Previous Page Next Page 
ది ఇన్వెస్టిగేటర్ పేజి 2


    "మనిషి జీవితాన్ని శాసిస్తాడా, లేక జీవితమే మనిషిని శాసిస్తుందా?
    ఆమె అడిగిన ప్రశ్న విని ఒక్కక్షణం కలవరపడ్డాడు ఆనంద్.
    అతని మౌనం ఆమెలో అసహనం కలిగించింది.
    "ప్లీజ్, చెప్పు ఆనంద్!" ఆమె మరింత ఆత్రుతగా అడిగింది.
    కేవలం ఆమె అడిగింది కనుక ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆమె ఆత్రుత చూశాక అప్పటికప్పుడే జవాబు చెప్పక తప్పదనిపించింది.
    ఆమెను తృప్తిపరచడానికే అయితే ఆమె ఆశించినట్టుగానే జవాబు చెప్పవలసి ఉంటుంది.
    ఆమె అడిగిన తీరులోనే ఉంది ఆమె ఏం ఆశించిందో!
    ఒక స్త్రీ పెట్టే బేడా సర్దుకుని సరాసరి ఓ మగాడిని వెతుక్కుంటూ వచ్చిందంటే ఆమెలో ఆ తెగింపు ఉందనే అనుకోవాలి!
    అంటే, ఇకనుంచి తన జీవితాన్ని తనే శాసించుకుంటుందన్నమాట!
    "శెభాష్ అనూషా! నీ సాహసానికి అభినందనలు! స్త్రీకి స్వేచ్చా, స్వాతంత్ర్యాలు కావలసిందే!" అతను నోటి వరకు వచ్చిన మాటలను పైకి అనలేక దిగమింగేశాడు.
    "సారీ అనూషా! నువ్వు చేస్తున్నది తప్పు. నీది తప్పటడుగు వేసే వయసు కాదు. ఇది నువ్వు ఆలోచించి తీసుకున్న నిర్ణయంలా లేదు."
    అది తను ఆలోచించి చెప్పాలనుకున్న జవాబు. కాని అతనిలో ఉన్న పురుష స్వార్థం అతని నోటిని నొక్కేసింది.
    "ఆనంద్! నేనింత సూటిగా జవాబు చెప్పమని నిలదీసినందుకు భయపడుతున్నావా? లేక నా ప్రశ్న అర్థంకాక నిన్ను తికమకపెట్టిందా?" క్షణంసేపు చిలిపితనం ఆమె మోముమీద దోబూచులాడింది.
    సూచన ప్రాయంగా ఆమె అన్నదాంట్లోనే అతను జవాబు వెతుక్కుని టక్కున అర్థంకానట్టు తల వూపాడు.
    "రియల్లీ సూపర్బ్! ఖచ్చితంగా నేను అనుకున్నట్టే అయింది. నీలో ఇంకా మగబుద్ధి మేల్కొన్నట్టు లేదు! మధ్య తరగతి వాళ్ళ జీవితం యధార్థంకాదు, జీవన విధానం వాస్తవం. బహుశా నీ ఆలోచన జీవనవిధానం వైపే పయనిస్తూ వుండొచ్చు! సరే, నీకు అర్థమయ్యేలా విడమరిచి చెబుతాను. నిర్మొహమాటంగా నువ్వు సమాధానం చెప్పాలి. చెబుతావు కదూ!"
    క్షణం ఆగి అంగీకారం కోసం అతని కళ్ళలోకి చూసింది.
    అతను తప్పించుకునే ప్రయత్నం చేయలేదు. క్షణం వాళ్ళిద్దరి చూపులు కలుసుకున్నాయి. అతనికి ఒప్పుకోక తప్పింది కాదు.
    తన సహజమైన అలవాటు ప్రకారం అంగీకారంగా తల వూపాడు.
    ఆమె మోమున క్షణం ప్రసన్నమైన చిరునవ్వు చోటుచేసుకుంది.
    ఆమె తన వేనిటీ బ్యాగ్ ను తెరచి, పసుపుకొమ్ము కట్టి వున్న పసుపుతాడును బయటకు తీసింది.
    అతని గుండె వేగంగా కొట్టుకున్నది. భారంగా శ్వాస పీలుస్తున్నాడు.
    ఊహించనిదేదో, అవాస్తవమైనదేదో జరగబోతున్నప్పుడు కలిగే అవస్థలో అతనిప్పుడున్నాడు.
    "ఆనంద్! మనిషే జీవితాన్ని శాసిస్తాడంటే, ఇదిగో ఈ పసుపుతాడు నా మెడలో కట్టి నన్ను నీ అర్థాంగిగా చేసుకో! లేదు, జీవితమే మనిషిని శాసిస్తుందంటే...."
    ఆమె క్షణం ఆగి, భారంగా శ్వాస పీల్చింది.
    ఎందుకో మిగిలిన ఆ కాస్తా అనడానికి ఆమె పెదాలు వణుకుతున్నాయి.
    పూర్తి చేయమన్నట్టు అతను కళ్ళతోనే ఆమెకు సైగ చేశాడు.
    "జీవితమే మనిషిని శాసిస్తుందంటే నువ్వు మగాడివే కాదనుకుని వెనుతిరిగి వెళ్ళిపోతాను!"
    చాచి దవడ పగులకొట్టినట్టు ఆమె మాటలు అతని హృదయాన్ని తాకాయి.
    "అనూషా !"
    అతని కేకలో ఆవేశం ఉంది. ఆత్మాభిమానం వుంది.
    వెంటనే అతని సూట్ కేస్ తీసి ఆమె చేతిలో పెట్టాడు.
    "వెళ్ళు. వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపో! లేకపోతే ఇందాక నువ్వు అన్న మూడక్షరాల అర్థం నీకు తెలియజెప్పాల్సి వస్తుంది. ప్లీజ్, గో అవే! నేను మృగంగా మారకముందే ఇక్కడ నుంచి వెళ్ళిపో!"
    ఆనంద్ ముఖం కందగడ్డలా ఎరుపెక్కింది. అతికష్టంమీద తనను తాను అదుపు చేసుకుంటున్నట్టు అతని ప్రతి చర్యా చెప్పకనే చెబుతున్నది.
    "థాంక్స్! పిరికివాళ్ళంటే నాకు పరమ అసహ్యం. ఈ లోకం ఏమీ గొడ్డుపోలేదు. నన్ను సమర్ధించేవాళ్ళు ఈ సమాజంలో ఒక్కరన్నా లేకపోతారంటావా?"
    ఛీత్కరిస్తూ వెనుదిరిగింది అనూష.
    అతను స్థాణువులా ఉండిపోయాడు. ఆదర్శాలూ స్వేచ్చా సమానతలు, స్త్రీ హక్కులు...అన్నీ తెల్లకాగితాల మీద నల్ల గీతలు మాత్రమేననిపించింది.
    ఆమెను సమర్థించేవాళ్ళు ఈ సమాజంలో ఎవరూ ఉండరేమో!
    ఆమె జీవితం ఏ మలుపు తిరుగుతుందో?
    ఆ ఆలోచనకే అప్రయత్నంగా అతని గుండె నెవరో పిండినట్టయింది.
    అతని కళ్ళు క్షణం చెమర్చాయి. అదీ కేవలం ఆమెమీద జాలితో మాత్రం కాదు.
    తనదన్న వస్తువు దూరమై పోతుందన్న బాధ అది!


                                                   *    *    *    *


    ఆకాశంలో చుక్కలు సయితం మబ్బుల చాటున మరుగున పడిపోయాయి.
    వీధి దీపాలున్న చోట తప్పా మిగిలిన ప్రాంతమంతా బొగ్గు గనిలా ఉంది.
    ఉధృతంగా వీస్తున్న గాలి తుఫాను వాతావరణానికి చిహ్నంగా ఈలలుగా, ఊళలుగా వినిపిస్తుంది.
    వాతావరణ కేంద్రం వారు తుఫాను హెచ్చరిక ఏమీ చేయకపోవడం వల్లనేమో ఎవరూ అధైర్యపడటం లేదు.
    భారీ వర్ష సూచన అనుకోవడానికి వీలు లేనట్టు రివ్వున వీచే గాలికి మేఘాలు తేలిపోతున్నాయి.
    ఆ వాతావరణం మొత్తంమీద యువ రచయిత సమ్రాట్ కు అనుకూలంగానే ఉంది.
    రాస్తున్న కాగితాలు అతని ఆలోచనల్లా గాలికి రెపరెపలాడుతున్నాయి.
    కొత్త కొత్త ఊహలు పుడుతున్నా వాటిని అక్షర రూపంలో పెట్టడానికి అతని కలం ముందుకు సాగడం లేదు.
    ఎక్కడో మేఘం ఉరిమింది. మరెక్కడో పిడుగు పడింది. ఆ క్షణాన గదిలో లైటు ఆరిపోయింది.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS