కూర పొడి ..గ్రేవీ కూరలకి

 

 

 

కాప్సికం, వంకాయ, టమాటో, దొండకాయ, బెండకాయ, ఇలాంటి కూరలు రుచిగా రావాలంటే, ఆ కూరలు పోపులో వేసి, మగ్గాక పైనుంచి కూర పొడి వేసి కలిపితే చాలు.. ఈ పొడిని ఒక్కసారే చేసుకుని పెట్టుకోవచ్చు. ఈ కూర పొడి కూడా రకరకాలు గా చేస్తారు. ఒకో రుచికి ఒకో పొడి వేస్తారు. ఆ రకాలు అన్ని చెప్పుకుందాం. అయతే అందులో ఈ రోజు మొదటి రకం పొడి గురించి తెలుసుకుందాం. ఈ పొడి గ్రేవీ కూరలకి బావుంటుంది.

 

కావలసిన పదార్ధాలు:

పల్లీలు పొడి               .... ఒక కప్పు
నువ్వుల పొడి           .... అర కప్పు
ఎండు కొబ్బరి పొడి      .... అర కప్పు
ధనియాల పొడి          .... పావు కప్పు
జీలకర్ర పొడి              .... రెండు చెంచాలు
పుట్నాలు పొడి          .... పావు కప్పు
ఉప్పు                      .... రెండు చెంచాలు
కారం                       .... నాలుగు చెంచాలు

 

తయారీ విధానం:

 

పల్లీలు , నువ్వులు, ధనియాలు, జీలకర్ర, లని విడి విడిగా పొడి మూకుడు లో కొంచం ఎర్రగా వేయించి , చల్లారాక పొడి చేసి పెట్టుకోవాలి. పుట్నాలు పచ్చివే పొడి చేయాలి. ఇప్పుడు అన్ని పొడులని బాగా కలిపి పొడి డబ్బాలో వేసి పెట్టుకుంటే..పదిహేను రోజుల వరకు తాజాగా వుంటుంది. ఈ పొడిని కూర మగ్గాకా ఆఖరిలో వేసి కలపాలి. అర కేజీ కూర కి రెండు  చెంచాలు పొడి వేస్తె సరిపోతుంది. ఈ పొడి లో ఉప్పు, కారం రుచి కోసం వేస్తాం కాబట్టి, కూరలో చూసి వేసుకోవాలి. పొడి కూర గా కావాలంటే పొడి విడిగా జల్లి కలపాలి. గ్రేవీ కూరగా కావాలంటే ఈ పొడినే పావు కప్పు పెరుగులో కలిపి కూరలో వేయాలి. కానీ పెరుగు వేసినప్పుడు కూర చప్ప పడుతుంది కాబట్టి, మాములు కంటే కొంచం కూర పొడి, కారం ఒక చెమ్చా ఎక్కువ వేయాలి. ఈ పొడి సాదారణంగా అన్ని కూరలలోకి బావుంటుంది. కాకర కాయ చేదు తెలియకుండా వుండాలంటే ఈ పొడి వేసి చూడండి. కాకరకాయ గ్రేవీలా కాకుండా పొడి కూరకి మాత్రమే ఈ పొడి బావుంటుంది. కాకర ఫ్రై చేసాక, ఆఖరిలో ఓ చెమ్చ పొడి వేసి కలిపి దించాలి. రుచిగా ఉండదని మనం పక్కన పెట్టె ఆనపకాయ కూరని ఈ పొడి వేసి గ్రేవీ కూర గా చేస్తే చపాతీలలోకి చాలా బావుంటుంది .

 

టిప్: పల్లీలు, నువ్వులు వేయించి పొడి చేసేటప్పుడు.. కొంచం జాగ్రత్తగా పొడి చేసుకోవాలి. లేదంటే వుండ చుట్టుకు పోయే అవకాశం వుంది. నెమ్మదిగా గ్రైండ్ చేసి, ఆపి చేస్తుంటే పొడి పొడి గా వస్తుంది. ఎక్కువ గ్రైండ్ చేస్తే ముద్ద ముద్దగా అయపోతుంది.

 

 

-రమ