Home » Merlapaka murali » Raaraa Maa Entidaakaa
పందెంలో ఓడిపోతే ఏం చేయాలో గడువు ముగిసిన మరుక్షణం చెబుతానన్నారు సోదరీమణులు. పందెంలో ఓడిపోతే ఏం అడుగుతారోనని రకరకాలుగా ఊహించింది.
వాళ్ళు ఏమయినా అడగవచ్చు. గుంజీలు తీయమని కోరవచ్చు. తన భర్తకు తను చెంపదెబ్బలు వేయాలని ఆశించవహ్చు. లేకుంటే హనీమూన్ కు తమను కూడా తీసుకెళ్ళమని అనొచ్చు. ఏం చెప్పినా చేయక తప్పదు.
ఇలా ఆలోచిస్తూంటే తను ఓటమి అంచుమీద నిలబడినట్లు అనిపిస్తోంది. పందెంలో గెలవకపోతే పోనీ, కనీసం మనిషయినా కనిపిస్తే ఇంత ఆదుర్దా వుండదు. అప్పటికీ రెండుసార్లు సుబ్బుల్ని ఇంటికి పంపించింది. మద్రాసు వెళ్ళాడని కబురొచ్చింది.
ఒక్క పక్క గడువు ముగుస్తుంటే ఇంకో పక్క మద్రాసు వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చిందో అర్ధంకాక వంశీమీద కోపం వచ్చింది. కోపం ప్రకటించడానికి కూడా మనిషి కనపడడాయె. ఆమె అలా దిగులుగా వుండడం ఆమె అక్కయ్యలకు ఎంతో ఉత్సాహాన్నిస్తోంది. తాము పందెంలో గెలవడం ఖాయమని ఆమె ముఖాన్ని చూస్తూనే తెలుస్తోంది. ఇంకాస్త ఉడికించడానికి ముగ్గురూ ఆమె దగ్గరకు చేరారు.
"ఏమిటే అలా వున్నావ్?" ఉమ తెచ్చిపెట్టుకున్న బాధతో అడిగింది.
"యుద్దభూమిలో ఓడిపోతున్న రాజును తలుచుకుంటూ రాణికి దిగులుకాక సంతోషంగా వుంటుందా?" రెండో అక్క మరికాస్త ఉడికించింది.
"అంటే సుజన ఓటమిని ఒప్పేసుకున్నట్టా?" చిన్నక్కయ్య అడిగింది.
"ఓడిపోతున్నట్లు ప్రత్యేకించి చెప్పాలా? దాని ముఖం చూస్తే తెలీడం లేదూ?" పెద్దక్క ఉమ సాగదీస్తూ చెప్పింది.
"కానీ ఈరోజు రాత్రి వరకూ గడువు వుందిగా?" అంది సుజన.
"ఇన్ని రోజులూ చేతకాని మరిదికి ఈరోజు ఏమయినా మన్మథుడు వలతహడా? అతను వేసే పుచ్చు ఐడియాలు ఏమీ పని చేయడం లేదు"
"మరి ఈ రాత్రి అయినా గట్టి ఐడియా వేసి సుజనని అవమానాల నుండి గట్టెక్కిస్తాడంటావా?"
"ఆ ఆశలేం పెట్టుకోకు. ఆయనగారు మద్రాసు ఉడయించాడట రేపు రాత్రి అసలు ముహూర్తం కదా. ఆపాటికయినా వస్తాడో? ఓడిపోయిన భార్యకు ముఖం చూపించలేక ఎగ్గొట్టేస్తాడో? ఎవరికి తెలుసు?" ఉమ అలా అన్నా వంశీ ఇక రాడన్న ధ్వని వుంది ఆమె మాట్లాడుతున్న మాటలలో.
"షేమ్.... షేమ్" ముగ్గురూ చిన్నగా చేతులు తడుతూ అన్నారు.
సుజనకు రోషం వచ్చింది. "యిప్పుడే ఎందుకు అలా మిడిసిపడతారు. ఇంకా ఈ రాత్రి వుంది కదా ఏమైనా జరగవచ్చు" అంది ఉక్రోషంగా.
"అది నీ భ్రమే. ఏమైనా జరగవచ్చేమోగానీ - నీ శోభనం మాత్రం జరగదు" హేమ ఖచ్చితంగా అంది.
"చూద్దాంలే" అని ముగ్గురూ వెళ్ళిపోయారు.
సుజన ఒంటరిగా మిగిలిపోయింది.
అప్పుడామె పశువుల కొట్టాంలో చైర్ వేసుకుని కూర్చుని వుండడం వల్ల ఇంట్లో ధ్వనులేమీ వినపడడం లేదు. వర్షాకాలం కాబట్టి సూర్యుడు మబ్బుల చాటున పచార్లు చేస్తున్నాడు. చలి చలిగా వాతావరణమంతా ఎగ్జయిటింగ్ గా వుంది. కానీ వంశీ లేడన్న ఆలోచన ఆ ఉత్సాహం మీద నీళ్ళు కుమ్మరిస్తోంది.
ఇలానే వుంటే ఆలోచనలు తనను పీక్కు తింటాయేమో ననిపించి మౌనికను అర్జంటుగా రమ్మని సుబ్బుల్తో కబురు పంపింది.
ఇంట్లోకెళ్ళి రెండు కప్పులూ, కాఫీ పోసుకుని ఫ్లాస్కూ తీసుకుని వచ్చింది.
మరికాసేపటికి మౌనిక అక్కడికి చేరుకుంది.
ఆమె వయసు సుమారు ఇరవై ఆరేళ్ళుంటాయి.
మిడ్ వింటర్ లో సైబీరియాలో చలిమంట కనిపించినట్లు, థార్ ఎడారిలో మంచి వేసవిలో ఒయాసిస్ ఎదురయినట్లు ఆమెను చూస్తూనే రెండు రకాల భావనలు కలుగుతాయి. ఎంత ఆత్మీయంగా అన్పిస్తుందో అదే క్షణంలో అంత దూరంగానూ కనిపిస్తుంది. ఎంతగా పూజించాలనిపిస్తుందో, అదే క్షణంలో మీద పడిపోవాలనిపిస్తుంది. ఆమె పర్సనాలిటీ అలాంటిది.
ఎంత అందంగా కనిపిస్తుందో అంత సెక్సీగానూ తోస్తుంది. ఇలా రెండు రకాలయిన ఫీలింగ్స్ ని కలగచేసేవాళ్ళు చాలా అరుదు. అందుకే ఆమెని చూసిన ఏ మగాడికయినా ఆమెతో ఎక్కడో - ఊటీలోనో, గోవాలోనో ఒంటరిగా గడపాలనిపిస్తుంది. కానీ ఆమె వివాహిత కావడంతో ఆ ఊర్లోని చాలామంది అబ్బాయిలు అలా ఊహలకే పరిమితమయి పోతున్నారు.
ఆమె భర్త శ్రీనాథ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ పక్కనున్న టౌన్ లో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆమె ఎం.ఏ. ఇంగ్లీష్ లిట్ చేసింది.
"కమాన్ మౌనికా! హౌ ఆర్ యు?" అంటూ ఆప్యాయంగా ఆహ్వానించింది.
"వెరీ ఫైన్ - పొద్దునే కబురు పెట్టేవేమిటి? నువ్వంటే కొత్త పెళ్ళికూతురివి గనుక పనులు చేయక్కర్లేదు. నేను మాసిపోయిన పెళ్ళికూతుర్ని పనులు చేయక తప్పదు. "ఊఁ ఏమిటి విశేషాలు?"
"బోర్ కొడుతోంటే కబుర్లు చెప్పుకుందామని రమ్మన్నాను దట్సాల్"
"ఇలా ఊహించే మధ్యాహ్నం వంటంతా మా అత్తమ్మకు ఒప్పించి వచ్చాను. ఆయన డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇక నో ప్రాబ్లం నాకూ బోర్ కొడుతోంది కాబట్టి మనం కబుర్లలో మునిగి తేలచ్చు" అంటూ మౌనిక ఎదురుగా వున్న కుర్చీలో తీరుబడిగా కూర్చుంది.
"చాలా మంచిపని చేశావ్. మనం ఎంత సేపయినా మాట్లాడుకోవచ్చు"
"రేపు రాత్రి మీ శోభనం అటకదా. మా పక్కింటి కాంతం చెప్పింది. మీరిద్దరూ లవర్స్ కదా. ఇంకా మీకు ఫస్ట్ నైట్ ఏమిటి? లవర్స్ కాని మేమే ఫస్ట్ నైట్ ని పెళ్ళికి ముందే ముగించేసుకున్నాం. పెళ్ళి అయ్యాక ఏర్పాటు చేసిన ఫస్ట్ నైట్ మాకు సెకండ్ నైట్" అంటూ సిగ్గుపడింది మౌనిక.
"పెళ్ళికి ముందే ఫస్ట్ నైటా! మీరిద్దరూ లవర్స్ కాకుండా అదెలా సాధ్యమైంది?" ఆశ్చర్యపోతూ ప్రశ్నించింది సుజన.
"అదంతా ఓ తమాషా"
"చెప్పవా?"
"ఫస్ట్ నైట్ గురించా! నా వల్ల కాదు బాబూ" మౌనిక మరింత సిగ్గుపడింది. అప్పుడు ఆమె ముఖం మందారం పువ్వుకి ఎర్రటి రంగువేసినట్లుంది.
"ప్లీజ్ చెప్పవూ?"
మౌనిక మెత్తబడింది.
మరో పదినిముషాలు అర్ధించాక చెప్పటానికి ఒప్పుకుంది. మొదట్లో సిగ్గుపడ్డా ఆ తరువాత దాటీగానే కొనసాగించింది.
"మాది సూళ్ళూరుపేట టౌన్. మా నాన్న చెక్ పోస్ట్ లో తనిఖీ అధికారి. అమ్మా నాన్నలకు ముగ్గురు సంతానం. మొదట మా అన్నయ్య వాడు డాక్టర్. విజయవాడలో డాక్టర్ గా పోస్టింగ్ రావడంతో అక్కడే పెళ్ళి చేసుకుని సెటిలయిపోయాడు.
రెండోది మా అక్కయ్య దానిని మద్రాసులో ఇచ్చాం. మా బావ స్పీక్ ఎరువుల ఫ్యాక్టరీలో పర్సనల్ మేనేజర్. ఇక ఇంట్లో మిగిలింది అమ్మా నాన్నలతో పాటు నేనొక్కదాన్నే.
నేను ఎం.ఏ. కంప్లీట్ చేశాను. ఎంఫిల్ చేద్దామని ఉన్నా వీలులేక పోయింది.



