Home » Dr Muktevi Bharathi » Mukthdevi Bharathi Khadhalu
సీటు దొరికింది
గబగబా నడుస్తూంది సంధ్య. ఈ బస్సు మిస్సయిలే మళ్ళా ఎంతో సేపు నిలబడాలి....అది నడక అనడానికి వీల్లేదు - పరుగే అది....
'మేడమ్.... మేడమ్....' ఆయాసపడుతూ ఎదురుగా వచ్చి నిలబడింది. భుజాన బాగ్, చూడిదార్ పైజామా - రుమాలుతో ముఖం తుడుచుకుంది. కాగితం అందించింది.
'ఏమిటీ' అంటూనే కాగితపు మడతలు విప్పింది సంధ్య.
'ఇందిర.... ఇంది రెవరు....'
'మా పిన్ని - మీరు.... మా పిన్ని ఎమ్.ఎ.లో క్లాసుమేట్సట'
'ఓహో ఇందూ....' కాగితం మడతపెట్టి, బస్సు కోసం చూస్తూంది సంధ్య.
'తప్పకుండా మీ హెల్ప్ కావాలి.... మా పిన్ని రేపు మీ ఇంటికి వస్తానంది. ఆ ఇంట్లోనే ఉంటున్నారా?'
"ఆఁ.' బస్సు వచ్చే వేపే చూపు!
'మా పిన్ని ఈ నెల ఆరో తారీఖున స్టేట్స్ వెళ్ళిపోతోందండి-' 'వూఁ- అయితే నాకేమిటి' మనసులో అనుకుంటూ టైము చూసుకుంది.... అమ్మాయి ఏదో చెప్తూనే ఉంది - అడుగు ముందుకు పడనీయటంలేదు. అంతలో బస్సు నిలబడి నిలబడనట్టుగా వచ్చి వెళ్ళిపోయింది.
'ఇంక చెప్పు' - బస్ స్టాప్ సిమెంటు బెంచిమీద తీరిగ్గా కూచుంటూ సంధ్య అమ్మాయి కేసి చూసింది.
'నాకు ఎలాగయినా ఈ కాలేజీలోనే చదవాలని ఉందండీ - ఎక్కడా అప్లయి చెయ్యలేదు-మీరు దయుంచి'-నవ్వు వచ్చింది సంధ్యకి.
'మంచిదే - నాలుగు రోజులయ్యాక కనిపించు....' చేతిలో ఉన్న కాగితం మడిచి పర్సులో పడేసింది. అప్పటికి అది పద్దెనిమిదో కాగితం! అన్నిటికీ ఒక సీజన్ ఉన్నట్లు ఇది ఎడ్మిషన్ల, సీట్ల సీజన్! ఎక్కడెక్కడ లేని బంధువులు, స్నేహితులు, పరిచయస్థులు - ఒకళ్ళేంటి - బస్సులో ఒకనాడు కలసి స్టాపులో దిగినవాళ్ళ, ఒక రోజు రేషన్ షాపులో కలసి కిరసనాయిలు సమస్య ముచ్చటించుకున్న వాళ్ళ - ఒకనాడు కూరగాయల మండీలో కలసి బేరమాడి కూరలు కొన్నవాళ్ళు.... ఎందరెందరో ఆత్మీయులు - ఈ ఆత్మీయుల ఒత్తిడి తట్టుకోడం కష్టంగానే ఉంది. అయినా ఈ ఆత్మీయులనించి దూరమవటమూ సాధ్యం కాదు.
సంధ్య బస్సులో కూచుని ఆ కాగితం విప్పి మళ్ళీ ఒకమారు చూసింది. 41 కంపార్టుమెంటల్ - ఏ మీడియం అయినా ఫరవాలేదు. ఈ అమ్మాయి ఎలాగయినా ఈ కాలేజీలోనే చదవాలనుకుంటోందా- బాగ్ లో కాగితం పడేసింది.
రోజుకన్నా అర్థగంట ఆలస్యంగా ఇల్లు చేరింది సంధ్య.
'మమ్మీ - నీ కోసం ఎవరో వచ్చారు. ఇందాకట్నుంచీ వెయిట్ చేసి ఇప్పుడే వెళ్ళారు.'
'హమ్మయ్య....'
'కాదు - పది నిమిషాల్లో మళ్ళా వస్తారుట. నిన్నెక్కడికీ వెళ్ళకుండా ఉండమన్నారు.' ఆపై మాటలు వినిపించుకోకుండా లోపల కెళ్ళిపోయింది సంధ్య.
కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేస్తున్నారు అంతా.
'ఇటు విను. నువ్వు కాదనటానికి వీల్లేదు.'
'చెప్పండేమిటో -' సంధ్య భర్తకేసి చూస్తూ అంది.
'మా ఫ్రెండు రామం లేడూ....'
'ఉన్నాడు.'
'వాడి బావమరిది భార్యకి మీ కాలేజీలో సీటిప్పించాలి.'
'ఇప్పించడానికి నేనెవర్ని - బావుంది.'
'నాకు అవన్నీ తెలియవు - ఆ అమ్మాయికి సీటు రావాలి.'
'సరే - ఒక చీటిమీద వివరాలు రాయమనండి - చూద్దాం.'
'అన్నీ ఇచ్చాడు. భోజనం కానీ ఇస్తాను.'
'ఇవ్వండి - ఇవ్వండి.'
'నువ్వలా తేలిగ్గా నవ్వేస్తే కాదు - గ్రాడ్యుయేషన్ పూర్తయితే కాని పిల్లల విషయం తలపెట్టడానికి వీల్లేదని ఆవిడ కండిషనట - పాపం, మరి-'
'ఇది మరీ బావుంది - ఈ విషయమే చెప్పి సీటు ఇప్పించనా' - సంధ్య అంటుంటే డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న పిల్లలిద్దరూ ఫక్కున నవ్వారు. భార్య, భర్త ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకున్నారు.
* * *
బాగ్ లో కాగితాల సంఖ్య అనంతంగా పెరుగుతోంది. అన్నీ జాగ్రత్తగా మడిచి, చిరిగిపోకుండా, నలిగిపోకుండా అరలో మళ్ళా భద్రపరచింది.
'ఈ అద్ద మొదటి - చిన్న అందాన్ని పదిరెట్లు ఎక్కువగా చూపిస్తుంది. ఇది ఈ అద్దం ప్రత్యేకత.' నిలువుటడ్డం ముందు నిలబడి మళ్ళీ మళ్ళీ తనని చూసుకొని 'బాచీ, టైము చెప్పరా' అని ఒక కేక పెట్టింది.
'మమ్మీ....నిన్నే - ఎవరో వచ్చారు .... ఎంతసేపు కూచుంటారు పాపం ఆయన!' బాచీ బొమ్మల పుస్తకం తిరగేస్తూ అన్నాడు. జ్వరంగా ఉందని స్కూలుకి వెళ్ళకుండా, జ్వరం తగ్గినా రెస్టు తీసుకుంటూ ఇంట్లో ఉంటున్నాడు బాచీ.
సంధ్యకి చాలా కోపం వచ్చింది. 'అబ్బా - నాకు టైము అయిపోతోంది - అయినా నేనేం చేయగలిగింది లేదని ఎన్నిసార్లు చెప్పినా, నా సమర్థత మీద వీళ్ళకి నమ్మకం- ఖర్మ -' విసుగ్గా ముందు గదిలో అడుగుపెట్టింది.
'నమస్కారమమ్మా.... నన్ను గుర్తుపట్టారా?' ఏభై ఏళ్ళ పెద్దమనిషి ఎదురుగా - ఆ వ్యక్తిని ఎక్కడా చూసిన గుర్తు రావటంలేదు.
'ఆ రోజు - అదే కిందటినెల ఐదో తారీఖున - బాలాజీ భవన్ లో పెళ్ళికి వచ్చారు కదా - ఆ పిల్ల మీ స్టూడెంటే - విజయ.'
'ఆఁ - విజయ' - గుర్తొచ్చింది.
'నేను ఆ అమ్మాయి మేనమామని .... నన్ను మీకు పరిచయం చేసిందా రోజు - మా అమ్మాయి కూడా ఇక్కడే చదివింది....' ఆయన ఏదో చెప్తున్నాడు.
పెళ్ళి కెళ్ళడం వరకు గుర్తుంది....కానీ ఈ మామయ్యలు, బాబాయిలు, తాతయ్యలు, బావలు వీళ్ళంతా కాక ఫ్రెండ్స్ - అబ్బా, ఎలా గుర్తుంచుకోటం - సంధ్యకి చాలా చిరాగ్గా ఉంది. ఇంతవరకు అసలు విషయం చెప్పడు__
'మా అమ్మాయీ మీ స్టూడెంటే....'
'ఏ సంవత్సరం?'
ఒక్క నిమిషం ఆగాడు. 'అదే - 1969 లో.' సంధ్యకి ఒళ్ళు మండిపోయింది. అంటే పన్నెండేళ్ళనాడు ఒక స్టూడెంటు, కొన్ని వందల మందిలో, గుర్తుంచుకోవడం సాధ్యమా....సంధ్య గడియారం వంక రెండుసార్లు చూసుకుంది.
'ఇంతకీ మీ ఇంకో అమ్మాయికా సీటు?'
ఆయన కాస్త సిగ్గుపడి 'అబ్బే, మా మనవరాలికి - ఫస్టుక్లాసు ఒక్క మార్కులో పోయింది. అంతే - అయినా క్లాసు వచ్చిన వాళ్ళకే సీట్లు వస్తున్నాయా ఏమిటి కాని....ఈ కాగితంమీద వివరాలన్నీ రాశాను- కాస్త శ్రద్ధగా చూడాలి. ఎలాగయినా వచ్చేట్టు చూడండి. మీ మేలు....' ఇంకా ఏదో అంటున్నాడు. కాగితం తీసుకుని లేచింది సంధ్య.
'అమ్మా! ఆ వెనక ఫోన్ నెంబర్లు వేశాను - సీటు రాగానే ఫోన్ చేస్తే వచ్చి ఫీజు కట్టేస్తాను.'
'చూడండి, ఒక్కమాట. మేం చేయగలిగింది చాలా తక్కువ ఉంటుంది, ముఖ్యంగా' సంధ్య మాట పూర్తి చేయలేదు.
'ఏముందమ్మా....అక్కడంతా మీరూ మీరే - మీరు తలుచుకుంటే ఇదేమంత పెద్ద పని! వస్తానమ్మా' మెల్లగా వెళ్ళిపోయాడు. ఆ కాగితం మడిచి బాగ్ లో పడేసింది. టైమయిపోయింది. ఆటో కోసం పరిగెత్తాల్సిందే సంధ్య విసుగ్గా ఇంట్లోంచి బయటికొచ్చేసింది.
* * *
రాత్రి తొమ్మిదయింది. పొద్దుటినుంచీ తీరిక లేకుండా అలసిపోయిన సంధ్యకి కునుకు పట్టేసింది.... గదిలో ఫోను మోగుతోంది. పిల్లలు నిద్దరపోతున్నారు. 'వాటె నాన్సెన్స్!' మంచంమీద నుంచి లేచింది.
'హలో....'
'ఆఁ.'
'హలో....'
'రాంగ్ నెంబర్ ప్లీజ్.' రిసీవర్ పెట్టేసి, గ్లాసుతో నీళ్ళు తాగుతూంటే మళ్ళీ ఫోన్.
'హలో.... సంధ్య స్పీకింగ్.'
'హలో - డాక్టర్ రావ్ హై.'
'నై హై....బహార్ గయే....'
'కబ్ ఆతే....'
'దస్ బజేకు ఆతే,'
'ఏక్ బాద్ బోలియే....' సంధ్య రిసీవర్ పక్కన పెట్టి కొడుకుని లేపి, 'ఎవరూ లేరని, డిన్నరుకి వెళ్ళారని చెప్పు' అంది గబగబా.
'హలో...'
'డాక్టర్ రావ్ కా బీబీ హై?'
'దోనోంభీ దావాత్ గయే'
అవతలాయన హిందీలో ఇంకా దంచుతున్నాడు, మర్నాడు ఏడు గంటల ఫ్లైట్ లో వెళ్ళిపోవాలట- తెల్లవారు జామున ఐదింటికే ఇంటికొచ్చి మాట్లాడతాడట. సంగతేమంటే వాళ్ళమ్మాయి సీటు!
రేప్పొద్దున్నే ఐదుగంటల కొస్తాడా? 'ఒరేయ్ బాచీ, ఒక నెల రోజులు సెలవు పెట్టేసి, అమ్మమ్మ దగ్గరుండి వస్తాను - లేకపోతే....' సంధ్య గొణుక్కుంటూ బెడ్ రూమ్ లోకి వెళ్ళిపోయింది. ఏమీ చేయలేనని చెప్పినా, ఎందరో ఎంతో ఆశ పెట్టుకు వస్తారు పాపం! తన పర్సులో ఉన్న రకరకాల కాగితాలు కళ్ళముందు కనిపించాయి సంధ్యకి.
* * *
సీట్ల హడావిడి చాలావరకు తగ్గిపోయింది. వరదలా తోసుకొచ్చిన సీట్ల సందడి తగ్గేసరికి కాస్త ప్రశాంతంగా ఉంది ఇంటా, బయటా వాతావరణం సంధ్యకి. అయితే మధ్య మధ్యలో ఒకళ్ళో ఇద్దరో వచ్చి, తనకు థాంక్సు చెబుతుంటే సంధ్యకి బాధనిపిస్తుంది. ఆ సీట్లు వాటంతట అవే వచ్చినవి. అయినా వస్తాయనుకున్న వాళ్ళకి రాకపోవటం, రావనుకున్న వాళ్ళకి రావటం - ఇలాటివన్నీ అన్నిచోట్లా సామాన్యంగా కనిపించేవే. ఒక్కోసారి సంధ్యకి అనిపిస్తుంది - ఈ ఆడపిల్లలు అందరూ కష్టపడి సీటు తెచ్చుకుని, చదువుకుని, వాళ్ళ కాళ్ళమీద వాళ్ళు నిలబడాలనుకోటం ఎంత గొప్ప విశేషం! అయితే అందరికీ తను సహాయం చేయలేదు. ఒకళ్ళకో ఇద్దరికో - సంధ్య బాగ్ లో చాలా నలిగిపోయిన కాగితాల మధ్య రెండింటినే గుర్తుంచుకుంది. రాధ - పాపం! ఎంతో అమాయకంగా ఉంది. రోజూ తనని కలుసుకుంది. మార్కులు కూడా పరవాలేదు. పైగా తల్లి తండ్రులు చదివించమంటుంటే, ఎలాగయినా చదువుకోవాలని దీక్షతో ఉంది - అలాంటమ్మాయికి సీటు ఇప్పించాల్సిందే.
లలిత - ఎంత అందంగా ఉంది! ఆ అమ్మాయి కో - ఎడ్యుకేషన్ లో ఒక్కరోజు కూడా చదవలేదు. కాకపోయినా, తన ప్రాణ స్నేహితురాలు రమ అన్న కూతురు. ఎలాగయినా సీటిప్పించాలి! పైగా రెండు మార్కులు కలిస్తే ఫస్టుక్లాసు వచ్చేదే!
సంధ్య ఆ రెండు కాగితాలు విడిగా పర్సులో పక్కగా గుర్తుగా; పెట్టింది.
* * *
గేటుదాటి బయటికి వచ్చిందో లేదో ఇద్దరు వ్యక్తులు మోటారు సైకిలు ఆపుకు నిలబడ్డారు.
"ఆఁ__మీరు సంధ్య కదూ...."
ఉలిక్కిపడింది సంధ్య.
'నమస్తే.'
'నమస్తే.'
పెద్ద మీసాలు, ఎర్రని ఫారిన్ షర్టు, నల్ల కళ్ళజోడు - ఒక అతను బాల్డ్ హెడ్ - ఎర్రని కళ్ళు - మరొకతను - ఇద్దరినీ ఎవరు చూసినా ఒక క్షణం బెదరక తప్పదు. రూపాలు ఎలా ఉన్నా సౌమ్యంగా మాట్లాడుతుంటే నిలబడాల్సొచ్చింది సంధ్య.
'గుర్తుపట్టలేదు కదూ? మనం ఎస్.ఎస్.ఎల్.సి.లో క్లాసుమేట్స్ మి.'
'ఆఁ' అంది సంధ్య. అంటే ఇరవై యేళ్ళనాటి విషయం. ఆ రోజుల్లో వంచిన తల ఎత్తకుండా భయం భయంగా స్కూలుకి వెళ్ళివచ్చే రోజులు__ఎవరెవరో__ఎలా గుర్తు పట్టటం? సంధ్య నవ్వేసి ఊరుకుంది.
'మీరు మరచిపోయారేమో! నేను మనం చదువుకున్న స్కూలు లీడరుని__పెద్ద రౌడీనని పేరు. హాల్ టికెట్ ఇవ్వనంటే పోట్లాడి, భయం పెట్టి పరీక్షలు రాసేశాను. ఇద్దరు బాల్య వీరత్వాన్ని తలుచుకు నవ్వుతుంటే సంధ్యకి కూడా నవ్వొచ్చింది.
'మనం తీయించుకున్న ఎస్.ఎస్.ఎల్.సి. గ్రూప్ ఫోటోలో నేను హెడీమాస్టర్ వెనక నిలబడ్డాను.' సంధ్యకి చిరాగ్గా ఉంది __ అసలు విషయం చెప్పరేం? వాచీ చూసుకుంది.
'మేము సీటుకోసం రాలేదు.'
సంధ్య హాయిగా ఊపిరి పీల్చింది.
'కానీ ఫస్టు లిస్టులో పేరుంది. పిల్ల మా మరదలు. మా ఆవిడ, మరదలు కలిసి పెళ్ళి కెళ్ళి పదిహేను రోజులుండిపోయారు.' సంధ్య నెత్తిన పిడుగు పడ్డట్లయింది. లిస్టులో పేరొస్తే ఫీజు కట్టలేదా! మై గుడ్ నెస్! ఇప్పుడేం చేయాలి__ సీటు రాలేదని ఎందరో బాధపడుతుంటే పెళ్లి కెళ్ళామంటూ చెప్పి, ఫీజు ఇప్పుడు కడతానంటారు, అన్ని లిస్టులు అయిపోయాయి కదా!
'అయామ్ సారీ__నేనేం చేయలేను. లోపలి కెళ్ళి మీరే ప్రయత్నం చేసుకోండి. వస్తాను.' గబగబా నడిచి ఎదురుగా వున్న ఆటోలో ఎక్కి కూచుంది.
* * *
ఇన్ని మడిచిన చిన్న కాగితాల మధ్య ఆ యిద్దరూ రాధ, లలిత పట్టువదలని విక్రమార్కుడిలా వెంట పడడం, సంధ్యకి కూడా ఎందుకో ఈ యిద్దరికైనా సీటు వచ్చేలా చూడాలని మనఃస్పూర్తిగా అనిపించడం అన్నీ కలిసొచ్చాయి. 'ఇద్దరికీ సీట్లు వచ్చాయి కానీ, వీళ్ళు కనిపించరేం? పోన్లే__పట్టుదలతో సీటు తెచ్చుకున్నట్టే కష్టపడి పరీక్షలు పాసయి, ఒక వ్యక్తిత్వం సంపాదించుకుని లోకంలో హాయిగా బతికితే చాలు__తన్ను కలవకపోతే వచ్చే నష్టం లేదు.' నవ్వుకుంటూ పర్సులో వున్న ఆ రెండు కాగితాలు కూడా చింపేసింది.
నెల రోజులు దాటిపోయింది__ఆరోజు సినిమాహాలు నుంచి బయటకొచ్చి, ఆటో కోసం చూస్తూంది సంధ్య.
'మేడమ్....మేడమ్.'
వెనక్కి తిరిగింది__
'ఓ__రాధా__ఏమిటి? కాలేజీకి వస్తున్నావా__క్లాసెస్ బాగా జరుగుతున్నాయా?'
నవ్వింది రాధ.
'అవునుకానీ __సీటు వచ్చిం తర్వాత మళ్ళా కనిపించలేదే__ నేను స్వీట్స్ అడుగుతానని భయమా?'
మళ్ళా నవ్వింది రాధ.
'చెప్పు.' పక్కనున్న అబ్బాయి రాధ కేసి చూశాడు.
'నేను మీ కాలేజీలో చేరలేదు, మేడమ్.'
'ఆఁ!' నోరు తెరిచింది సంధ్య.
'మరి!....అన్ని సార్లు....'
'కాదండి__మా__బావ__ఇతనే వాళ్ళ కాలేజీలోనే చేరమని సీటు తెప్పించాడండి__అయితే నాతో పందెం వేశాడు, నాకు మీ కాలేజీలో సీటురాదని__నేనేమో ఎలాగయినా తెచ్చుకుంటానని__చివరికి మీ దయవల్ల నేనే పందెం గెలిచాననుకోండి__మీ దగ్గరకొచ్చేసరికే నేను ఆ కాలేజీలో ఫీజు కట్టేశాను.' రాధ చెపుతున్న తక్కిన మాటలు ఇంక వినపడలేదు సంధ్యకి__ బగబా నడిచి వెళ్ళిపోతున్న అమ్మాయిని, అబ్బాయిని చూస్తూ అలా చాలాసేపు నిలబడిపోయింది. ఇందుకా తనంత కష్టపడి సీటు ఇప్పించింది!
* * *
'ఒరేయ్. తమ్ముడూ__చెప్పు__నువ్వు పెళ్ళిచేసుకుంటాను అంటే ఒక చక్కటి అమ్మాయిని చూసి పెడతాను.'
'నేను నా ట్రెయినింగ్ అయేవరకు పెళ్ళిమాట ఎత్తను.'
'కాదురా....అంత చక్కటి అమ్మాయిని నేనే యింతవరకు చూడలేదు. తెలుసా. చెప్పు__'సంధ్య కళ్ళ ముందు లలిత మెదిలింది__అవును, రేపు కనుక్కోవాలి__సీటు వచ్చాక మళ్ళా కనిపించరు వీళ్ళు!!
'అక్కా__టైమైపోతోంది__పద, పద' తమ్ముడు తొందరచేశాడు బెంగుళూరులో ట్రెయినింగ్__'అదయిపోయాక హైదరాబాదులో ఉద్యోగము చేస్తాగా__అప్పుడు చూడు' అంటాడు పెళ్ళిమాట ఎత్తితే!
* * *
రైల్వే స్టేషన్ అంతా ఎప్పుడూ సందడే__తమ్ముడు రిజర్వుడు కంపార్టుమెంటులో కూచున్నాడు. సంధ్య అటు ఇటు జనప్రవాహాన్ని చూస్తూంది.
'మేడమ్!' పరుగెత్తుకుంటూ ఒక గుంపుని తోసుకు వచ్చి నిలబడింది. మెడలో పచ్చని పసుపుతాడు, కళ్ళనిండా కాటుక, తలనిండా పూలు__అందం పదిరెట్లు పెరిగింది__లలిత!
'ఓ లలితా.'
'నమస్తే, మేడమ్....' పక్కన సూట్ లో ఎంతో హాండ్ సమ్ గా ఉన్న అబ్బాయిని పరిచయం చేసింది, బుగ్గల్లో సిగ్గు మొగ్గలు తొడుగుతుంటే. సంధ్య అలాగే చూస్తూ ఉండిపోయింది__కొత్త పెళ్ళికూతురు, పెళ్ళికొడుకు__నవ్వు వచ్చింది.
* * *
రైలు కదులుతుంటే అందరితోపాటు తనూ చేయి ఊపుతూ ముందుకు ముందుకు నడిచింది.
ఫ్లాట్ ఫామ్ కొంచెం ఖాళీ అవుతోంది. మెల్లిగా నడుస్తూంది సంధ్య. ఈ పిల్లలెందుకొస్తారు సీట్లు, సీట్లంటూ_ఆఁ.... కొందరు సరదాగా కాలేజీలో చేరి, పెళ్ళిచేసుకుని వెళ్ళిపోడానికే! 'హాయ్_సంధ్యా!' భుజంమీద చెయ్యి పడింది__
'ఏమిటే_రమా_విశేషాలు' 'ఏముంది_చూశావుగా_మా లలితని. దాని కసలు చదువుమీద ఆసక్తిలేదు_అన్నయ్యకి దీన్ని కాలేజీలో చేర్చాలనిలేదు_లేకపోతే మా వదినకే అమ్మాయి కాలేజీకి వెళ్ళాలని సరదా మాత్రమే_ దీనికి చక్కగా ముస్తాబయి, రోజూ ఒక చీర సోగ్గా కట్టుకు కాలేజీకి రావాలని_అనుకోకుండా ఈ సంబంధం కుదిరింది__అతను నైజీరియాలో డాక్టరు__చదువక్కర్లేదు__అందమైన పిల్ల కావాలనుకున్నాడు__అంతే__వారం రోజులు కాకుండా పెళ్లి అయిపోయింది__ చూశావుగా__హనీమూన్ కి వెడుతున్నారు'__నవ్వింది రమ. సంధ్యకి నవ్వాలో, ఏం చెయ్యాలో తెలియలేదు.
'పోన్లే - ఇదీ మంచి సీటే' అనుకుంటూ ముందుకు కదిలిపోయింది.*



