అమ్మో అమ్మాయిలు 41

Listen Audio File :

నుదుట కారుతున్న చెమటని టవల్ తో అద్దుకుంటూ ఇలా అడిగాడు వ్యాకర్ణ "అవునురా అబ్బూ! నా రోగం ఏమిటో సరిగ చెప్పావు. అన్నట్లు ఈ వ్యాధి పేరేమిటన్నావ్?".

“ఈ జబ్బు పేరు లాట్కో డిమ్కాగ్రాఫై ఎనీషి మూఫిర్!” అబ్బులు గొప్పగా చెప్పాడు.

“జపాన్ సుందరిమణి పేరులా వుందిరా!”

“య్యా అయితే వుండొచ్చు. అందులో వింత ఏముంది!” మీసాల చాటున నవ్వుని దాచుకుంటూ అన్నాడు అబ్బులు.

వ్యాకర్ణకి ఉన్నట్లుండి పెద్ద అనుమానం వచ్చింది. “ఇలాంటి వ్యాధి వుంటుందని నీకెలా తెలుసురా?” అడిగాడు.

“ప్రస్తుతం నేను కూడా యిదే వ్యాధి పీడితుడిని కదా! మనిద్దరి ఆలోచనలు ఒకే విధంగా సాగుతున్నాయి కదా! మనిద్దరి పరిస్థితి ఒకే రకంగా వుంది కదా!” కదా అన్నమాట వత్తిపలుకుతూ చెప్పాడు అబ్బులు.

“మనది అంటువ్యాధా!”

“ఎంతమాత్రం కాదు. యిరువురం ఒకే పరిస్థితిలో వున్నాము కాబట్టి గ్రహించాను.”.

“సరే, ఈ వ్యాధి పేరు డిమ్కాలిమ్క్ అని యెలా తెలుసుకున్నావ్?”

“దీని పేరు డిమ్కాలిమ్క్ కాదు. లాట్కో డిమ్కా గ్రాఫై ఎనీషి మూఫిర్" సరిదిద్దాడు అబ్బులు.

“సరే అదేలే, ఈ పేరు నీకెలా తెలుసా అని.......”

“అదా?”

“ఆ..... అదే.... చెప్పు.”

“చెప్పక తప్పదా?”

“తప్పదు.”

“అయితే విను. మనం ప్రేమించాముగాని పెళ్ళి కాలేదు. అందుకని ఏదో ఏదో ఆలోచిస్తున్నాము. ఆ ఆలోచనకి ఓ దారి తెన్నూలేదు, రూపం లేదు, జీవంలేదు. దాంతో నాకో ఆలోచన వచ్చింది. ఇదోరకం వ్యాధి అని... వ్యాధి అని తెలుసుకున్న వాడిని దానికో పేరు కూడా తగిలించాలి కదా! లేకపోతే ఎవరితోనైనా చెప్పేటప్పుడు ఎలా తెలుస్తుంది.

చంటి వెధవలాగా వ్యాధి వ్యాధి అని అఘోరిస్తే ఏమన్నా బాగుంటుందా? అందుకే ఈ వ్యాధికి నామకరణం కూడా నేనే చేసేశాను. లాట్కో డిమ్కా గ్రాఫై ఎనీషి మూఫిర్ అని......” అబ్బులు కళ్ళద్దాలు తుడుచుకుంటూ చెప్పాడు.

“హార్నీ?” అని ఆశ్చర్యపోతూ వ్యాకర్ణ నవ్వాడు.

అబ్బులు అద్దాలు తగిలించుకుని రవంత సిగ్గుపడుతూ నవ్వాడు.

“అయితే మనిద్దరం ఈ వ్యాధి పీడితులం అన్నమాట!” వ్యాకర్ణ అడిగాడు.

“ఆ..... మరే, లాట్కోడిమ్కాగ్రాఫై ఎనీషి మూఫిర్ పీడితులం" భారంగా జవాబు యిచ్చాడు అబ్బులు.

“ఇదేం బాగులేదురా" ఉన్నట్లుండి గట్టిగా అరిచాడు వ్యాకర్ణ.

ఉలిక్కిపడ్డ అబ్బులు వీపుమీద అందినంత మేర చరుచుకుంటూ "నీ దుంపతెగ అదేం నవ్వురా హడలిచచ్చాను" అన్నాడు.

అదేం వినిపించుకోలేదు వ్యాకర్ణ. "ఇదేం బాగుండలేదు" అన్నాడు అదేమాటని పట్టుకుని సాగదీస్తూ.

“ఏది! ఏది బాగుండంది?” అబ్బులు అడిగాడు.

“నేను ముఖ్యమంత్రి ఎలా కావాలా అని ఆలోచిస్తుంటే నీవు అదే ఆలోచిస్తూ వుండటం, నాకే వెన్నుపోటు పొడవాలని చూస్తున్నావా? నమ్మకద్రోహి, మిత్రద్రోహి, ఒక రాష్ట్రానికిద్దరు ముఖ్యమంత్రులు వుండటం చరిత్రలోనే లేదు. కావాలంటే నాకు కోపైలెట్ గా అఘోరించు" కోపంగా అన్నాడు వ్యాకర్ణ.

“అది కాదురా!” నచ్చజెప్పబోయాడు అబ్బులు.

“ఏది కాదు?” మరింత కోపంగా అన్నాడు వ్యాకర్ణ.

“మనకిలాంటి ఆలోచనలు రావటం మన తప్పుకాదు. లాట్కో డిమ్కాగ్రాఫై ఎనీషి మూఫిర్ వ్యాధి లక్షణమే అంత" బహు శాంతంగా చెప్పాడు అబ్బులు.

“సారీర అబ్బూ! ముఖ్యమంత్రిగా నీవే వుండులే" వ్యాకర్ణ తగ్గిపోతూ అన్నాడు.

“మనలోమనకేంటి బ్రదర్! నీవు ముఖ్యమంత్రివి అయితే నేను అయినట్లు కాదా?” తన నెత్తిన కిరీటం తీసి వ్యాకర్ణనెత్తిన పెట్టినంత వుదారంగా మాట్లాడాడు అబ్బులు.

ఫక్కున నవ్వు వినిపించింది.

“నీవు నవ్వావా?” వ్యాకర్ణ అనుమానంగా అడిగాడు.

“నవ్వుంది నీవు కాదా?” అబ్బులు బుర్ర తడుముకుంటూ ఎదురు అడిగాడు.

"మీ యిద్దరు కాదు నవ్వింది నేను.”అంది జయచిత్ర రూములో కాలుపెడుతూ.

“ముఖ్యమంత్రి కావాలని అవకాశంకోసం అరవైఆరుమంది ఆశగా సమయం కోసం చూస్తుంటే మధ్యలో తగుదునమ్మా అంటూ మీ యిద్దరు కూడా తయారయ్యారా!” బిందురేఖ జయచిత్ర తోకలా వెనుకనే వస్తూ అడిగింది.

“మా మాటలు విన్నారా?” వ్యాకర్ణ సిగ్గుపడుతూ అడిగాడు.

“ఆ..... మొదటినుంచీ" అంది జయచిత్ర.

“ప్రతిది విన్నారా?” అబ్బులు ఆతృతగా అడిగాడు.

“ప్రతిది విన్నాం. లాట్కో డిమ్కా గ్రాఫై ఎనీషి మూఫిర్ తో సహా" పెదవి బిగింపులో నవ్వు బిగబట్టి మరీ చెప్పింది బిందురేఖ.

అబ్బులు కళ్ళద్దాలలోంచి మిర్రి మిర్రి చూశాడు.

బిందురేఖ కొంటెగా నవ్వింది.

దాంతో అబ్బులుకి మండి - 'యాక్యూ మెగ్నిషి కార్బొరడిస్పాన్' అన్నాడు ఘాటుగా.

“యాక్యూ మెగ్నిషి కార్బొరడిస్ర్పాస్ అంటే అది కూడా ఓ వ్యాధి పేరేనా?”

ఏమి తెలియనట్లు అడిగింది బిందురేఖ.

“ఎస్!” అన్నాడు అబ్బులు.

“అదికూడా అంటుకుందా?”

“ఆ.....”

“దాని లక్షణాలు ఏమిటి?”

“ఎవరైనా మాట్లాడుకుంటుంటే చాటుగా వుండి వినటం" మాములుగా చెప్పాడు అబ్బులు.

బిందురేఖ ముఖం పావలా బిళ్ళంత అయింది.

“మాటలతో భలే దెబ్బ తీశావురా అబ్బిగా!” అన్నట్లు మెచ్చుకోలుగా అబ్బులుని చూశాడు వ్యాకర్ణ.

'బాధపడకే బిందూ! ఈ సత్రకాయ ముఖ్యమంత్రుల పని నేపడతా కదా!' అన్నట్లు చూసింది జయచిత్ర.

ఎవరికి వారే ఏమి జరగనట్లు వేరే కబుర్లు చెప్పుకుంటూ వుండిపోయారు.

“బామ్మగారు లేరా!” వ్యాకర్ణ అడిగాడు.

“భక్తగణం లేదా!” అబ్బులు అడిగాడు.

“వాళ్ళు యింట్లో వుంటే మాకింత స్వేచ్ఛ ఎక్కడిది! అంతా కలిసి మింగుడు స్వాముల వారికి చూడటానికి వెళ్ళారు" జయచిత్ర చెప్పింది.

“వాడెవడు!” అబ్బులు అడిగాడు.

“వాడు కాదు వారు. ఆ స్వాములవారి వద్ద బోలెడు మహత్యాలు వున్నాయట. ఎవరికైనా వ్యాధి వస్తే ఆయన దగ్గరకెళితే వ్యాధి వున్నచోట నోరు తెరిచిపెట్టి ఆ ఆ అంటాడుట. అంతే అలా ఆ వ్యాధిని మింగేస్తాడుట. దాంతో వ్యాధి అంటూ వెళ్ళిన వాళ్ళ రోగం కుదురుతుందిట. అందుకే ఆయనకీ మింగుడు స్వాములవారని పేరు వచ్చింది" బిందురేఖ చెప్పింది.

“బుద్ధి లేకపోతే సరి" కోపంగా అన్నాడు అబ్బులు.

“నాకేనా బుద్దిలేంది?” అంతకన్నా కోపంగా అడిగింది బిందురేఖ.

“మింగుడు స్వాముల వారిని నమ్మే భక్తగణానికి బుద్ధి లేదంటున్నాను. రేపు నేను కూడా అడ్డబొట్టు నిలువుబొట్టు కలిపి ముఖంనిండా పెట్టుకుని మెడలో రుద్రాక్షలు వేసుకుని, బారెడు గడ్డం మారెడు శిఖతో ప్రజలకి దర్శనమిచ్చి నా పేరు గుటకాయస్వాహ స్వాములవారు. భక్తులారా రండి. మీ వ్యాధి ఏమిటో చెప్పండి అంటే అంతా వస్తారు. అప్పుడు నేనేమో వాళ్ళ వ్యాధులని గుటకాయ స్వాహా చేస్తుంటాను. ఛీ..........ఛీ.. ఈ దేశంలో మూఢులు ఎక్కువయిపోయారు" అబ్బులు విసుక్కుంటూ వ్యంగ్యంగా అన్నాడు.

“గుటకాయస్వాహా స్వాముల వేషంలో మీరు కళ్ళజోడు పెట్టుకుంటారా స్వామి వినయంగా అడిగింది బిందురేఖ. దాంతో అందరికి నవ్వు వచ్చింద. హాయిగా నవ్వుకున్నారు