మహిళల కోసం మూడురోజుల ప్రామిస్!!

 

ఈ ప్రపంచం ఎంత డవలప్ అయిందంటే మహిళలు మూడురోజులు అని చెప్పగానే ఠక్కున అది నెలసరి సమస్యనే కదా!! అని 90% మంది ఎంతో సులువుగా గ్రహించేస్తారు. ఆడవాళ్ళ పీరియడ్స్ గురించి, పడక గదిలో సెక్స్ గురించి మాట్లాడినంతగా ఈమధ్య కాలంలో వేరే ఏ విషయం మాట్లాడటం లేదు ప్రజలు, సెలెబ్రెటీలు, రచయితలు, సామాజిక కార్యకర్తలు ఇట్లా అందరూ కూడా. అయితే ఆడవారి నెలసరి అనే విషయం గురించి మాట్లాడిన  వ్యక్తులు, దాని గురించి ఎంతో అవగాహనా ప్రసంగాలు చేసే వ్యక్తులు సామాజిక మాద్యమలలో కూడా ఈ విషయం గురించి సపోర్ట్ ఇచ్చేవారు కూడా చివరికి తమ తమ ఇళ్లలో ఆడవాళ్లు అదే నెలసరి సమస్యలో ఉన్నపుడు వారి బాధను, వారి పరిస్థితిని అర్థం చేసుకుని సపోర్ట్ ఇచ్చేవారు చాలా తక్కువేనని చెప్పవచ్చు.

దీనిని బట్టి చూస్తే ఏ విషయం అయినా మాటలు చెప్పడం ఎంతో తేలిక అని అర్థమవుతుంది. ఇకపోతే మహిళల నెలసరి విషయం ఒకప్పుడు ఎంతో గోప్యత కలిగినది. ఆ తరువాత దాని గురించి స్వేచ్ఛగా మాట్లాడినా ఆ నెలసరిని ఎదుర్కొనే మహిళలు మాత్రం దాన్ని ఎదుర్కొని తీరాల్సిందే. మగవాళ్ళు, సామాజిక కార్యకర్తలు, అవగాహనా సదస్సులు ఇట్లా ఎందరు ఎన్ని మాట్లాడినా, స్త్రీల నెలసరి గురించి, వారి సమస్యల గురించి ఎంత నీతులు చెప్పినా అవేవి కూడా స్త్రీల నెలసరి సమయంలో వారి సమస్యలు పరిష్కరించలేవు అనే విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇది మాటల సమాజం అయినపుడు, కేవలం మాటల్లో ఏదేదో చెప్పేసి తరువాత వారి మానాన వారిని వదిలేస్తే, నెలసరి వల్ల కలిగే ఎమోషన్స్, చిరాకు, అసహనం, ఆ మూడు రోజులు శరీరంలో కలిగే మార్పులు ఇవ్వన్నీ కూడా వాళ్ళను వదిలిపోవు. కేవలం సమాజం మాట్లాడుకోడానికి ఈ టాపిక్ అన్నట్టుగా ఉంటాయి సమాజం మాటలు. అందుకే ఈ విషయంలో స్త్రీల పట్ల కావాల్సింది మాటల పరంపర కాదు చేతల తోడ్పాటు. 

మూడ్స్ ను అర్థం చేసుకోవాలి!!

మూడ్ అనగానే ఏదో పడకగదిలో రొమాన్స్ గుర్తొస్తే అంతకంటే అథములు లేరని అనుకోవచ్చు. ఇక్కడ మూడ్ అంటే మానసిక పరిస్థితి. మహిళల నెలసరి సమయంలో అది మారుతూ ఉంటుంది. ఎంతగా అంటే కోపం, చిరాకు, అసహనం, ఏడుపు, బాధ వంటివి వెంటవెంటనే మారిపోతూ ఉంటాయి. శరీరంలో జరిగే హార్మోన్ల ప్రభావమే దీనికి కారణం. కాబట్టి నెలసరిలో ఇలాంటివి ఉంటాయని మాటలు చెప్పకుండా, ఆ స్థితిలో ఉన్న ఇంట్లో ఆడవాళ్లకు కోపరేట్ చెయ్యాలి. సాధారణ సమయాల్లో మాదిరిగా చిన్నవాటికి ఆడవాళ్ళ మీద కొప్పడటం, విమర్శించడం, తిట్టడం వంటివి చేయకూడదు. ఆ సమయంలో మరీ సున్నితంగా ఉంటారు చాలా తొందరగా బాధపడిపోతారు. 

విశ్రాంతి ఆవశ్యకత తెలుసుకోవాలి!!

ఇటీవల కాలంలో నెలసరి అయితేనేం, సాధారణ రోజుల్లానే గడిపేయచ్చు ఇదిగో ఈ ఎనర్జీ డ్రింక్, ఇదిగో ఈ టాబ్లెట్స్, ఇవిగో ఈ సానిటరీ పాడ్స్ అంటూ ఎన్నో యాడ్స్ టీవీ లలో వస్తుంటాయి. ఇంకా సామాజిక మాద్యమలలో కూడా దీని గురించి ఓ తెగ చర్చిస్తారు. నెలసరిలో ఆడవాళ్లు అన్నీ చేయచ్చు అని ఊదరగొడతారు. అయినా నెలలో మూడు రోజులు శరీరంలో కలిగే మార్పులతో ఎంత దృఢమైన ఆడవాళ్లు అయినా ఎంతో కొంత మానసికంగా ఇబ్బంది పడుతున్నపుడు ఆ మూడు రోజులను ఆడవారి విశ్రాంతికి వదిలేస్తే ఏమి నష్టం వస్తుంది ఈ సమాజానికి. ప్రతి ఇంట్లో మగవాళ్ళు ఆ మూడు రోజులు కూడా ఎలాంటి పని చేసుకోలేక పేలుతున్న ప్రసంగాలేనా మహిళలు ఆ రోజుల్లో కూడా అన్ని చేయవచ్చు అని చెప్పడం వెనుక ఉద్దేశం. శరీరంలో మార్పులు కలిగే ఆ మూడురోజులు శరీరానికి కష్టం లేకుండా విశ్రాంతి ఇవ్వడం వల్ల మిగిలిన రోజులను ఎంతో ఉల్లాసంగానూ, మరెంతో చురుగ్గానూ గడిపేయచ్చు. ఇంకా మరొక ముక్కలో చెప్పాలంటే ఒక వెహికల్ ను రిపేర్ చేయిస్తూ డ్రైవ్ చేయడం చేస్తామా?? లేదు కదా. అలాంటిదే ఇది కూడా. 

ఆరోగ్యం విషయంలో తోడ్పాటు!! 

ఆరోగ్యం ఎప్పుడు ఎలా దెబ్బతింటుందో చెప్పలేం. ముఖ్యంగా మహిళలకు వచ్చే సమస్యలలో 90% ఈ నెలసరి క్రమం తప్పడం, హార్మోన్ల సమస్యలు, మానసిక ఒత్తిడి వంటి వాటి వల్లనే వస్తాయి. కాబట్టి మహిళలు నెలసరి విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటే అంత ఆరోగ్యంగా ఉండగలుగుతారు. 

ఆహారం ఔషధం!!

నెలసరి సమయంలో కోల్పోయే రక్తం తిరిగి అభివృద్ధి చెందడానికి ఐరన్ పుష్కలంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే ప్రోటీన్లు, విటమిన్లు అన్ని కూడా తాజా పదార్థాల నుండి లభ్యమయ్యేలా జాగ్రత్త తీసుకోవాలి. ఇవన్నీ తెలుసుకున్నాక  మహిళలకు ఆ మూడు రోజులు తోడ్పాటు అందిస్తామని మీకు మీరు ప్రామిస్ చేసుకోండి. ఆ మాట మీద నిలబడి సపోర్ట్ ఇవ్వండి. మీ ఇంటి మహాలక్ష్ములు నెలసరిని ఒత్తిడి లేకుండా దాటేస్తారు. 


◆ వెంకటేష్ పువ్వాడ