Home » Ladies Special » ప్రపంచంలో మొట్టమొదటి మహిళా డాక్టర్.. 205ఏళ్ల క్రితం ఈమె జీవితం అంతా పోరాటమే..!

ప్రపంచంలో మొట్టమొదటి మహిళా డాక్టర్.. 205ఏళ్ల క్రితం ఈమె జీవితం అంతా పోరాటమే..!

ప్రపంచంలో మొట్టమొదటి మహిళా డాక్టర్.. 205ఏళ్ల క్రితం ఈమె జీవితం అంతా పోరాటమే..!

 

ఆడపిల్ల చదువు అంటే అవాక్కయ్యే కాలం అది.. దాదాపు 205 ఏళ్ల కిందట ఒక మహిళ డాక్టర్ విద్యను అభ్యసించి ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా డాక్టర్ అయ్యింది. అయితే మహిళలను అణిచివేసే ఆ కాలంలో ఆమె ప్రయాణం అంత సజావుగా అయితే సాగలేదు. కానీ ఆమె పోరాడింది.  తన జీవితం అంతా తన పోరాటాన్ని సాగించింది.  "కొత్త ఆలోచనను అంగీకరించాలంటే ఒంటరిగా నిలబడే ధైర్యం అవసరం."  అని ఆమె అంటుంది.  ఆ గొప్ప ప్రేరణే.. ఎలిజబెత్ బ్లాక్ వెల్.. ప్రపంచంలో మొట్టమొదటి మహిళా  డాక్టర్ ఆమె. ఈమె గురించి మరికాస్త  వివరంగా తెలుసుకుంటే..

ప్రపంచ వ్యాప్తంగా గమనిస్తే దాదాపు ఒక 30,  40 ఏళ్ల నుండి ఆడపిల్లల చదువుకు ప్రోత్సాహం లభిస్తోంది.  మరీ ముఖ్యంగా గత 20 ఏళ్ల కాలం నుండే ఇది మెరుగ్గా ఉంది. అంతకు ముందు ఆడపిల్లలకు చదువు ఎందుకు అని అనుకున్న తరం కాస్తా మారి ఆడపిల్ల చదువు ఇంటికి వెలుగు అనే దశకు వచ్చింది. కానీ 19 వ శతాబ్దంలో ఆడవాళ్ళ విద్యకు ద్వారాలు పూర్తీగా మూసుకుపోయినప్పుడు ఎలిజబెత్ వైద్యశాస్త్రంలో పట్టా సాధించడమే కాకుండా భవిష్యత్తులో ఎంతో మంది  మహిళలు వైద్యరంగం వైపు వెళ్లడానికి ప్రేరణగా నిలించిది.

స్నేహితురాలి కోరికే ఆమె ప్రయాణానికి నాంది..

ఎలిజబెత్ ఫిబ్రవరి 3, 1821న  జన్మించింది. ఇంగ్లాండ్‌లోని బ్రిస్టల్‌లో జన్మించిన ఎలిజబెత్ మొదట్లో డాక్టర్ కావాలని అనుకోలేదు. బదులుగా ఆమె ఉపాధ్యాయురాలిగా వృత్తిని కొనసాగించింది. కానీ ఒక సంఘటన ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది.

ఆమె సన్నిహితురాలు తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడింది. ఆమె చనిపోయే ముందు ఎలిజబెత్‌తో "ఒక మహిళా డాక్టర్ నాకు చికిత్స చేసి ఉంటే, నేను ఇంత బాధపడి ఉండేదాన్ని కాదు."  అని చెప్పింది. స్నేహితురాలి బాధ ఎలిజబెత్  హృదయాన్ని తాకింది.  ఆ క్షణంలోనే ఆమె డాక్టర్ కావాలని నిశ్చయించుకుంది.


వైద్యకళాశాల ప్రవేశం..

ఎలిజబెత్ వైద్య కళాశాలలో ఎలా ప్రవేశం పొందిందనేది కూడా ఆసక్తికరమైన కథ. 1847లో ఆమె న్యూయార్క్‌లోని జెనీవా మెడికల్ కాలేజీ (ఇప్పుడు హోబర్ట్ విలియమ్స్)లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకుంది. ఆ సమయంలో మహిళలు వైద్య కళాశాలకు హాజరు కావడం అసాధ్యమని భావించారు.  కళాశాల మేనేజ్మెంట్ కు  ఖచ్చితంగా తెలియకపోవడంతో, వారు విద్యార్థులలో ఓటింగ్ నిర్వహించారు.  విద్యార్థులందరూ దాన్ని చాలా జోక్ గా తీసుకున్నారు.  ఒక మహిళ వైద్య విద్య కోసం రావడం అసంభవం అని అనుకున్నారు.  ఈ కారణంగా వాళ్లందరూ  మహిళ వైద్య విద్య అభ్యసించడానికి తమ సమ్మతి తెలుపుతూ ఓటు వేశారు. దీని తర్వాత మేనేజ్మెంట్ ఎలిజబెత్‌కు ప్రవేశం కల్పించింది. కానీ ఎలిజబెత్ వాస్తవానికి కళాశాలకు వచ్చినప్పుడు కళాశాలలో ఉన్న విద్యార్థులందరూ ఆశ్చర్యపోయారు.

వ్యతిరేకత..

ఆ కళాశాలలో ఎలిజబెత్ ఏకైక మహిళ. అందుకే ఆమె ప్రతి అడుగులోనూ వ్యతిరేకతను ఎదుర్కొంది. కానీ ఆమె తన తెలివితేటలతో వారందరి నోళ్లు మూయించింది. 1849లో ఆమె తన తరగతిలో అగ్రస్థానంలో నిలిచి MD డిగ్రీని సంపాదించి, ఆధునిక కాలంలో మొట్టమొదటి మహిళా వైద్యురాలిగా నిలిచింది.

కంటి చూపు దూరం..

వైద్య పట్టా పొందిన తర్వాత కూడా ఎలిజబెత్ కష్టాలు ఆగలేదు. వైద్య పట్టా పొందినప్పటికీ ఆమెకు అమెరికాలో ఉద్యోగం దొరకలేదు. ఈ కారణంగా ఆమె లండన్‌కు వెళ్లి మిడ్‌వైఫరీలో శిక్షణ ప్రారంభించింది. అయితే నవజాత శిశువుకు చికిత్స చేస్తున్నప్పుడు, ఆమె కంటిలో ఇన్ఫెక్షన్ ద్రవం వచ్చింది. చికిత్స ఆలస్యం కారణంగా, ఆమె ఒక కంటిలో శాశ్వతంగా దృష్టి కోల్పోయింది. కానీ ఈ అడ్డంకి ఆమె ఉత్సాహాన్ని తగ్గించలేదు.


పేదలకు,  మహిళా విద్యకు మద్దతు..

ఒక కంటి చూపు పూర్తిగా కోల్పోయినప్పటికీ, ఎలిజబెత్ తన పట్టుదల వదులుకోలేదు.  ఆమె సోదరి ఎమిలీతో కలిసి 1853లో అమెరికాలో ఒక క్లినిక్‌ను ప్రారంభించింది. వారు దానికి "న్యూయార్క్ డిస్పెన్సరీ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్" అని పేరు పెట్టారు. పేద మహిళలు,  పిల్లలకు మహిళా వైద్యులు చికిత్స చేసే ప్రపంచంలోనే ఇది మొట్టమొదటి ప్రదేశం. తరువాత 1867లో ఇతర మహిళలకు వివక్షత లేకుండా వైద్యవిద్య  అభ్యసించే అవకాశాన్ని కల్పించడానికి ఆమె మహిళా వైద్య కళాశాలను స్థాపించింది. ఇదీ ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా వైద్యురాలి జీవిత పోరాటం.


                                     *రూపశ్రీ.

google-banner
vanitha-mob-card-img
vanitha-mob-card-img
vanitha-mob-card-img
vanitha-mob-card-img