బీరకాయ మెదిపి కూర

 

 

 

కావలసినవి:
బీరకాయలు  - 4
పప్పు సామానులు - తగినంత
చింతపండు  - చిన్న నిమ్మకాయ అంత
ఉప్పు, పసుపు - తగినంత

 

తయారీ విధానం:

ముందుగా బీరకాయల్ని ముక్కలుగా తరుగుకోవాలి. ఈ కూర రుచి ముక్కలు తరుగుకోవటంలోనే వుంది. మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా రెండు అంగుళాలు పొడవు ఉండేలా కట్ చేసుకోవాలి. ముందుగా శనగపప్పు, మినపపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి , కరివేపాకు వేసి చిటికెడు ఇంగువ కూడా కలిపి పోపు ఎర్రగా వేగాక తరిగిన బీరకాయ ముక్కలు, పసుపు, ఉప్పు, వేసి కలియబెట్టాలి. మూతపెట్టే ముందు చింతపండుని ఉండలా చేసి కూర మధ్యలో పెడితే కూర వుడుకుతున్నప్పుడు ఆ పులుపు కూరకి పడుతుంది. కూర కదిపేటప్పుడు చింతపండు కూర మొత్తంలో కలవకుండా చూసుకుంటూ కదపాలి. కూర అంతా ఉడికాక చింతపండు తీసేయాలి అప్పటికి అందులోని పులుపు కూరకి పడుతుంది. కూర కొంచం గ్రేవీగా కొంచం పొడిగా ఉండేలా చూసుకుని ఆపాలి.

 

ఈ కూర మా అత్తగారు చేస్తారు.  ఆమె వాళ్ళ అత్తగారి నుంచి నేర్చుకున్న కూరట. ఏంటి ప్రత్యేకం అంటే, మాములుగా చింతపండు పులుసు తీసి పోసినప్పుడు కంటే ఇలా చింతపండు మధ్యలో పెట్టి చేసిన కూర పులుపు సరిసమానంగా వుండి, చాలా రుచిగా వుంటుంది. అన్నీ ఒకేరకం వస్తువులే.. కానీ వాటిని వాడే విధానంలోనే, వండే విధానంలోనే రుచి మారిపోతుంది. అమ్మ వాళ్ళు పులుసు పోసి వండుతారు మెంతిపొడి వేస్తారు.  అత్తయ్య వాళ్ళు ఇలా బీరకాయ మేడిమి కూర చేస్తారు. ఒక్కసారి ఈ కూర రుచి చూస్తే చాలు మళ్ళీ మళ్ళీ  చేస్తారు. పూర్వపు వంటలు ఇవి. రుచిగానే వుంటాయి. ఏమంటారు? ఒక్కసారి వండి, రుచి చూసి చెప్పండి.

 

-రమ