ఒకే రక్తం - ఒకేమనుషులు
    

                                                                  ---కొమ్మూరి వేణుగోపాలరావు
    
    
                             

   ఆ యింట్లో పెద్దా చిన్నా అంతా కలిపి నలభైమందిదాకా వుంటారు.
    
    ఇంటి యజమాని పుండరీకాక్షయ్యగారికి ఎనమండుగురు సంతానం. అయిదుగురు కొడుకులూ, ముగ్గురు కూతుళ్ళూను ఆఖరి కూతురు గిరిజకు తప్ప అందరకూ పెళ్ళిళ్ళయినాయి. అయిదో కొడుకు మన్మధరావుకు నిరుడే పెళ్ళయింది. ఆ యింట్లో పెళ్ళి జరిగిందంటే ఎలా వుంటుందంటే అటువైపు వాళ్ళు, యిటువైపువాళ్ళూ కలిసి అయిదారొందలమంది బిలబిలమంటూ వచ్చి పడతారు. ఎటునుంచి చూసినా ఒకవైపువారే!
    
    పొరపాటు... ఆ కుటుంబంలో అటువైపువారూ యిటువైపువారూ అంటూ రెండుతెగలు లేరు. ఎటునుంచి చూసినా ఒకవైపువారే!
    
    పుండరీకాక్షయ్యగారికి ఆయన భార్య అనసూయమ్మగారు స్వయానా అప్పకూతురు. వాళ్ళకి కూడా ఈ రక్తసంబంధం ఒకనాటిది కాదు. పుండరీకాక్షయ్యగారి తల్లిదండ్రులుకూడా ఒకరికొకరు బావామరదళ్ళే. చుట్టరికాలు తిరగేస్తే అనసూయమ్మగారు పుండరీకాక్షయ్యగారికి కేవలం అక్క కూతురవడమేగాక ఆమె తండ్రివైపునుంచి తల్లిదండ్రుల తల్లిదండ్రులుకూడా ఒకరికొకరు మేనరికమే వాళ్ళ తల్లిదండ్రులు మళ్ళీ బావామరదళ్ళు ఇలా తరుచుకుంటూపోతే అటు ఏడుతరాలనుంచీ ఆ యింటికి వచ్చినవాళ్ళుగానీ, అక్కడనుంచి మరోయింటికి ఇవ్వబడినవాళ్ళుగానీ ఒకరికొకరు రక్త సంబంధీకులూ, ఆత్మీయులేగాని పరాయివాళ్ళు మచ్చుకైనా లేరు. పరాయివాళ్ళ సంబంధాన్ని కలవటానికి ససేమిరా వీల్లేదు, వీల్లేదు. పరాయి సంబంధం మాటెత్తితే ఆ యింటిపెద్దలు మండిపడతారు. ఆ యింట్లో పెళ్ళి జరిగిందంటే వచ్చిన వాళ్ళంతా ఒకరికొకరు బంధువులు, ఆప్తులే వరసలతో పిలుచుకుని బిలబిల తిరగేస్తూ వుంటారు. ఏరాబాబూ, ఏరోయ్ మావా, ఒరేయ్ అల్లుడూ ఏంబాబాయ్, ఏవమ్మా పిన్నీ అమ్మమ్మా, బామ్మోయ్, యిదిగో చెల్లెమ్మా, అక్కయ్యా... మరేఁ ఇలాంటి సరసాలతోనే వాతావరణమంతా ధ్వనించి పోతూ వుంటుంది. సాధారణంగా వయసుకిచ్చిన గౌరవాన్ని మినహాయిస్తే ఒకరికొకరు 'ఏమండీ' అని పిలుచుకునే సందర్భం వుండదు. మగపిల్లల్ని ఎరా, ఆడపిల్లల్ని 'వసే, ఏమే...' యివే సంబోధనలు. పెళ్ళయి పిల్లలు పుట్టిన ఆడవాళ్ళను కూడా బావలు, మేనమామలు 'వసేయ్' అనో 'ఏమే' అనో వాళ్ళ వాళ్ళ భర్త ఎదుటే పిలుస్తుంటారు. ఆ భర్తలుకూడా ఏమీ అనుకున్నట్లు కనిపించదు. వాళ్ళూ మిగతా ఆడవాళ్ళని అలానే పిలుస్తూ వుంటారు. ఆ యింటివాళ్ళుగాని, వాళ్ళ చుట్టుపక్కాలుగాని అంతోయింతో కలిగినవాళ్ళే. స్వయంకృషితో ఎప్పటికప్పుడు ఆస్తిపాస్తులు అభివృద్ధి చేసుకుంటున్నవాళ్ళే. వాళ్ళకి బంధుత్వాలూ, ఆపెక్షలూ మెండు డబ్బుమీద భక్తీ, గౌరవం ఎక్కువే. వాళ్ళ ఆస్తిపాస్తులూ, భూమీ పుట్రలూ ఆ వలయాన్ని ఛేదించుకుని బయటకు వచ్చి మిగతా ప్రపంచంతో కలవటం వాళ్ళకిష్టంలేదు ఆ పని వాళ్ళు జరగానివ్వరు. వాళ్ళకోసం సిద్దంగా వున్నట్లు మేనరికాలూ, ఎదురు మేనరికాలూ, బావా మరదళ్ళ వరసలూ ఎప్పటికప్పుడు తీర్చిదిద్ది వుంటాయి.
    
    ఆ యిల్లు పెద్దదే. పెద్దమేడ. ఇంటిచుట్టూ బోలెడు ఖాళీస్థలంకూడా వుంది. మేడపైనా క్రిందాకూడా గదులు చాలానే వున్నాయిగాని గదుల్ని మించిన మనుషులున్నారు. అందరూ దగ్గరవాళ్ళే కాబట్టి వచ్చిపోయే చుట్టపక్కాలకి కూడా కొదవలేదు గదుల్లో పడుకునేవారు, వసారాల్లో పడుకునేవారు, డాబామీద పడుకునేవారు, చాపలమీద దొర్లేవాళ్ళు, ఎప్పుడు చూసినా మనుషులు కనిపిస్తూనే వుంటారు. ఒక్కోసారి సంసారాలతో వచ్చిన చుట్టపక్కాలు నెలలతరబడి వసారాల్లోనే పడుకుని, రైల్వేఫ్లాట్ ఫారాల్లో, సత్రాల్లో కాపురాలు కానిచ్చేసినట్లు గడిపెయ్యటం జరుగుతూ వుంటుంది.
    
    పనిమీద ఆ యింటికి వచ్చిన కొత్తవారికి అక్కడ ఎవరికెవరు ఏమవుతారో, అక్కడ అసలువాళ్ళెవరో, చుట్టాలెవరో పోల్చుకోవటం కష్టమై తికమకపడి పోతూంటారు. మామూలుగా చూస్తే అంతా సరదాగా, చలాకీగా తిరుగుతూన్నట్లే కనిపిస్తారు. కాని నిశితంగా, పరిశీలనాత్మకంగా చూస్తే అంత స్వాభావికంలో కూడా ఒకరకం కృత్రిమత్వం, యంత్రాగారంలో యంత్రాలు పనిచేసే వాతావరణం, అర్ధంలేని సామెతలు, విసుర్లు విసురుకోవటం, బలవంతంగా నవ్వటం, దేన్నో వెదుక్కునే ఆరాటం, వంటరితనాన్ని పొందుదామన్న ఆశ, విడదియ్యటానికి వీల్లేని అసంతృప్తి ఆ మనుషుల్లో కలిసిపోయి, పేరుకుపోయి, అస్పష్టంగా అసలు వాళ్ళకే తెలియకుండా ఎక్కడో వుండిపోవటం మేధావులెవరికైనా స్ఫురించవచ్చు.
    
    ఒకరోజు ఉదయం తొమ్మిదిన్నరవేళ కాలేజీకి వెడదామని గబగబ రెండు ముద్దలు అన్నం తినేసి పుస్తకాలు పట్టుకొని ముందుగదిలోకి వచ్చింది గిరిజ. గిరిజ ఫస్టియర్ బి.ఏ. చదువుతోంది. చీరె కట్టుకుంటే ఆమె వయస్సు పద్దెనిమిదేళ్ళకు సమంగా కనిపిస్తుందిగాని పరికిణి వోణి వేసుకుని రెండుజడలు వేసుకుంటే పదహారేళ్ళ చిన్నపిల్లలా కన్పిస్తుంది. ఎప్పుడో పెద్దవాళ్ళపోరు పడలేనప్పుడు తప్ప ఆమె ఎప్పుడూ పరికిణి వోణీలోనే వుంటుంది.
    
    ముందుగదిలోకి వచ్చిన గిరిజ చెప్పుల జతకోసం వెతుక్కుంటోంది. కాటుకతో వెలుగుతున్న ఆమెకళ్ళు గది నలుమూలలా గబగబ తిరుగుతున్నాయి. చెప్పు ఒకటయితే కిటికీ చువ్వలమధ్య ఇరుక్కుని కనిపించింది గాని, ఎంత గాలించినా రెండోదాని ఆచూకీ మాత్రం తెలియలేదు.
    
    గిరిజకు కోపం వచ్చింది. ఏడుపుకూడా వచ్చింది. రోజూ యింతే. తాను ఎంత శ్రద్దగా జాగ్రత్త చేసుకున్నా ఒకరోజు పుస్తకాలు కనిపించవు. ఒకరోజు చెప్పులు, ఒకరోజు పెన్ను... ఓ అరగంట వాటిని సాధించటం కోసం హైరాన పడాల్సిందే.
    
    "విస్సూ! వొరేయ్ విస్సూ!" అని పిలిచింది ఉక్రోషంగా.
    
    ఆమె కనీసం పదిసార్లన్నా పిలిచాకగాని లోపల్నుంచి ఆ విస్సు అని పిలవబడ్డ అబ్బాయి ఊడిపడలేదు. వాడు గిరిజ పెద్దన్నగారి మూడోకొడుకు. పదేళ్ళుంటాయి. పూర్తిపేరు విశ్వేశ్వరరావు. ఇంట్లో అందరూ విస్సూ అనో, ఒరేయ్ విస్సిగా అనో పిలుస్తూ వుంటారు.
    
    "ఆఁ! ఏమిటి గిరిజత్తయ్యా?" అంటూ విశ్వం పరిగెత్తుకు వచ్చాడు చివరకు నడుముక్రిందకు జారిపోతూ వున్న గుండీలు లేని వొదులు నిక్కరూ, భుజాలు జారిపోయి వున్న చొక్కా చిందరవందరగా వున్న క్రాఫింగూ, స్థిరంలేనట్లు ఎక్కడికో కదిలే కళ్ళూ... నిర్లక్ష్యంగానే కాకుండా కొంచెం వెర్రి వాలకంగా వుంటాడు.