అమ్మో అమ్మాయిలు 2

Listen Audio File :

ఆవిడ వీళ్ళిద్దరినీ ఉరిమి చూసి 'ఏం నాయనా! మీరు నమస్కారం పెట్టటానికి ఈయన తప్ప ఎవరూ దొరకలేదా మీకు? ఈయనతో ఏం పనిబడింది. ఏం కావలసి వచ్చింది?” అంది.

''మనస్కారం పెట్టడం మర్యాద లక్షణం. పెద్దవాళ్ళ కి పెట్టడంలో తప్పులేదు కాబట్టి పెట్టాం. పంగ నామాలు పెట్టామా? తిన్న యింటికి వాసాలు లెక్కపెట్టామా? ఉత్త నమస్కారం పెట్టాము. అంతే! అదీ మీరు ఇంటిగలవారని మేము 'టులెట్' బోర్డు చూసి వచ్చాం కాబట్టి...” అబ్బులు కళ్ళజోడు సవరించుకుని ఇంటావిడని నాలుగు కళ్ళతో ఎగాదిగా చూసి గట్టిగా చెప్పేశాడు.

“నమస్కారాలు పెట్టించుకోవటం యిష్టం లేకపోతే మానేస్తాం" వ్యాకర్ణ చెప్పేశాడు.

“మీరు మా యింట్లో అద్దెకు దిగుదామని వచ్చారా?” అంది ఆవిడ.

“అవును.”

“మీకు పెళ్ళయిందా?” పైనుండి కిందవరకూ పరీక్షిస్తూ అంది.

“కాలేదు.”

“అయితే మీరు మరో యిల్లు చూసుకోండి.”

“అదేమిటండీ! పెళ్ళి కాకపోవడం మా నేరమా? పెళ్ళయిన వాళ్ళకే అద్దెలకిస్తే మాలాంటి బ్రహ్మచారులు పేవ్ మెంటు మీద పడి ఏడ్వాల్సిందే? పెళ్ళి చేసుకున్నవాడు ఉత్తముడని పెళ్ళి కాని వాడు పేచీ కోరని ఎక్కడుందని మేమడుగుతున్నాము అదీకాక....”

“వీళ్ళు నాకు నమస్కారం కూడా పెట్టారేవ్' అంటూ ఇంటాయన గుర్తు చేశాడు.

“మీరు కాసేపు నోరు మూసుకోండి" అని ఆయన్ని గద్దించి వీళ్ళ వైపు తిరిగింది ఆవిడ "మీరు మరో ఇల్లు చూసుకోండి" అంది ముఖం ముట ముట లాడిస్తూ.

'బ్రహ్మచారులమైనా మేము చాలా మంచివాళ్ళమండి. మీరు కాదూ కూడదు పెళ్ళయిన వాళ్ళకే ఇల్లు అద్దెకిస్తామంటే ఓ పనిచేస్తాం. మా చదువు పూర్తికాలేదు. మాకిప్పుడేపిల్లనివ్వరు కాబట్టి మా వాడు, నేను పెళ్ళి చేసేసుకుంటాం" అన్నాడు వ్యాకర్ణ.

“ఏంటీ?” అంటూ ఇంటావిడ కనుగుడ్లు పెద్దవిచేసింది.

“ఇద్దరు మగాళ్ళుగాని ఇద్దరాడవాళ్ళుగాని పెళ్ళాడటంలో తప్పులేదండి, ఇప్పుడది ఫ్యాషన్ కూడా. ఇతర దేశాలలో ఎంతమంది పెళ్ళి చేసుకుంటున్నారో మీకేం ఎరుక? మా వాడు నేను పెళ్ళి చేసుకుంటాం ఓ కంచంలో తింటూ (హోటలువాడు పెడితే) ఓ మంచం మీద పడుకుని (మాకు మంచాలు లేవు) ఓ గదిలోనే కాపురం పెడతాం. పిల్లలు కనడం ఎలాగూ అసాధ్యం కాబట్టి పెళ్ళాడటానికి అభ్యంతరం లేదు ఏమంటారు?'

“ముందిక్కడి నుండి పొమ్మంటాను. ముఖాలు చూస్తుంటేనే తెలుస్తుంది రౌడీమూక రౌడీమూకని.నాకు ఆరుగురు కూతుళ్ళు మీరు చూడబోతే తోక లేని కోతులా వున్నారు.”

“ఏమండోయ్! మాటలు మర్యాదగా రానివ్వండి. మీకు ఆరుగురు కూతుళ్ళో ఏడుగురు కొడుకులో ఎవరికెరుక?” అన్నాడు వ్యాకర్ణ.

“మీ అమ్మాయిలను పెళ్ళికాని అబ్బాయిలకివ్వరా అండీ?” అనుమానం బయటపెట్టాడు.

అబ్బులు అమాయకంగా. “ఆ........అ.... ఏమిటా వ్యంగం. నే అనుకుంటూనే వున్నా, మొన్నీ మధ్య మా మూడో అమ్మాయి శకుంతల పేర ప్రేమలేఖ రాసింది మీరేనని. ఏకంగా మా ఇంట్లోనే మకాంపెట్టి మా అమ్మాయి బ్రతుకుని నట్టేటిలో కీడ్చి మా పరువు గంగలో కలిపి.”

“ఈ ఊళ్ళో గంగ లేదండి. కృష్ణ తప్ప" గుర్తు చేశాడు వ్యాకర్ణ.

“గంగ ఏ ఊళ్ళో ఉందిరా?” అన్నాడు అబ్బులు, కళ్ళజోడులోంచి తొంగిచూస్తూ.

“గుంటూరులో వుంది" టకీమని చెప్పాడు వ్యాకర్ణ.

“మన రామయ్య కూతురు గంగ కాదురా. గంగానది సంగతి.”

“వీళ్ళ మాటలింటుంటే అరికాలి మంట నెత్తికెక్కింది యింటావిడకి. తిట్లు, శాపనార్థాలు అనే దండకం ఎత్తుకుంది.