నమ్మకం.. మానవ సంబంధాల మంత్రం

 

 

కొత్తగా పెళ్ళయి అత్తవారింట్లో అడుగుపెట్టిన కొత్తకోడలికి అదో కొత్త ప్రపంచం. ఇంతకుముందు తను పెరిగిన వాతావరణం, అలవాటయిన వ్యక్తులను వదిలి, తనకి ఏమాత్రం తెలియని ప్రపంచంలోకి అడుగుపెట్టినపుడు కొంత బెరుకు, భయం సహజంగా వుంటుంది. అయితే కొన్ని చిన్న చిన్న విషయాలలో జాగ్రత్త వహిస్తే అక్కడి కుటుంబ సభ్యులతో కలసిపోవడం, తను వారిలో ఒకరిగా మారడం కష్టం కాదు. ఇందుకు నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. అయితే ఇవి కేవలం కొత్తగా పెళ్ళికూతుర్లకే కాదు.. ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరమైన సూచనలు

సంబంధ బాంధవ్యాలలో ‘పారదర్శకత’ ఎంతో మంచిది అంటారు ఫ్యామిలీ కౌన్సిలర్లు. ఒకరిపై ఒకరికి నమ్మకం వుండాలి. అలా నమ్మకం వుండాలి అంటే నమ్మకం కలిగించేలా వుండాలి ఎవరి ప్రవర్తనైనా. చాలాసార్లు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా తప్పు ఎదుటివారిదే అంటుంటారు చాలామంది. అయితే ఒకరి మీద మరొకరికి నమ్మకం వుంటే ఎదుటివారి పొరపాట్లు తప్పులుగా కనిపించవు. క్షమించలేని నేరాలుగా తోచవు. మన ప్రవర్తన మనకెంత కరెక్టు అనిపిస్తుందో, ఎదుటి వ్యక్తులకి కూడ వాళ్ళ కారణాలు వాళ్ళకుండొచ్చు. అందుకే ఎప్పుడూ పరిస్థితులను రెండువైపుల నుంచి చూడాలి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ముందుగా మనమే ఆ సమస్యని ముగించడానికి ప్రయత్నించాలి.

సర్దుకుపోవడం చేతగానితనమనుకుంటారు చాలామంది. కాని అది సంబంధ బాంధవ్యాలని నిలిపి వుంచే ఓ రక్షణ వలయం. అది లేనిరోజున ఏ బంధం రెండు రోజులు కూడా నిలవలేదు. ఓ పెద్ద లక్ష్యం సాధించాలని వచ్చినప్పుడు దారిలో ఎదురయ్యే చిన్న చిన్న ఇబ్బందులని చూసీ చూడనట్టు వదిలేయాలి. అలాగే ఓ చక్కటి కుటుంబంగా కలసి వుండాలంటే భిన్న మనస్తత్వాలలతో వుండే వ్యక్తుల మధ్య ఏర్పడే చిన్నచిన్నపొరపొచ్చాలనీ పట్టించుకోకూడదు. ఏమంటారు?



- రమ ఇరగవరపు