Home » Yoga » ఆడవారిలో ఋతు సంబంధ సమస్యలకు చెక్ పెట్టే సర్వాంగాసనము
ఆడవారిలో ఋతు సంబంధ సమస్యలకు చెక్ పెట్టే సర్వాంగాసనము!
నేటి ఆధునిక జీవన శైలిలో మనిషికి ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆడవారికి శారీరక సమస్యలు అన్ని హార్మోన్ల ప్రభావం మీద ఆధారపడి ఉంటాయి. శరీరంలో వివిధ అవయవాలు ప్రభావం చెందటం వలనా…. వాటి పనితీరు మందగించడం వలనా… శరీర స్థితి మార్పుకు లోనవుతుంది. వీటన్నిటికీ చక్కని పరిష్కారం యోగ.. యోగాలో సర్వాంగాసనము గొప్ప ఫలితాలను ఇస్తుంది. అది ఏ విధంగా వేయాలి?? దాని ప్రయోజనాలు ఏంటి?? వంటివి తెలుసుకుంటే…
సర్వాంగాసనం...
సర్వాంగ అంటే అన్ని అవయవాలు అని అర్థం. ఈ ఆసనం వేయటం వల్ల, శరీర అవయవాలన్నీ చక్కగా పనిచేస్తాయి. ముఖ్యంగా మహిళలలో ఎదురయ్యే థైరాయిడ్ సమస్యలను తగ్గిస్తుంది. ఈ ఆసనం వేయడం వల్ల "థైరాయిడ్" అనే గ్రంథి నియంత్రించ బడుతుంది.
వేయవలసిన విధానం :
శిరస్సు నుంచి, పాదాల వరకూ సరిగ్గా ఉండేలా వెన్నముకను భూమికి ఆనించి నేలపై పడుకోవాలి.ఇది శవాసన భంగిమలో ఉండటం అన్నమాట. ఇలా ఉన్న భంగిమ నుండి చేతులు తలకు ఇరువైపులా తిన్నగా వెనక్కు ఉంచాలి.
ఇప్పుడు ఈ స్థితిలో నేల నుంచి 45°(నలభై అయిదు డిగ్రీలు) కోణంలోకి కాళ్లు రెండూ ఎత్తి ఉంచాలి. అలా 45° నుండి మెల్లగా కాళ్ళను 90° కోణం వరకూ ఎత్తాలి. చేతులను శరీరం పక్కకు ఉంచాలి. తరువాత అరచేతులతో పిరుదులను పట్టుకుని, మోచేతులను భూమికి అన్చి శరీరాన్ని ఇంకా పైకి ఎత్తాలి. చేతులతో బలాన్ని ఉపయోగించి కాళ్ళను అలాగే నిలబెట్టాలి. ఈ భంగిమలో కాళ్లు గాలిలో నేలకి సమాంతరంగా ఉండాలి.
కాళ్లు శరీరము ఒక్కలాగే నిటారుగా ఉండేలా భుజాలపైన బరువును ఉంచాలి. తల నేలను తాకుతూ ఉంచాలి. ఇలా కొన్ని సెకండ్ల పాటు ఉన్న తరువాత చేతులను వాదులు చేయాలి, తరువాత 90° నుండి 45° కోణం లోకి రావాలి. ఆ తరువాత కాళ్ళను మెల్లగా కిందకు దించి చేతులను తలకు రెండువైపులా ఉంచాలి. దీని తరువాత శవాసనంలోకి వచ్చి స్థిమితపడాలి.
దీని వల్ల కలిగే శారీరక లాభాలు:
ఈ సర్వాంగాసనము వేయడం వలన మెదడుకు రక్తప్రసారం చక్కగా జరుగుతుంది. ఆడవారి ఆరోగ్యం మీద ప్రభావం చూపించే థైరాయిడ్ గ్రంధి నియంత్రించబడుతుంది. ఈ గ్రంధి అసమతుల్యతకు గురి కావడం వలన ఆడవారిలో పిల్లలు కలగడంలో ఇబ్బందులు ఏర్పడతాయి. వాటిని ఈ ఆసనం ద్వారా నియంత్రించుకోవచ్చు.
ఈ ఆసనం వల్ల కలిగే ఆరోగ్య లాభాలు:
ఆరోగ్య పరంగా ప్రతి ఆసనం చాలా విశిష్టమైనది, ప్రత్యేక ఫలితాలను ఇస్తుంది. ఈ ఆసనం వేయడం వల్ల మొలలు, హెర్నియా, థైరాయిడ్ మొదలైన జబ్బులకూ, మలబద్ధక సమస్యకూ, స్త్రీలలో ఎదురయ్యే ఋతుసంబంధ ఇబ్బందులకూ చక్కని పరిష్కారం పొందగలుగుతాము.
కేవలం శారీరక, ఆరోగ్య లాభాలు మేరమే కాకుండా యోగాసనాల వల్ల ఆధ్యాత్మిక లాభాలు కూడా ఉంటాయి. సర్వాంగాసనము వేయడం వల్ల కలిగే ఆధ్యాత్మిక లాభాలు ఏమిటంటే.. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఏకాగ్రత, మానసిక శక్తి లభిస్తుంది. తద్వారా మనిషిలో పని చేయగలిగే మానసిక సామర్థ్యం పెరుగుతుంది.
ఈ ఆసనం వేయడానికి కొన్ని సూచనలు:
మానసిక ఆందోళన, నడుంనొప్పి, మెడనొప్పి ఉన్నవారు ఈ ఆసనం వేయరాదు.
జాగ్రత్తలు:
ఆసనం మొదలుపెట్టినప్పుడు కాళ్ళను పైకి ఎత్తేటప్పుడు కాళ్ళను నిటారుగా పైకి లేపాలి. ఆ భంగిమలో మోకాళ్లు పంచకూడదు. అలాగే కాళ్ళను 45° నుండి 90° లకు తీసుకు వెళ్ళేటప్పుడు బలాన్ని ప్రయోగించే క్రమంలో చాలామంది తల ఎత్తుతారు. ఆ భంగిమలోకి వెళ్ళేటప్పుడు తల ఎత్తరాదు. శరీరం బరువును చేతులపైన, భుజాలపైన ఉంచాలి. చివరి భంగిమలో పాదాలను చాచకూడదు.
ఈ ఆసనం వేసేటపుడు శ్వాస కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. అసన సమయంలో శ్వాస ఎలాగుండాలంటే… కిందకు వంగే ప్రతిసారి గాలి వెలుపలికి విడవాలి. పైకి లేచే ప్రతిసారి గాలి తీసుకోవాలి. చివరి భంగిమలో సాధారణంగా ఉండాలి.
ఇదీ సర్వాంగాసనం వేయవలసిన విధానం, ఆసనం వల్ల కలిగే ప్రయోజనాలు.
◆నిశ్శబ్ద.