Home » Health Science  » ఎపిసోడ్ -68


    "నాలాంటి వాళ్ళలో కాదు" అన్నాడు రుద్రప్రసాద్.

 

    హఠాత్తుగా గమనానికొచ్చింది అప్సరకి. ఎప్పుడు ఎవరు ఎవరిని సమీపించారోగానీ తను అతని కౌగిట్లో వుంది.

 

    అతని కౌగిలి వదిలించుకొని దూరంగా వెళ్ళిపోవడానికి ఒక ప్రయత్నం చేసింది అప్సర.

 

    కానీ ఎలాంటి ప్రయత్నం అది? అతి దుర్భలమైన ప్రయత్నం:

 

    కొద్ది క్షణాలపాటు -

 

    మనసు అతడికి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటోంది.

 

    కానీ శరీరం అతడికి దగ్గరవుతుంది.

 

    మరికొద్ది క్షణాలపాటు...

 

    మనసు అతడికి దగ్గరయిపోవాలనుకుంటోంది.

 

    కానీ శరీరం దూరంగా వెళ్ళిపోవాలని కోరుకుంటోంది.


 
    మరికొద్ది క్షణాల తర్వాత..

 

    ఒళ్ళూ మనసూ, సంఘర్షణ మాని ఒకటయిపోయాయి. అతనికి మరింత దగ్గరగా హత్తుకుపోయింది అప్సర.

 

    అప్పుడు మొదలయింది రెండు శరీరాల మధ్య పరస్పర ఆకర్షణతో కూడిన సంఘర్షణ. వేడి, తాపం, సెగలు, నిట్టూర్పులు.

 

    తర్వాత...

 

    అలసటతో కళ్ళు తెరిచి అంది అప్సర "నువ్వు నిజంగా మెర్సినరీవే: అన్నివిధాలా: చూడు: నాకు తెలియకుండానే నా మనసునీ, నా శరీరాన్నీ కూడా ఎలా స్వాధీనం చేసుకుని కొల్లగొట్టావో?"

 

    ఆమె యింకేదో కూడా చెప్పబోతుంటే చెప్పనివ్వకుండా ఆమె పెదిమలని తన పెదిమలతో సీల్ చేసేసాడు రుద్రప్రసాద్.

 

    ఆ దీర్ఘ చుంబనానికి ఆమె ఊపిరందక తల అటూ ఇటూ విదిలిస్తుంటే, తల పైకెత్తి నవ్వి, ఆమె తలని తన రెండు చేతుల్లో పట్టుకుని ఆమె విశాలనయినాల్లోకి తొంగిచూస్తూ...

 

    "నేను పుట్టిన తర్వాత ఎవరితో చెప్పని ఒకమాట చెప్పనా?"

 

    ఏమిటన్నట్లు చూసింది అప్సర.

 

    "ఐలవ్ యూ: ఐలవ్ యూ అప్సరా: ఐ నీడ్ యూ:"

 

    లేచి చీర సవరించుకుంటూ అంది అప్సర. ఆమె మొహంలో సంతోషం, దిగులూ రెండూ కనబడుతున్నాయి.

 

    "నువ్వు ఏం చదివావు రుద్రా?"

 

    "చరిత్ర, ఆర్థికశాస్త్రం, ఫిలాసఫీ" అన్నాడు రుద్ర.

 

    అతడి పెదిమలని తన చూపుడువేలితో రాస్తూ, మృదువుగా అంది అప్సర." అందుకని నిన్ను చదువుకున్న మూర్ఖుడనాలి"

 

    నవ్వి, సిగరెట్ అంటించాడు రుద్ర.

 

    "ఆల్ రైట్: ఇక మనమిద్దరం ఒకటేనని నిశ్చయమయిపోయింది కదా: ఇంక మన ప్లాను అమలులో పెట్టడం ఎలాగో ఆలోచించాలి."

 

    "నీ ప్లాను ఎవరికీ చెప్పనంటివి కదా?" అంది అప్సర.

 

    "మీ డాడీతో చెప్పనన్నాను. నీతో చెప్పననలేదే: నువ్వూ నేనూ ఒకటే: నీతో చెప్పకుండా ఎలా?"

 

    "రుద్రా:" అంది అప్సర ఆర్తిగా. "నువ్వు ఏదన్నా చెప్పే ముందు నన్ను కాస్త చెప్పనీ: ఈ ఆపరేషన్ నాకు బొత్తిగా ఇష్టంలేదు. కానీ నువ్వు యిందులో వున్నావు కాబట్టి నేనూ వున్నాను. అంతే:

 

    రుద్రా: ఈ పని ఒక్కటీ అయిపోయిన తర్వాత నువ్వింక ఈ జీవితం మానెయ్యాలి. కనీసం నాకోసం: ఆ తర్వాత మనిద్దరమూ హాయిగా ఒక తోటలో చిన్న పొదరిల్లులాంటి ఇల్లు కట్టుకుని..."  

 

    "తప్పకుండా: యిది నా ఫైనల్ అసైన్ మెంట్:" అన్నాడు రుద్ర. తర్వాత నెమ్మదిగా చెప్పడం మొదలెట్టాడు.

 

    "ఇప్పుడు మనం చేయబోయేది ఒక మిలియేచర్ వార్. సూక్ష్మరూపంలో ఉన్న యుద్ధం. నాతోపాటు మరో అయిదుమంది మెర్సినరీలు ఉంటారు. వీళ్ళందరూ, నాతోబాటు ఇంతవరకూ కొన్ని యుద్ధాలలో పని చేసిన వాళ్ళే. నేను ఎప్పుడు కబురు పంపిస్తే అప్పుడు వస్తారు.

 

    ఇకపోతే, ఈ యుద్ధానికి ఆయుధాలు కావాలి. ఆయుధాలు అమ్మే దేశాలు చాలా వున్నాయి. అమ్మే డీలర్లు చాలామంది వున్నారు. కానీ ఆయుధాలు అమ్మాలన్నా, కావాలన్నా ఒక ముఖ్యమైన పత్రం అవసరమవుతుంది. దాన్నే "ఎండ్ యూ సర్" సర్టిఫికెట్ అంటారు. అంటే ఆయుధాలు కొనబోతున్నది వాటిని ఉపయోగించదలుచుకొన్న వాళ్ళేనని. పాశ్చాత్యదేశాలకి సంబంధించినంత వరకూ ఎండ్ యూసర్ అంటే మరో ప్రభుత్వమే: ప్రైవేట్ వ్యక్తులకు వాళ్ళు ఆయుధాలు అమ్మారు. సీక్రెట్ సర్వీస్ ఆర్గనైజేషన్ దీనికన్నా ఆయుధాలు బహుమతిగా ఇస్తున్నప్పుడూ, లేకపోతే బ్లాక్ మార్కెట్ లో ఆయుధాలు కొంటున్నప్పుడూ తప్ప, ప్రతి డీల్ లోనూ ఈ 'ఎండ్ యూసర్' సర్టిఫికెట్ అత్యవసరం:

 

    "ఎండ్ యూ సర్ సర్టిఫికేట్ ని కొన్నిదేశాలు ఈకకి ఈకా, తోకకి తోకా పీకినట్లు పరీక్ష చేస్తాయి. కొన్ని కొన్ని దేశాలు "చూసీ చూడనట్లు" పోతాయి. తక్కిన డాక్యుమెంట్లు అన్నిటినీ ఫోర్జరీ చేసినట్లే 'ఎండ్ యు సర్' సర్టిఫికేట్ ని కూడా ఫోర్జరీ చేస్తూనే వుంటారు."

 

    శ్రద్ధగా వింటోంది అప్సర.

 

    "మనం డైరెక్టుగా యూరోపియన్ దేశాలకి అప్లయ్ చేసి ఆయుధాలు సంపాదించలేం కమ్యూనిస్టు దేశాలకేమో ఎందువల్లనోగానీ జనరల్ భోజా అంటే వల్లమాలిన ప్రేమ. అందుకని వాళ్ళనీ అడగలేం. అడిగితే పని కాకపోగా ప్లానుకూడా బెడిసికొట్టవచ్చు. అలాగే గవర్నమెంటు ఆధీనంలో ఉన్న ఫార్ బిక్ నేషనల్ ఆఫ్ బెల్ఖియమ్ కి కూడా మనం అప్లయ్ చెయ్యిలేము ఎందుకంటే మన అప్లికేషన్ వెంటనే గవర్నమెంటుకీ పంపబడుతుంది. పెద్దపెద్ద ఆయుధాల డీలర్లయిన భోఫోర్స్ ఆఫ్ స్వీడెన్ పార్కర్ హేల్ ఆఫ్ బ్ర్మంగ్ హామ్, ఓర్లికాన్ ఆఫ్ స్విడ్జర్లాండ్, జర్మనీ తాలూకు వెర్నర్ అండ్ అదర్స్. ఇటలీలో ఫియట్ - వీళ్ళందరినీ మనం అప్రోచ్ కాలేం ఎందుకంటే వీళ్ళెవరూ ఆయుధాలు మనకి అమ్మరు కాబట్టి."

 

    "పైగా మనకు కావలసిన ఆయుధాలు చాలా కొద్దిపాటి. ఇవి పెద్ద పెద్ద లైసెన్స్ డ్ డీలర్లకి అంత ఆసక్తి కలిగించవేమో" అంది అప్సర. మెల్లిమెల్లిగా తనుకూడా అడ్వెంచరస్ మూడ్ లోకి వచ్చేస్తూ. "ప్రపంచ ప్రఖ్యాత పొందిన ఆయుధాల వ్యాపారి ఆద్నాన్ ఖోషిగ్గీ అసలు మనవైపు కన్నెత్తికూడా చూడడేమో:"

 

    "ఆద్నాన్ ఖోషిగ్గీ కన్నెత్తి చూడడు. డాక్టర్ పెరిట్టీ, డాక్టర్ లాంగెన్ స్టెయిన్ లాంటి డీలర్లు అసలు పన్నెత్తి పలకరించరు." అని కాసేపు ఆలోచించాడు రుద్రప్రసాద్.                        


Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.