Previous Page Next Page 
డెత్ ఛాంబర్ పేజి 2


    నూతన్ ఆటోలో తన రూమ్ కి చేరుకున్నాడు.
    ఇంటి గలావిడ ఓ మనియార్డర్ ఫారాల కట్ట తెచ్చిచ్చిందతనికి.
    "పోస్ట్ మెన్ ఇచ్చాడు. అన్నిటి మీదా సంతకం పెట్టి ఉంచుతే సాయంత్రం డబ్బుతెచ్చిస్తానన్నాడు."
    నూతన్ ఆకట్ట అందుకుని మెట్లెక్కబోతూంటే అడిగిందామె.
    "ఎక్కడినుంచి వచ్చినయ్ అన్ని మనియార్డర్ లు"
    "అన్ని చోట్లనుంచీ!"
    "ఎందుకు వస్తున్నాయ్?"
    "పోస్టల్ ట్యూషన్ చెప్తాను నేను."
    ఆమె సంతృప్తి పడింది.
    గదిలోకెళ్ళి మనియార్డర్ ఫారాలు లెక్క పెట్టాడు. ఒక్కొక్క ఫారానికి యాభయ్ రూపాయల చొప్పున నూటనలభైరెండు ఫారాలున్నాయ్. అంటే షుమారు ఏడువేలు.
    సంతృప్తి పడ్డాడు నూతన్. గత పదిహేనురోజులుగా రోజుకి నాలుగయిదు మనియార్డర్లు వస్తూనే ఉన్నాయ్ గానీ అత్యధిక సర్క్యులేషన్ గల పత్రికలో తన ప్రకటన వచ్చాక ఒక్కసారిగా మనియార్డర్ల సంఖ్య విపరీతంగా పెరిగి పోయింది.
    బహుశా ఇంకో రెండుమూడు రోజులు ఇలాగే అయిదారు వేలుచొప్పున వస్తుంది.
    ఆ తరువాత తను ఈ గది ఖాళీ చేసివెళ్ళిపోవాలి. లేకపోతే పోలీసులు వస్తారు. ఇప్పటికే రెండుసార్లు పోలీసుల బారినుంచి తప్పించుకున్నాడు.
    మొదటి సారి న్యూస్ పేపర్లో నెంబర్లతో పూర్తిచేసే పజిల్ వేసి, అందులో గెలుపొందినవారందరికీ రెండువేలరూపాయల జపాన్ టేప్ రికార్డర్ ఉచితం అని చెప్పి, దాని పాకింగ్ అండ్ పోస్టేజిలకు మాత్రం రెండు వందల రూపాయలు మనియార్డరు ద్వారా పంపమనికోరాడు.
    చాలామంది వెయ్యిరూపాయల టేప్ రికార్డర్ గెలుపొందామని భ్రమపడి రెండువందలు పంపించారు.
    ఢిల్లీలో సర్దార్ జీ దగ్గర వందరూపాయల టేప్ రికార్డర్ లు యాభైరూపాయల పోస్టల్ ఖర్చుతో అందరికీ పంపి ఒక్కొక్క కేస్ కి యాభై రూపాయల చొప్పున మిగుల్చుకునేవాడు.
    ఆఖరికి ఆ మోసం బయటపడింది.
    దాంతో తను ఆ గదీ, ఆ ఏరియా ఖాళీచేశాడు.
    రెండోసారి దైవశక్తి వున్న ఉంగరాల గురించి పేపర్లో ప్రకటనలు వేశాడు.
    "శ్రీ నూతనేంద్రస్వామి వారి ఆశీర్వాదం, పూజా బలంతో మంత్రశక్తిని సంతరించుకున్న దైవశక్తి ఉంగరాలు ధరించి మీరు ప్రేమించినఅమ్మాయిని వారం రోజుల్లో లొంగదీసుకోండి! వారం రోజుల్లోపల ఈ ఉంగరం ప్రభావం కనిపించని ఎడల డబ్బు వాపస్!"
    ఆ ప్రకటనకు ఎన్నో మనియార్దర్లు వచ్చాయ్.
    ఒకో ఉంగరం మాట పాతికరూపాయల ధర. ఆ స్కీమ్ కూడా నెలరోజులే నడిచింది.
    పోలీసులు తనగదిమీద దాడి చేయడానికికొద్ది గంటలముందే గది ఖాళీ చేసి ఇంకో ఏరియాలో సెటిలయాడు.
    కొద్ది రోజులు సంపాదించుకున్న డబ్బంతా హాయిగా అనుభవించాక మరోప్లాన్ ఆలోచించాడు. వారంరోజులు రాత్రింబగళ్ళు ఆలోచించాక అయిడియావచ్చింది. వెంటనే అన్ని పేపర్లకూ ప్రకటనలు తయారు చేశాడు.
    "మీలో కోర్కెలు, యవ్వనంతగ్గిపోతున్నాయా? నేడే వయసుతోనిమిత్తం లేకుండా మా 'యవ్వనం' ఆయుర్వేద మాత్రలు వాడి అదుపు లేని శారీరక సుఖాలనుపొందండి! జీవితాన్ని నందనవనంచేసుకోండి! ముఫ్ఫయ్ మాత్రలున్న సీసా వెల యాభయ్ రూపాయలు మాత్రమే! వెంటనే మనియార్డర్ పంపి ఆనందాన్ని మీ స్వంతం చేసుకోండి?"
    అంతే మళ్ళీ మనియార్డర్లు మొదలయిపోయాయ్.
    అంతే, తనకు తెలీనిమందుని తనే తయారుచేయటం ప్ర్రారంభించాడు.
    ఓ ఆయుర్వేద డాక్టర్ సాయంతో బలానికి మాత్రలు తయారుచేయించివాళ్ళందరికీ పంపటం మొదలుపెట్టాడు. ఆ మాత్రలవల్ల యవ్వనం వస్తుందనీ, అదుపులేని శారీరక సుఖాలు పొందగలమనీ వాళ్ళనుకుంటే తన కొచ్చే నష్టం ఏమీలేదు. తనకుసీసాడు మాత్రలు పంపటానికి పదిహేనురూపాయలు ఖర్చవుతోంది.
    అంటే ఒక్కొక్క మనియార్డర్ మీదా ముఫ్ఫయ్ అయిదు రూపాయలులాభం!
    కానీ ఇదీ ఎన్నాళ్ళో సాగదు.
    మళ్ళీ పోలీసులు......కేస్ లు--
    భారత దేశంలో డబ్బు సంపాదించటం కష్టంకాదు.
    "మోసం చేయటమనేది పాపం కాదు. మన జన్మహక్కు" అనుకోగలిగితే జనాన్ని పిచ్చాళ్ళను చేసిబోలెడు డబ్బు సంపాదించవచ్చు! కాకపోతే అలా ఎక్కువకాలం చేయటం కష్టం! అందుకే ఇప్పుడీ మాస్టర్ ప్లాన్ వేసింది.
    కానీ దీనికి చాలా ఫైనాన్స్ కావాలి!
    కనీసం యాభయ్ వేలు!
    అందుకే ఈ యవ్వన గుళికల స్కీమ్ మొదలుపెట్టాడు.
    పోస్ట్ మెన్ డోర్ బెల్ మోగించాడు.
    తలుపు తెరచి అతనికి సంతకం చేసిన మనియార్డర్ ఫారాలిచ్చాడు.
    అతను లెక్క కట్టి డబ్బు ఇచ్చేశాడు.
    "ఇన్ని మనియార్డర్స్ ఎక్కడినుంచి వస్తున్నాయ్ సార్?"
    "పేషెంట్స్ నుంచి."
    "అంటే మీరు డాక్టరా సార్?"
    "ఆయుర్వేదం."
    "నాకు కీళ్ళ నొప్పులు వస్తుంటాయ్ సార్! దానికేమయినా మందుదొరుకుతుందా?"
    "రేపు ఇస్తాను......"
    "థాంక్యూ సర్!"
    నూతన్ టేబుల్ ముందు కూర్చుని సొరుగులో నుంచి కొన్ని లెటర్ హెడ్స్ తీశాడు. "కాంగ్రెస్ అధిష్టానవర్గ కార్యాలయం" అని ఉంది వాటి మీద, న్యూఢిల్లీ అడ్రస్!
    తను ఢిల్లీలో ఒక కాంగ్రెస్ లీడర్ ఆఫీస్ లో స్టెనోగా పనిచేసినప్పుడు అక్కడున్న లెటర్ హెడ్స్ ని నమూనాగా తీసుకుని వాటిని ప్రింట్ చేయించాడు.
    ఆ లెటర్ హెడ్స్ ని ఎలక్ట్రానిక్ టైప్ రైటర్ లో ఉంచి తనుముందే ప్రిపేర్ చేసుకున్న లెటర్స్ ఇంగ్లీషులో టైప్ చేయటం ప్రారంభించాడు.
    తను చదివిన ఇంగ్లీష్ లిటరేచర్ బాగా పనికొస్తోంది.
    మోహన్ రెడ్డిగారూ
    ముఖ్యమంత్రిపాలసీలు, విధానాలు మీకు నచ్చటం లేదనీ, వాటి వల్ల వచ్చే ఎన్నికల్లో మన పార్టీ ఓట్లుకోల్పోతుందని, అందుచేత ముఖ్యమంత్రిని మార్చటం అనవసరమనీమీరు రాసిన లేఖ మా దృష్టికి వచ్చింది. ఆ విషయంలో మీ పూర్తి అభిప్రాయలనూ, మీ వెనుక నిలబడ్డ ఎమ్మెల్యేల మనోగతాన్నీ పూర్తిగా పరిశీలించేందుకు మా ప్రత్యేక దూతశ్రీ కృష్ణకాంత్ గారు 28 వ తేదీ శుక్రవారం హైద్రాబాద్ చేరుకుంటున్నారు. ఆయనకు హోటల్ ఎయిర్ కాజిల్ లో బస ఏర్పాటుచేయడమైనది. ఈ విషయం రహస్యంగా ఉంచవలసిందిగా కోరుతున్నాం! దయచేసి ఈ విషయాలపై ఢిల్లీకి  ఫోన్ లు చేయటంగానీ, చర్చించటం గాని చేయవద్దని మనవి!
    ఆయన అక్కడ వివిధవర్గాలతో జరిపే చర్చల్లో మీరూ పాల్గొనవలసిందిగా మేము కోరుతున్నాము. ఆయన మా కందించే నివేదిక ఆధారంగా వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని మేము భావిస్తున్నాం!
    
                                                                                  ఇట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి-
                                                                                             సంతకం......"


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS