నేను "మాకు తెలిసిన వాళ్ళబ్బాయి" అనేశాను. ఆ తర్వాత మా సుమతక్క భర్త" అని ఆయన్ని పరిచయం చేశాను.
ఇంతలో అనవసరంగా రంగప్రవేశం చేస్తూ ఇంకో గొట్టంగాడు "ఏరా కుమార్... ఫ్యామిలీతో సినిమాకొచ్చావా...?" అని పరామర్శించాడు.
కుమార్ జవాబిచ్చేలోగానే, అతడు సుమతక్కని చూసి "నమస్తే సుమతిగారు! మొత్తానికి మా కుమార్గాడు ప్రేమించిన పిల్లనే పెళ్ళి చేసుకున్నాడన్నమాట! నీకంత ధైర్యం ఎలా వచ్చిందిరా? సుమతిగారే నిన్ను మెడలువంచి పెళ్ళి చేసుకుని వుంటారు. ఔనా?" అని ఘళ్ళున నవ్వి, మా అందరివైపూ చూసి ఆగిపోయాడు.
నేనూ పెద్దక్కా వూపిరి బిగబట్టి, రక్తం పాలిపోయిన మొహాలతో చూస్తుండిపోయాం.
చిన్నక్క భయంతో కళ్ళు మూసేసుకుంది.
చినబావ మొహం కోపంతో జేవురించి వుంది.
కుమార్ ఇబ్బందిగా అటూఇటూ చూసి వాగుతున్న ఫ్రెండ్ చేతిమీద గట్టిగా గిల్లి, "వెళ్ళొస్తాను" అని, ఫ్రెండ్ తోబాటు వేగంగా అక్కడినుండి వెళ్ళిపోయాడు.
పెద్దబావ మొహంలో గొప్ప వెలుగొచ్చింది. సినిమాను మించిన ఎంటర్ టైన్ మెంట్ దొరికిన ఉత్సాహం కనిపించిపోతోంది.
జరిగిన విషయం జీర్ణం చేసుకోలేక కాసేపు ఎవరం మాట్లాడుకోలేదు. మొదటగా పెద్దబావే మాట్లాడుతూ "సో.... ఒకణ్ణి ప్రేమించి ఇంకోడిచేత తాళి కట్టించుకోవడం మీ వంశాచారం అన్నమాట. పూర్ బ్రదర్..... నువ్వూ నా జాబితాలోకి వచ్చావు. మా మరదలు నా భార్యకన్నా రెండాకులు ఎక్కువే చదివినట్లుగా కనిపిస్తోంది.... కథ ఎందాకా నడిచిందో?" అన్నాడు.
చిన్నబావ పిడికిళ్ళు బిగుసుకున్నాయి. చిన్నక్క తలవంచుకుని నిల్చుని వుంది.
చిన్నబావ దాని జడపట్టుకుని అందరూ చూస్తున్నారన్న ధ్యాసకూడా లేకుండా ఈడ్చుకెళ్ళి ఆటో ఎక్కించాడు.
మేమూ ఆ వెనకాలే బయల్దేరాం. పెద్దబావ దారిపొడుగునా పెద్దక్కనీ, చిన్నక్కనీ అసహ్యంగా మాట్లాడుతూనే వున్నాడు. నేను భరించలేక, "అభిమానం వుంటే వదిలెయ్యలేకపోయావూ? మళ్ళీ ఒక్కరోజు కూడా వదిలిపెట్టకుండా వెంట పడతావుగా!" అన్నాను.
"శక్తీ! బావగారితో అలాగేనే మాట్లాడటం..." అంది పెద్దక్క ఎంతైనా దానిపేరు అరుంధతి కదా!
నేను దానివైపు చీత్కారంగా చూసి ఆటో దిగి డబ్బులిచ్చాను.
అందరం లోపలికి వెళ్ళేసరికి అక్కడో పెద్దసీన్ జరుగుతోంది.
"నేను మొదటిరాత్రే చెప్పాను. ఫ్రాంక్ గా వుండేవాళ్ళంటే నాకిష్టం. అలా లేనివాళ్ళంటే నాకు అసహ్యం అని ఆరోజు చెప్పుంటే ఈ కుమార్ గాడి విషయం నేను క్షమించేసి వుండేవాణ్ని కానీ ఇది ఆ విషయం నా దగ్గర దాచి నన్ను మోసం చేసింది. ఎంత అడిగినా అబ్బే.....అలాంటిదేం లేదు' అని అబద్దాలాడింది. 'రంకు నేర్చింది బొంకు నేర్వదా' నా పిచ్చిగానీ.... ఇక మాటలనవసరం.... మీ అమ్మాయిని నేను తీసుకెళ్ళడం జరగనిపని.... విడాకు లిచ్చేస్తాను. ఆ కుమార్ గాడికో, ఇంకోడికో ఇచ్చి కట్టబెట్టండి వస్తా!" అని చిన్నబావ బ్యాగ్ అందుకున్నాడు.
చిన్నక్క ఏడుస్తూ "నన్ను అన్యాయం చెయ్యకండి....క్షమించండీ" అని కాళ్ళు పట్టుకుంది.
"బాబూ....నీ తండ్రిలాంటివాణ్ని నామాట విను....ప్లీజ్..." అంటూ నాన్నగారు ప్రాధేయపడ్డారు. ఆయన వినలేదు. విదిలించుకొని వెళ్ళి పోయాడు.
కోర్టులో కేసు వేశాడు.
చిన్నక్క విడాకులకి ఒప్పుకోలేదు. బోన్ లో నిలబడి తనకే పాపమూ తెలీదనీ, ఆ భర్తే కావాలనీ కోరింది.
విడాకులు మంజూరు కాలేదు.
గత్యంతరంలేక చిన్నక్కని తనవెంట తీసుకెళ్ళాడు. అప్పటినుంచీ మా గడప తొక్కనివ్వడు. దాని సంగతులు మా చెవుల్న పడనివ్వడు.
ఆడపిల్ల పుట్టిందని తెలిసి "బాగానే వుందన్నమాట!" అని నాన్న సంతోషపడ్డాడు.
ఈలోగా మా పెద్దక్కకి ఇంకో ఇద్దరు మగపిల్లలు పుట్టారు. అదెప్పుడూ తొమ్మిది నెలలు పుట్టింట్లో, మూడునెలలు అత్తింట్లో వుంటుంది.
మా నాన్న ఇప్పుడు మూడో కూతురికి.... అంటే.... నాకు సంబంధాలు చూస్తున్నాడు. ఈ ఇద్దరు బావగార్లనీ, వాళ్ళ స్వభావాల్నీ చూశాక నాకు మగవాడంటే భయంకన్నా అసహ్యం ఎక్కువైంది. పెళ్ళి అంటే మృత్యుదండనతో సమానం అనిపిస్తోంది. మగవాడు అంటే పెద్దకొరడా పట్టుకొని ఝుళిపిస్తూ వస్తున్న యముడిలా కనిపిస్తున్నాడు. దానికితోడు ఈ పెళ్ళికొడుకుల డాక్టరైతే పది లక్షలూ... ఇంజనీర్ అయితే పదిహేనూ.... ఆఫీసర్ అయితే తొమ్మిదీ..... క్లర్క్ అయితే.....మూడూ.... ఫ్యూన్ అయితే లక్షా అని రేట్లు నిర్ణయించేసుకుంటున్నారు.
"ఏదీ లేనివాడయితే....అసలు ఉద్యోగమే లేనివాడైతే కట్నం అవసరం లేదా?" ఆవేశంగా అడిగింది శక్తిమతి.
"తన పురుష లక్షణం నాకు తాకట్టు పెడితే... అదీ ఓ ఐదేళ్ళు చాలు! ఐదేళ్ళకోసం ఆ పురుషలక్షణం నాకు తాకట్టు పెట్టి ఇంటిపట్టునుండి ఓ ఇల్లాలు ఏమేం చేస్తుందో అవన్నీ చేస్తే..... ఒక్కగర్భం.... ప్రసవం తప్ప! నేను అతనికి భర్తపోస్ట్ ఇస్తాను. తిండీ, బత్తా, సెక్యూరిటీ అన్నీ ఇస్తాను. తను కట్నం తీసుకోనందుకు బాధపడక్కర్లేదు. అతనికి నెలనెలా జీతంలా జేబు ఖర్చుకూడా ఇస్తాను. అతను చెయ్యవలసినదల్లా....
"తన పురుషలక్షణం నీకోసం త్యాగం చెయ్యాలి అంతేనా?" అన్నాడు.
"ఔను!" అంది.
"మరి ఈ కాంట్రాక్ట్ కి ఒప్పుకునేవాడెవడైనా మీకు కనిపించాడా?" అడిగాడు.
"కనిపించాడు. అతను ఇతరులకోసం, తనకి ఏం సంబంధం లేనివాళ్ళ కోసం కూడా రిస్క్ తీసుకుని ఏమైనా చెయ్యగలడు. అంత మంచి మనసు" అంది.