దూరంగా...

 

    పార్కింగ్ ప్లేన్ లోని మారుతీలో కూర్చున్న ఓ వ్యక్తి చేతిలోని ఫోటోని టాక్సీలో 'షా'నీ పరికించి చూసి నెమ్మదిగా తల పంకించాడు.

 

    ఇప్పుడు కారు ముందెళుతున్న టాక్సీని అనుసరిస్తూంది.


                                   *  *  *


    అసురసంధ్యవేళ...

 

    నిశ్శబ్దంగా ప్రవహిస్తున్న గోదావరినదిలో తాళిని అర్ఘ్యంలా విడుస్తుంటే శ్రీహర్షకి లూసీ గుర్తుకొచ్చింది.

 

    పడమటి దిక్కున అరుణరాగం రక్తసిక్తమయిన లూసీ చివరి రూపాన్ని జ్ఞప్తికి తెస్తుంటే ఎక్కువసేపు అక్కడ నిలబడలేనట్టు ఒడ్డుకు నడిచాడు.

 

    ఎక్కడో పుట్టిన తనకు మరెక్కడో తారసపడింది లూసీ. బ్రతుకు మునిమాపువేళ గుండెగగనంపై నక్షత్రంగా మెరిసి చిత్రమైన చివరి కోరికతో వేగుచుక్కలా తన ఒడిలోనే రాలిపోయింది. కోరి తనను ఇక్కడిదాకా తరలించింది.

 

    అయిపోయింది.

 

    ఒక అధ్యాయం ఆఖరిపుట చిరిగిపోయింది.

 

    మరికొన్ని గంటల్లో విశాఖపట్నం చేరుకుంటాడు.

 

    ఆ తర్వాత స్పెయిన్... పుజో... జూలీకోసం పోరాటం... బహుశా ఈ దేశంతో బాల్యంలో తప్ప ఏ బంధమూలేని ఇక్కడి గాలితో నేలతో అనుబంధం తెగిపోయింది.

 

    రాజమండ్రి స్టేషన్ కి వచ్చాడు. ఆఖరినిముషం అక్కడ ఓ బెంచీపై నడుంవాల్చాడు. అపరాత్రి దాటింది.

 

    వైజాగ్ వెళ్ళాల్సిన ట్రైన్ రాగానే జేబులో టికెట్ చెక్ చేసుకుని ఫస్ట్ క్లాస్ సీట్ లో కూర్చున్నాడు.

 

    అందులో వున్నది ఒకేఒక్క వ్యక్తి. వయసు ముప్పయి వుంటుందేమో. చుట్టూ 'టాయ్స్' వుంచుకుని కిటికీలోంచి బయటికి చూస్తున్నాడు.

 

    బండి కదిలేక "లైటార్పేయనా" అడిగాడతను.

 

    ఆర్పాల్సిన టైంలో ఆ ప్రశ్న వేయడం ఆర్పాలని లేదన్న అతడి ఆలోచనలకి అద్దంపడుతుంటే 'ఇట్స్ ఓకె' అన్నాడు శ్రీహర్ష తనూ బెర్త్ పై కూర్చుని.

 

    బయటనుంచి రివ్వున గాలి వీస్తుంది.

 

    చీకట్లోకి చూస్తున్న ఆవ్యక్తి మరోమారు టాయ్స్ పేకెట్స్ ని సర్ది ఓ మూలనుంచాడు. చాలా అపురూపంగా అతను వాటిని పరికించడం చిత్రమనిపించింది.

 

    శ్రీహర్షకూడా వాటిని గమనిస్తుంటే నెమ్మదిగా అన్నాడతను "మా పాపకోసం."

 

    కొందరు చాలా కాజువల్ గా పరిచయాల్ని పెంచేసుకుంటుంటారు.

 

    "పాపకి ఆరేళ్ళే. కాని ఓ అరవయ్ డెబ్బయ్ టాయ్స్ వున్నాయి."

 

    హఠాత్తుగా శ్రీహర్షకి జూలీ గుర్తుకొచ్చింది.

 

    "నేను హైద్రాబాద్ వెళ్ళిన ప్రతీసారీ అడుగుతుంది. ఏడాదిగా వెంటాడుతుంటే యిదిగో ఇప్పటికి సాధ్యమయింది."

 

    జూలీ వెంటాడలేదు. కాని వెళ్ళిన ప్రతీసారి తను తీసుకువెళ్ళే వాడు.

 

    "ఒక్కోమారు అనిపిస్తుంది... ఉద్యోగ బాధ్యతలతో ఫామిలీని మిస్సవుతున్నానా అని" క్షణం ఆగి బాస్కెట్ లోని ఆపిల్స్ అందించాడు "ఇఫ్ యూ డోంట్ మైండ్..."

 

    రాత్రినుంచి ఏమీ తినలేదని అప్పటికి గుర్తొచ్చిన శ్రీహర్ష అందుకున్నాడు. నిద్రపోవాలి అనిపించడంలేదో తను అతడిని నిద్రపోనివ్వడంలేదో ముందు బోధపడలేదు.

 

    "ఇన్ ఫాక్ట్... మా అమ్మాయి పోలీసులంటే దొంగలకంటే ఎక్కువ భయపడుతుంది."

 

    ఉన్నట్టుండి ఈ టాపిక్కేమిటో అర్థంగాక "బహుశా ఈ దేశంలో పసిపిల్లలు సైతం పోలీస్ డిపార్ట్ మెంటుని అసహ్యించుకుంటారనుకుంటాను" అన్నాడు షా మృదువుగా నవ్వుతూ.

 

    "మీరు ఈ దేశం మనిషి కాదా?" దృష్టి మరల్చుకుంటూ అన్నాడు శ్రీహర్ష.

 

    "నేననేది అదికాదు. నేరస్తుల్ని మించిన నికృష్టులుండేది ఈ దేశపు పోలీసు విభాగంలోనే అని ఎక్కడో చదివాను."

 

    "అఫ్ కోర్స్! కాదనను. దాన్ని సమర్థించను కూడా. ఎందుకంటే పోలీసు వ్యవస్థని కంట్రోల్ చేసేది మరో పెద్ద దోపిడీ వ్యవస్థకి చెందిన పొలిటీషియన్స్ కాబట్టి. బై ది బై! మీరు రాజకీయనాయకులు కాదుగా" నవ్వుతూ అడిగాడు.

 

    "కాదు. మరి మీరు?"

 

    "నేను పోలీస్ ఆఫీసర్ని."

 

    క్షణంపాటు గొంతు కడ్డంపడినట్టయింది.

 

    "ఐసీ!"

 

    "ఇంకా చెప్పాలి అంటే ఐయ్యెయస్ అవకాశం వున్నా ఏదో ఉద్ధరించాలని కోరి ఐపియస్ తీసుకున్న వాడ్ని. అఫ్ కోర్స్! నేను నాన్సెన్సికల్ గా ఆలోచించాలని ఉద్యోగంలో చేరిన ఆరునెలల్లోనే బోధపడిపోయిందనుకోండి. మిమ్మల్ని బోరు కొట్టిస్తున్నానా?"

 

    "ఇట్సాల్ రైట్!"

 

    "ఎనీవే నైస్ టు సీయూ! నా పేరు శమంత్... వైజాగ్ లో ఏయస్పీని" కరచాలనం చేశాడు "మరి మీరు?"

 

    "సుబ్బా... రావ్... వైజాగ్ లో బిజినెస్..."

 

    అప్పటికి తోచిన అబద్ధం చెప్పిన శ్రీహర్ష యిక చర్చని ఆపి పడుకోవాలనుకుంటుండగా టి.టి.యి వచ్చాడు.

 

    శ్రీహర్ష ఊహించలేదు అలాంటి సమస్య ఒకటి ఎదుర్కోవాల్సి వస్తుందని.

 

    శమంత్ టిక్కెట్ చెక్ చేసిన టి.టి.యి వున్నట్టుండి శ్రీహర్ష పేరు అడిగాడు.

 

    ఇబ్బందిగా చూసాడు శ్రీహర్ష.

 

    "మరేంలేదు సర్! మీ పేరేదో కాస్త ముచ్చటగా కనబడితేనూ... మీ నోటితోనే వినాలని..."

 

    "నాన్సెన్స్! చార్టులో వుంటుందిగా" సీరియస్ గా అన్నాడు శ్రీహర్ష.

 

    "అదికాద్సార్! షా అనే పేరు తెలుగులో తెలుగువాళ్ళు పెట్టుకోరుగా అందుకని..." టి.టి.యి మాటల్ని అర్థోక్తిగా ఖండించాడు శమంత్.

 

    "ఆయన పేరు సుబ్బారావ్."

 

    "లేదులెండి. నేను చెస్ ఎక్కువగా ఆడుతుంటాను. చాలా తక్కువమూవ్స్ లో షా చెబుతుంటానని నా పేరు సుబ్బారావయినా..." కర్చీఫ్ తో మొహం తుడుచుకుంటూ అన్నాడు శ్రీహర్ష. "ఫ్రండ్సంతా 'షా' అని పిలుస్తుంటారు. నా స్నేహితుడు అదే పేరుతో రిజర్వ్ చేసాడనుకుంటాను."

 

    ఆ క్షణంలో తనకు అభిముఖంగా కూర్చున్న ఓ పోలీసాఫీసరు ఏం ఆలోచిస్తున్నాడో అతడు పట్టించుకోలేదు. నిద్ర కుపక్రమిస్తూ బెర్తుపై వెల్లకిలా పడుకున్నాడు.

 

    "తప్పయిపోయింది సర్" ఇంచుమించు లెంపలేసుకుంటూ టి.టి.యి రూంలోంచి బయటికి వెళ్ళిపోయాడు.