యోగా...మగవారికి ముఖ్యం!ఆడవారికి అనివార్యం!

 

 

ఒకప్పటి కంటే ఇప్పుడు యోగా బాగా ప్రాచుర్యం పొందింది.అయినప్పటికీ యోగా చుట్టూ మన దేశంలో అనేక వివాదాలు ముసురుకుంటూ వుంటాయి.కాని, అమెరికా లాంటి పాశ్చాత్య దేశాల్లో యోగాను నెత్తిన పెట్టుకుంటున్నారు.తల కిందులుగా తపస్సు చేస్తూ శీర్షాసనం, శవాసనంతో అన్నీ వేసేస్తున్నారు.అంతకంతకూ లాభపడిపోతున్నారు.మన దగ్గర మాత్రం చాలా మంది యోగా విలువ తెలియక,బద్ధకంతోనూ,నిర్లక్ష్యంతోనూ అమూల్యమైన విద్యకు దూరమవుతున్నారు.మరీ ముఖ్యంగా,భారతీయ స్త్రీలు...


యోగా ... పిల్లలకు, పెద్దలకు అందరికీ అవసరమే.కాని,మహిళలకి మరింత ముఖ్యం.ఎందుకంటే,ఆడవారు ఆరోగ్యంగా వుండటం వాళ్లకు మాత్రమే కాదు యావత్ కుటుంబానికీ ముఖ్యం.తల్లి క్షేమం మీదే పిల్లల భవిష్యత్ ఆధారపడుతుంది.భార్య ఉత్సాహం మీదే భర్త ఆనందం ఆధారపడి వుంటుంది.అందుకే,స్త్రీలు తమ కోసం,తమ వారి కోసం రెండు కారణలతోనూ యోగా చేయాల్సిందే.యోగా చేసేందకు టైం లేదు అని చెప్పేందుకు కూడా వీలు లేదు.ఎలాగోలా సమయం చూసుకుని స్త్రీలు యోగాభ్యాసం చేస్తేనే మన దేశం త్వరత్వరగా బాగుపడుతుంది.ఒక అమ్మాయి యోగాసనాలు వేస్తూ తనని తాను వశపరుచుకోవటం పైకి కనిపించినంత మామూలు విషయం కాదు.అది దేశ భవిష్యత్తునే పరోక్షంగా బాగు చేసే అద్భుత విప్లవం!


యోగా చేయటం వల్ల పురుషులు,స్త్రీలు ఎవరికైనా ఆరోగ్యం సిద్ధిస్తుంది.ఇది కాక మానసిక ఉత్సాహం ఇనుమడిస్తుంది.సంపూర్ణ శారీరిక,మానసిక చైతన్యం మనల్ని కొత్త జీవితంలోకి తీసుకెళుతుంది.కాని,యోగా వల్ల స్త్రీలకు మాత్రమే ఒనగూరే కొన్ని లాభాలు కూడా వున్నాయి.అవ్వి వారికి ఎంతో అవసరం కూడా...


ఇంటా,బయటా ఒత్తిడితో కొనసాగే మహిళలకి మొత్తం శరీరంపై ప్రభావం చూపే వ్యాయామం ఎంతో అవసరం.అది కేవలం యోగా వల్లే అవుతుంది.జిమ్,ఎయిరోబిక్స్,వాకింగ్ లాంటివి నూటికి నూరు శాతం లాభాలు చేకూర్చలేవు.అలాగే,శరీరంలో ఎన్నో రకాల హార్మోన్లు ఉత్పత్తి అయ్యేది ఎండోక్రైన్ వ్యవస్థ వల్ల.ఇది కూడా యోగాసనాలు వేయటం ద్వారా ఆరోగ్యంగా పని చేస్తుంది. తద్వారా శారీరిక,మానసిక సమతుల్యం ఏర్పడుతుంది.


స్త్రీకి ప్రకృతి సహజంగా వచ్చిన బాధ్యత,వరం పునరుత్పత్తి.ఆమె మాత్రమే సంతానానికి జన్మనిస్తూ మానవ జాతి కొనసాగటానికి కారణం అవుతోంది.అయితే,రకరకాల యోగాసనాలు మహిళల్లోని పునరుత్పత్తి వ్యవస్థని చక్కగా పని చేసేలా చేస్తాయి.గర్భం ధరించటం,సుఖ ప్రసవసం జరగటం వంటి వాటి విషయంలో యోగా చేసే మేలు ఎంతో.ఇక పెళ్లైన స్త్రీలకి,కాని స్త్రీలకి అందరికీ ప్రస్తుతం వున్న సమస్య అధిక బరువు.ఒంట్లో కొవ్వు తొలగించుకోవటానికి కూడా అత్యంత క్షేమదాయకమైన పద్ధతి యోగాభ్యాసమే.మందులు,సర్జరీలు అన్నీ సైడ్ ఎఫెక్ట్స్ వుండేవే.


యోగా ద్వారా నయం కాని అనారోగ్యం అంటూ ఏదీ లేదు.సాధారణ అలర్జీల నుంచీ డయాబిటిస్,బీపీ,డిప్రెషన్ లాంటి వాటి వరకూ అన్నీ నియంత్రణలోకి వస్తాయి.ముఖ్యంగా, ఒకే రకమైన పని చేస్తూ జీవితంలో నిరుత్సహాం,నిరాశ ఎక్కువైపోయిన ఆడవారు యోగా చేస్తే కొత్త కళతో మెరిసిపోతారు.అందం,ఆనందాల కలయికే యోగా!


ఆధునిక కాలంలో ఆఫీస్ వర్క్,ఇంటి బాధ్యతలతో ప్రతీ స్త్రీ రెట్టింపు ఒత్తిడికి గురవుతోంది.ఈ స్ట్రెస్ కూడా యోగా సాధన ద్వారా జయించవచ్చు.ఒక్క మాటలో చెప్పాలంటే మగవాళ్లకి యోగా చాలా ముఖ్యం.కాని,ఆడవారికి అది అనివార్యం.తప్పక చేసి తీరాల్సిందే!