Next Page 
దుప్పట్లో మిన్నాగు పేజి 1

దుప్పట్లో మిన్నాగు  (5 to 7)
శివ చెప్పిన కథ  (8 to 25 - 4 Episod)
విజ్జి చెప్పిన కథ  (26 to 37 -2 Episod)
వెంకు చెప్పిన కథ  (38 to 53 -3 Episod)
శేషు చెప్పిన కథ  (54 to 66- 2 Episod)
నేను చెప్పిన కథ (67 to 108-8 Episod)
పట్నాయక్ చెప్పిన కథ (109 to 141-7 Episod)

ఉపసంహారం (142 to 146)
                  దుప్పట్లో మిన్నాగు
                              -యండమూరి వీరేంద్రనాథ్


    10, మహాత్మాగాంధీ రోడ్.
    ఈస్ట్రన్ సెక్టార్,
    దిబ్రూగడ్.
    అన్న అడ్రసున్న కవరు పట్టుకుని-
    "ఈ ఇల్లు ఎప్పుడూ తాళం వేసుంటుందేమిటబ్బా" అని పోస్టు బంట్రోతు హిందీలో గొనుక్కోవటం నాకు స్పష్టంగా వినిపించింది. ఆ ఇంట్లో నేను వుంటున్నాననీ, బైటకీ లోపలికీ వెళ్ళే కార్యకలాపాలు వెనుక గుమ్మంగుండా చేస్తూన్నాననీ వాడికి తెలీదు.
    అరుంధతి నన్నూ, ఈ ఇంటినీ వదిలిపెట్టి వెళ్లిపోయి రెండు నెలలయినా, ఆ విషయం తెలియని మిత్రులు, ముఖ్యంగా ఆంధ్రదేశం నుంచి తరచు ఉత్తరాలు వ్రాసేవారు. కానీ తరువాత నెమ్మదిగా నా పేర్న ఉత్తరాలు రావటం ఆగిపోయాయి.
    ఇదిగో మళ్లీ ఇన్నాళ్ళకి మరో ఉత్తరం వచ్చింది.
    ఆతృత, ఆనందం ముప్పిరిగొనగా, కిటికీలోంచి పడుతూన్న ఉత్తరాన్ని నేలవరకూ జారకుండా గాలిలోనే అందుకున్నాను, చింపటం కొద్దిగా కష్టమయింది. ఉద్వేగంతో వేళ్ల మధ్య ఉత్తరం నిలవలేకపోతూంది. ఎలాగైతేనేం కష్టపడి చింపిచదివాను.
    శివగాడు వ్రాశాడు.
    ఏదో పనిమీద షిల్లాంగ్ వెళ్ళవలసి వస్తూందట. వెంకూగాడూ, వాడు బయల్దేరుతున్నారట. గౌహాతీ వచ్చి కలుసుకోవల్సిందని వ్రాశాడు.
    వెంకూ, శివా ఫారెస్టాఫీసర్లు.
    శివగాడి వుత్తరంలో మరో విశేషం ఏమిటంటే శేషూ, విజ్జీ కూడా వస్తున్నారట.
    మేము అయిదుగురూ కలుసుకొని ఎన్నాళ్ళయిందో!
    ఉత్తర ప్రత్యుత్తరాలు లేకపోయినా, ఒకరి గురించి ఒకరం ఎప్పటికప్పుడు విశేషాలు తెలుసుకుంటూ వుండకపోయినా, మేమయిదుగురం ఒకే అభిరుచిగల వాళ్ళం.
    ఆ అభిరుచి పేరు "మందు."
    మందు మిత్రులు మందులోనే మిత్రులు నానుడి మాపట్ల అక్షరాల నిజం. అందుకే పేకముక్కలు విసిరేయబడ్డట్టూ విడిపోయాక మళ్ళీ ఒకరి గురించి ఒకరం తెలుసుకోవడం. శివ నాకు ఉత్తరం వ్రాయటానికి కారణం అదే- నాగురించి వారికి తెలియక పోవటం.
    ఇన్నాళ్ళకి మళ్ళీ మేం కలుసుకొనే వీలు కలిగింది.
    నాకు ఎన్ని ఇబ్బందులున్నా ఈ అవకాశాన్ని వదలుకోదల్చుకోలేదు. చేతిలో వున్న ఉత్తరాన్ని అలాగే వదిలేసి, నెమ్మదిగా లేచాను. లేస్తూంటే వళ్ళంతా తేలిగ్గా హాయిగా వుంది.
    అరుంధతి డబ్బు ఎక్కడ పెట్టిందో.....లేక తనతోపాటూ అంతా తీసుకువెళ్ళిపోయిందో-
    వెతకటం ప్రారంభించాను. అదృష్టవశాత్తూ నా గదిలో అల్మైరాలో కాగితం క్రింద ఎప్పుడో పెట్టివుంచిన నూరు రూపాయల కాగితాలు కొన్ని కనబడ్డాయి. వాటిని తీసుకొని బయల్దేరాను.
    గదిలో దుమ్ము అంగుళం మేర  పేరుకుని వుంది. కదుల్తూంటే గాలికి పొరలా లేస్తూ వుంది. అది నాకు అంటుకోకుండా జాగ్రత్తగా వెనుక గుమ్మంనుండి బైటకొచ్చాను.
    దిబ్రూగడ్ ఏమీ మారలేదు.
    అక్కణ్ణుంచి గౌహాతీ చేరటానికి గాలిలో నాకు అరగంట పట్టింది.
                        *    *    *
    గౌహాతీ విమానాశ్రయం లాంజ్ లో అయిదుగురం కూర్చుని వున్నాం. రాత్రి ఒంటిగంట అయింది.
    గౌహాతీలో ఆందోళన తీవ్రతరం అవటంవల్ల షిల్లాంగ్ వెళ్ళాల్సిన విమానం కాన్సిల్ అయింది. బస్సులూ, టాక్సీలూ, ప్రైవేటు కార్లూ కూడా ఆగిపోవటం వల్ల ఆ విమానాశ్రయమే మాకా రాత్రికి ఆశ్రయం అయింది. కబుర్లు చెప్పుకుంటూ తింటూ తాగుతూ ఆ రాత్రి గడపటానికి నిశ్చయించుకున్నాం. ఒక రకంగా మాకీ అవకాశం దొరకటం అదృష్టంగానే భావించాం.
    దాదాపు సంవత్సరంగా ఒకరి విషయాలు ఒకరికి తెలియటంలేదు. వుత్తరాలు కూడా వ్రాసుకోవటానికి టైమ్ లేనంత బిజీ మేమందరం. బిజీ అంటే ముందు చెప్పినట్లూ-మందూ, రేసులూ, నాకయితే సాహితీ గోష్టులూ, మిగతావారికి అంతకన్నా కాస్త చౌకబారుదైన పేకాట.
    "ఈ కబుర్లు బోరు. కథలు చెప్పుకుందాం" అన్నాడు శివ.
    వాడు సస్పెన్సు కథలు చెప్పటంలో దిట్ట.
    "మంచి ఆలోచన" అన్నాడు శేషు.
    "మీరందరూ వప్పుకుంటే నేనో కొత్తరకం పందెం సూచిస్తాను" అన్నాడు విజ్జీ.
    "ఏమిటి?"
    "అయిదుగురం అయిదు కథలు చెప్పుకుందాం. ఎవరిది తక్కువ సస్పెన్సుతో వుంటే వారు ఈ రాత్రి ఈ బిల్లు ఇవ్వాలి" అన్నాడు. నేను కాస్త తటపటాయించాను.
    నాకు సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిన మాట నిజమే. కానీ  పుంఖానుపుంఖంగా వ్రాస్తున్నాననీ, నా భాష ఎవరికీ అర్థం కానంత పటాటోపంతో వుంటుందనీ గమనించి నాకు బహుమతి ఇచ్చారే తప్ప, నాలో ప్రతిభ వుందని కాదు. ఆ విషయం నా అంతరంగంలో నాకూ తెలుసు. అయినా వీళ్ళకన్నా ఆ మాత్రం గొప్పగా చెప్పలేనా అన్న నమ్మకంతో సరే అన్నాను.
    ఈ లోపులో వెయిటరు బీరు బాటిల్సూ, చికెన్ మంచూరియా తీసుకొచ్చి బల్లమీద సర్దాడు.
    మొట్టమొదటి కథ శివ చెప్పటం మొదలు పెట్టాడు.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS