Rating:             Avg Rating:       955 Ratings (Avg 3.08)

Aanagar Colony 8

ఆహా నగర్ కాలనీ

సూరేపల్లి విజయ

8 వ భాగం

ఎడిటర్ విశ్వంభరధరరావు కు సాకేత్ హెడ్జెక్ అయిపోయాడు జనరల్ ఆర్టికల్స్ రాయమంటే రాయడు. సమ్ థింగ్ స్పెషల్ ఉండాలంటాడు. ఎప్పుడూ ఏదో ఓ స్పెషల్ ఉండాలంటాడు. ఆ సేన్షేషన్ తన కొంప ముంచుతుంది. అదీ విశ్వంభరధరరావు భయం. అలా అని సాకేత్ ని వదులుకోలేడు. తను అతడ్ని వదులుకున్న మరుక్షణం, కసితో సాకేత్ మరింత విజృంభించి వేరే పత్రికలకు రాస్తాడు.

సరిగ్గా అప్పుడే జరిగిందా సంఘటన బ్రహ్మాండమైన ఆలోచన వచ్చేసింది ఎడిటర్ కు. అప్పుడే పోస్ట్ లో వచ్చిన ఆ పేపర్ చూసాక. న్యూయార్క్ టైమ్స్ పత్రిక అది. ఆ పత్రిక చివరి పేజిలో ఓ మారుమూల పడ్డ బాక్స్ ఐటమ్ అది.

* * *

"సార్....పిలిచారట" ఎడిటర్ ఛాంబర్ లోకి ఎంటరయి విష్ అడిగాడు సాకేత్.

"రావోయ్...నీ కోసమే ఎదురుచూస్తూన్నాను"

"నీకో సేన్షేషన్ ఆపరేషన్ అప్పగించబోతున్నాను. నువ్వు తప్ప ఈ పని మరెవరూ చేయలేరు" ముందు జాగ్రత్తగా సాకేత్ ని పొగడుతూ అన్నాడు.

రెండు అంగుళాలు ఛాతీ పొంగింది సాకేత్ కు. ఈ రోజు పోస్టులో వచ్చిన న్యూయార్క్ టైమ్స్ పత్రిక చూపిస్తూ "ఇందులో చివరి పేజిలో చివరి కాలమ్ లో ఉన్న బాక్స్ ఐటమ్ చూడు" సాకేత్ ఆ ఐటమ్ చదివాడు.

సిటీ అవుట్ స్కట్స్ లో ఉన్న ఆహానగర్ గురించి అందులో రాసి ఉంది. కొంతమంది ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న కాలనీ అది. అక్కడ వ్యవహారాలు, మనుష్యుల ప్రవర్తనలు విచిత్రంగా ఉంటాయి. వాళ్ల జీవన సరళిలో కూడా చాలా వ్యత్యాసం ఉంది. రకరకాల చిత్ర విచిత్ర మనస్తత్వం ఉన్న వ్యక్తులు అక్కడ ఉన్నారంటూ...పేర్కొంది ఆ పత్రిక.

"చూసావా సాకేత్..దేశం కాని దేశంలో ఉన్న పత్రిక...ఇక్కడి విశేషాల్ని రాసింది. ఇంతవరకు మనకు ఆహానగర్ కాలనీ ఒకటి ఉందని అందులో ఎన్నో వింతలు విశేషాలు జరుగుతున్నాయని తెలియదు. ఒక్కసారి నువ్వు అక్కడికి వెళ్ళి వచ్చావనుకో, నీ చేతినిండా పనే. నీలాంటి యంగ్, డైనమిక్ డేరింగ్ అండ్ డ్యాషింగ్ రైటర్ చేయాల్సిన ఇన్ వెస్టిగేషన్ అది. ఏమంటావ్? సాకేత్ రియాక్షన్ గమనిస్తూ అడిగాడు ఎడిటర్.

"నేను ఆహానగర్ కాలినికి రేపే బయల్దేరతాను సార్" చెప్పాడు సాకేత్ అత్యుత్సాహంగా.

"బయల్దేరడమంటే ఆషామాషీ కాదు. కొవ్రొజులపాటు వాళ్ళతో ఉండాలి. వాళ్ళలో కలిసిపోవాలి. జీవన సరళి మొత్తం స్టడీ చేసి, దాన్ని సీరియలైజ్ చేయాలి. ఈ దెబ్బతో నీ పేరు రాష్ట్రమే కాదు, దేశమే మార్మోగిపోతుంది" ఎడిటర్ విశ్వంభరధరరావు సాకేత్ ని ఉత్సాహపరుస్తూ చెప్పాడు.

వాస్తవానికి అతని ఉద్దేశం వేరు. ఈ వంకతో కొన్ని నెలలపాటు సాకేత్ ని తన పత్రికకు దూరంగా ఉంచాలి. అతను మరో పత్రికలో రాయకూడదు. సాకేత్ కు ఆ అడ్వంచర్ బాగా నచ్చింది. అందుకే ఈ యిష్యూని ఛాలెంజ్ గా తీసుకున్నాడు.

* * *

సాకేత్ ఒంటరివాడు అతను నేలమీద పడ్డానికి ముందే తండ్రి చనిపోయాడు భూమ్మిద ఊపిరిపోసుకున్న మరుక్షణమే తల్లి చనిపోయింది. బంధువులు నష్టజాతకుడు అని హేళన చేశారు. మొహం చాటేశారు. ఎలా బతికాడో, ఎలా పెరిగాడో అతనికే గుర్తులేదు. అతనికి ఊహ తెలిసేసరికి ప్రేమ రాహిత్యంలో మునిగిపోయాడు.

కసి, పట్టుదల, ఆత్మవిశ్వసం, ఈ మూడే సాకేత్ ని ఎప్పుడూ వెన్నంటి ఉన్నాయి. నిరంతరం తనని భయపెట్టే ఆకలి బూచి" ని ఎదిరిస్తూ తనకై తను ఓ మార్గం ఏర్పరచుకోవాలని తాపత్రయపడేవాడు. తను అందరిదారిలో కాకుండా, తనకంటూ ఓ దారి ఏర్పరచుకోవాలని, తన దారినే పదిమంది నడవాలని అతని కోరిక.

ఏ విశ్వవిద్యాలయానికి వెళ్ళకుండానే, ఏ విశ్వవిద్యాలయ పట్టాలు లేకుండానే స్వయం కృషి తో రాణించాడు. లైబ్రరీకి వెళ్ళి, రాత్రింబవళ్ళు పుస్తకాలు మధించాడు.