ఇన్ఫ్లుఎంజా వైరస్ నుండి పిల్లలను ఎలా కాపాడుకోవాలి?

ప్రస్తుత కాలంలో ఇన్ఫ్లుఎంజా-ఎ వైరస్ దేశవ్యాప్తంగా కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా  మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, ఒడిశా, ఢిల్లీ సహా పలు ప్రధాన నగరాల్లోనో,  రాష్ట్రాల్లో వైరల్ ఇన్ఫెక్షన్ కేసులు నమోదవుతున్నాయి. ఇన్ఫ్లుఎంజా రూపాంతరం తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుంది, సోకిన వారిలో కొందరు ఆసుపత్రిలో చేరడం కూడా అవసరం. ఆరోగ్య నిపుణులు కూడా దీనిని తీవ్రమైన వ్యాధిగా..  ప్రాణాంతకమైన సమస్యగా పరిగణిస్తున్నారు. పెరుగుతున్న ముప్పును దృష్టిలో ఉంచుకుని పిల్లల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇటీవలి నివేదికలలో, ఆరోగ్య నిపుణులు H3N2 ప్రభావం గరిష్టంగా పిల్లలలో కనిపిస్తోందని చెప్పారు. 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు కూడా తీవ్రమైన వ్యాధితో ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. విచారించాల్సిన విషయమేమిటంటే..  H3N2తో పాటు, అనేక రాష్ట్రాలలో H1N1 కేసుల పెరుగుదల కొనసాగడం.

దేశంలో పెరుగుతున్న వైరల్ ఇన్‌ఫెక్షన్‌ను నివారించడానికి ఆరోగ్య నిపుణులు పిల్లల కోసం ప్రత్యేకంగా సూచనలు ఇచ్చారు. 

ఇదెప్పుడు తగ్గుతుంది?

హెచ్‌3ఎన్‌2తో సహా సీజనల్ ఇన్‌ఫ్లుఎంజా ద్వారా వచ్చే వ్యాధులు మార్చి నెలాఖరు నుంచి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక నివేదికలో పేర్కొంది. అయితే అప్పటి వరకు దీనిని నివారించేందుకు ప్రజలంతా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం, దేశంలో కరోనా ఇన్‌ఫెక్షన్ కేసులు కూడా నమోదవుతున్నాయి, వీటిలో చాలా లక్షణాలు H3N2 మాదిరిగానే ఉండటం కాస్త గందరగోళ పరిచే విషయం.

H3N2 ప్రభావం పిల్లలలో ఎక్కువగా కనిపిస్తుంది. వ్యాధి సోకిన పిల్లలలో అధిక జ్వరంతో పాటు ముక్కు కారటం, శ్వాస తీసుకోవడంలో సమస్యలు కనిపిస్తాయి. ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో కూడా తీవ్రమైన లక్షణాలు కనిపించే ప్రమాదం ఎక్కువగా ఉంది. కొన్ని సందర్భాల్లో ICUలో ఉంచాల్సి రావచ్చు. 

యాంటీ బయటిక్స్ వాడొచ్చా?

సాధారణ మందులు వాడటం, విశ్రాంతి తీసుకోవడం ద్వారా చాలా ఇన్ఫ్లుఎంజా కేసులు నయమవుతాయి, అయితే వైద్యుల సలహా మేరకు మాత్రమే ఈ మందులు తీసుకోవడం మంచిది. H3N2 ఇన్‌ఫ్లుఎంజా వైరస్‌కు వ్యతిరేకంగా యాంటీబయాటిక్స్ పని చేయనప్పటికీ, చాలా మంది తమంతట తాముగా యాంటీబయాటిక్స్ తీసుకోవడం ప్రారంభిస్తారు. ఈ సమస్య వచ్చిన పిల్లలకు సొంతంగా యాంటీబయాటిక్స్ ఇవ్వవద్దని వైద్యులు తల్లిదండ్రులకు సలహా ఇస్తున్నారు. మీకు ఈ వైరస్ సోకిన లక్షణాలు కనిపిస్తే, వైద్యుడిని సంప్రదించి, వారు సూచించిన మందులను మాత్రమే వాడాలి.

వైద్యులు H3N2 ఇన్ఫ్లుఎంజా వైరస్ ను నివారించడానికి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు  సూచించారు, వీటిని అనుసరించడం ద్వారా ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు ముక్కు, నోటిని కర్చీఫ్ అడ్డుగా ఉంచుకోవాలి..

క్రమం తప్పకుండా చేతులను సబ్బుతో కడుక్కోవాలి.  

కరోనా సమయంలో ఎలాగైతే ఫేస్ మాస్క్ ధరించారో.. అలాగే ఇప్పుడూ జాగ్రత్తగా ఫేస్ మాస్క్ మైంటైన్ చెయ్యాలి. రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లకపోవడం ఉత్తమం.

చేతులతో ముక్కును నోటిని పడే పడే తాకడం మానుకోవాలి.  

శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవాలి, ద్రవపదార్థాలు బాగా తీసుకోవాలి.

జ్వరం, ఒళ్ళు నొప్పులు బాధిస్తుంటే.. పారాసెటమాల్ తీసుకోవచ్చు. ఇవి తప్ప సొంతంగా ఎలాంటి మందులూ వాడకపోవడం ఉత్తమం.

పైన చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటే పిల్లల ఆరోగ్యానికి ఢోకా ఉండదు.

                                   ◆నిశ్శబ్ద.