రెస్టారెంట్ లోంచి బయటకు నడిచింది విజూష.
సీలోనో కూర్చుంటూ పక్క సీటులో సెటిలైన స్పూర్తితో అంది.
"ఐ డోంట్ థింక్ యిట్సే మిస్టిక్. బహుశా రుత్వికి బలమయిన ఆధారం ఏదో వుండివుండాలి."
కారు వెళుతుంటే ఓరకంట విజూషనే గమనిస్తూ అంది స్పూర్తి.
"బహుశా ఈ పాటికి అక్కడ బాగా గొడవ జరుగుతూ వుండవచ్చు"
"ఎక్కడ?"
"మనం ఇప్పుడు వెళ్ళేచోట."
విజూష మొహం వివర్ణమైపోయింది.
"మనం రవీంధ్రభారతికి వెళుతున్నామా?" దొరికిపోకూడదంటూ అంది.
"వెళితే బెటరు" స్పూర్తి ఇప్పుడు ఇందాక విజూష అన్న మాటలని సమర్దిస్తూ అంది.
"అవును విజ్జూ.. పోటీ నిర్వహించే క్విజ్ మాస్టర్ బగా రీసెర్చ్ చేసి ప్రశ్నల్ని జవాబుల్ని ప్రిపేర్ చేసుకోవాలి.
అదొక్కటే కాదు....
జవాబులు కరెక్టో కాదో ఒకటికి పదిసార్లు చెక్ చేసుకుని అవసరమైతే ఎక్స్ పర్ట్ ఒపీనియన్ తీసుకోవాలి"
రాత్రి తొమ్మిది గంటల సమయంలో కారు రవీంధ్రభారతి ఆవరణ లోకి దూసుకొచ్చింది.
విజూష అంత వేగంగా నడవగలదని స్పూర్తికి అంతవరకూ తెలియదు.
అర నిముషం వ్యవధిలో ఆడిటోరియంలోకి అడుగుపెట్టిన విజూష అక్కడ ఇంకా సీట్లనుంచి కదలని జనాన్ని చూసి ఆశ్చర్యపోలేదు.
డయాస్ పై వున్నాడు రుత్వి.
విద్యుద్దీపాల కాంతిలో అంత దూరాన వున్న ఆమెకు మాత్రం చాలా చేరువగా నిలబడి వున్నట్టున్నాడు.
ఆమె చూపుల కిరణం తాకిన స్పటికంలా పరావర్తనం చెంది ఇంద్రధనువుగా మారినట్టు అనిపించాడు ఓ క్షణం.
తుషార స్నాత ప్రత్యుష స్వప్నంలో నుంచి నడిచి వచ్చిన గంధర్వుడిలా కనిపించాడు మరో క్షణం.
రుత్వికి సుందరంగారికి మధ్య వాగ్యుద్దం జరుగుతోంది.
అయినా రుత్వికి కోపం లేదు.
నిద్రపోయే పసిపాప పెదవులపై మెరిసే పసిపాప నవ్వులా స్వచ్చంగా వున్నాడు.
స్పూర్తి ఓ సీటులోకి లాగేదాకా తేరుకోలేదు విజూష.
నేను కొన్ని ప్రశ్నలకి సరయిన జవాబులు తెలీని వ్యక్తినని ఇందరిముందు అనేసి వెళ్లిపోవడంకాదు... రుత్వి ఆ వివరాలని బయటికి చెప్పి తీరాలి" ఒక యూనివర్శిటీ ప్రొఫెసర్ గా తనకున్న పరిజ్ఞానాన్ని ప్రశ్నించిన రుత్విని క్షమించలేనట్ట అన్నాడు క్విజ్ మాస్టర్ పత్రికా విలేఖరులను చూస్తూ.
"దయుంచి ఆయన్ని ఇబ్బంది పెట్టకండి. ప్రోగ్రాం రికార్డ్ తీసివుంటారుగా.
దాన్ని ఓ కమిటీకి చూపించి నేనన్న మాటల్లో నిజాన్ని గుర్తించమనండి చాలు" అన్నాడు రుత్వి అర్దింపుగా.
నాకా వివరాలు ఇప్పుడే కావాలి" మొండికేసాడు క్విజ్ మాస్టర్ సుందరం.
క్విజ్ కాంపిటీషన్ నిర్వహించిన హ్యూమన్ రిసోర్సెస్ విభాగం వాళ్లు అర్దాంతరంగా ప్రోగ్రాం ముగించడమేగాక ఇప్పుడు ఇక్కడ ఇలాంటి చర్చ కొనసాగడం ఇబ్బందిగా అనిపిస్తుంటే ఏం చేయాలో పాలుపోక దిక్కులు చూస్తున్నాడు నిశ్చేష్టులుగా.
"పోనీ ఆ పొరపాట్ల గురించి మీరైనా చెప్పొచ్చుగా?" ఓ విలేఖరి డయాస్ మీదనున్న రుత్విని అడిగాడు.
"పైగా పెద్దాయన చాలా హర్టయినట్టున్నారు."
"నేను డిటైల్స్ లోకి వెళితే మరింత హర్టవుతారు. అందుకే..."
"నో" ఆర్ధోక్తిగా అరిచాడు క్విజ్ మాస్టర్.
"నేను రైట్ అని నాకు తెలుసు. కాబట్టి రుత్వి అభియోగాన్ని సభాముఖంగానే తప్పని నిరూపించాలనుకుంటున్నా"
జనం చప్పట్లు కేకల మధ్య అయిష్టంగానే పాయింట్ లోకి వచ్చే రుత్వి. "ఓకే!"
హఠాత్తుగా ఆడిటోరియంలో నిశ్శబ్దం ఆవరించింది.
డయాస్ పై వున్న రెండు మైక్స్ ముందు విడివిడిగా నిలబడి వున్నారు క్విజ్ మాస్టర్ సుందరం, రుత్వి.
"మిస్టర్ జగన్నాధ్ ని, మన జాతీయ పతాకాన్ని ఎర్రకోట తొలిసారి ఎగురవేసింది ఎప్పుడు అని మీరు అడిగారు.
