"గోదారమ్మా, మళ్ళీ నీ ఒళ్ళో మునకేస్తానా? భూదేవమ్మా! నిన్ను అలికి ముగ్గులు పెట్టుకుంటానా? ఇదెక్కడ వనవాసమే సీతమ్మ తల్లీ" అనుకుంది నిస్త్రాణంగా.
    
                                                                * * *

    సుబ్బారాయుడు ఒళ్ళంతా చెమటలు పట్టాయి. కండువాతో తుడుచుకుని చుట్టూ చూశాడు. పేకమేడల్లా అపార్టుమెంట్లన్నీ ఒకేలా ఉన్నాయి. గేటుదాకా వెళ్తే చౌకీదార్ హిందీలో "కౌన్? క్యా హోనా?" అని భీకరంగా అరుస్తున్నాడు. అతడు తనని గుర్తుపట్టలేదంటే అవి తమ ఫ్లాట్లు కావన్నమాట! అప్పటికీ సైగలు చేసి చెప్పాడు 'మెట్లు ఎక్కక్కర్లేదు...... లిఫ్ట్... జు.... య్యి... మని పైకి వెళ్తుంది' అని. కానీ అతను పెద్దగా నవ్వి లిఫ్ట్ వైపు చూపించాడు. తను అప్పుడు గమనించాడు. అన్ని భవంతుల్లోనూ ఆ లిఫ్ట్ గది ఉంది. 'ఇప్పుడెలా? రామ్ బల్ ఫోన్ నంబరైనా తెచ్చానుగాదు.... అప్పటికీ పార్వతి అంటూనే ఉంది. మారుపడిపోతారండీ! అని అనుకున్నాడు.
    
    అటూ ఇటూ తిరుగుతుండగానే మధ్యాహ్నం అయిపోయింది. కడుపులో ఎలుకలు పరిగెత్తుతున్నాయి. అసలే పార్వతి ఈ రోజు కొబ్బరి పచ్చడీ, మజ్జిగ పులుసూ, నిమ్మకాయ పప్పూ చేసింది. పనీపాటా లేక తిండి మీదే ధ్యాస ఉంటోందీ మధ్యన. జేబులో డబ్బులున్నా ఏంకొనుక్కుతినాలో అర్ధం కావటంలేదు. చివరికి వీధుల్లో పిడతకింద పప్పు అమ్ముకునే వాడ్ని చూసినా బెరుకుగా, భయంగా ఉంటోంది భాష రాక. అతనికి ఇంతలో కళ్ళు మెరిశాయి. తమ కింద అంతస్తులో ఉండే ఒక అరవాయన గబగబా గేటు తెరుచుకుని ఎదురుగా ఉన్న ఫ్లాట్ లోకి వెళ్తున్నాడు. సుబ్బారాయుడు ఇంకేం ఆలోచించకుండా ఆయన వెంటపడ్డాడు. గేటు దగ్గర చౌకీదార్ మళ్ళీ ఆపాడు.
    
    సుబ్బారాయుడు లిఫ్ట్ ఎక్కుతున్న ఆయన్ని చూపించి ఆయన కావాలన్నాడు. అతను వదిలేసేసరికి ఆయన లిఫ్ట్ లోకి ఎక్కడం, అది పైకి వెళ్ళిపోవడం జరిగిపోయింది.
    
    సుబ్బారాయుడు అది కిందికి వచ్చేదాకా ఆగి అందులో పైకి వెళ్ళాడు. అది పైదాకా వెళ్ళి ఆగింది. బయటికొచ్చాడు. ఆయన ఏ ఫ్లాట్ లోకి వెళ్ళాడో ఎలా తెలుసుకోవడం? ఎవరో అరవం తెలిసినవాళ్ళ ఇంటికే వెళ్లుంటాడు అని ప్రతి తలుపుకి చెవి ఆనించి లోపల వినపడే మాటలు వినడానికి ప్రయత్నించాడు. అలా ఓ తలుపు దగ్గర నిలబడి చెవి ఆన్చగానే, టక్కున తలుపు తెరుచుకుంది. లోపల్నుండి ఒక లావాటావిడ తొంగి చూసింది. వయసు నలభైలోపే ఉండొచ్చు.
    
    సుబ్బారాయుడికి భయం వేసింది..... తనని దొంగను అనుకుంటుందేమోనని.... "నేను ... నేనూ.... సుబ్బారాయుడ్ని," అన్నాడు.
    
    ఆవిడ నవ్వింది.
    
    అంతసేపటికి ఓ మనిషికి తనగోడు అర్ధమైందని సుబ్బారాయుడు సంతోషంగా "మాది ఈ ఊరుకాదు.... ఈస్ట్ గోదావరి.... వరదరాజపురం! నేనూ, మాఆవిడ వచ్చి వారం అయింది. మాకూ..." ఏదో చెప్పబోతుండగా ఆవిడ అతని చెయ్యి పట్టుకుని లోపలికి లాగి తలుపేసేసింది.
    
    సుబ్బారాయుడు ఆ చర్యకి కొయ్యబారిపోయి నిలువు గుడ్లేసుకుని చూడసాగాడు.
    
    "సుబ్బారావునే బిజాయా! పైసా హై?" అని అతని గుండెలమీద చెయ్యేసి జేబు తడిమింది.
    
    అతని ఒళ్ళంతా కరెంటు పాకినట్లు నిలువెల్లా వణుకొచ్చింది.
    
    ఆమె అతన్ని అలాగే లోపలికి లాక్కెళ్ళి "క్యా పీయేగా?" అంటూ ఓ సీసా తీసింది.
    
    అదేమిటో అర్ధమై సుబ్బారాయుడికి భయం వేసింది.
    
    "అయ్యబాబోయ్! నాకు గంటచుట్టతప్ప ఏ అలవాటూలేదమ్మా....! చూడబోతే ఎవరో ఆఫీసరు పెళ్ళాంలా ఉన్నావు.... ఇదేం పనమ్మా... తప్పు కదూ!" అన్నాడు.
    
    ఆమె గలగలా నవ్వుతూ వచ్చి అతని పక్కన చతికిలబడి గ్లాసు ఎత్తి తాగుతూ, "బస్... ఏక్ గంటా బస్ హై?" అని అతని మీదకి ఒరిగింది.
    
    అప్పటికే ఆమె పైట స్థానభ్రంశం చెందింది.
    
    సుబ్బారాయుడు గుటకలు మింగాడు.
    
    "హౌ ... హేండ్ సమ్!" అంటూ ఆమె చటుక్కున అతని చెంపమీద ముద్దు పెట్టింది.
    
    "అయ్యో....! ఇదేం పని? ఎవరక్కడ.... రక్షించండి..... రక్షించండి!" అని అరిచాడు సుబ్బారాయుడు.
    
    ఆమె కొత్తగా, వింతగా చూసి, "క్యాఁచిల్లారే?" అంది.
    
    సుబ్బారాయుడు జేబులోంచి చిల్లరంతా తీసిపోసి, "ఇంతే చిల్లరుంది.....నన్ను వదులు, నే పోతా" అన్నాడు.
    
    ఆమె మొహం మాడ్చుకుని తలుపుతీసి అతని రెక్కపట్టిలాగి బయటికి గెంటుతూ, "నాలాయక్.... కమీనే....! జావ్!" అంది.
    
    సుబ్బారాయుడు తెల్లబోయి చూస్తూండగానే తలుపులు ధడేల్న వేసుకుంది.
    
    "కులమెరిగి చుట్టం, స్థలమెరిగి వాసం అన్నారు మధుకే కాబోలు!" అంటూ సుబ్బారాయుడు కాళ్ళీడ్చుకుంటూ వస్తూంటే....
    
    "హమ్మయ్య....! ఇక్కడున్నారా మీరు?" అన్న రామ్ బల్ కంఠం వినపడింది.
    
    సుబ్బారాయుడికి రామ్ బల్ని చూడగానే గొంతు తడారిపోయిన వాడికి నీటిధారను చూసినప్పుడు కలిగిన సంతోషంలాంటిది కలిగింది. గబాల్న వెళ్ళి కౌగలించుకున్నాడు.
    
    "ఆ పార్వతమ్మ మీరు తప్పిపోయారని ఏడుస్తూ కూర్చుంది. త్వరగా పదండి.....భాషరానప్పుడు ఎందుకిలాంటి సాహసాలు?" అంటూ మందలించాడు రామ్ బల్.
    
    కర్ర లేనివాడ్ని గొర్రైనా కరుస్తుంది అన్నట్లు నాకు భాష రాక పోయేసరికి ఆ ఇల్లాలు... మీదపడి.... ఛీ! చెప్పాలంటే సిగ్గేస్తోంది. అన్నాడు తలవాల్చుకుని సుబ్బారాయుడు.
    
    ఆయన చూపించిన వైపుకి చూసిన రామ్ బల్ "అవతల కాశీ అన్నపూర్ణమ్మ లాంటి భార్యని పెట్టుకుని.... పొద్దుటే ఇందాకా నేను కూడా లేకుండా ఇటొచ్చారూ? ఛ... ఛ... ఛ...!" అని చిరాకు పడ్డాడు.
    
    "కుమ్మరికి కుండ కరువు... సాలెకి బట్ట కరువు అన్నట్టుగా అయిపోయిందయ్యా చివరికి నా పరువు! నా శీలాన్ని అన్యాయంగా శంకిస్తున్నావు!" అన్నాడు బాధగా సుబ్బారాయుడు.
    
    "నూట పదహారో నంబర్ అపార్ట్ మెంట్ విషయం మరి చెల్లమ్మకి చెప్పకుండా ఉండాలంటే..." అని చేతులు నలుపుకుంటూ నసిగాడు రామ్ బల్.
    
    సుబ్బారాయుడు కోపంగా "తెలీక వెళ్ళానయ్యా మగడా అంటే వినవేం?" అన్నాడు. అతనికి కడుపులో ఆకలి మండిపోతోంది.