ఓ అడుగు ముందుకేశాడు. సరిగ్గా అప్పుడే బామ్మగారు అబ్బులుతో "ఏడ్వకు నాయనా!” అంది.

“నేనెక్కడేడ్చాను! ఛా ఛా....” అన్నాడు అబ్బులు. “కళ్ళు తుడుచుకున్నావుగా!” అంది బామ్మగారు. “నలక పడ్డది" అనేశాడు అబ్బులు. “కళ్ళజోడు వుండంగానే?” ఆశ్చర్యపోయింది బామ్మగారు. “మీకు తెలీదు బామ్మగారూ! కళ్ళజోడు వుండగానే నలకలు పడటమే కాదు. కామెర్లు, కళ్ళకలక కూడా రావచ్చు.”

“నిజమే నాయనా! నాకూ కళ్ళజోడుందిగా. ఓసారి ఏమయిందనుకున్నావు? ఓ చీమ కళ్ళజోడు పక్కనుంచి పాకి కంట్లో పడింది. అప్పుడు కళ్ళజోడున్నా బాధలు తప్పవని ఒప్పుకుంటూ" తన కళ్లలో పడ్డ ఆ చీమ కథ పది నిమిషాలు చెప్పింది బామ్మగారు.