అమ్మో అమ్మాయిలు 3

Listen Audio File :

మధ్య మధ్య యింటాయన సణుగుతూనే ఉన్నాడు "వీళ్ళు మంచివాళ్ళు. నాకు నమస్కారం పెట్టారేవ్" అంటూ.

జాయింటుగా ఇరువురు నమస్కారం పెట్టి అక్కడినుంచి బయటపడ్డారు వ్యాకర్ణ అబ్బులును అడిగాడు. “అరే అబ్బూ! ఈ రోజు మనం ఎన్ని ఇళ్ళూ చూశాంరా?”

“కనీసం నూటయాభయి వుంటాయి.”

“ఏడ్చావ్! ఇళ్ళంటే వుత్త ఇళ్ళు కాదురా శూరకర్ణా! అద్దె ఇళ్ళు.”

“పదిన్నర"

“పదిన్నరేమిటిరా? పంది కొక్కులు పందులకి పుడతాయన్నట్లు వుంది.”

“భయ్యా! పదిన్నర అంటే - పూర్తిగా అద్దె యిళ్ళు చూసింది పది. వాళ్ళకి నచ్చక, మనకి వాళ్ళ గదులు నచ్చక వదిలేశామనుకో అది వేరే సంగతి. అర సంగతి - అంటే ఇంతకుముందు మనం నమస్కారం పెట్టి యింటి సంగతి - ఇంటాయన, యింటావిడ ముఖం చూశాంగాని అద్దె భాగం చూడలేదు గదా! అందుకని అర అన్నాను"

“ఏడ్చినట్లే వుంది నీ లెక్క"

“ఈ ఎండలో మరో గంట తిరిగితే ఏడ్చినట్లేం ఖర్మ నిజంగా ఏడ్వాల్సిందే. కాళ్ళూ, తల, వళ్ళు అన్నీ మాడిపోతున్నాయి.”

“కాళ్ళకి బూట్లున్నాయి. తల మీద జుట్టుంది. వంటికి బట్టలున్నాయి. నోరు మూసుకు నడువు. కష్టపడకపోతే ఇల్లెక్కడ దొరుకుతుందిరా"

“నడవక తప్పదంటావ్?” బోలెడంత నీరసపడిపోతూ అన్నాడు వ్యాకర్ణ.

“తప్పుతుంది. ఓ పనిచేస్తే" తేలిగ్గా అనేశాడు అబ్బులు.

“ఏం చేస్తే?” నడక తప్పుతుందంటే ఎంతో సంతోషం వేసింది వ్యాకర్ణకి.

“మీ బాబుని తలుచుకో"

“బాబునా!”

“అవునురా, సూర్యభగవానుణ్ణి తలుచుకో.”

“మా అమ్మ కుంతి కాదు. మా అయ్య సూర్యనారాయణ కాదు. మరో ఉపాయం చెప్పు.”

“ఓ పని చెయ్.”

“చెప్పు మరి" 'నా నెత్తినెక్కు" అంటూ తలవంచాడు అబ్బులు. మాటల్లో ఎదురుగా వస్తున్న లావుపాటి శాల్తిని చూడలేదు. అబ్బులు తలవెళ్ళి శాల్తీ తాలూకా పొట్టకి గుద్దుకుంది.

"యాక్సిడెంట్! యాక్సిడెంట్" వ్యాకర్ణ పెద్దగా అరిచాడు.

“ఏం నాయనా, కళ్ళు కనపడటంలా? నన్ను గుద్దుతున్నావు! నే కాబట్టి సరిపోయింది. అదే ఏ కారో లారీయో అయితే ఈ పాటికి.....”

“కరెక్ట్! డ్రైవర్ జైలుకెళ్ళేవాడు. అలాంటి పాడు పనులు చేయటం మా ఇంతా వంటా లేదు" కళ్ళజోడు సరిచేసుకుంటూ అన్నాడు అబ్బులు.

“మనుషుల్ని గుద్దుకోవటం నీకలవాటా నాయనా! ఇంకొంచెం గట్టిగా అయితే నా పొట్ట పగిలిపోయేది" పొట్ట నిమురుకుంటూ అన్నాడా శాల్తీ!

“అది నా పొరపాటు కాదండీ"

“ఎవర్ది మరి?”

“సూర్యభగవానుడిది. ఆయన కిరణాలు సూటిగా నా కళ్ళలోపడి గుచ్చుకోవటంతో కళ్ళ ముందుది కనిపించక మిమ్మల్ని గుద్దేశాను.”

పొట్ట శాల్తీ అబ్బులి మాటలకి పొట్టపగిలేటట్లు నవ్వి "భలే వాడివోయ్ సూర్యుడు యిప్పుడు నీ వెనుక భాగంలో వున్నాడు. కిరణాలు పడేది నీ వీపుమీదే?” అన్నాడు.

“భాగం?.... ఎంత బాగా గుర్తుచేశారండీ! మేము ఇల్లు మారాలి. మాకో ఖాళీ భాగం కావాలి. మీ యింట్లో మీ ఇంటిప్రక్క వీధిలో... ఎక్కడో అక్కడ ఓ గది అద్దెకి దొరుకుతుందా అండీ!”

“ఏమిటీ? గది అద్దెకి కావాలా! అద్దె గది కోసం తిరుగుతున్నారా?” ఆతృతపడిపోతూ అడిగింది శాల్తీ.

“అవునండీ" వినయంగా చెప్పాడు అబ్బులు.

“ఒక్క గదికోసం ఒక నెలనుండి తిరుగుతున్నాము. ఒక్క గది ఎక్కడా లేదు. మూడు గదులు. నాలుగు గదులు. ఫ్యామిలీకి తప్ప బ్యాచిలర్స్ కి పనికొచ్చే ఒక్క గదున్న కొంపేలేదు” వ్యాకర్ణ దిగులుగా అన్నాడు.

శాల్తీ గారు వీళ్ళ మాటలిని లాల్చీ జేబులోంచి నోట్ బుక్కు, పెన్ను తీశాడు. “చూడు బాబూ! అద్దె ఇంటికోసం రెండు నెలలబట్టీ తిరుగుతున్నాను. మీరు చూసి వదిలేసి ఇంటి అడ్రస్ లు చెపితే నేవెళ్ళి చూసుకుంటాను బాబ్బాబు”

“బాగుంది. మాకు జ్ఞాపకశక్తి తక్కువండి!” అంటూ వ్యాకర్ణ, అబ్బులు శాల్తీని తప్పించుకుని ముందుకు పోయారు.

“లేచిన వేళ బాగుండలేదు” అన్నాడు అబ్బులు నడుస్తూ.

“అవునురా! ఇవాళ తిరిగిన వాళ్ళం తిరిగినట్లున్నాము. ప్రతిచోటా మొండిచెయ్యే ఎదురయింది. వీడెవడో రూమ్ చూపిస్తాడనుకున్నాను. నీ గుద్దు ఫలితమా అని వీడే మన్ని అద్దె ఇళ్ళెక్కడున్నాయి అంటూ నోటుబుక్కు తీశాడు చూసుకునడువు” విసుక్కున్నాడు వ్యాకర్ణ.