మహిళలూ బి అలర్ట్!! 

మహిళలు మహారాణులు. ప్రస్తుత కాలంలో ఇంటా, బయట, ఏ వ్యవహారాలలో అయినా మహిళలదే పైచేయి. చాలా కుటుంబాల్లో ఏదైనా నిర్ణయం తీసుకోవడం నుండి, అది అమలు జరిగేదాక ఆ ఇంటి ఆడవాళ్ళ పాత్ర చాలా ఉంటుంది. ఎంత అంటే అక్షయపాత్ర అంత. వాళ్ళు ఏ పని చేయాలి అంటే ఆ నైపుణ్యాన్ని చాలా సులువుగా సంపాదించేసుకోగలుగుతారు. ఇలా అల్ రౌండర్ మహిళలే కాకుండా సాధారణ గృహిణీలు కూడా అప్డేట్ అవుతున్నారు. వీళ్ల జీవితంలో ఈ ఎదుగుదల వల్ల కలిగే హుషారులో చాలామంది, బాధ్యతల్లోనూ, పనులలోనూ మునిగిలిపోయి కొన్ని మర్చిపోతున్నారు. పర్యవసానంగా వాళ్లకు బోలెడు ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. చాపకింద నీరులా మహిళలను చుట్టుముట్టే

సమస్యలు ఇవే!!

వంటింటి విషాదం!!

ప్రతి ఇంట్లో మిగిలి పదార్థాలు పడేయలేక, తినలేక ఇబ్బంది పడేది ఆ ఇంటి గృహిణి అనేమాట జగమెరిగిన వాస్తవం. భర్త బయట పార్టీ లో తింటాడు, పిల్లలు కాస్త పెద్దవాళ్ళు అయి ఉంటే వాళ్ళు ఫ్రెండ్స్ తో చాట్స్, పిజ్జా లు, బర్గర్లు తింటారు. ఇంట్లో అందరికోసం వండి కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తే వాళ్ళందరూ మాకొద్దు అని తినకుండా పోతే, అప్పుడు అదంతా చెత్త కుప్పలో పడెయ్యలేక, ఆ వంట చేయడానికి పడిన కష్టం గుర్తొచ్చి, దాన్ని అలాగే పెట్టేసి. మరుసటిరోజు అదే తిండి తాను తింటూ భర్త, పిల్లలకు  వేడి వేడిగా వడ్డిస్తున్న మాతృమూర్తులు ఎందరో!! ఇలా తాజా ఆహారం తీసుకోక కేవలం కార్బోహైడ్రేట్స్ మాత్రం ఎక్కువగా శరీరంలోకి పోతూ డయాబెటిస్ కు గురవుతున్న మహిళలు అనేకం, అలాగే కుటుంబ సమస్యల గూర్చి ఒత్తిడికి లోనవుతూ కూడా దీన్ని కొనితెచ్చుకుంటున్నవాళ్ళు ఉన్నారు.

వాటర్ వార్నింగ్!!

మహిళలు ఇంట్లో ఉన్న వాళ్ళైతే పర్లేదు. ఈకాలంలో చాలామంది మహిళలు అధిక విద్యతో సంబంధం లేకుండా కుటుంబాలకు చేదోడుగా ఉండటానికి, ప్రస్తుత కాలంలో ఇల్లు సమస్యలు లేకుండా గడవడానికి ఏదో ఒక ఉద్యోగం చేస్తూనే ఉంటారు. వీళ్ళు, మరియు పాఠశాల విద్యార్థినిలు ఎదుర్కొనే సమస్య గురించి చెప్పుకుంటే నవ్వాలో, ఏడవాలో కూడా అర్థం కాదు. ఇంటి బయట అడుగు పెట్టాక గమ్యం చేరెవరకు ఎక్కడా ప్రభుత్వం పబ్లిక్ టాయిలెట్లను ఏర్పాటు చేయదు, ఎక్కడైనా ఉన్న డబ్బు పెట్టాల్సిందే. బయట బాత్రూమ్ వెళ్లాలనే సమస్య తప్పించుకోవడానికి మహిళలు చేసే పని మంచినీళ్లు ఎక్కువగా తాగకపోవడం. దీనివల్ల చాపకింద నీరులా కిడ్నీ సమస్యలు వస్తాయి. భారతదేశంలో అధికశాతం మంది మహిళలు ఎదుర్కొనే సమస్య ఇదే.

హార్మోనల్ ప్రోబ్లేమ్స్!!

మహిళల్లో ఎక్కువగా కనిపించే థైరాయిడ్ సమస్య దాని ద్వారా ఊబకాయం చాలా మంది మహిళల్లో కనిపిస్తుంది. కేవలం దీంతో వదిలిపోకుండా ఈ ఊబకాయం రానురాను శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ పెంచి అవి మహిళల్లో రొమ్ము కాన్సర్ కు కారణం అవుతాయి అనే ఆశ్చర్యం వేస్తుంది. హార్మోన్ సమస్యల వల్ల డిప్రెషన్, అనవసర ఫోబియాలు, pcod, గర్భాశయ సమస్యలు ఇలా ఒకదానికొకటి అల్లుకుపోతుంటాయి ఈ సమస్యలు అన్ని. ఇవన్నీ కూడా మహిళల ఋతుచక్రం మీద ప్రభావం చూపించి మానసికంగా మహిళలను దిగజారుస్తాయి.

రక్తంతో యుద్ధం!!

నిజమేనండీ బాబు. భారతదేశంలో అధికశాతం మంది మహిళలు ఎదుర్కొంటున్న మరో సమస్య రక్తహీనత. ఐరన్, కాల్షియం లోపాలు, సరిపడినంత ఎముక సామర్థ్యము, హిమోగ్లోబిన్ స్థాయిలు లేక బలహీనంగా, వాటి ద్వారా ఇతర సమస్యలు కూడా ఎదుర్కొంటున్న ఆడవాళ్లు ఎందరో. ముఖ్యంగా పోషకాహార లోపం వల్ల శారీరక దృఢత్వం లేక గాజుదేహాల్లా మారుతున్న ఆడవాళ్లు అధికం. ఇలా ఇన్ని సమస్యలు ఉన్నా ప్రపంచంలో పోటీలో ఆగకుండా పరిగెత్తాలని ఆరటపడుతూ ఉన్న మహిళలకు యాడ్స్ లో అందంగా చూపించే ఆహారాలు, ఎనర్జీ డ్రింకులు శక్తిని ఇవ్వవు. ప్రకృతిపరంగా లభించే ఆహారమే ఆరోగ్యం, అందం, ఆనందం కూడా.

కాబట్టి మహిళలూ బి అలర్ట్!!మీ ఆరోగ్యం మీ చేతుల్లో!!

◆ వెంకటేష్ పువ్వాడ