ఈ రెండు వర్గాలూ మానవుడిని అతనెంత ఎత్తుకి ఎదిగినా కూడా ఏదో ఒక రకంగా శాసిస్తూనే వున్నాయి. దానికి ఉదాహరణే మీరు.
    
    మీలో ఎంతో తెలివీ, వాక్పటిమా వున్నాయి. కానీ ఏం లాభం? యోగం, ధ్యానం, దేవుడు, దయ్యమూ వంటి పదాలు మీరూ వాడుతున్నారు. అదీ మనదేశం చేసుకున్న దౌర్భాగ్యం" విసుగ్గా అన్నాడు చీఫ్.
    
    అతని మాటలతో ఏకీభవిస్తున్నట్లు చిన్నగా తలూపాడు డాక్టర్.
    
    తిరుపతి చిన్నగా నవ్వి అన్నాడు-
    
    "చాలా బాగా చెప్పారు చీఫ్! ఒకరకంగా మీ వాదనలో కూడా బలం వుంది. నాదొక చిన్న డౌట్"
    
    "ఏమిటది?" చీఫ్ కంఠంలో తిరుపతి తన వాక్ర్పవాహాన్ని మెచ్చుకోవడంతో గర్వం తొణికిసలాడింది.
    
    "ఏం లేదు.... మహదేవ్ ని మొదటిసారి స్కానింగ్ చేసినప్పుడు కనిపించిన 'సర్వైకల్ రిబ్' తరువాత ఎందుకు కనిపించలేదు?"
    
    "అది... అది... లక్ష కేసుల్లో ఒక కేసు అలా జరగడానికి అవకాశం వుందని ఇంగ్లీషు వైద్యశాస్త్రం ఘోషిస్తోంది" తడబడి సరిదిద్దుకుని బదులిచ్చాడతను.
    
    "దానికి కారణమేమిటి?"
    
    "ఏముంది? సింపుల్.... మనిషి ఎముకలు కాల్షియం, భాస్వరం, కార్బనేట్ అనే పదార్ధాలలో తయారవుతాయి. యిక స్కానింగ్ తీసేటప్పుడు X-రే, గామా అల్ట్రావైలెట్ కిరణాలు మనిషి శరీరంలోంచి ఎముకలపై పడి ఆ ఏముకని కరిగించేశి వుంటాయి.
    
    దీనిక్కారణం చిన్నపిల్లల ఎముకలా అది వుద్భవించటం యింకా మొదటి దశలోనే వుంది కాబట్టి.
    
    "మంచిది! మరి డాక్టర్ 'సర్వైకల్ రిబ్'కీ ఆపరేషన్ మినహా మరో మార్గం లేదని అన్నారు. మీరు చెప్పినట్లు X-రే, గామా, ఆల్ట్రా వైలెట్ కిరణాలతో మనిషి శరీరంలో పెరిగే ఎగ్ స్ట్రా ఎముకల్ని కరిగించే వీలున్నప్పుడు ఆపరేషనే చెయ్యాలని ఎందుకన్నారు?" నిలదీస్తున్నట్టు అడిగాడు తిరుపతి.
    
    ఆ ప్రశ్నతో పచ్చివెలక్కాయ గొంతులో పడ్డట్టు ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరై పోయాడు చీఫ్!

    "మీరు సమాధానం చెప్పలేరని నాకు తెలుసు. ఇప్పుడు నేను చెప్పే విషయాలు శ్రద్దగా వినండి. మీ అనుమానాలు, కుళ్ళంకలూ అన్నీ తీరిపోతాయి.
    
    మనిషి శరీరంలో వుండి బయటకు కనిపించని షట్ చక్రాలను మీరంటున్న సైన్స్ ద్వారానే కంప్యూటర్ తెరమీద చూపించే విధానాన్ని కనుక్కున్నా గొప్ప వ్యక్తి మోతోయామా.
    
    తత్ఫలితంగా ఏ మనిషికైనా శారీరక, మానసిక పరీక్షలు చేసి ఆ ఎలక్ట్రానిక్ పరికరాల సహాయంతో శరీరంలో ఏ యోగచక్రం ఎంత వరకూ అభివృద్ధి చెందిందో శరీరంలో ఏ భాగం లోపభూయిష్టంగా వుందో, ఎక్కడ రోగలక్షణాలు చోటు చేసుకుంటున్నాయో అన్న సత్యాల్ని ప్రత్యక్షంగా చూపగల సైన్సు పరికరాలు జపాన్ లో వున్న మోతోయామా పరిశోధనా కేంద్రంలో రూపుదిద్దుకున్నాయి.
    
    డా|| మోతోయామా యోగిమాత్రమే కాదు. ఒక గొప్ప సైన్సు పరిశోధకుడు! తూర్పుదేశాలలోని ఆయుర్వేదం, ఆక్యుపంచర్, యునానీ వైద్య ప్రక్రియల్లో దిట్ట! మనిషిలోని దివ్యశక్తులపై పరిశోధన చేసిన (RHINE) మహశయుడి శిష్యుడు, గొప్ప ఎలక్ట్రికల్ ఇంజనీరు, కంప్యూటర్ సైంటిస్టు.
    
    అంతేకాదు! మోతోయామా భవిష్యత్తుని స్వయంగా చూడగలిగే పుణ్యపురుషుడు.
    
    మోతోయామా జీవితం ఆసాంతం తెలుసుకుంటే భగవంతుడి ఉనికి అర్ధమవుతుంది.
    
    అతను 1925లో జపాన్ లోని షొడోషీమా అనే ద్వీపంలో జన్మించాడు. ఇతని తఃల్లి శైకోమోషీమా! గొప్ప భక్తురాలు. ఆమె పసివాడయిన మోతో యామాకు అయిదేళ్ళ వయసులోనే ఆధ్యాత్మిక సాధన ఎలా చేయాలో వివరించి నియమబద్దమైన శిక్షణనిచ్చింది.
    
    హిమప్రవాహాలతో, రక్తాన్ని గడ్డకట్టించే చలిలో తెల్లవారుజామునే మేల్కొని నిశ్చలమైన దీక్షతో సాధన గావించేవాడతను.
    
    పసివాడవటంతో నిర్మలమయిన అతని మనసు చాలా సులభంగా భగవంతుడ్ని ఆకర్షించి త్వరలోనే అతనిలో అనేక దివ్యశక్తులు మేల్కొన్నాయ్.
    
    దివ్యదృష్టినిచ్చే 'జ్ఞాననేత్రం' దానంతట అదే తెరుచుకుంది. శరీరంలోని యోగ చక్రాలూ, నాడులూ జాగృతం అయి- మనుష్యుల భవిష్యతతులు తెలిపే దర్శనాలు, దివ్యానుభూతులు కలగటం మొదలయింది.
    
    అంతేకాదు చదువులో కూడా అన్నింటా ముందుంటూ 1952లో పి.హెచ్.డి. డిగ్రీనీ, మానసిక శాస్త్రంలో కూడా డిగ్రీని పొందాడతను.
    
    ఇప్పటి సైన్సుతో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని జోడించి అతను ఒక నూతన విజ్ఞానాన్ని (Wisdom Science) కనిపెట్టాడు. విశ్వవిద్యాలయం స్థాయిలో సైన్స్ పరిశోధనా కేంద్రాన్ని స్థాపించాడు.
    
    మనుష్యుల మనస్సులలో కలిగే తలంపులకూ వారికి కలిగే కష్ట సుఖాలకూ ఏదో వర్ణించరాని జోడి వున్నదని అతను గమనించాడు. దాని ఫలితంగా మనిషి మెదడులోని ఆలోచనా తరంగాల్ని కొలవగల విద్యుత్ అయస్కాంత ప్రాణవాహిక మార్పులను (Magnetic physiological Changes)కొలిచే పరికరాలను కనిపెట్టాడు.
    
    ఆధ్యాత్మికతనూ, సైన్సునూ, ఎలక్ట్రానిక్సునూ మేళవించి అతడు సృష్టించిన నూతన 'భగవత్ శాస్త్రం' (Science Of God) పై ఆయన వెలువరించిన దాదాపు అరవైకి పైగా సైన్సు పరిశోధన- వ్యాసాలు ప్రపంచ సైంటిస్టులు సైతం దిగ్ర్భాంతి పొందేలా అద్భుతంగా వున్నాయి.
    
    ఇందులో చాలా మట్టుకు మనిషికి కలిగే చెడు కర్మ, తప్పుడు ఆలోచనలవల్ల శరీరంలో ఏర్పడే మార్పులు- దానివలన జీవితం పెడదారి పట్టిపోయి కష్టాలకూ, దురదృష్టానికి కూడా ఎలా దారి తీస్తుందో స్పష్టంగా కనుగొన్నాడు. మోతోయామా.
    
    ఒకరోజు స్కూల్ లో చదువుతున్న తన పదేళ్ళ కొడుకుతో మోతో యామాని కలవటానికి వచ్చిందో స్త్రీ! ఆ పిల్లవానికి ఏదో తెలియని భయంతో స్కూల్ లో మనస్సు- పరిపరివిధాల కంగారుకు లోనై, అతనికి సమస్యలనూ, బాధలనూ సృష్టించడంతో ఆమె ఎందరో డాక్టర్ల చుట్టూ తిప్పిందట అయినా మార్పు రాలేదు. దాంతో ఆమె మోతోయామాని కలిసింది. తన కొడుకు బాధలు వివరించింది.