చదువులో వెనుకబడిన పిల్లల విషయంలో తల్లిదండ్రులు చెయ్యాల్సిన పనులివే!

పిల్లలు పుట్టినప్పటి నుండి తల్లిదండ్రులు వారి భవిష్యత్తు గురించి కలలు కంటారు. తమ పిల్లలు బాగా చదువుకోవాలని, మంచి స్థాయికి చేరాలని అనుకుంటారు. కానీ తల్లిదండ్రులు తమకు తెలియకుండానే కొన్నితప్పులు చేయడం వల్ల పిల్లలు చదువులో వెనుకబడతారు.  కేవలం పాఠశాలలో ఉపాధ్యాయుల బోధనే కాదు తల్లిదండ్రులు కూడా తగినంత శ్రద్ద తీసుకుంటేనే పిల్లలు చదువులో రాణిస్తారు. లేకపోతే తరగతిలో వెనుకబడి ఉండటం, పరీక్షలలో పేలవమైన మార్కులు. చదువుకోవాలనే ఆసక్తి లేకపోవడం వంటివి జరుగుతుంటాయి. పిల్లల విషయంలో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో తెలుసుకని వాటిని పాటిస్తే  పిల్లలు చదువులో మెరుగవుతారు.

పిల్లలు పరీక్షలలో ఒక సబ్జెక్ట్ లేదా అన్ని సబ్జెక్ట్ లలో మార్కులు తక్కువ తెచ్చుకుంటున్నా,  వారు చదువు పట్ల  నిరాసక్తిగా ఉన్నా దానికి కారణం ఏంటో తెలుసుకోవాలి. చాలామంది తల్లిదండ్రులు ఇలాంటి పిల్లలను చూసి విసుక్కుంటారు. వేలరూపాయలు పోస్తున్నా చదవడం లేదని వేపుకు తింటూంటారు. అందుకే పిల్లలు తమ సమస్యను తల్లిదండ్రులతో చెప్పలేకపోతారు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలతో స్నేహపూరితంగా మాట్లాడుతూ వారి సమస్య అడిగి తెలుసుకుని వాటిని పరిష్కారం ఆలోచించాలి.

పిల్లలు తరగతిలో బోధించే విషయాల మీద శ్రద్ద చూపించకపోతే  తల్లిదండ్రులు పిల్లలో ఏకాగ్రత పెంచడానికి ప్రయత్నించాలి.  తరగతిలో ఏం చెబుతున్నారు, ఎందుకు అర్థం కావడం లేదు వంటి విషయాలను   తెలుసుకుని వాటికి అనుగుణంగా పిల్లలకు విషయావగాహన పెంచాలి.

పిల్లలు చదువులో వెనుకబడటానికి ప్రధాన కారణం వారికి విషయం అర్థం కాకపోవడం. కొందరు పిల్లలు విషయాన్ని రెండు మూడుసార్లు మళ్లీ మళ్లీ రివిజన్ చేస్తే తప్ప పూర్తీగా అర్థం చేసుకోలేరు. ఇంటి దగ్గర పిల్లలతో ఇవన్నీ చేయించే బాధ్యత తల్లిదండ్రులదే.

చదువు విషయంలో పిల్లలు బట్టీ పడుతుంటే దాన్ని తల్లిదండ్రులే నివారించాలి. ఇది చాలా చెత్త అలవాటు. ఇంటి దగ్గర పిల్లలన చదివిస్తున్నప్పుడు ఈ విషయాన్ని తల్లిదండ్రులు గమనించి దాన్ని ఆపు చేయించాలి. విషయాన్ని అర్థమయ్యే విధంగా ఉదాహరణలతో వివరించి చెప్పాలి. దీని వల్ల పిల్లలకు విషయం మీద స్పష్టత వస్తుంది.

చాలామంది ఒంటరిగా చదువుతుంటారు. కానీ ఇది మంచిది కాదు. పిల్లలను కలసి చదువుకునే ప్రోత్సహిస్తే వారిలో చాలా స్కిల్స్  డవలప్ అవుతాయి. ముఖ్యంగా నలుగురిలో మాట్లాడటం అనే విషయంలో బిడియం పోతుంది. స్పీకింగ్ స్కిల్స్ పెరుగుతాయి.

ఇంటి దగ్గర పిల్లలకు ఓ ప్రణాళిత ఏర్పాటు చేయడం తల్లిదండ్రుల కర్తవ్యం. దీని వల్ల పిల్లలు ఏ సమయానికి ఏది పూర్తీ చెయ్యాలో స్పష్టతతో ఉంటారు. ఆటల నుండి చదువు వరకు అన్ని విషయాలలో సాటిసిపై అవుతారు.

                                                      నిశ్శబ్ద.