Home » Dr C ANANDA RAMAM » Tapasvi

 

    "ఏం చేస్తారు?" నన్ను ఉద్యోగం లోంచి తీసేస్తారు. ఇది వరకు తీసేశారు కదా! అంతకంటే ఎక్కువేం జరుగుతుంది? ఇంకా సహించలేకపొతే నన్ను చంపుతారేమో! అయితేనేం మళ్ళీ జన్మించనా?"
    డాక్టర్ కిరణ్ కుమార్ లేచి విక్రం భుజం స్నేహపూర్వకంగా తట్టి "నిన్నెవరూ ఏం చెయ్యలేరు. నీ పరిశోధన త్వరగా ముగించు" అని వెళ్ళిపోయాడు.
    పరిస్థితులు కుసుమకు మరీ ప్రాణసంకటంగా తయారయ్యాయి. ఏ రోగులకు ఆవిడ విసుగనేది లేకుండా సకలు సేవలు చేస్తోందో వాళ్ళే ఆవిడను చూసి .....ముఖ మెదురుగానే నిరసనగా నవ్వుతున్నారు. క్రొత్తగా వచ్చిన వాళ్ళకు పాత వాళ్ళు గుసగుసగా చెపుతున్నారు. వాళ్ళూ వీళ్ళూ వచ్చి కుసుమను కుతూహలంగా ప్రదర్శనశాలలో వింత వస్తువును చూసినట్లు చూస్తున్నారు. కుసుమ తట్టుకోలేకపోతోంది. ఇంతకంటే తన పాత జీవితమే మేలనిపించింది. డాక్టర్ విక్రం దగ్గరకు వచ్చింది....
    "నేను వెళ్ళిపోతున్నాను!"
    "ఎందుకు?"
    "ఇదంతా నేను భరించలేను. నా కారణంగా మీరు నిందలపాలవటం అసలు సహించలేను!"
    విక్రం విసుగ్గా తలెత్తి చూశాడు. ఆ చూపులకు కంపించిపోయింది కుసుమ.
    'అలా చూడకండి.! అందరూ ఈసడించినా తట్టుకోగలను. నాకంటే ఏ విధంగానూ ఎక్కువ కాని క్షుద్రలందరూ నన్ను చిన్న చూపు చూసినా భరించగలను. నన్ను చిన్న పుచ్చి తద్వారా తమకు ఆధిక్యాన్ని అంటగట్టుకోవాలనే అల్పులనూ ఎదుర్కోగలను. కానీ మీ చూపు.... ఆ చూపు ముందు మాత్రం నిలవలేను."
    "వెళ్ళు! వెళ్ళి నీ పని చూసుకో! నీ పనిని గురించి తప్ప మరి దేనిని గురించి ఆలోచించకు. ఇంకెప్పుడూ ఇక్కడి నుండి వెళతానని అనకు!"
    "అనను. మీరే గెంటినా వెళ్ళను. ఇక్కడే ఉంటాను."
    విక్రం చిరునవ్వు నవ్వాడు.
    "ఆ చిరునవ్వు నా మనసులో మెరుస్తున్నంత కాలం దేనినయినా భరించగలను. ఎలాంటి శక్తులయినా ఎదుర్కోగలను. భగవంతుడా! ఈ చిరునవ్వు ఎప్పటికీ ....ఎప్పటికీ , నా మనసులో పదిలం చేసుకోనివ్వు" అని ప్రార్ధించుకుంది కుసుమ.

                                    29
    కుసుమ కారణంగా విక్రం పై రేగిన దుమారం విక్రంను నలుగురి దృష్టిలోకి తెచ్చింది . కుసుమ - విక్రంల కధలు మానవ సహజ స్వభావాన్ని బట్టి సాధారణులు చెప్పుకోగా - తెలివయినవాళ్ళు కొందరు విక్రం ప్రతిభను అతి త్వరలో గుర్తించగలిగారు! అతడు నయం చేసిన కాంప్లెకేటేడ్ కేసెస్ గురించిన కధలు చకచక వ్యాప్తిలోకి వచ్చేశాయి! వామన్ ను చూసి చిరునవ్వుతో తప్పుకునే జనుల సంఖ్య నానాటికీ ఎక్కువ కాసాగింది. వామన్ ఎంత తెలివిగా ఎంత చాకచక్యంగా తప్పించుకోవాలని చూసినా, ఒకటి రెండు కేసులు వామన్ చేతుల్లో పడటమూ, వామన్ ఒకదానికొకటి ట్రీట్ చేసి, మరింత పాడు చెయ్యటమూ , మిగిలిన డాక్టర్లు అతి ప్రయాస మీద ఆ రోగిని కాపాడటమూ చాలా సార్లు జరిగింది. రహస్యంగా డాక్టర్లు తమలో తాము అనుకునే మాటలు నలుగురిలోకి రావటానికి ఎక్కువ కాలం పట్టలేదు. వామన్ ను ఒక దేవతగా ఆరాధించిన జనం ఆ భావన నుండి బయట పడటానికి ..... వామన్ ను ఒక పురుగులా విదిలించటానికి క్షణం పట్టలేదు. మనోబలం.... విచక్షణ..... వివేకం..... ఉన్న కొద్దిమంది ఎటు దారి తీశారో ఆ దారిలోకి క్షణాల మీద ప్రవాహం మళ్ళిపోయింది.
    తన గదిలో కూర్చుని పాలిపోయిన ముఖంతో శూన్యంలోకి చూస్తున్న వామన్ ను చూసి భరించలేకపోయాడు విక్రం. ఆనాడు కుసుమ కూడా అంత దయనీయంగా లేదు.
    వామన్ దగ్గరకు వచ్చి భుజం మీద చెయ్యి వేసి "వామన్!" అన్నాడు ఆదరంగా.
    ఆ స్పర్శకు ఉలిక్కిపడ్డాడు వామన్.
    ఆ స్పర్శ భరించలేకపోతున్నాడు. ఆ స్పర్శను తానై తొలగించుకోలేక పోతున్నాడు. అంతే కాదు ఆ స్పర్శ తనకు కావాలని కూడా ఉంది.
    "నిన్ను నువ్విలా ఎందుకు చిత్రవధ చేసుకుంటావు వామన్! ఏం ప్రయోజనం దీని వల్ల?"
    "ఏం చెయ్యమంటావు నన్ను?"
    నూతిలోంచి వచ్చినట్లు వస్తున్నాయి నోటివెంట మాటలు.
    "ఆలోచించవలసినది ఏముందీ? రిజైన్ చేసెయ్యి."
    దిగ్గున లేచాడు వామన్.
    "రిజైన్ చెయ్యమంటున్నావా? నేను చెయ్యలేను. ఒక్కనాటికీ రిజైన్ చెయ్యను"
    జుట్టు పీక్కుంటూ వెళ్ళిపోయాడు వామన్.
    జాలిగా నిట్టూర్చాడు విక్రం.
    వామన్ నేరుగా సుధ దగ్గరకు వెళ్ళాడు.
    వామన్ ముఖం చూడగానే సుధ సానుభూతితో కరిగిపోతూ అతడిని కూర్చోబెట్టి చల్లని మజ్జిగ ఇచ్చింది.
    అదంతా ఒక్క గుక్కలో త్రాగేశాడు వామన్!
    "సుధా! నన్ను నమ్ము! నేను చెడ్డవాడ్ని కాను. నా దగ్గర కొచ్చిన రోగులు జబ్బు నయం చేసుకుని వెళ్ళాలనే ఉంటుంది కాని...."
    ఆగిపోయాడు వామన్!
    "ఇందులో నమ్మకపొవటానికేముందీ? డాక్తర్లందరూ కోరుకునేది అదేగా!...."
    'అవును . డాక్టర్లందరూ కోరుకుంటారు. అదే సాధిస్తారు! నేనూ అదే కోరుకుంటాను! కాని .....సుధా! ఈ క్షోభ భరించలేను. విక్రం చెప్పినట్లు చెయ్యటమే మంచిదేమో!"
    "ఏం చెప్పారు విక్రం?"
    "నన్ను రిజైన్ చెయ్యమన్నాడు!"
    "మీకు అదే మంచిదిగా తోచిందా!"
    "నా చేతులలో ఉన్నది - నా కోసం నేను చేసుకోగలిగింది అదొక్కటే!"
    "మరి రిజైన్ చెయ్యండి!"
    "చెయ్యలేను. నలుగురిలో నేను డాక్టర్ గా నిలవాలి. డాక్టర్ నని చెప్పుకోవాలి!"
    సుధ నవ్వింది.
    "అయితే డాక్టర్ కావటానికే ప్రయత్నించండి."
    "ప్రయత్నించినంత మాత్రాన డాక్టర్ ని కాగలనా?"
    "అది నేనెలా చెప్పగలను? మీరు నిజంగా ఎప్పుడు ప్రయత్నించారు?"
    "ఏమో! నాకు ఎంతో సంపద వచ్చింది. ఏనాడూ దానిని అనుభవించలేకపోతున్నాను. డాక్టర్ గా నన్ను నేను ప్రకటించుకున్నాను. డాక్టర్ని కాలేక పోతున్నాను. నేనెవరినో , నాకేం కావాలో నాకే అర్ధం కావటం లేదు. నాకు సుఖం లేదు, శాంతి లేదు, సంతోషం లేదు."
    సుధ వింటూ కూర్చుంది. ఏం మాట్లాడలేదు.
    "సుధా! నాకు నువ్వు కావాలి! నువ్వు లేకుండా నేను బ్రతకలేను."
    "నేను మీదాన్నని ఎప్పుడో చెప్పానుగా!"
    "అలా కాదు! అనుక్షణం నాతోనే ఉండాలి! నన్ను పెళ్ళి చేసుకో!"
    "అందుకు కూడా నా అంగీకారం ఎప్పుడో చెప్పాను."
    వామన్ ముఖం పాలిపోయింది. వణుకుతున్న గొంతుతో అన్నాడు -
    "మిసెస్ కామేశ్వరీ దేవిని అడిగి ఆవిడ అనుమతితో నిన్ను దక్కించుకోవటం అసంభవం ..... ఎదురించి అయినా సరే నిన్ను పొందాలని రెండు మూడు సార్లు ప్రయత్నించాను. కానీ, అన్నిసార్లూ ఓడిపోయాను! ఏం చెయ్యగలను సుధా! ఎలా దక్కించుకోగలను నిన్ను?"
    వామన్ లో ఆ ఆర్తి భరించలేకపోయింది సుధ.
    'ఇంక ఒక్కటే ఉపాయం ఉంది..."
    "చెప్పు! నిన్ను దక్కించుకోగలిగే ఏ ఉపాయమైనా సరే!"
    "మీ కోసం నేనే కామేశ్వరీదేవిని ధిక్కరించి వస్తాను! స్వీకరించగలరా?"
    "తప్పకుండా! కామేశ్వరీ దేవికి తెలియకుండా.... ఆవిడ కంటికి కనబడకుండా పెళ్ళి చేసుకుందాం!"
    సుధ నవ్వింది - వామన్ ఉత్సాహంగా మళ్ళీ అన్నాడు.
    "ఎప్పుడు? ఇప్పుడే వెళదామా?"
    "కాదు! నాకింకా ఇక్కడ కొంచెం పనులున్నాయి. అవి అయిపోయిన తరువాత మిసెస్ కామేశ్వరీ దేవికి చెప్పి వస్తాను!"
    "మిసెస్ కామేశ్వరీదేవికి చెప్పి వస్తావా?"
    తడబడుతున్న మాటలతో పోడారిపోతున్న గొంతుతో అన్నాడు వామన్!
    "మీకెందుకూ భయం? చెప్పుకునేదానిని నేను కదా!"
    "ఆవిడ నిన్ను రానియ్యదు"
    "నిజమే! రానియ్యదు. కానీ , నేను ఎదిరించి వస్తాను."
    "ఎదిరించగలవా? అంత శక్తి నీకుందా?"
    "అది మీ మీద ఆధారపడి ఉంది...."
    "అంటే?"
    "మీరు నన్నెంత గాడంగా కోరుకుంటే .....నాకోసం.... ఎంత తీవ్రంగా ప్రయత్నిస్తే .... నేను అంత శక్తితో ఆవిడను ఎదిరించగలను..."
    "సుధా! నేను నిన్నెంత గాడంగా కోరుకుంటున్నానో నీకెలా వర్ణించగలను? నాలో అణువణువూ , అహర్నిశలూ నిన్నే పలవరిస్తుంది. ఈ లోకంలో నాకు నేనుగా ......నాకోసం.....చెయ్యగలిగేది ఇదొక్కటే."
    'అయితే పైవారం ఇదే రోజు - ఇదే టైంకి నేను మీ కోసం ఎదురుచూస్తూ ఉంటాను.
    సరిగ్గా ఆ ముహూర్తానికి ఎవరినీ లక్ష్య పెట్టకుండా మీ దగ్గరకు వచ్చేస్తాను."
    తన చేతిని ముద్దు పెట్టుకుంటున్న వామనమూర్తి కళ్ళలో అంతులేని ఆనందాన్ని చూసి సంతృప్తితో నిట్టూర్చింది సుధ....

                                    30


    విక్రంను .... ప్రయోగశాలలో ప్రయోగం చేస్తున్న విక్రంను తన్మయత్వంతో చూస్తుంది సౌందర్య.
    విశ్వమంతా తన ప్రయోగశాలే అయినట్లు తన ప్రయోగంలో లీనమయిపోయాడు విక్రం. కార్యసాధనలో మునిగిన ఆ దృడ హస్తాలు, సునిశితంగా పరిశీలించే ఆ విశాల నేత్రాలు, పరిసరాలన్నీ ప్రకాశింపచేసే ఆ జ్ఞానమయ తేజోమూర్తి ఆమెలో అణువణువూనూ దీప్తివంతం చేయ్యసాగాయి.
    తన ప్రయోగం ముగించి తల ఎత్తి సౌందర్యను చూసి చిరునవ్వు నవ్వాడు విక్రం.
    "నా పరిశోధన త్వరలోనే ఫలించబోతుంది."
    "ఆ విషయం మీ ముఖంలోనే తెలుసుతుంది."
    "నాకు చాలా ఆనందంగా ఉంది. త్వరలోనే నిన్ను అందుకోబోతున్నందుకు."
    "నాకు చాలా విచారంగా ఉంది. ఇంకా కొంత కాలం నిరీక్షించవలసి ఉన్నందుకు!"
    ఇద్దరూ ఒక్కసారిగా ఫకాలున నవ్వారు. మొత్తం ప్రయోగశాల ఉల్లాసంతో ఊగిపోయింది.
    "విక్రం! నీకు దూరంగా ఉండలేను. నీ దగ్గరే ఉండిపోతాను. అందరిలాగా గదులు ఊడ్చి.... నీకు వండిపెట్టి ...."
    'ఛ! ఛ! అలా మాట్లాడకు. ఇలాంటి మాటలు మాట్లాడితే నువ్వు సౌందర్యవు కాలేవు. సౌందర్యవు కాకపోయాక నాకు దేనికి!" కొంటెగా నవ్వాడు విక్రం.
    "ఏం? నీ దగ్గర ఉండిపోవటం మంచిది కాదా?"
    "నాకు మంచి చెడ్డలు లేవు."
    "నాకూ లేవు. మరి దేనికి భయం?"
    "భయమా?"
    ఆ మాటలు పలికిన తీరులో ఉన్న నిబ్బరానికి ముగ్ధురాలయింది ఆమె.


Related Novels


Nanrushi Kurutay Kavyam

Sampenga Podalu

Swathi Jallu

Aparajitha

More