ప్రతిగా నవ్వి వెంటనే తల తిప్పేసుకున్నాడు. ఇష్టమయినవాళ్ళు ఎదురుగా వుండీ మాట్లాడకపోవడం ఎంత బాధాకరం!
    
    ఆరోజు మొత్తం ఆమె అతనితో ఒక్కమాటైనా మాట్లాడటానికి ప్రయత్నిస్తూనే వుంది. కానీ అవకాశం దొరకలేదు.
    
    "ఆదివారం నువ్వు మా ఇంటికొస్తున్నావు. కాదనకూడదు. ఎందుకంటే నా పుట్టినరోజు" అంది లీల.
    
    ధృతికి నిజానికి నవీన్ తో కలిసి గడపాలని వుంది. కానీ లీల మాటలని కూడా తోసిపారేయాలనిపించలేదు.
    
    "ఒక్క గంటయితే ఓ.కె." అంది.
    
    లీల ఫక్కున నవ్వి "అంతసేపు కూడా మా ఇంట్లో వుండలేవు నువ్వు" అంది.
    
    "అదేం?"
    
    "చూస్తావుగా! తినబోతూ రుచులెందుకు అడగటం?"
    
    "కృష్ణమూర్తిని కూడా పిలిచావా?"
    
    "జిడ్డునా? ఎందుకు తల్లీ! ఆరోజు కూడా నేను సుఖంగా వుండటం నీకు ఇష్టంలేదా?"
    
    ధృతి నవ్వేసింది.
    
    జీవితం అడవిలా కాదు, పూదోటలా వుంచుకోవాలి. ప్రతి చిన్న విషయంలో కూడా ఒక పద్దతీ, పరిశుభ్రతా వుంటేనే ఒకవిధమైన సొగసూ, అందం మన కళ్ళకి కనపడతాయి. లేకుంటే అంతా వికారం.
    
    లీల ఇల్లు చూసేసరికి ధృతికి కళ్ళు తిరిగినంత పనైంది. ఇల్లు చాలా పెద్దదే! ఏడు, ఎనిమిది గదులున్నాయి. కాని ఒక్క గదిలో కూడా జానెడు జాగా కూర్చోడానికి అనువుగా లేదు.
    
    "ఇది ఇంత స్టయిలుగా తయారవుతుంది. ఇల్లు ఎందుకు శుభ్రం చేసుకోదు అనుకుంటున్నావు కదూ! అటు చూడు. వాడు మా తమ్ముడు. మైకేల్ జాక్సన్ శిష్యుడ్ని అంటూ ఇరవైనాలుగు గంటలూ ఆ రికార్డులు పెట్టుకుని ఎగుర్తూనే వుంటాడు. కాళ్ళకి, చేతులకీ ఏవి అడ్డమొస్తే అవి తన్ని పారేస్తాడు. ఆ పక్కగదిలో కూర్చుని మట్టీ మశానం పెట్టి ఏదో చేస్తొందే అది మా పెద్దచెల్లెలు. దీనికి టీవీలో ఏం చూపిస్తే అవి నేర్చేసుకుని చేసెయ్యాలానే తపన! వంటింట్లో ఇంకో చెల్లెలు వుంది. దానికి పాకశాకాల పిచ్చి. అపూర్వమైన ప్రయోగం ఏదో చేస్తూ వుండి వుంటుంది బహుశా! మా అమ్మకి సినిమాల పిచ్చి భాషాభేదం లేకుండా అన్ని సినిమాలూ చూస్తుంది. ప్రస్తుతం ఏదో మళయాళం సినిమా కెళ్ళిందిట. ఇంటికొచ్చీరాగానే వి.సి.పి. లో ఏదో కేసెట్ పెట్టుకుని బిజీగా అయిపోతుంది. పాపం ఇక చివరగా ఆ మూల గదిలో మా తాతగారు వున్నారు. చూపిస్తా పద. ఆయనకి పరిచయం చేస్తాననుకుంటే మాత్రం నీ ఆశ అడియాసే. ఆయన మన ప్రపంచంలో లేరు".
    
    ధృతి ఆయన్ని చూసింది. సీరియస్ గా గోళ్ళు కొరికేసుకుంటూ ఏవో చదివేస్తున్నారు.
    
    "ఆయన దగ్గరికెళ్ళి నమస్కారం అని చూడు ఏమవుతుందో."
    
    "ఏమవుతుంది?" భయంగానే అడిగింది ధృతి.
    
    "అమాంతం కీచుగా అరిచి, 'ఏదీ నా రివాల్వర్? యుగంధర్ నిన్ను వెన్నంటే వున్నాడు. నేను ఏజెంట్ 007 ని' అంటూ నీమీద పడి కరచినంత పనిచేస్తాడు."
    
    ఆమె హావభావాలు చూసి నవ్వాపుకోలేకపోయింది ధృతి.
    
    "నవ్వకు! ఆపైన మేడమీద కూర్చుని "పెనుచీకటాయెను లోకం" అని పాడ్తోందే అది మా అక్క దాన్ని, దాని ఇద్దరు పిల్లల్నీ వదిలిపెట్టి మా బావ అలిగి వెళ్ళిపోయాడు. మా తాతయ్యవల్లే."
    
    "ఏం జరిగింది?"
    
    "ఏముందీ! ఈయన ఇలా మునివేళ్ళమీద కూర్చుని 'యుగంధర్' ప్రమాదంలోంచి ఎలా బయటపడ్తాడా అని ఆతృతగా చదువుతుండగా మా బావ వచ్చి నవ్వుతూ 'బాగున్నారా? అని పలకరించాడట. నేను ఓపక్కచస్తుంటే నన్ను కుశలప్రశ్నలు వేస్తావా అని లాగి పెట్టి చెంపమీద అయిదు వేళ్ళు పడేట్లు కొట్టారు. ఇంకేముంది.....మా బావ కంచికీ, అక్క ఇంటికీ.
    
    "నిజంగా!" ఆశ్చర్యంగా అడిగింది ధృతి.
    
    "కావాలంటే పలకరించి చూడు."
    
    "వద్దులే" అంది భయంగా ధృతి.
    
    ఇంతలో మెట్లు దిగుతూ "చీకటిలో కారుచీకటిలో" అని పాట పాడుతూ వస్తోంది ఒకావిడ.
    
    "అక్కా! మా ఫ్రెండ్" అని లీల పరిచయం చెయ్యబోయింది.
    
    "పోతే పోనీ పోరా! ఈ పాపపు జగతిని...." అంటూ రాగంతీస్తూ సాగిపోయిందావిడ.
    
    ఇద్దరు పిల్లలు ఆవిడ కొంగుపట్టి లాగుతూ "అమ్మా.....ఆకలీ...." అంటూ రాగయుక్తంగా ఏడుస్తూ వెళుతున్నారు.    

    గదిలోంచి ఈలోగా ఒక వస్తువు వచ్చి వారి మధ్యలో పడి భళ్ళున పగిలింది.
        
    "ఫ్లవర్ వాజ్! ఇది మా తమ్ముడి విన్యాసం" అంది లీల.
    
    "కళా, రూపా....." అని గట్టిగా అరిచింది.
    
    మొహం అంతా రంగులు అంటుకునీ, చేతుల్నిండా బంకమట్టితో ఒకమ్మాయి వచ్చి విసుగ్గా "ఏంటే?" అంది.
    
    "ఈ అమ్మాయి మా ఫ్రెండ్ ఇది కళ అని నా చెల్లెలు" అంటూ వుండగానే..... ఆ అమ్మాయి చేతుల్ని ఒక దగ్గరికి తీసుకురాలేకా, అక్కడ వుండలేకా, నానా అవస్థలూపడి 'నమస్తే' అంటూనే పరుగులాంటి నడకతో వెళ్ళిపోయింది.
    
    వంటింట్లోంచి రూప కాబోలు వచ్చింది. మొహం అంత చెమట, జిడ్డు వేసుకున్న నైటీనిండా పసుపు, నూనె మరలూ! నానా జిడ్డుగా వుందాకారం.
    
    లీల మళ్ళీ పరిచయం చెయ్యబోయేలోగానే 'కెవ్వు' మని అరిచి, "మాడిపోయింది, మసైపోతోంది" అంటూ వంటింట్లోకి పరుగుతీసింది.
    
    "ఆ.....ఇప్పుడు చెప్పు! ఏం తీసుకుంటావ్? కాఫీనా, టీనా?" అని లీల అడుగుతుంటే-
    
    "లీలా! ఏమీ అనుకోకపోతే మనం ఇద్దరం వెంటనే బైటికెళ్ళి ఏదయినా తిందాం" అంది ధృతి.