ఆయన "దిగు" అని తను దిగి గబగబా నడవసాగారు. వెనకగా డ్రైవర్ పువ్వుల బుట్టా, పెద్ద ప్యాకెట్టూ తీఉస్కుని నడవసాగాడు.
    
    ఎక్కడ చూసినా తల వంచుకుని తను పని ఏదో తాము చూసుకుంటున్న వృద్దులు కనిపించారు. కొందరు అతిశ్రద్దగా గడ్డి, కలుపు మొక్కలూ పీకిపారేస్తున్నారు. ఇంకొందరు 'క్లీనింగ్ మెషిన్' తో వరండా అంతా శుభ్రం చేస్తున్నారు. ఇంకొందరు ఏవో కుడుతూ, వైర్లు అల్లుతూ చాల బిజీగా కనిపించారు. అంతమంది వృద్దుల్ని ఒకేచోట చూడటం ఆమెకి చాలా వింతగా అనిపించింది. తలతిప్పి ధర్మానందరావుగారి వైపు చూసింది.
    
    ఆయన నవ్వుతూ "చూశావా! యవ్వనమంతా ఒకేచోట పోగుపడ్డట్లుగా వుందికదూ?" అన్నారు.
    
    ధృతి కళ్ళు విప్పార్చి ఆయనకేసి చూస్తూ వుండగా-
    
    "అవును! యవ్వనమంటే యిదే! యవ్వనమంటే ఉత్సాహం! యవ్వన మంటే ఆత్మవిశ్వాసం! యవ్వనమంటే రేపటి భవిష్యత్తుకి ఈరోజు పునాది వేసుకోవడం! యవ్వనమంటే సోమరితనం లేకుండా శ్రమపడటం! కాదంటావా మైడియర్ యంగ్ గర్ల్?" అన్నారు.
    
    చిరునవ్వుతో తల వూపింది.
    
    ఇంతలో ఒక నడివయసు వ్యక్తి హడావిడి పడ్తూ వచ్చి "రండి.....రండి..... డాక్టరుగారు వచ్చి మీకోసమే ఎదురుచూస్తున్నారు" అన్నాడు.
    
    ఆయన ధృతిని చూపిస్తూ "ధృతి, నా పర్సనల్ అసిస్టెంట్" అన్నారు.
    
    అతను నమస్కరించి ఇద్దర్నీ లోపలికి తీసుకెళ్ళాడు. అక్కడ ఒకాయన స్టెత్ స్కోప్ తో కొంతమందిని పరీక్షిస్తూ ఏవో చెపుతున్నాడు. వీళ్ళని చూడగానే "ఆనందూ! మిశ్రాకి ఆపరేషన్ వెంటనే చేసెయ్యాలి" అన్నారు దగ్గరకొస్తూ.
    
    "ఏర్పాట్లు చేయించు" అన్నాడు ధర్మానందరావు.
    
    "ఆ కొడుకుకి ఉత్తరం రాయించాను..." అని డాక్టరుఅగరు అంటూ వుండగా-
    
    వెనకనించి ఓ వృద్దుడు "అక్కర్లేదు మీరు ఎవరికీ అనవసరంగా ఉత్తరాలు రాయించవద్దు. అసలు నాకాపరేషన్ అవసరం లేదు అంటుంటే వినరేంటీ?" అన్నాడు ఆయాసపడుతూ.
    
    ధర్మానందరావు అటువైపు నడిచి "మిశ్రా! ఆవేశపడకు, ఆపరేషన్ చేసేముందు అయినవాళ్ళ అంగీకారం తీసుకురావాలి. అందుకే ఉత్తరము రాయించడం ఆపరేషన్ చెయ్యనంత మాత్రాన నువ్వు వెంటనే చచ్చిపోవు. బ్రతికినన్నాళ్ళూ కష్టపడుతూ, చూసేవాళ్ళని కూడా కష్టపెడుతూ బ్రతుకుతావు" అన్నారు.
    
    ఆ తర్కానికి తల వంచినట్లు అతను మరి మాట్లాడలేదు. మరో ముసలావిడ వచ్చి ధర్మానందరావుగారికి నమస్కరించి "బాబుగారిని చూడటం కోసం దేవుడు మళ్ళీ కళ్లిచ్చాడు" అంది.
    
    ఆయన చిరునవ్వుతో "ఆపరేషనయ్యాక కళ్ళు బాగా కనిపిస్తున్నాయా బూబమ్మా?" అన్నారు.
    
    ఆమె ఆనందంగా తల నిలువునా వూపింది. ఆయన చాలాసేపు డాక్టరుగారితో కలిసి ఒక్కొక్కళ్ళ దగ్గరకే వెళ్ళి పలకరిస్తూ, యోగక్షేమాలు విచారిస్తూ గడిపారు. డాక్టరుగారి పేరు 'రంగన్' అనుకుంటా ఆయన 'రంగన్' అంటూ మాటిమాటికి పిలుస్తూ భుజంమీద చెయ్యివేసి ఏదో మాట్లాడుతున్నారు.
    
    ధృతి ఆయననే గమనిస్తూ కూర్చుంది. ప్రతివారి మొహాల్లో ఆయనని చూడగానే ఎంతో అభిమానం, ఆప్యాయథా! ఎవరంటారు. ఈ మనిషి ఒంటరివాడని! తన వాళ్ళమ్నీద ప్రేమ చూపించడం గొప్పకాదు. తనకేమీ కానివారిమీద చూపించటమే గొప్ప! ఏమిటీ విశ్వజనీయమైన కారుణ్యం! "మెటీరియలిజం జలతారు ముసుగు, మీ మానవత్వపు వెలుగుల్ని దాచలేకపోతోంది" అనుకుంది. ఆమెకి తెలియకుండానే ఆమెకి కంటనీరు తిరిగింది. మనసుకి ఆనందం కలిగినా, బాధ కలిగినా వ్యక్తీకరించేవి కళ్ళేగా!

    తమతో కూడా తెచ్చిన స్వీట్లూ, పువ్వులూ అందరికీ పంచే డ్యూటీ ధృతికి అప్పగించారు. తనకంటే ఎంతో పెద్దవాళ్ళయినవాళ్ళు 'క్యూ'లో ఒక్కొక్కరే వచ్చి తన చేతిలోంచి స్వీట్స్ తీసుకుని, బుగ్గలు పుణికీ, ఆశీర్వదించీ, చేతిమీద ముద్దుపెట్టి వెళుతుంటే ఆమెకి అనిర్వచనీయమైన అనుభూతి కలిగింది. అంతటి దివ్యానుభూతిని కలిగించిన ఆయనకు నేను చాలా ఋణపడిపోయాను అనుకుంది. ఆయనలో చూసి నేర్చుకోవలసింది ఎంతో వుంది అనుకుంది.
    
    ఒక వృద్దుడు ఎంతో ఓర్పుగా పలక మీద అక్షరాలు దిద్దుకుంటున్నాడు. ధృతి అతనిని ముచ్చటగా చూస్తూ దగ్గరకెళ్ళి నిలబడింది. ఇది చూసి ప్రక్కనే వున్న మరో వృద్దుడు.... "చూడమ్మా! ఇప్పుడు చదువు నేర్చుకుని ఎవరికో ఉత్తరం రాయాలంట" నవ్వుతూ అన్నాడు.    

    "లేదు విశ్వనాథం! అలా అని ఎక్కడా రాసి లేదు. ఏ పనైనా ఏ వయసులోనయినా ఆరంభించవచ్చు. కావలసిందల్లా ఆ పనిమీద అభిలాష మాత్రమే" అంటూ ధర్మానందరావుగారు వచ్చారు. ఆయన్ని చూడగానే అతడు లేచి నిలబడి "మా లిజీకి..."
    
    "ఓ! తప్పకుండా. 'హెన్రీస్టెల్ మెన్' అనే వ్యక్తి తన అరవయ్యో ఏట  సైన్సు అభ్యసించడం మొదలుపెట్టి శాస్త్రజ్ఞుడయ్యాడు. 'స్కాట్ తన నలభయ్యొ ఏట సారస్వతం చదవాటం మొదలుపెట్టాడుట. ఏదయినా నేర్చుకోడానికి ప్రత్యేకమైన వయసంటూ లేదు" అని చెప్పి నవ్వుతూ "లిజీ చాలా అందమైందనుకుంటాను" అన్నారు కన్నుగీటుతూ.
    
    ఆ అరవై ఏళ్ల వృద్దుడు వెంటనే సిగ్గుపడుతూ "ఆ మాట నెమ్మదిగా అంటారా? చాలా అందమైంది" అని, అంతలోనే దిగులుపడుతూ, "ఆ  మధ్య ఉత్తరం రాసింది కంటిచూపు ఆనడం లేదని, అద్దాలు మార్పించమంటే తన కొడుకులూ, కూతుళ్ళు పట్టించుకోవడంలేదని పెళ్ళి పెటాకులు లేని నేనే తనకంటే చాలా ఆనందంగా వున్నాననిపిస్తుంది బాబుగారు!" అన్నాడు కళ్ళు తుడుచుకుని.
    
    ధర్మానందరావుగారు ఓదార్పుగా అతని భుజంమీద చెయ్యివేశారు.
    
    భోజనాల సమయం అయినట్లుంది. గంటకొట్టారు. అందరితో బాటు క్రింద కూర్చుని, తన పక్కనే ధృతిని కూర్చోమని ఆయన సైగచేశారు. అలా వారితో కలిసి కబుర్లు చెప్తున్న ఆయన్ని చూస్తుంటే, 'మనుషులందరూ ఒకేలాగా ప్రవర్తిస్తూంటారు, స్పందిస్తుంటారు కానీ గొప్పవాళ్ళు మాత్రం తమ ప్రవర్తనద్వారా స్పందనని చూపెట్టరు. కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రమే బాహాటంగా చూపెడతారు' అనుకుంది. తమ భోజనాలు అయ్యాక ఆయన స్వయంగా కొందరికి వడ్డించారు. సమయం ఎలా గడిచిపోయిందో అంతుచిక్కలేదు. సాయంత్రం నాలుగవుతుండగా ఆయన బయల్దేరారు. అందరూ కారు వరకూ సాగనంపారు. కొందరు గుసగుసగా "ఆ అమ్మాయి ఎవరూ? ఎప్పుడూ ఎవర్నీ వెంటబెట్టుకుని రాలేదే" అనడం, మరికొందరు లోగొంతుకతో "చాలా దగ్గర వాళ్ళమ్మాయి అయి వుంటుంది" అనడం వినిపించి చాలా గర్వంతో కూడిన ఆనందాన్ని అనుభవించింది ధృతి.