Home » Dr C ANANDA RAMAM » Tapasvi


    "మరి దేనికి సంకోచం?"
    "సంకోచం అసలు లేదు. కానీ, నేనూ చివరకు నువ్వూ ఎవ్వరూ ఏనాడూ ఆధీనం చేసుకోలేని సర్వస్వతంత్రమైన కాలానికి మనమందరమూ బద్ధులం కాక తప్పదు. కాలం పరిపక్వం కావాలి. నా పరిశోధన ఫలించాలి. అప్పుడు నా బ్రతుకు పరిపూర్ణమయ్యేలా నిన్ను స్వీకరించగలను. ఏం సౌందర్యా! నిరీక్షించలేకపోతున్నావా?"
    "అవును. ఇన్నాళ్ళుగా నిరీక్షించాను. ఏనాటికైనా నీ దానిననే విశ్వాసం ఉన్నన్నాళ్ళు ఎంత కాలమైనా నిరీక్షించగలిగాను. ఇప్పుడా విశ్వాసానికే దెబ్బ తగులుతుంటే!"
    "నానుండి నిన్ను ఆకర్షించగలిగే మరొక శక్తి ఉందా?"
    "ఉంది."
    "ఏమిటి?"
    "మా నాన్నగారు."
    పకపక నవ్వాడు విక్రం.
    "అయితే ఫరవాలేదు."
    "నవ్వకు విక్రం! మా నాన్నగారు మామూలుగా ఉన్నన్నాళ్ళూ నిర్లక్ష్యం చెయ్యగలిగాను. ఆయన మమతను గుర్తించినా ధిక్కరించగలిగాను. కానీ ఈనాడు ఆయన నీ ప్రక్కన నిలబడ్డారు. తనను సర్వనాశనం చేయాలని చూసే శక్తులను ఎదిరించి నిన్ను నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నారు."
    "అందుకు నీకు సంతోషంగా లేదా?"
    "ఉంది. భయంగా కూడా ఉంది. ఇదంతా నా కోసమే అయితే...ఇందులో నాన్నగారి స్వార్థం మాత్రమే ఉంటే- నేను భయపడక్కర్లేదు. కానీ ఆయన నా కోసమే నీ ప్రక్కన నిలబడ్డారు, ఇంక నేను ఆయనను ధిక్కరించలేను."
    "ధిక్కరించవలసిన అవసరం ఏముంది?"
    "ఏమో! ఏనాడు ఏ క్షణంలో ఏ రూపంలో ఆయనకు లొంగిపోయి నీకు దూరమయిపోతానో! నన్ను వెళ్ళమనకు విక్రం! ఇక్కడే ఉండిపోతాను."
    విక్రం హృదయం మీద వాలిపోయింది సౌందర్య...ఆర్తితో భగభగ జ్వలించే తన శరీరం అమృత భావనలతో పులకరించినట్లయింది. తల ఎత్తి అతని ముఖంలోకి చూసింది. వెంటనే వెనక్కు తగ్గింది. అతను ఏమీ మాట్లాడలేదు. మాట్లాడక్కర్లేదు. పరిశోధన పూర్తి అయిన తరువాత కాని ఆ చేతులు తనను చుట్టుకోవు. తనను గుండెలో నిలుపుకోవు.
    బేలగా నిలబడిపోయింది సౌందర్య.
    క్షణికంగా అయినా సౌందర్యను బేలగా చూడలేకపోయాడు విక్రం. సౌందర్య చేతిని తన చేతిలోకి తీసుకుని "ధైర్యంగా ఉండు సౌందర్యా! నేను నిన్ను దక్కించుకుని తీరుతాను" అన్నాడు.
    అప్పటివరకు వసుంధరను సౌందర్య చూడలేదు. అతని లాబ్ దాటి అతని జీవితంలోకి రావాలని ప్రయత్నించలేదు. ఆనాడు మొదటిసారిగా అతని జీవితంలోకి అల్లుకుపోవాలని కోరిక కలిగింది.
    "నన్ను మీ అమ్మగారికి పరిచయం చెయ్యి" అంది.
    ఆమెను వసుంధర దగ్గరకు తీసుకెళ్ళి తను తన లాబ్ లోకి వచ్చేశాడు అతను.
    సౌందర్య మొదటిసారిగా వసుంధరను కలుసుకొంటున్నప్పుడు తాను అక్కడ ఉండదలచుకోలేదు.
    వాళ్ళిద్దరికీ ఒకరి పట్ల ఒకరికి కలిగే అభిప్రాయాల మీద తన నీడ పడకూడదు.
    ఆమెను చూడగానే కొద్దిగా ముడుచుకుపోయింది వసుంధర.
    ఆ విశృంఖలత్వాన్ని అర్థం చేసుకోలేకపోయింది. దానిలో విలీనమైన శ్రుతి ఆవిడ కందలేదు.
    వసుంధరలో సౌమ్యత్వానికి- ఆ సౌమ్యత్వంలోని ఒకానొక పదునుకు కొద్దిగా బెదిరింది ఆమె.
    సమస్తమూ అర్థం చేసుకోగలిగినట్టున్న ఆ చూపుల నుండి తప్పుకోవాలనిపించింది ఒక్క క్షణం. తప్పించుకోవలసిన అవసరం లేదనిపించింది మరుక్షణం.
    ఆ చూపులు అన్నీ అర్థం చేసుకోగలవు. దేనినయినా క్షమించగలవు. బట్టబయలుగా నిలబెడతాయి. సిగ్గిలవలసిన అవసరం లేదని ధైర్యం చెబుతాయి.
    "కూర్చో అమ్మా" ఆదరంగా అంది వసుంధర.
    ఆమె కూర్చుని అతి సామాన్యంగా ఉన్న ఆ ఇంటిని నాలుగు ప్రక్కలా చూసింది.
    "ఇప్పుడు మీకు సుఖంగా ఉందా?"
    "ఇప్పుడు అంటే?"
    "ఇబ్బందులన్నీ పోయి..."
    "నాకు ఇబ్బంది కలిగించేది ఒకే ఒక్క విషయం- మా విక్రం ముఖం చిరునవ్వు లేకుండా చూడవలసి రావటం. అలాంటి అవస్థ నాకింత వరకూ రాలేదు. అంచేత నాకెప్పుడూ ఎలాంటి ఇబ్బందీ లేదు."
    "నేనెవరో విక్రం మీకు చెప్పారా?"
    "త్వరలో నిన్ను పెళ్ళి చేసుకోబోతున్నానని చెప్పాడు."
    "నేను కోడలిగా రావటం మీకు ఇష్టమేనా?"
    "ఇష్టం లేదు."
    "అదేం?"
    "నీలో ఏదో గొప్పతనం ఉంది. అంత గొప్పతనం ముందు నాకేదో సంకోచంగా ఉంది. సుధలాంటి కోడలయితే నాకు అనుకూలంగా ఉండేది."
    "సుధ మీకు తెలుసా?"
    "తెలుసు. ఒక్కసారే చూశాను. అయినా చాలా ఇష్టపడ్డాను."
    "ఈ సంగతి విక్రంకు చెప్పారా?"
    "చెప్పవలసిన అవసరమేముంది?"
    "విక్రం మీ మాట వినరా?"
    "ఈ ప్రశ్న ఇంతవరకూ నేను అతన్ని అడుగలేదు. నన్ను నేనూ వేసుకోలేదు. నీకెలా సమాధానం చెప్పను?"
    "సుధ అంటే మీకిష్టమయినప్పుడు నన్ను కోడలిగా అంగీకరించగలరా?"
    "విక్రం నిన్ను చేసుకోవాలనుకున్నాడు. నా ఇష్టాయిష్టాలు అతనికెందుకు ఆపాదిస్తాను?"
    సౌందర్య లేచింది.
    "విక్రం వ్యక్తిత్వానికి బీజమెక్కడో అర్థమయింది" అనుకుంది.
    "ఈ అమ్మాయితో నేను సర్దుకోలేకపోవచ్చు. కానీ విక్రంకు తగిన భార్య..." అనుకుంది వసుంధర.

                                    31

    శశాంకను తిరిగి తన స్వాధీనంలోకి తెచ్చుకోవాలని మిసెస్ కామేశ్వరీ దేవి చేసిన ప్రయత్నాలు ఇన్నీ అన్నీ కావు. దేనికీ శశాంక లొంగి రాలేదు. ఇక కామేశ్వరీదేవికి మిగిలింది ఒకటే! పగ తీర్చుకోవటం- కాటువేయటానికి సమయంకోసం కాచుకుని ఉంది..
    పెద్ద బాంక్ బిల్డింగ్ కాంట్రాక్టు తీసుకున్నాడు శశాంక. పని చురుకుగా సాగుతోంది. నాలుగో అంతస్థు మీద వర్కర్స్ పనిచేస్తున్నారు. ఆ సమయంలో స్కే ఫోల్డింగ్ కదిలిపోయింది. స్లాబ్ కూలిపోయింది. వర్కర్స్ నుగ్గు నుగ్గు అయిపోయారు.
    మిసెస్ కామేశ్వరీదేవి ఆందోళనతో శశాంక దగ్గరకు వచ్చింది...
    "ఎంత ఘోరం జరిగిపోయింది?" అంది.
    ఆవిడ కంఠంలో విచారం ఉట్టిపడుతోంది. కానీ ఎంత ప్రయత్నించినా కళ్ళలో ఉరకలు వేసే పాశవిక సంతోషాన్ని అణచుకోలేకపోయింది.
    కామేశ్వరీదేవిని చూసి చిరునవ్వు నవ్వాడు శశాంక.
    "అవును. ఘోరమే జరిగింది..."
    ఆ చిరునవ్వును సహించలేకపోయింది కామేశ్వరీ దేవి.ఆవిడ మనసులో పొంగులెత్తే ఆనందాన్నంతటినీ ఆ చిరునవ్వు చంపేస్తోంది.
    "ఇప్పుడు చాలా గొడవ జరుగుతుంది కదూ!"
    "మామూలేగా!"


Related Novels


Nanrushi Kurutay Kavyam

Sampenga Podalu

Swathi Jallu

Aparajitha

More