ఆంజనేయులు మీద పడేటట్టుగా బేగ్ ను విసిరేసింది.

 

    "చూడండీ! కావలసిన సామాగ్రి లిస్టు చెప్తాను జ్ఞాపకముంచుకోండి. బియ్యం అయిదు కేజీలు, కందిపప్పు రెండు కిలోలు, పెసరపప్పు రెండు కిలోలు, ఆవాలు..." వరుసగా లిస్టు చెప్పి "అలాగే మార్కెట్ కెళ్ళి ఫ్రెష్ కూరగాయలు తెండి..." అని హుకుం జారీచేసింది.

 

    సడన్ గా తరణి ఎందుకిలా మారిపోయిందో అర్ధంకాక బిత్తరపోయాడు ఆంజనేయులు.

 

    "ఇదిగో పల్లెటూరి పిల్లా! నీ బాణాలు నా దగ్గర వెయ్యొద్దు. నా సంగతి నీకు తెలీదు. నాకు కోపమొచ్చిందంటే ఆ పెట్టేబేడా అవతల విసిరేస్తాను. తెలుసా?" గయ్ మని లేచి ఆ బేగ్ ని తరణి మీదకు విసిరేశాడు.

 

    అదే సమయంలో లోనికి ప్రవేశించింది భువనేశ్వరి.

 

    "ఏమమ్మాయ్! ఏవిటీ?" అంటూ ఆరా తీసింది.

 

    "నేను వెళ్ళి సరుకులు తెస్తానూ అంటే వినిపించుకోవడంలేదండీ మీ అల్లుడు..." ఆంజనేయులు వేపు కన్నుగీటుతూ అంది తరణి.

 

    "అదేమిటమ్మా! చీకటి పడుతోంది. నువ్వెళ్ళడం ఏవిటి? మతి గాని పోయిందా... ఏం బాబూ! సరుకులు తేవడానికి అమ్మాయ్ వెళ్ళాలా? మగవాళ్ళు చెయ్యాల్సిన పనులు మగవాళ్ళే చెయ్యాలి. వెళ్ళు... వెళ్ళు..." అంది ఆంజనేయుల్ని వుద్దేశించి.

 

    ఆంజనేయులు గుటకలు మింగాడు.

 

    "నేనూ అదే అంటున్నాను ఆంటీ! నువ్వెళ్ళడం ఏవిటీ అని... వినదు కదా. మొండి... జగమొండి..." కసిగా అని బేగ్ అందుకున్నాడు ఆంజనేయులు.

 

    "జల్దీ ఆవోనా" కళ్ళతో వెక్కిరిస్తూ అంటున్న తరణి వేపు ఒళ్ళు మండిపోతూ చూస్తూ బయటికెళ్ళాడు ఆంజనేయులు.

 

    అప్పుడే లోపలకొచ్చి అదంతా చూసిన ఆనందం గుండెలు బాదేసుకున్నాడు.

 

    ఇంతకు ముందు తను టిఫిన్ పెట్టించమన్నా, సినిమా చూపించమన్నా మన్ మోహన్ సింగ్ బాబులా లెక్కలేసిన ఆంజనేయులేనా? నిజంగా పెళ్ళాం కాకపోతే చెప్పగానే సరుకులు తేవడానికి వెళ్తాడా?

 

    ఏదో తిరకాసుంది. అదేమిటో తెలీటంలేదు.

 

    అప్పుడప్పుడు ఎవరో పల్లెటూరాయన వచ్చి ఆంజనేయుల్ని కలిసి వెళుతుంటాడు. ఆయనెవరు? తల విదిల్చి లేచాడు ఆనందం.


                              *    *    *    *


    రాత్రి ఎనిమిది అవుతుండగా ఆంజనేయులు ఖాళీ సంచులతో, చేతిలో పొట్లంతో వచ్చాడు.

 

    ఆనందం అతన్ని చూసి ఆశ్చర్యపోయాడు.

 

    "సరుకులేవి?"
    


    "సరుకుల్లేవు- గిరుకుల్లేవు మనిద్దరికీ టిఫిన్ తెచ్చా. తినేసి పడుకుందాం. మాట్లాడితే పెళ్ళాం... పెళ్ళాన్నంటోందిగదా... ఈ రాత్రికి పస్తు పడుకోబెడితే గాని రోగం కుదిరి నిజం చెప్పదు" అన్నాడు ఆంజనేయులు ఖాళీ సంచిని ఓ మూలకి విసిరేస్తూ.

 

    "అయితే నా చెల్లెలు నీకు భార్య కాదంటావ్?"

 

    "నీకు చెల్లెలేమో! నాకు భార్య కాదు" కసురుకున్నాడతను.

 

    "నాకంతా అయోమయంగా ఉంది వయస్సులో ఉన్న అమ్మాయి, అందమైన అమ్మాయి, చలాకీ అమ్మాయి తనంతట తాను వచ్చి, సెటిలయిపోయి, నీ భార్యననటం ఏవిటిరా బాబూ...? నిప్పు లేకుండా పొగ వస్తుందా?"

 

    "రాదు! నిన్ను తగలేస్తే రెండూ వస్తాయి. పద టిఫిన్ తిందాం" అరిచాడు ఆంజనేయులు బీపీ వచ్చినవాడిలా.

 

    ఆనందం ఓ క్షణం వెర్రి చూపులు చూసి-

 

    "ఆ అమ్మాయి ఎవరయినా మనం మాత్రమే తినటం పాపంరా" ఆనందం జాలిగా అన్నాడు.

 

    గుడ్లురుముతూ చూశాడు ఆంజనేయులు.

 

    "దేవకన్య కావచ్చు... అయితే మన కళ్ళు పేలిపోతాయి. లేదా పూర్వ జన్మలో నీ భార్యేమో... కోరిక చావకపోతే మరో జన్మ ఎత్తుతారట... ఒకసారి నీ పూర్వజన్మ గుర్తుకు తెచ్చుకోరా అంజీ..."

 

    మాటలు పూర్తికాకముందే ఆంజనేయులు సుడిగాలిలా ఆనందం మీదపడి పిడిగుద్దులు గుద్దాడు.

 

    ఆ దెబ్బకి ఆనందానికి కళ్ళు బైర్లుకమ్మాయి.

 

    తరణి వాకిట్లోకి వచ్చి అటే చూస్తున్నా లెక్కచేయకుండా ఇద్దరూ టిఫిన్ తినేసి ముసుగులు పెట్టేశారు.


                              *    *    *    *


    అర్దరాత్రి వేళ పక్కింటి లాయర్ ఇంట్లోంచి ఎడాపెడా, కుడి, ఎడమ గంటలు నిర్విరామంగా మోగుతుంటే ఆనందానికి మెలుకువ వచ్చి దిగ్గున లేచి కూర్చున్నాడు.

 

    "నిద్రపోనీకుండా ఈ దిక్కుమాలిన గంటల గోలొకటి" అని విసుక్కుని యథాలాపంగా తలతిప్పి చూడగా-

 

    తరణి కూజాలోని నీళ్ళు గ్లాసులోకి వంపుకొని తాగుతూ కనిపించింది.

 

    ఆనందం జాలితో ద్రవించిపోయాడు.

 

    "మీ ఆయన పిసినారి, దుర్మార్గుడు. అక్కడికీ నేను చెప్పాను. ఐనా వినలేదు. ఆకలిగా వుందా?" అడిగాడు ఆనందం లేచి ఆమె దగ్గరకెళ్ళి.

 

    ఆమె తలూపింది మౌనంగా.

 

    "నేనెళ్ళి ఏమైనా పండ్లు పట్టుకురానా?" అన్నాడు ఆనందం.

 

    ఆమె మాట్లాడలేదు మౌనంగా తల వంచుకుంది.

 

    "నేనెళ్ళి తెస్తా..." అని ఆనందం జేబు తడుముకొని, తన దగ్గర చిల్లి గవ్వ కూడా లేదని గుర్తుకు రావడంతో తల వంచుకున్నాడు.

 

    "పర్వాలేదన్నయ్యా! ఒక రాత్రి పస్తుంటే ప్రాణాలు పోవుగా... నువ్వెళ్ళి పడుకో" అంది ఆమె గంభీరంగా.  


                             *    *    *    *


    "సారీ తరణీ... ఏదో చిరాకులో ఉండి అలా చేశాను... నన్ను క్షమించు. ఇవిగో ఇడ్లీ... త్వరగా తినేయ్... వాడు లేస్తే ఒక్క ముక్క మిగలనివ్వడు" అన్నాడు ఆంజనేయులు.

 

    రాత్రి తరణికి, ఆనందానికి మధ్య నడిచిన సంభాషణని విన్న అతను ఉదయమే పరుగున వెళ్ళి టిఫిన్ పట్టుకొచ్చాడు.

 

    అది తరణికి తెలీదు.

 

    "థాంక్యూ... నా మీద కోపం లేదా?" నవ్వుతూ అడిగింది తరుణి.

 

    "కోపమంటే... నువ్వెవరివో తెలీదు. అడిగితే చెప్పవు. నువ్వు నా పెళ్ళానివని చెబుతున్నందుకు కోపం వస్తోంది... అలా చెప్పటం వల్లనే యీ రూమ్ లో వుండగలుగుతున్నందుకు సంతోషంగా వుంది. ఏమో నాకేమీ తెలీటం లేదు. నువ్వయితే త్వరగా తిను" అన్నాడు.