Next Page 
చీకట్లో సూర్యుడు పేజి 1

                            చీకట్లో సూర్యుడు


                                      -యండమూరి వీరేంద్రనాథ్



    భవిష్యత్తులో ఒకరోజు

                              *    *    *

    అనూహ్య అన్నా వదినలతో కలిసి భోజనం చేస్తూ అన్యమనస్కంగా ఏదో ఆలోచిస్తూంది.

    నగరానికి అరవై కిలోమీటర్ల దూరంలో వున్న సైన్స్ సిటీలో అనూహ్యపని చేస్తూంది. పదిహేను రోజులకొకసారి బయట గడపటానికి ఆమెకి అనుమతి వుంది. ఆ రోజు ఎన్నిపనులున్నా భోజనం కూడా మానుకుని ఆమెకోసం ఎదురుచుస్తూ వుంటారు అన్నా వదినలు ఆమెకోసం.

    క్రితంరోజు జరిగిన సంఘటన తలచుకున్నకొద్దీ ఆమె బుగ్గలు ఎర్రబడుతున్నాయి. అసలు  వేదప్రియ చేసింది ఇదంతా.

    వేదప్రియ కూడా సైన్స్సిటీలో పనిచేస్తూంది. పట్టుబట్టి కంప్యూటర్ దగ్గరికి తీసుకు వెళ్ళింది.

    ఎనిమిదో జనరేషన్ కంప్యూటరు, IC - XV 1-TYPE2.

    అనూహ్యకి కావాల్సిన మొగుడు గురించి కంప్యూటర్ ని ప్రశ్న అడగటం ప్రారంభించింది.

    "ఛా.....వద్దు" అంది అనూహ్య కంగారుగా.

    "ఎందుకొద్దే? అసలు ఇలాంటి కంప్యూటర్లు కనుక్కుంది ఎందుకు? ఇంత చిన్న  ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేకపోతే ఇక మేమెందుకు?" అంటూ 'ఫీడ్' చేయటం ప్రారంభించింది వేద ప్రియ.

    అయిదు నిముషాలు ఫీడ్ చేయగానే కంప్యూటర్ తిరిగి ప్రశ్నలడగటం ప్రారంభించింది.

    "పేరు"

    "అనూహ్య"

    "పేరు బావుంది"

    'పేరు బావుందో లేదో నిన్ను చెప్పమనలేదు. మంచి వరుడి గురించి చెప్పు."

    "జాతకాల మీద నమ్మకం వుందా? నక్షత్రం ఏమిటి?"

    "నమ్మకం లేదు. ఏ నక్షత్రం వాడైనా ఫర్వాలేదు."

    "డాక్టరే కావాలా?"

    "ఎవడైనా ఫర్వాలేదు, అందగాడై వుండాలి."

    "అనూహ్య ఆమె నొక్కుతున్న బటన్స్ వైపు చూస్తూంది.

    "అమ్మాయి ఎత్తెంత?"

    "5 అడుగుల 4 అంగుళాలు"

    "కొలతలు"

    "వ్వాట్"

    "కొలతలు ప్లీజ్"

    ఇదంతా చూస్తున్న అనూహ్య మొహం ఎర్రబడగా 'ఇకచాల్లే అంది. వేదప్రియ వినిపించుకోకుండా అనూహ్య మెడభాగాన్ని ఓ క్షణం తదేకంగా చూసి, 36,26,32 అని నొక్కింది.

    "చాలా మంచి ఫిగరు పుట్టుమచ్చ లెక్కడున్నాయి"

    "అది నీ కనవసరం"

    ఎప్పుడూ సీరియస్ గా వుండే అనూహ్య కూడా ఈ కంప్యూటర్ సంభాషణని చిరునవ్వు బిగపట్టి చూస్తూంది. మరోవైపు మానవుడి మేధకు మనసులోనే జోహార్లు అర్పించకుండా వుండలేకపోతోంది. మనిషి మెదడులో ఎన్ని జ్ఞాపకశక్తి కణాలుంటాయో, ఒక సెంటీమీటరు 'చీఫ్; మీద అన్ని మిలియన్ల విషయాలను ముద్రించి మనిషి తయారుచేసిన మానవాతీత శక్తి అది.

    "సెక్స్ అంటే మంచి అభిరుచి వున్నవాడు కావాలా?" కంప్యూటర్ అడిగింది.

    "ఆ.....చాలా"

    అనూహ్య కంగారుపడి "ఏమిటే ఇది?" అంది. వేదప్రియ 'నువ్వుండు' అంది నవ్వుతో......గదిలో ఇద్దరు అమ్మాయిలూ, ఆ మిషను తప్ప ఇంకెవరూ లేకపోవటంతో అల్లరి విజృంభించింది.

    "మంచి స్పోర్ట్స్ మన్ కావాలా? ఏ ఆటలో?"

    "రోమాన్స్ లో-" అందివేదప్రియ.

    "తెల్లటి శరీరఛాయ వున్నవాడు కావాలా? నలుపైనా ఫర్వాలేదా"

    "అక్కడక్కడా నలుపున్నా ఫర్వాలేదు."

    "సీరియస్ గా వుండేవాడు కావాలా? సరదాగా నవ్వుతూ వుండేవాడా?"

    "అందర్నీ నవ్విస్తూ వుంటే ప్రత్యేకత ఏముంది? అందరి దగ్గరా సీరియస్ గా వుండి భార్య దగ్గర సరదాగా, కొన్ని ప్రత్యేక సమయాల్లో అల్లరిగా వుండేవాడు కావాలి."

    "ప్రత్యేక సమయాలంటే?"

    "మిషన్ లకు తెలియవులే అవి."

    "నన్ను మిషన్ అంటే నాక్కోపం వస్తుంది."

    "సారీ"

    "చదువు?"

    "అనూహ్య డాక్టరు. అందువల్ల కాస్త చదువుకున్నవాడైతే మంచిది."

    "చదువుకున్నవాడు, ఇంకా పెళ్ళికానివాడు, సెక్స్ పట్ల మంచి అభిరుచి వున్నవాడు- పైకి సీరియస్ గా, ఏకాంతంలో అల్లరిగా-"

    "కరెక్ట్"

    "వయసు ఇరవైనాలుగు"

    "సరీగ్గా సరిపోతుంది........"

    "అలాటివాడున్నాడు. అనూహ్యకి సరీగ్గా సరిపోతాడు! పేరు_"

    "ఊ.... పేరు?"

    "వాయుపుత్ర-"

    అనూహ్య కల్పించుకుని "ఇక చాల్లేవే" అంది. వేదప్రియ వదల్లేదు, "అడ్రస్ ప్లీజ్....." అని అడిగింది.

    "ఇక్కడే వున్నాడు."

    "ఎక్కడ"

    "నా వెనుక"

    ఇద్దరూ అయోమయంగా చూస్తూ వుండగా వెనుకనుంచి ఒక యువకుడు వచ్చాడు. అతడి చేతిలో రిమోట్ కంట్రోల్ వుంది. కళ్ళు నవ్వుతున్నాయి. తాము అడిగిన ప్రశ్నలన్నింటికీ కంప్యూటర్ సమాధానం చెప్పలేదనీ, అతడే ఈ అల్లరంతా చేశాడనీ అర్థం చేసుకోవటానికి వారికి ఎంతోసేపు పట్టలేరు. తాము చెప్పిన సమాధానాలు, ప్రశ్నలు తల్చుకోగానే మొహం సిగ్గుతో కందిపోయింది. అక్కణ్ణుంచి తూనీగల్లా పరుగెత్తారు.


                                                            *    *    *

    "ఏమిటి బిందూ-అడిగిన ప్రశ్నకి అయిదు నిముషాలు నుంచీ ఆలోచనలతో మునిగిపోయావు?" అన్నా వదిన మాటలకి చప్పున ఈ లోకంలోకి వచ్చింది అనూహ్య.

    తేరుకుంటూ "ఏమిటమ్మా నీ ప్రశ్న?" అంది.

    "సూర్యుడు కాలిపోతే మనం పూర్తిగా చీకట్లికి వెళ్ళిపోతాం కదా"

    "మనం బ్రతికి వుండగా అలా అవదు. సరేనా"

    "ఎప్పటికి అవుతుంది?"

    "అయిదు వందల కోట్ల సంవత్సరాల తరువాత" అంది అనూహ్య నిజంగా అప్పటికా పరిస్థితి వస్తే, కొన్ని సంవత్సరాల ముందే ప్రాణులూ, చెట్లూ అన్నీ మాడిపోతాయి. సముద్రాల్లో నీరంతా ఆవిరై గాలిలోకి వెళ్ళిపోతుంది.

    "అదేమిటి ఆంటీ - సూర్యుడులో వేడి తగ్గిపోతూ వుంటే అంతా గడ్డకట్టాలి కదా. ఆవిరైపోవటం ఏమిటి?"

    అనూహ్య కాస్త తటపటాయించింది. "పెద్దయ్యాక తెలుస్తుందిలే" అని కొట్టిపడెయ్యటం, చిన్నపిల్లల మనసుల్లో తెలుసుకోవాలన్న భావాన్ని తగ్గిస్తుందని ఆమెకు విదితమే. అభిమాన హీరోల రాక్ డాన్స్ ల ప్రభావంనుంచి తప్పించి, ఇలాటి వాటిమీద ఆసక్తి రేకెత్తించటం పెద్దల కనీస కర్తవ్యం అని ఆమె అనుకుంది.

    "సూర్యుడంటే ఉట్టి గాలిముద్ద అవునా? కాలిపోతున్న సూర్యుడు చివర్లో గర్భం బ్రద్ధలై "రెడ్ జెయింట్ గా" మారిపోతాడు. అప్పుడే ఎర్రటి మేఘంగా మారి భూమిపైన ప్రయాణం చేస్తాడు. ఆ వేడికి భూమి భగభగ మండే నిప్పుకణం అయిపోతుంది. కానీ కోట్ల సంవత్సరాల తరువాత సంగతి అది! ఆ తరువాత అంతా చీకటిగా, మంచు ముద్దగా మిగిలిపోతుంది అదీ ప్రళయం అంటే."

    "మరి అప్పుడు మనుష్యులు చాలా భయపడతారు కదా?"

    అనూహ్య బిందూ బుగ్గమీద ముద్దుపెట్టుకొని "అప్పటికి మనుష్యులందరూ రాకెట్లు ఎక్కి ఇతర గ్రహాలకు వలస వెళ్ళి పోతారు" అని బయటకొచ్చింది. ఇన్ స్టిట్యూట్ కి వెళ్ళే టైమైంది. ఆమె హడావుడిగా తన త్రీ వీలర్ ఎక్కబోతుంటే ఫోన్ మ్రోగింది. కారుస్టార్ట్ చేసి, "హలో" అంది.

    "నేను వేదప్రియని మాట్లాడుతున్నాను" అట్నుంచి వినపడింది.

    "చెప్పు"

    "నీ కోసం డైరెక్టర్ ఎదురు చూస్తున్నారు."

    ఆమె ఆశ్చర్యపోయి "ఏ డైరెక్టర్?" అని అడిగింది.

    "యస్. యస్.ఆర్. డైరెక్టర్."

    "ఆమె ఆశ్చర్యం మరింత ఎక్కువైంది. హరికోటలో వుండే డైరెక్టర్ ఇక్కడికొచ్చి తనని అడగటం ఏమిటి?

    ఆమె కారు గేటు దగ్గర పూర్తిగా 2-గామా కిరణాల్లో పరీక్షింపబడిన తరువాత లోపలికి వెళ్ళటానికి అనుమతి ఇవ్వబడింది. అయిదు నిముషాల్లో ఆమె డైరెక్టర్ గదిలో ఉంది.

    గదిలో ప్రవేశిస్తూనే ఆమె అతడి ముందు టేబిల్ మీదున్న ఎలక్ట్రానిక్ పరికరాన్ని చూసింది. తన పర్సనల్ ఫైలు అది. ఆమెలో ఉత్సుకత ఎక్కువైంది. తన గురించిన అన్ని వివరాలూ అందులో వున్నాయి. ఆ విషయమే అతడూ ధృవీకరిస్తూ అడిగాడు. "అంతరిక్ష ప్రయాణంమీద మీకు ఉత్సాహం వున్నట్టు ఇందులో వుంది. మీరు ఆ విషయంలో ఆర్నెల్లు శిక్షణ కూడా పొందారు. ఆ ఉత్సాహం ఇంకా వున్న పక్షంలో ఒకసారి స్పేస్ సిటీకి పంపాలనుకుంటున్నాం. మీ అభిప్రాయం ఏమిటి?"

    ఆమె గుండె వేగంగా కొట్టుకోసాగింది...... అంతరిక్షయానం....చంద్రుడి కవతల కృత్రిమంగా తయారుకాబడిన నేల(?) మీద జీవనం.

    "ఎన్నాళ్ళుండాలి సార్."


Next Page 

  • WRITERS
    PUBLICATIONS