"చచ్చినపాములా వుంది ఆయన పరిస్థితి! ప్రతివాళ్ళూ ఈ వారం నుండీ పనికట్టుకుని ఇంటికి వచ్చి మరీ "మీ ఆవిడ ఎక్కడికో వెళ్ళిపోయారటగా!" అని పరామర్సలు చేసి వెళ్ళారు. ఇరవై సంవత్సరాలు ఆవిడ్ని ఏం బాధపెట్టాడో కానీ అంతా వారంలోగా రుచి చూపించేసింది. ఆవిడ్ని ఏమీ అనలేని స్థితి! మళ్ళీ వెళ్ళిపోతేనో..." అని నవ్వింది.
    
    అతని పశ్చాత్తాపం ఆవిడకి గడిచిన ఇరవై వసంతాల కాలం తిరిగి తీసుకురాగలదా?
    
    స్త్రీ క్షమయీ ధరిత్రి కాబట్టే ఆమె తిరిగి వచ్చింది.
    
    "సుమతీ! తల్లీ....ఇప్పుడెలా వుందమ్మా?" ఆ కంఠం విని ఆశ్చర్యంగా చూశాను.
    
    అత్తయ్య ఏడుస్తూ వచ్చింది. ఆమె వెనకాలే నాదస్వరానికి తిత్తి పట్టేవాడిలా మావయ్యా!
    
    "వాడి చేతులు పడిపోనూ....అంత కోపమైతే ఎలాగే? అయినా నువ్వు అక్కడికి ఎందుకెళ్ళావు? మీ మావయ్యకి చెప్స్తే ఆయనే మందలించేవారుగా" నాతల నిమురుతూ అంది.
    
    అనసూయ తెల్లబోయి చూస్తోంది.
    
    "పదమ్మా! ఇంటికెళదాం" అంది అత్తయ్య.
    
    "నీ ముద్దుల కొడుకు చంపడానికి పెళ్ళాం కావాలని మంకుపట్టు పడుతున్నాడా అత్తయ్యా?" హేళనగా అడిగాను.
    
    "ఛీ! వాడు జరిగినదానికి ఎంతో పశ్చాత్తాపపడుతున్నాడు. చెప్పరేమండీ?" మావయ్యవైపు చూసింది అత్తయ్య.
    
    "అవునమ్మా...పద మా ఇంట్లోనే వుందురుగాని..." అన్నాడు మావయ్య.
    
    "నువ్వు మా అమ్మకి తోడబుట్టినవాడివి కదా మావయ్యా? ఒక్కసారైనా నాకు జరుగుతున్న అన్యాయానికి నోరు విప్పవేం? నీకూ ఓ ఆడపిల్లుందిగా మావయ్యా? ఆస్తి, హోదా, పరపతీ, పదవీ, పరువూ....ఇవి తప్ప మీ మెదళ్ళో ఏమీలేదా? మానవత్వం మరిచిపోయారా?" ఆవేశంగా అడిగాను.
    
    "ఇక ముందు నిన్ను నేను జాగ్రత్తగా చూసుకుంటానుగా....ఇంటికి రామ్మా!" అన్నాడు మావయ్య.
    
    నేను జవాబు చెప్పేలోగా "ఎక్స్ క్యూజ్ మీ! సుమతీ మీరేనా?" అని వినిపించింది.
    
    నేను ఆ లేడీ ఇన్స్ పెక్టర్ని చూసి బలహీనంగా తల ఆడించాను.
    
    "డౌరీ హెరాస్ మెంట్ కేసుకదా! చెప్పండి మిమ్మల్ని యిలా కొట్టింది మీ హజ్బెండేనా?" ఆవిడ అనసూయ ఖాళీ చేసిన స్టూల్ మీద కూర్చుంటూ అంది.
    
    అత్తయ్య మొహాన నెత్తురుచుక్కలేదు. అంతలా పాలిపోయింది.
    
    మావయ్య కంగారుగా "మీరు పొరపడుతున్నారు ఇన్స్ పెక్టర్! ఆ అమ్మాయి నాకు స్వయానా మేనకోడలు. నేను కన్నతండ్రికన్నా ఎక్కువగా చిన్నప్పటినుండీ ఈ తల్లిదండ్రులు లేని పిల్లని పెంచాను. మా అబ్బాయి ఆనంద్ ని ఇష్టపడి పెళ్ళి చేసుకుంది. ఏమ్మా.... బావంటే నీకు ప్రాణం కదూ! ఆవిడకి చెప్పు....ఎవరో గిట్టనివాళ్ళు మామీద కంప్లయింట్ ఇచ్చుంటారు" అన్నాడు.
    
    "ఔనమ్మా....దానికి మేం ఏం లోటూ చెయ్యలేదు. ఇంటికొచ్చి చూడండి....ఎన్ని నగలూ....ఎన్ని చీరలూ.... ఇల్లు కూడా దాని పేరుమీదే వుంది. ఒక అనాథ పిల్లకి ప్రేమ లేకుండా ఇన్ని చేస్తామా?" అంది అత్తయ్య.
    
    "మీరు ఊర్కోండి. ఆమెని చెప్పనివ్వండి. చెప్పమ్మా.... నీ భర్త ఆనంద్ ప్రియంవద అనే ఆవిడతో అక్రమసంబంధం కలిగి వుండడం వలన నిన్ను కొట్టి తిట్టీ హింసిస్తున్నాడట నిజమేనా?" అంది.
    
    నేను అత్తయ్యవైపు చూశాను.
    
    భయంగా నావైపు చూస్తోంది.
    
    మావయ్య వైపు చూసాను.
    
    అభ్యర్ధనగా చూస్తూ చేతులు జోడించాడు.
    
    అనసూయ వైపు చూసాను.
    
    "చెప్పు - భయంలేదు" అంది.
    
    ఇన్స్ పెక్టర్ వైపు చూసాను.
    
    "ఎవరికీ భయపడాల్సిన పనిలేదు చెప్పమ్మా" అంది.
    
    "మా ఆయన..."
    
    "నిన్ను చంపడానికి ప్రయత్నించాడని చెప్పు" అందించింది అనసూయ.
    
    "అబద్దం" అరిచింది అత్తయ్య.
    
    "అబ్బబ్బా! మీరు వూరుకోండి. బయటికి నడవండి. నువ్వు చెప్పమ్మా...ఈ దెబ్బలన్నీ అతనే కొట్టాడా?" ఆమె అడిగింది.
    
    "కాదు....ఆయా నా దైవం. చాలా ప్రేమగా చూసుకుంటాడు. నేనే పొరపాటున మెట్లమీదనుండి దొర్లిపడ్డాను."
    
    "సుమతీ!" అంది అనసూయ.
    
    అత్తయ్యా, మావయ్యా వూరిపి పీల్చుకున్నారు.
    
    "వీళ్ళిద్దరూ మనుషులు కారండీ! అపర దేవతామూర్తులు నాకు ఏ లోటూ రానివ్వరు" అన్నాను.
    
    "మీరు భయపడి అబద్దం చెప్పకండి. మీకు పూర్తి రక్షణ మేం కల్పిస్తాం" అంది ఇన్స్ పెక్టర్.
    
    "థాంక్స్! కానీ నాకా అవసరం లేదు" చేతులు జోడించాను.
    
    "సరే....వస్తా!" ఆవిడ లేచి నిలబడింది.
    
    "సుమతీ! నీకు మతిపోయిందా?" అరిచింది అనసూయ.
    
    "లేదు! తెలివిగానే మాట్లాడుతున్నాను" అని మావయ్యవైపు తిరిగి "ఇంటికెళదాం మావయ్యా" అన్నాను.
    
    "అలాగే...ఇప్పుడే డాక్టర్ తో మాట్లాడొస్తాను" ఆయన ఆనందంగా వెళ్ళాడు. ఇన్స్ పెక్టర్ కూడా వెళ్ళిపోయింది.
    
    "ఇంక నువ్వెళ్ళిరా!" అత్తయ్య అనసూయ వైపు కోపంగా చూస్తూ అంది.
    
    అనసూయ కోపంగా "నోరులేనిదాన్ని చేసి ఇంటికి తీసుకెళ్ళి చంపిద్దామనుకుంటున్నారేమో....ఆమె వెనకాల నాలాంటి స్నేహితులున్నారు. ఆమెకేం జైర్గినా నువ్వూ, నీ మొగుడూ, నీ కూతురూ కటకటాల వెనుక ఉంటారు జాగ్రత్త!" అని నావైపు బేలగా చూసి "వస్తా సుమతీ! జాగ్రత్త" అని వెళ్ళిపోయింది.
    
    నేను నీరసంగా నవ్వుకున్నాను.
    
    ప్రదీప్ వచ్చేలోపే వెళ్ళిపోవాలి. ఆలస్యం చెయ్యకూడదు.
    
                                                              * * *
    
    ఫోన్ ఆగకుండా రింగవుతోంది.
    
    జయంతి విసుగ్గా వచ్చి తీసి "హలో" అంది అవతలవాళ్ళు పెట్టేసినట్లున్నారు. ఈ బ్లాంక్ కాల్స్ తో చచ్చిపోతున్నాం" అంది.
    
    నేను వచ్చినప్పటినుండీ బ్లాంక్ కాల్స్ వస్తూనే వున్నాయి. హేంగింగ్ చైర్ లో వెనక్కివాలాను. ప్రదీప్ ఎంతగా టెన్షన్ పడుతుంటాడో అనిపించింది. పడడేమో...అతని స్వభావానికి విరుద్దం కదా అని కూడా అనిపించింది. లేచి నడుస్తుంటే కాలు నెప్పిగా వుంది. కష్టపడి క్రోటన్స్ మొక్కలవైపు వెళ్ళాను. నన్నెవరూ పట్టించుకోడంలేదు. నాతో మాట్లాడడమే లేదు.
    
    జయంతి కొడుకు వాటర్ పైప్ తో నీళ్ళు ఎగజిమ్ముతూ ఆడుతున్నాడు. నన్ను చూసి నవ్వాడు. చేతులు చాపాను. పరిగెత్తుకుంటూ వచ్చాడు. తడి బట్టలతో, ఒళ్ళంతా బురద మరకలతో వున్నాడు.