"నాకు తోచడం లేదు" అంటే పాపని డాన్స్ స్కూల్ కి తీసుకెళ్ళూ....సంగీతం నేర్పించూ....స్పోర్ట్స్ కోచింగ్ కి తీసుకెళ్ళూ.....ఇంక తోచదన్న సమస్య ఏమిటీ?" అనేస్తాడు.
    
    ఎంత ఆక్యుపైడ్ గా వుందామన్నా రకరకాల ఆలోచనలు వస్తూనే వుంటాయి. అద్దం ముందు నిలబడి 'నాకేం తక్కువా' అని చూసుకుంటాను.
    
    "అహల్యా....నీ ఒంటి కాంతి వెన్నెలలో పిరమిడ్ లా వుంటుంది. నీ పోశ్చర్ గ్రీకు శిల్పంలా సమ్మోహనంగా వుంటుంది. నీ కనుబొమలు కూడా కోరిక రేపుతాయి. నీ క్రింద పెదవి మీద పుట్టుమచ్చ అయితే.... అబ్బా తలుచుకుంటేనే ఐస్ క్రీం మీద చెర్రీలా నోరూరిస్తుంది" అనే ఆ రొమేంటిక్ మాటలేమయ్యాయీ? నేనప్పటిలాగే వున్నానుగా....నా శరీరం బరువు పెరగలేదు.... నా నడుం క్రింద ముడతలు లేవు.....బుగ్గలమీద నునుపు తగ్గలేదు. మరి రఘు ఎందుకు పరాయి ఆడపిల్లల వైపు ఆకర్షితుడౌతున్నట్లూ?
    
    రఘు సింగపూర్ నుండి రాగానే నిలదీశాను. "నువ్వు సింగపూర్ ఎవరితో వెళ్ళావు?"
    
    "నా పి.ఏ.తో" అన్నాడు.
    
    "అమ్మాయేగా!"
    
    "ఔను! అయితే ఏం?"
    
    "రఘూ! ఇది కూడా నన్ను లైట్ గా తీసుకోమంటావా? నువ్వు నాలోని టాలెంట్ ని కిల్ చేస్తే సహించాను....తాగితే సహించాను....నాతో గడపకపోతే సహిస్తున్నాను. కానీ పరస్త్రీలతో తిరుగుతుంటే ఎలా సహించేది?"
    
    "అహల్యా! నా రేంజ్ కి ఇవన్నీ మామూలే రఘురాం రియల్ ఎస్టేట్స్ ఎమ్.డీ పి.ఎ.తో బిజినెస్ టూర్ వెళ్ళడం పెద్ద విశేషం కాదు. నువ్వు అలవాటుపడాలి."
    
    "ఎన్నని అలవాటుపడాలి నేను? నువ్వు మాత్రం నేను ఇల్లు కదులుతానన్నా ఒప్పుకోవు. నీ భార్య ఒకప్పుడు ప్రఖ్యాత గాయని అన్న విషయాన్ని కూడా విస్మరించావు. ఎవడో పార్టీలో అహల్యగారి భర్త అన్నందుకు 'నేను అహల్య భర్తని ఏవిటిరా? అహల్యే రఘురాం భార్య" అని చితక్కొట్టేవుట! ఇవన్నీ అలవాటు పడినట్లుగా నువ్వు ఇంకో స్త్రీతో గడిపొస్తే నేనలవాటు పడలేను" ఏడుస్తూ అరిచాను.
    
    "అహల్యా అర్ధం చేసుకో! అది స్టేటస్ సింబల్. భార్యగా నీ అధికారాలు వాళ్ళకి ఎన్నడూ రావు. నీ ముందు వాళ్ళు దిగదుడిచి పారేసినట్లుగా వుంటారు. నీకు ఇల్లు, హోదా, పాపా అన్నీ వున్నాయి. ఇంకా తోచకపోవడం ఏవిటీ? పాపకి సంగీతం నేర్పించూ పొద్దుపోతుంది" అన్నాడు.
    
    "ఎందుకూ దాని సంగీతాన్ని కూడా అటకెక్కించే ఇంకో ప్రబుద్దుడికిచ్చి అంటకట్టడానికా?" అడిగాను.
    
    "నీకేం తక్కువైందని ఇలా మాట్లాడుతున్నావో నాకు అర్ధంకావడంలేదు. నువ్వు సినిమాలలో పాడడం నాకు ఇష్టంలేదు. హాయిగా ఇంట్లో పాడుకో" అన్నాడు.
    
    "హాయి!" అతను చెప్పేదే తప్ప ఎదుటివాళ్ళు చెప్పేది అతనర్ధం చేసుకోడు.
    
    ఆ రాత్రి నా గదిలోకొచ్చి నాతో శృంగారం చెయ్యబోయాడు. ఆ విస్కీ వాసన నేను భరించలేకపోయాను. కన్నీళ్ళు ఆగలేదు. అతను మాత్రం అవసరం తీరాక గుర్రుపెట్టి నిద్రపోయాడు.
    
    ఏదైనా భర్తని నిగ్గదీసేవరకూ....ఆ తర్వాత ఆ బెరుకూ వుండకుండా అతను బాహాటంగా చేస్తాడనడానికి నిదర్శనంగా రఘు ఈసారి స్విట్జర్ లాండ్ మరొక అమ్మాయితో వెళ్ళాడు. ఆ అమ్మాయి మాళవిక అని ఈ మధ్యే కొత్తగా పి.ఏ.గా చేరింది.
    
    "వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా వింటే నీకు బాధగా వుంటుంది. అందుకే నేనే చెపుతున్నాను. మాళవిక నాతో వస్తోంది" అన్నాడు.
    
    నేను ఏడుస్తూ "నాకు భరించశక్యం గావడంలేదు రఘూ! వై డోంట్ యూ అండర్ స్టాండ్?" అన్నాను.
    
    "భరించాలి....ఎందుకంటే నిన్న రాత్రి చూసావుగా. నీతో శృంగారం ఎంత రసహీనంగా వుంటుందో. అందుకే భరించాలి. నాకు చికెన్ తినడం ఇష్టం.....నీకు చెయ్యడం రాదనుకో! బయట తింటే వూర్కోవూ....అలాగే ఇదీనూ..." అన్నాడు.
    
    నేను తీగ తెగిన వీణనే అయ్యాను.
    
    ఆరు సంవత్సరాలు నాతో స్వర్గంలా వుంటుందంటూ అనుభవించిన ఈ వ్యక్తి నాకెలాంటి సర్టిఫికెట్ ఇచ్చాడూ! ఎందువల్ల వచ్చిన మార్పిదీ?
    
    రఘు వెళ్ళిపోయాడు.
    
    ఏ స్త్రీ తట్టుకోలేని మాట అని వెళ్ళాడు. నాకు ఒక్కసారిగా జీవితం మీద ఆశ నశించింది. పునీత ఫోటో గుండెలకి హత్తుకున్నాను. అది స్కూల్ నుండి వచ్చేలోగా ఈ దరిద్రపు జీవితం అంతం చేసుకోవాలనుకున్నాను.
    
    ఫ్యాన్ రాడ్ కి ఉరి వేసుకోడానికి సిద్దం చేసుకున్నాను. క్రింద స్టూలేసుకుని ఎక్కి మెడకి తగిలించుకున్నాను. కళ్ళు మూసుకున్నాను. అమాయకమైన పునీత మొహం తలుచుకున్నాను. బుగ్గలమీద నుండి కన్నీరు జారిపడుతోంది. ఎన్నెన్నో ఆలోచనలు.... పాత స్మృతులు.....దాసుగారూ దాసమ్మగారూ ఎంతగా ఏడుస్తారో.....నా అభిమానులు....మీరు ఒక్కపాట పాడినా చాలమ్మా అంటూ వెంటబడిన దర్శక నిర్మాతలు....అమ్మ, నాన్న....అన్నలూ, వదినలూ.... తల విదిలించి నెమ్మదిగా కాళ్ళు పైకి లేపుతూ స్టూల్ ని తన్నేసాను. ఇంకో క్షణంలో తాడు పీకని బిగించి గిలగిలా తన్నుకుంటాననుకుంటున్న తరుణంలో....ఎవరో కాళ్ళని బలంగా చుట్టుకున్నారు. నా మెడ ఒరుసుకోకుండా పట్టుకున్నారు.
    
    రఘు వచ్చేసాడా!! ఆశగా కళ్ళు తెరిచాను. దీపూ నావైపు చూస్తున్నాడు.
    
    ఆ కళ్ళల్లో అదే భావం.... నేను తాళి కట్టించుకుని వచ్చిన మరుక్షణం నుండీ వున్న భావం.... నన్ను ఓ అపరాధిలా చూస్తాడు. ఎప్పుడొచ్చినా పునీతతో ఆడుకోవడం, దానికి బొమ్మలు తేవడం, అన్నయ్యతో మాట్లాడడం చేస్తాడేకానీ నన్ను పట్టించుకోడు. నేనంటే అతనికి అకారణ ద్వేషం.
    
    "నన్ను చావనీ! ఎవరికీ అక్కర్లేని ఈ జీవితం నిరర్ధకం" అన్నాను.
    
    "నన్ను అతను అలాగే పట్టుకుని మెడలోంచి ఆ వరమాల తీసెయ్యండి" అన్నాడు హేళనగా.
    
    నేను కిందకి దిగాకా, భోరుమని ఏడిచాను.
    
    "ఇందాకా ఏమన్నారూ? ఎవరికోసమో మీ జీవితం అన్నారు కదూ! అంత పనికిమాలిన మాట మీ నోట వచ్చినందుకు సిగ్గుపడండి. మీకోసం మీరు బ్రతకడం నేర్చుకోండి. మీ కళనీ, వ్యక్తిత్వాన్నీ, ఆశల్నీ అన్నింటినీ చంపేసుకున్నారు. కనీసం.....దేహాన్ని నిలుపుకుని ఆ కళ్ళు, కాళ్ళూ, చేతులూ ఇతరులకి ఏవైనా సేవ చేయగలవేమో ప్రయత్నించండి...." అన్నాడు.
    
    "దీపూ.....మీ అన్నయ్య ఏం చేశాడో చూశావా?" అని ఏడుస్తున్న నన్ను మధ్యలోనే ఆపేశాడు.
    
    "ఒద్దు.... ఇప్పుడు నా భుజం దొరికిందికదా అని సానుభూతి కోసం ఏడవద్దు మొదటిరోజు నుండీ మీ అస్తిత్వాన్నీ వ్యక్తిత్వాన్నీ మీరు నిలబెట్టుకోడానికి ప్రయత్నించలేదు. మీ గొంతు విని వెర్రిగా ఆరాధించిన నేను-మీరు మా అన్నయ్యలాంటి స్వార్ధపరుడ్ని ఎంచుకోవడం చూసి అవాక్కయ్యాను. నేను ఆరాధించిన వ్యక్తి మీరు కాకపోతే ఎంత బావుండునూ అని ఎన్నోసార్లు అనుకున్నాను. అన్నయ్య తాళానికి తల ఊపుతూ మీరు ఒక్కొక్కమెట్టే కిందకి దిగజారడం ఈ కళ్ళతో చూశాను. ఐ పిటీ దీస్ ఇండియన్ విమెన్.... అంతా మీ చేతుల్లోనే ఉంటుంది. మీ ఉరి మీరే బిగించుకుంటారు. ఆ తర్వాత గిలగిలలాడ్తారు."