Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం-2 పేజి 2


    
    సుందరమందహాస పరిశుద్ధ కపోలలు దేవదూతికల్
    కొందరు వచ్చి పుష్పకములోఁ గొనిపోయిరి; నిర్మలాంబు ని
    ష్యంద మహా హిమాచల తటాంచల చంచల గాంగ నిర్ఘర
    మ్మందు సుఖమ్ముగా జలకమార్చిరి పుణ్యసతీవతంసమున్.
    
    మలయ మరుత్ కుమార సుకుమార సుఖంకర చారుచామరం
    చల చలనమ్ములోఁ బరవశత్వము నందుచు, శైలవాహినీ
    కల లహరీ విలాసములు గాంచుచు, దేవి సురాంగనా కుతూ
    హలకృత నవ్యదివ్యకుసుమాంబరభూషణభూషితాంగియై -
    
    ఒక్కసువర్ణపీఠిఁ గొలువుండఁ; గనుల్ మిరుమిట్లుగొల్పుచున్
    జిక్కిని నీలి నింగి తెరఁ జీల్చుచు షట్కిరణ ప్రదీప్తమౌ
    చక్కని చుక్క యొక్కటి దిశావలయమ్ముల దీప్తిపుంజముల్
    గ్రక్కుచు వచ్చె; దక్షిణముఖమ్ముగఁ జొచ్చెఁ దదీయగర్భమున్.
    
    కాంత విచిత్రమైన కల గాంచి, చివాలున మేలుకాంచి, భూ
    కాంతుని నిద్రలేపి కలగన్న తెరం గెరిఁగింప, రాజు కా
    ర్తాంతికముఖ్యులం బిలిలి ప్రాంజలియై ప్రియపత్ని స్వప్న వృ
    త్తాంతము సాంతముం దెలిపి తత్ఫలిత మ్మడుగంగ వారలున్.
    
    "జయమగుఁగాక! మా పుడమిసామికి! పట్టపుదేవికిన్ శుభో
    దయమగుఁగాక! శాక్యజనతాపరితోషపయోధికిన్ మహో
    దయమగుఁగాక! స్వప్నము నితాంత సుఖాంతము - సర్వదా సుతో
    దయ ఫల సూచక, మ్మిది యథార్ధము! పార్ధివపాకశాసనా!
    
    చల్లనివేళ వచ్చినది స్వప్నము; మేలిమిపాలవెల్లి యీ
    చల్లనితల్లి తల్లియగు చక్కదనాల వరాల చిన్ని జా
    బిల్లికి; ముజ్జగమ్ము మురిపించును -మైమరపించు - శాక్యభూ
    వల్లభు భాగ్యముల్ కలికి వన్నెల వెన్నెల పూలతోటలై.
    
    కర్కటకంబునం గలఁడు కంజహితుండు; విరుద్ధదృష్టి సం
    పర్కము లేని లగ్నము; శుభగ్రహసంపద లెస్స; మంగళో
    దర్కము స్వప్నగాథ; కనుఁ డల్లదె ప్రాగ్భవనాంగణాన బా
    లార్కమయూఖజాల మరునారుణముల్ వెలుగుల్ వెలార్చెడిన్.
    
    సకలకళావిశారదుఁడు, సౌమ్యుఁడు, సత్యతపస్వి, ధర్మసా
    ధకుఁడు, మహానుభావుఁడు, సుధామధుమూర్తి, సమాశ్రిత ప్రజా
    సుకృతసుజాతుఁ, డంచితయశోధరుఁ, డానతసర్వభూమిభృ
    న్మకుటవిరాజితాంఘ్రి, జితమారుఁడు నీకుఁ గుమారుఁడౌ ప్రభూ!
    
    రాజాలలాముఁడై సకల రాజకిరీట వినూత్న రత్న నీ
    రాజితపాదపద్ముఁడయి రాజిలు నాతఁడు! కానిచో, పరి
    వ్రాజకమౌళియై యమరవాహినివోని వచస్సమృద్ధితో
    నీ జగతిం బునీత మొనరించు, చరించు సామంతభద్రుఁడై."
    
    అని దైవజ్ఞశిఖామణుల్ పలికి, శాక్యస్వామి లో మెచ్చి యి
    చ్చినకాన్కల్ గొని రాజదంపతుల కాశీస్సుల్ ప్రసాదించుచున్
    జనినా; రాప్రియవృత్తమున్ విని జనుల్ సంతుష్టులైనారు; నిం
    డిన వల్లల్లన రాణికిన్ నెలలు; పండెన్ రాజు సౌభాగ్యముల్.
    
    పరమానంద రసాతిరేక కరుణా బాష్పాభిషేకమ్ములన్
    జిర కౌతూహల భావ బంధుర శుభశ్రీగంద లేపమ్ములన్
    పరిపూర్ణ ప్రణయానురాగమయ దృక్పంకేరుహశ్రేణులన్
    ధరణీకాంతుఁడు ప్రేమపూజలిడె నంతర్వత్నియౌ పత్నికిన్.
    
    అఖిలలోకారాధ్య మగు పరంజ్యోతిని
        ధరియించు నుపనిషత్తరుణి యనఁగ
    అతిలోక రమణీయమైన వ్యంగ్యార్దమ్ము
        వహియించు సత్కవివాక్కనంగ
    సుధలు చిందెడి కళానిధిబింబముం దాల్చు
        క్షీరవారాశివీచిక యనంగ
    అనురాగరంజితమ్మగు నహస్కర మండ
        లము భరించు ప్రభాతలక్ష్మి యనఁగ
    
    సచ్చిదానందమయము, ప్రసన్నమధుర,
    మమృతనిష్యందము, తమోపహము మహస్సు
    ఉదరగోళాన దినదినాభ్యుదయ మంద
    వెలిఁగె కల్యాణి శాక్యభూవిభుని రాణి.
    
                                    అక్కాచెల్లెళ్ళు
    
    శ్రీమతీ ప్రేమ లజ్జాభిరామవదన
    వారిజాతమునుండి వెల్వడుటె తడవు
    తీర్చు వెనువెంటనే ధరిత్రీధవుండు
    సౌహృదము మీరా దేవేరి దౌహృదములు.
    
    'దేవదేహము'న కారుగా నర్ధించు దేవి
    భావము గ్రహించి శాక్యభూపాలమౌళి
    కరుణకవికావ్యము ట్లనుద్ఘాత లలిత
    మృదులశయ్యాక మగు తేరు పదిలపరచె.
    
    రాగరంజితనిజమనోరథము వోని
    రథము నెక్కి సఖీసహాస్రములతోడ
    ననుగుచెల్లి ప్రజావతి యనుగమింప
    రాణి పుట్టిల్లు సేరఁ బ్రయాణమయ్యె.
    
    సలిల సంపూర్ణ మంగళ శాతకుంభ
    కుంభ వలయిత కదళికా స్తంభ చలిత
    లలిత తోరణమాలికా కలిత పథము
    నిండుచూలాలి కన్నులపండువయ్యె.
    
    ఒడుదుడుకు లేని పథము వెంబడి రథమ్ము
    నడచుచుండెను సుకవి ఛందమ్ము రీతి;
    అక్క సెల్లెండ్రు ప్రకృతికావ్యమ్ములోని
    సరసఘట్టమ్ములను సమీక్షణ మొనర్ప.
    
    భారత వసుంధరా శిరోభాసమాన
    వజ్రకోటీర మగు హిమవద్గిరీంద్ర
    మాకసమ్మెత్తు కాన్పింప ననియె దేవి
    చెల్లిలిం జూచి, బుజముపైఁ జేయి సాచి.

    "చెల్లి! కనుగొమ్ము గిరికులశేఖరుండు
    శిరసు పైకెత్తుకొని విరాజిల్లు విధము;
    చలనము నెరుంగఁడెన్ని వర్షములకైన
    తలలువంచరు గాదె స్వాతంత్ర్యధనులు!
    
    వల్లకాట వసించెడివానిఁ బిలిచి
    పిల్లనిచ్చి యిల్లరికమ్ము పెట్టు నెవఁడు ?
    ఈ మహారాజు చలువగాదేమి! బేసి
    కంటివాఁ డెయ్యె తా 'నొకయింటివాఁడు.'
    
    ఇచ్చోటనే త్రోసిపుచ్చె వరూధినీ
        ప్రణయబంధము పిచ్చి బ్రాహ్మణుండు
    ఇచ్చోటనే తిష్టనిడి నిష్ఠగొనె మనో
        రథసిద్ధికై భగీరథనృపుండు
    ఇచ్చోటనే పొంగులెత్తి నేలకు దూఁకె
        నమృతంపువెల్లి గంగమ్మ తల్లి
    ఇచ్చోట నిచ్చోతనే పచ్చవిల్కాని
        కరఁగించె ముక్కంటి కంటిమంట
    ఇచ్చటే యిచ్చటే హృదయేశ్వరునకు
    కొండరాచూలి వలపులు గ్రుమ్మరించె -
    అనుచు విద్యాధరాంగన లనుదినమ్ము
    చెప్పికొనుచు విహారముల్ సేయుదురిట.
    
    ఆలపింతురు వీణియల్ మేళవించి
    కిన్నరస్త్రీలు సురతరంగిణి తటాల,
    కామర కరకంకణ క్వణ క్వణన తాళ
    లయలు వెలయంగ నీ హిమాలయ యశమ్ము.
    
    సోదరీ! గాంగ గతులలో శ్రుతులు గలిపి
    పాడుకొన్నారు స్వేచ్చగా బ్రహ్మఋషులు;
    అడుకొన్నారు యుగసంధ్యలందు నిగమ
    బాలు రిచ్చోట నాల్గుస్తంభాలయాట.
    
    వేదశాఖల ప్రాతశ్శుభోదయముల
    నుపనిషద్భాల లుయ్యాల లూఁగి రిచట;
    ధర్మదేవత నాల్గుపాదాలతోడ
    చెంగలించిన దిట తట ప్రాంగణముల."    


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS