Home » Merlapaka murali » Raaraa Maa Entidaakaa


    తను ఎందుకూ పనికిరాడేమోనన్న అనుమానం ఇప్పుడు నగ్న సత్యంలా అనిపిస్తోంది.
    
    దాంతో అతను మరింత కుదేలయిపోతున్నాడు.
    
    అందుకే ఆ తర్వాత ఏం చేసినా అతను ముట్టుకోలేకపోయాడు.
    
    ఇలా మూడురోజులు గడిచాయి.
    
    దేవిక భర్తతో పాటు అత్తగారింటికి వచ్చింది.
    
    తన స్వంత ఇంటిలో ప్రతీదీ మరీ మరీ స్పష్టంగా గుర్తుకొస్తుండటంతో శంకర్ మరింత ముడుచుకుపోయాడు.
    
    అందులోనూ సుబ్బరామయ్య వీలయినప్పుడల్లా కొడుకును తిడుతూనే వున్నాడు.
    
    తన భర్త శారీరకంగా బాగానే వున్నాడనీ, మానసికంగానే సరిగా లేడని గ్రహించింది దేవిక.
    
    అతనలా తయారుకావడానికి సుబ్బరామయ్యే కారణమని కూడా తెలుసుకుంది.    

    అందుకే తండ్రిని ఎదిరించమని చెప్పింది.
    
    తనను సుఖపెట్టి, అతన్నీ సుఖపడమని తఃనకు చేతనైనంతగా రెచ్చగొట్టింది దేవిక.
    
    కానీ రెండూ వీల్లేకపోయింది.
    
    దాంతో ఇక భరించలేక ఆ వీధిలో వున్న ఓ కుర్రాడితో లేచిపోయింది.
    
    తన ప్రభావం కొడుకు మీద ఎంత దుష్ఫలితలను కలగజేసిందో తెలుసుకోలేని సుబ్బరామయ్య కోడలు మరో యువకుడితో లేచిపోయిన రోజున తీవ్రమైన టెన్షన్ ఫీలై పక్షవాతానికి గురయ్యాడు. మంచంమీద నుంచి కదలలేని తీవ్రమైన టెన్షన్ ఫీలై పక్షవాతానికి గురయ్యాడు. మంచంమీద నుంచి కదలలేని ఆయన్ను చూసి శంకర్ ధైర్యం పుంజుకున్నాడు. మునుపటి భయం పోయింది.
    
    నిస్సహాయంగా పడిపోయిన ఆయనపై కసి బయల్దేరింది. మందులు తేవడం మానేశాడు. అదే విషయం సుబ్బరామయ్య అడిగితే "ఏం చేయను? మీరేగా నన్ను పనికిమాలిన వాడినని తిట్టేవాళ్ళు.

    నిజం కూడా అదే తండ్రి పక్షవాతంతో మంచంలో పడుంటే డాక్టర్ కి చూపించలేని, మందులు కొనివ్వలేని అసమర్ధుడయిన కొడుకుని నేను" అని ఆయన పాఠం ఆయనకే ఒప్పచెప్పడం ప్రారంభించాడు.
    
    అలా తండ్రిని ఎదరించాడు. తన కసినంత తీర్చుకుంటూ వుండడంతో విచిత్రంగా అతనిలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పోయింది. మనిషి బలంగా, ఆకర్షణీయంగా తయారయ్యాడు.
    
    ఆడపిల్లను చూస్తే కోరిక అతన్ని నిటారుగా నిలబెట్టేది. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది దేవిక ఆ కుర్రాడితో సెటిలై పోయింది"
    
    వంశీ చెప్పడం పూర్తి చేసి శరవణన్ రియాక్షన్ కోసం చూశాడు. ఇది గ్రహించిన ఆయన "సుబ్బరామయ్యకు శంకర్ మంచి శాస్తి చేశాడు. భార్య దగ్గర ఓడిపోయిన అతను - ఆ ఓటమికి కారణమైన తండ్రిమీద పగ సాధించి గెలిచాడు.
    
    ఇందుకు అందవయ్యాని అప్రిషియేట్ చేయాలో భార్యను పోగొట్టుకున్నందుకు సానుభూతి తెలియజేయాలో పురియడం లేదప్పా" అన్నాడు.
    
    మాటల్లోనే వాళ్ళు మరో రౌండ్ కూడా పూర్తి చేయడంతో నిషా కూడా ఎక్కువయింది. మాటలు విస్కీలో తడిసి ఎంతో బరువెక్కినట్లు భారంగా నోట్లోంచి జారుతున్నాయి.
    
    "అందుకే ఈ పెద్దవాళ్ళంటే నా కసహ్యం. పిల్లలమీద తమ ఐడియాలని రుద్దాలని ప్రయత్నిస్తారే తప్ప స్వేచ్చగా పెరగనివ్వరు. చాలామంది మగవాళ్ళు తమ అధికారాన్నంతా ఇంట్లో ప్రదర్శిస్తుంటారు. ఒక మగవాడి దౌర్జన్యానికి, దౌర్భల్యానికి ముందుగా బలయ్యేది అతని భార్యా పిల్లలే.
    
    మా మామనే తీసుకోండి. అతని శాస్త్రాల పిచ్చంతా ఇంట్లోవాళ్ళ మీద రుద్దుతుంటాడు. ఆ ఇంట్లో బాగా పాతదయిన ఓ పెద్ద కొయ్య పెట్టె వుంది. దాన్నిండా ఈ పుస్తకాలే ఈ శతాబ్దపు పంచాంగాలన్నీ ఆయన దగ్గరున్నాయి. మాయల ఫకీరు ప్రాణం చిలుకలో వున్నట్లు ఆయన ప్రాణం ఆ కొయ్య పెట్టెలో వుంది.
    
    ఊరికి బయల్దేరాలనుకోండి - వెంటనే ఆయన ఆ పెట్టె తెరచి ఓ పుస్తకం తీస్తాడు. దాన్ని అటూ ఇటూ తిప్పి, గంటసేపు ఏదో లెక్కలు వేసి గ్రహాల చలనం బాగా లేదనీ, ప్రయాణం వద్దనీ చెబుతాడు. దాంతో బయల్దేరిన ఇంటిల్లిపాదీ ఉసూరుమంటూ అలంకరణలన్నీ తీసివేసి, నిరాశను ఒంటినిండా కప్పుకుని మూల కూర్చుండిపోతారు.
    
    వాస్తు బాగాలేదని ఆయన వంటగదిని ఇప్పటికి ఎన్నిసార్లు కొట్టి కట్టారో లెక్కలేదు. ఆ పెట్టెను వదిలించుకుంటే తప్ప ఆయన పిచ్చి తగ్గదు"
    
    "వాస్తు కూడా బాగా నమ్ముతాడా?"
    
    "చిన్నగా అడుగుతారేమిటి! ఆయన వాస్తు దగ్గర్నుంచి, గ్రహాల స్థితి వరకు నమ్ముతాడు. అంతేకాదు తు.చ. తప్పకుండా ఆచరిస్తాడు. ఆచరించమని మిగిలినవాళ్ళని శాసిస్తాడు కూడా"
    
    "అందుకేనేమో నప్పా వీలయినంత త్వరలో బ్రహ్మానందం మహారాజ్ ని పంపించమని రెండుమూడు సార్లు లెటర్ రాశాడు" అన్నాడు శరవణన్.
    
    "బ్రహ్మానంద మహారాజ్ ఎవరు?"
    
    "ఆయన ఒక తాంత్రికుడు మద్రాసులోనే వుంటాడు. ఆయన చేయని విద్యంటూ లేదు ఆయన గురించి విన్నాడేమో ఎలాగో ఆయన్ని ఒప్పించి తమ ఇంటికి పంపమని రాశాడు"
    
    శరవణన్ చెప్పిన విషయం వింటూంటే వంశీకి తళుక్కున ఓ ఆలోచన మెరిసింది. ఒక దెబ్బకు రెండు పిట్టలు అనుకున్నాడు.
    
    రేపు రాత్రితో తమ ఛాలెంజ్ గడువు ముగుస్తుంది. ఆ మరుసటి రోజురాత్రి తన మామయ్య ఫస్ట్ నైట్ అరేంజ్ చేస్తాడు. అంటే సుజన పందెంలో గెలవాలంటే రేపు రాత్రికి అన్ అఫీషియల్ శోభనఁ జరిగిపోవాలి.
    
    అలా జరిగితేనే సుజన తన అక్కయ్యలతో వేసిన పందెంలో నెగ్గుతుంది.
    
    లేకుంటే ఓడిపోతుంది. సో - రేపు రాత్రికి సుజనను కలుసుకోవాలి అనుకుంటూ కొత్త పథకం అల్లుకున్నాడు. అంత గొప్ప ఐడియా తట్టినందుకు తనను తనే అభినందించుకున్నాడు.
    
    "సార్! మీరో సహాయం చేయాలి" అంత సడన్ గా వంశీ కళ్ళు మెరవడాన్ని అయోమయంగా చూస్తూ "ఎన్నప్పా అది?" అని అడిగాడు శరవణన్.
    
    "మహరాజ్ రేపు మధ్యాహ్నానికి ఇంటికి వస్తున్నాడని మామయ్యకు మీరు టెలిగ్రామ్ ఇవ్వాలి సార్" అన్నాడు వంశీ.
    
    "ఎందుకప్పా?"
    
    "అదంతా పెద్ద కథలే సార్. ఇంతకీ మీరు టెలిగ్రామ్ ఇస్తున్నారా లేదా?"
    
    "అయ్యయ్యో! ఎంతమాట.... ఎంతమాట.... ఇప్పుడే ఇచ్చేస్తానప్పా"
    
    వంశీ మరింత ఖుషీగా ఇంకో రౌండ్ పూర్తి చేశాడు.
    
                                                            *    *    *    *    *
    
    ఉదయం లేచింది మొదలు దిగులు దిగులుగా వుంది సుజనకు. ఆరోజు రాత్రితో గడువు ముగుస్తుంది. తన భర్తంత రొమాంటిక్ పర్సనాలిటీ మరొకరు లేరని ఢంఖా బజాయించి చెప్పి, ముహూర్తానికి ముందే శోభనం జరిపించుకుంటానని పందెం కాసింది. ఇప్పుడేమో వంశీ పత్తా లేడు. ఎక్కడికెళ్ళాడో కూడా తెలియడం లేదు.
    
    గతంలో వేసిన పథకాలన్నీ ఫెయిలవడంతో ముఖం చాటేశాడేమోనన్న అనుమానం కలుగుతోంది.


Related Novels


Preminchandi Please

Ee Reyi Needoyi

Pagale Vennela

Nee Meeda Manasaayaraa

More