ఎందుకని ప్రశ్నించలేదాయన.

 

    ఫోనందుకుని నేరుగా పర్సనల్ ఆఫీసర్ కి ఫోన్ చేసింది నిశాంత. తనను తాను కొత్తగా అపాయింట్ అయిన పి.ఎ. టు చైర్మన్ అని పరిచయం చేసుకుని-

 

    సెక్యూరిటీ ఆఫీసర్ నారాయణ్ దత్ కు సంబంధించిన వివరాలను అడిగింది.

 

    రెండు నిమిషాల తరువాత పర్సనల్ ఆఫీసర్ చెప్పడం ప్రారంభించాడు.

 

    "ఒరిజినల్ నారాయణ్ దత్ స్ట్రిక్ట్ అండ్ సిన్సియర్ మేడమ్..."

 

    ఆ మాటల్ని వింటూనే రిసీవర్ని దేశ్ ముఖ్ కి అందించింది నిశాంత. తను ఎక్స్ టెన్షన్ ఫోన్ రిసీవర్ని అందుకుని అతను చెప్పే మాటలను వింటోంది.

 

    పర్సనల్ ఆఫీసర్ చెబుతున్నది వింటున్నాడు దేశ్ ముఖ్.

 

    'ఎం.డి మనోహర్, నారాయణ్ దత్ ఫ్రెండ్స్ గా వున్నంతకాలం అంతా బాగానే జరిగిపోయింది మేడమ్!"

 

    "మరీవేళ నారాయణదత్ ని సస్పెండ్ చేయడానికి ఎం.డి. ఎందుకు పూనుకున్నాడు?" ఎక్స్ టెన్షన్ ఫోన్లోంచి అడిగింది నిశాంత.

 

    "తనకెంత సర్వీసున్నా, ఆ సర్వీస్ ని చైర్మెన్ గుర్తించలేదన్న కోపంతో, ఎం.డి.తో నారాయణ్ దత్ చెయ్యి కలిపినా, బేసికల్లీ హి ఈజ్ గుడ్ మేడమ్!"

 

    "ఎం.డి. కెదురుగా ఇంత నిక్కచ్చిగా చెబుతున్నారంటే, మీరు నారాయణ్ దత్ పార్టీయా?" నవ్వుతూ అడిగిందామె.

 

    "మీరెప్పుడు జాయిన్ అయ్యారో నాకు తెలీదు కానీ... నేనీ రోజుతో రిటైరవుతున్నాను..." నవ్వుతూ అనేసి ఫోన్ పెట్టేశాడు ఆ పర్సనల్ మేనేజర్.

 

    దేశ్ ముఖ్ ముఖం వివర్ణమైపోయింది.

 

    "ఇప్పుడు నన్నేం చేయమంటావో చెప్పు?" గంభీరంగా అడిగాడు దేశ్ ముఖ్. నిశాంత తెలివితేటల్ని పరీక్షించాలనే అలా అడిగాడాయన.

 

    "నా నిర్ణయం కటువుగా వుంటుంది" ఆత్మవిశ్వాసంతో అంది నిశాంత.

 

    "ఫర్వాలేదు చెప్పు."

 

    "నారాయణ్ దత్ ని ఎం.డి.ని చెయ్యండి" ఆ మాట చెప్పి దేశ్ ముఖ్ చేతిలో ఫైలుని వుంచింది.

 

    మూడు నిమిషాలసేపు గదిలో పచార్లు చేశాడు దేశ్ ముఖ్.

 

    వెంటనే పి.ఎ. సుభాష్ చంద్రను పిలిచాడు. నారాయణ్ దత్ ను మేనేజింగ్ డైరెక్టర్ ను చేస్తూ లెటర్ డిక్టేట్ చేశాడు. మనోహర్ ని అప్పటికప్పుడే డిస్ మిస్ చేశాడు.

 

    ఆర్డర్స్ వెళ్లిపోయాక దేశ్ ముఖ్ తనలో తనే నవ్వుకున్నాడు.

 

    అనుకోకుండా నిశాంత ఒక టెస్ట్ లో నెగ్గింది. ఆ విషయం నిశాంతకు తెలీదు.

 

    నిశాంత సాల్వ్ చేసిన ప్రాబ్లమ్, రియల్ ప్రాబ్లమ్ కాదు. నిశాంత మేథస్సును, టెస్ట్ చెయ్యడానికి దేశ్ ముఖ్ సృష్టించిన ప్రాబ్లమ్. నిశాంత మధ్యలో ఫోన్ చేయగా మాట్లాడింది పర్సనల్ ఆఫీసర్ కాదు పి.ఎ. సుభాష్ చంద్ర.

 

    అంతా ఒక డ్రామా, స్లమ్ ఏరియాలోది మొదటి భాగమైతే, ఇది రెండో భాగం.


                            *    *    *    *


    న్యూయార్క్...

 

    ఒలింపిక్ టవర్ ఎపార్ట్ మెంట్. యాభై రెండు అంతస్తుల విశాల భవనం అది.

 

    వాటిల్లో రెండు ఫ్లోర్లు పూర్తిగా మహంత రెసిడెన్స్- బిజినెస్ డీలింగ్స్ కోసం వచ్చే ఏజెంట్లతో చర్చల కోసం ఈ రెసిడెన్స్ ను వుపయోగిస్తాడు మహంత.

 

    మొదటి ఫ్లోర్లో రెండు రాయల్ సూట్స్, స్విమ్మింగ్ ఫూల్, ఫారిన్ యువతులు స్వాగత, సత్కారాలు చేసే బార్ ప్రత్యేకతలు కాగా, రెండో ఫ్లోర్ పూర్తిగా మహంత పర్సనల్.

 

    విశాలమైన బెడ్ రూమ్, ఆ రూమ్ రివాల్వింగ్ బెడ్, ఆ పక్కన ఆర్ట్స్ రూమ్, లైబ్రరీ, డ్రాయింగ్ రూమ్... మహంత అభిరుచికి అనుగుణంగా ఫ్రెంచి, ఆర్చిటెక్స్ డిజైన్ చేసిన గోల్డెన్ రూమ్స్ అవి.

 

    ఇరాక్, ఇరాన్ యుద్ధ సమయంలో-

 

    జార్జి బుష్ ప్రెసిడెంట్ గా వున్న అమెరికన్ ప్రభుత్వానికి ఆయుధాలు సరఫరా విషయంలో, మహంత పెద్ద ఎగ్రిమెంటును కుదుర్చుకున్నాడు.

 

    ప్రతి దేశంలోనూ తనకు నమ్మకస్తుడైన వ్యక్తిని బిజినెస్ ఏజెంటుగా నియమించడం, ఆ ఏజెంట్ ద్వారా తన బిజినెస్ డీల్ చెయ్యడం మహంత టెక్నిక్స్ లో ఒకటి.

 

    ప్రస్తుతం మహంత డ్రాయింగ్ రూమ్ లో అతనికి ఎదురుగా వున్న వ్యక్తి సురేంద్రరాయ్ మహంత అమెరికన్ బిజినెస్ ఏజెంట్.

 

    "లేవిన్ సన్ ఈ విషయంలో మనకు బాగా వుపయోగపడ్డాడు..." సంతోషంగా అన్నాడు సురేంద్ర రాయ్.

 

    లేవిన్ సన్ అనే అమెరికన్ ని యు.ఎస్. సెనేట్ కమిటీలో చేర్పించిన వాడు మహంత. అతనికి మాత్రమే తెలిసిన సీక్రెట్ అది.

 

    అదే సమయంలో రాబర్ట్ మర్చంట్ ఫోర్భ్స్ కొత్త సంచికను టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయాడు.

 

    ఫోర్బ్స్ పత్రిక ప్రతి ఏటా ప్రపంచ ప్రఖ్యాత ధనవంతుల లిస్టును, వారి ఆస్తుల వివరాలను, ఇంటర్వ్యూలో ప్రచురిస్తుంది.

 

    ఈ ఏడాది మహంత ఫోటో ఫోర్బ్స్ పత్రిక ప్రత్యేక ముఖ చిత్రంతో వచ్చింది.

 

    రెండేళ్ళ క్రితం అమెరికన్ ఇండస్ట్రియిలిస్టు గోల్డెన్ పీటల్ గెట్టీ, ఆ తరువాత సామ్ మూరే, ఈ ఏడాది మహంత.

 

    వరల్డ్ రిచ్చెస్ట్ ని గుర్తించడానికి ముందు ఆయా వ్యక్తుల 'పర్సనల్ వెల్త్'ని మాత్రమే లెక్కలోకి తీసుకుంటారు. కుటుంబ ఆస్థిని (ఫ్యామిలీ వెల్త్) లెక్కలోకి తీసుకోరు.

 

    జాతీయ ఆస్తి, వ్యక్తిగత ఆస్తులకు సంబంధించిన ప్రపంచ ప్రఖ్యాత ధనవంతుడు బ్రూనై సుల్తాన్ ఆస్తులు ఇప్పటికీ ఆర్థిక శాస్త్రవేత్తలకు అందని పరిధిలోనే వున్నాయి. బ్రూనై సుల్తాన్ దేశంలో ఆయిల్ రెవిన్యూ ద్వారా వచ్చే ఆదాయం మూడు బిలియన్ల అమెరికన్ డాలర్లు కాగా, ఆయన నివాసం వుండే ప్యాలెస్ విలువ మూడు వందల మిలియన్ అమెరికన్ డాలర్లు. ఆయిల్ రెవిన్యూ దేశానిది కాగా, ప్యాలెస్ వ్యక్తిగతమైన ఆస్థి- అలాగే సుల్తాన్ వార్షిక వ్యయం కూడా- ఈ లెక్కల ఆధారంగానే బ్రూనై సుల్తాన్ ను ప్రపంచ ధనవంతులతో మొట్టమొదటివాడుగా గుర్తిస్తున్నారు.

 

    అలాగే ప్రపంచంలో ఖషోగ్గీ వార్షిక వ్యక్తిగత వ్యయం 120 మిలియన్ల అమెరికన్ డాలర్లు- అలాగే మహంత.

 

    ఫోర్బ్స్ పత్రికకు తనిచ్చిన ఇంటర్వ్యూను చదువుకుంటూ నవ్వుకున్నాడు మహంత.