ఈ సమయంలో ఆడవాళ్ళు  వేయకూడని ఆసనాలు!

ఆరోగ్యం కోసం మహిళలు ఎన్నెన్నో చేస్తారు. వాటిలో ప్రభావవంతమైనది యోగా.. వెర్రి పట్టి జిమ్ ల చుట్టూ తిరిగి చివరికి మన భారతదేశ మహర్షులు మనకు ప్రసాదించిన యోగా మార్గం వైపుకు నడుస్తున్నారు అందరూ. ఖరీదైన వస్తువుల అవసరం ఏదీ లేకుండా కేవలం ఏకాగ్రత, అవగాహనల మీద చేసే యోగా ఇప్పుడు విదేశాలలో సైతం మన్నన పొందుతోంది. సెలబ్రిటీల నుండి సాధారణ హోమ్ మేకర్ వరకు ప్రతి మహిళ యోగాను ప్రయత్నించాలని అనుకుంటోందిప్పుడు. అయితే యోగా కేవలం సాధారణంగా జిమ్ లో చేసే ఎక్సర్సైజ్ లాంటిది కాదు. ఇది మనసును శరీరంతో మమేకం చేసే గొప్ప మార్గం. మనిషి జీవితంలో మానసిక, శారీరక శక్తిని ప్రోగు చేసుకునే విశిష్ట ప్రయాణం. యోగాను పాటించేటప్పుడు చేయవలసిన, చేయకూడని పనులు ఖచ్చితంగా తెలుసుకోవాలి. వాటికోసం ఎక్కడెక్కడో వెతకనక్కర్లేదు. ఇదిగో క్రింద పొందికగా పొందుపరచిన విషయాలు తెలుసుకొండి మరి..


* భోజనం చేసిన తరువాత యోగాసనాలు ఎప్పుడూ వేయకూడదు. యోగానే కాదు సాధారణ వ్యాయామాలు కూడా వేయకూడదు. ఇక చాలా మంది అల్పాహారం పెద్దగా ఎఫెక్ట్ చూపించదులే అనే ఆలోచనతో అల్పాహారం తరువాత యోగా చేయడానికి సిద్దపడతారు. అయితే ఇది మంచిది కాదు. భోజనం చేసిన నాలుగు గంటల తరువాత, అల్పాహారం తీసుకున్న రెండు గంటల తరువాత మాత్రమే  యోగా చెయ్యాలి. 


* చాలామంది యోగ ఆసనాలు వ్యాయామం లాంటివే అనే ఉద్దేశ్యంతో వ్యాయామాలను, ఆసనాలను కలిపి చేస్తుంటారు. అయితే అది చాలా పొరపాటు. ఆసనాలు వేరు, వ్యాయామం వేరు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. వ్యాయామం చెయ్యాలి అనుకుంటే మొదట వ్యాయామం చేసి, ఆ తరువాత శవాసనం వేసి, కాస్త శరీరం కుదురుకున్న తరువాత ఆసనాలు వెయ్యాలి. వ్యాయామం వల్ల శరీరం ఆసనాలు వేయడానికి తగ్గట్టు సిద్దమవుతుంది కూడా.


* ప్రతి ఆసనానికి కొంత సమయం, ప్రతి ఆసనం తరువాత కాసింత విశ్రాంతి అనేవి చాలా అవసరం. ఇలా చేయడం వల్ల ఆసనం ద్వారా కలిగే పలితం ఆయా శరీర భాగానికి సమృద్ధిగా అందుతుంది. ఆసనాలు వేస్తే సరిపోదు… వాటి వల్ల పూర్తి పలితాన్ని పొందాలి అంటే ఆసనాలు వేసేటప్పుడు వాటి మీదనే ఏకాగ్రత పెట్టాలి. 

* ఆసనాలు వేసిన తరువాత మనిషికి ఎలా అనిపించాలంటే శరీరం తేలికగా అనిపించాలి. అంతేకానీ జిమ్ చేసినట్టు చెమటలు పట్టడం, అలసిపోవడం వంటివి ఉండకూడదు. ఇంకా చెప్పాలంటే ఆసనాలు అనేవి చాలా నిదానంగా సాగే ప్రక్రియ. ఆసనాలు వేసేటప్పుడు భంగిమలు మార్చేటప్పుడు ఎంతో జాగ్రత్తగా సున్నితంగా కదులుతారు. దీనికి అనుగుణంగా ఉచ్వాస, నిశ్వాసలు కూడా ఉండాలి. కాబట్టి కేవలం శరీరం కదలికే కాదు, అంతర ప్రక్రియ కూడా యోగా ప్రధానం.


* ఆసనాలు వేయడం మొదలు పెట్టిన కొత్తలో ఒక్కొక్క దాన్ని సాధన చేస్తూ వెళ్ళాలి. అంతేకానీ భంగిమలు మారడానికి వీలవుతోంది కదా అని వరుసపెట్టి ఆసనాలు వేయకూడదు. వాటికి కేటాయించే సమయం కూడా తక్కువ సమయంతో మొదలుపెట్టి క్రమంగా పెంచుకోవాలి. 


* ఆసనాలు ప్రతి రోజూ క్రమం తప్పకుండా చేస్తుంటేనే వాటి నుండి సరైన పలితం లభిస్తుంది. లాగే నెలసరి సమయంలో, గర్భవతులుగా ఉన్నప్పుడు మహిళలు ఆసనాలు వేయకూడదు.


పైన చెప్పినవన్నీ జాగ్రత్తగా పాటిస్తూ ఉంటే ఆసనాలు మహిళల జీవితాన్ని మార్చే అస్త్రాలు అవుతాయి. ఆరోగ్యాన్ని ఇస్తాయి.

                                               ◆నిశ్శబ్ద.