మహిళల్లో PCOS ప్రారంభంలో కనిపించే లక్షణాలు ఇవి..!


PCOS, లేదా పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్.. చాలా మంది మహిళలు  తరచుగా  ఈ సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు.  కానీ దీన్ని గుర్తించడం మాత్రం చాలా కష్టం. ఇందులో  కష్టమైన విషయం ఏమిటంటే ఈ అకస్మాత్తుగా అకస్మాత్తుగా కనిపించేది కాదు. కానీ క్రమంగా చిన్న లక్షణాలతో  మొదలవుతుంది. పిసిఓఎస్ సమస్య ఉన్న చాలామంది మహిళలు తమకు అసలు ఆ సమస్య ఉందన్న విషయాన్ని కూడా గుర్తించలేరు. మరికొంతమంది మహిళలు లక్షణాలు కనిపిస్తున్నా తాత్కాలిక పరిష్కారాలతో సమస్యను పట్టించుకోరు.  పిసిఓఎస్ సమస్య ప్రారంభంలో కనిపించే లక్షణాలేంటో తెలుసుకుంటే..

 పిసిఓఎస్ ను ముందుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం..

PCOS ను ముందుగానే గుర్తిస్తే దాని ప్రభావాలను చాలా వరకు నియంత్రించవచ్చు. ఇది భవిష్యత్తులో సంతానోత్పత్తిని కాపాడటమే కాకుండా డయాబెటిస్ వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. కాబట్టి శరీరంలో కనిపించే  ముందస్తు  సంకేతాలను గమనించాలి.

నెలసరి..

ప్రతి మహిళకు పీరియడ్ సైకిల్  28 రోజులు ఉండదు.  కొన్నిసార్లు ఒత్తిడి, ప్రయాణం లేదా నిద్ర సమస్యల కారణంగా ఈ పీరియడ్ సైకిల్ మారుతుంది.  అయితే, PCOS ఉన్నవారిలో ఈ వ్యత్యాసం బాగా పెరుగుతుంది. కొంతమంది మహిళలకు నెలసరి 35 రోజుల కంటే ఎక్కువ ఆలస్యం అవుతుంది లేదా కొన్నిసార్లు నెలల తరబడి కూడా రాదు. కొంతమంది మహిళలకు నెలసరి వచ్చినప్పుడు అధిక రక్తస్రావం,  అలసట ఉంటాయి.  ఎందుకంటే PCOSలో అండోత్సర్గము సక్రమంగా ఉండదు.  దీని వలన హార్మోన్ల అసమతుల్యత,  శరీరంలో బ్యాలెన్స్ తగ్గుతుంది. అందుకే మహిళలలో నెలసరి విషయంలో ఏ చిన్న మార్పు గమనించినా, ఏ అసౌకర్యం అనిపించినా నిర్లక్ష్యం చేయకూడదు.

బరువు..

ఎంత  పనిచేసినా  బరువు నియంత్రణలో ఉండకపోగా బరువు పెరగడం జరుగుతుంది. PCOS ఉన్న మహిళలకు ఇది తరచుగా జరుగుతుంది.  ఎందుకంటే పిసిఓఎస్ ఉన్న మహిళల శరీరాలు ఇన్సులిన్ నిరోధకతను కలిగిస్తాయి. అంటే వారి శరీరం  చక్కెరను సరిగ్గా ప్రాసెస్ చేయలేదు. ఇది బరువు పెరగడాన్ని సులభం చేస్తుంది. ముఖ్యంగా బొడ్డు చుట్టూ లావుగా మారుతుంది. దీన్ని తగ్గించడం కష్టం. చాలామంది దీన్ని లేజీనెస్ వల్ల వచ్చిన సమస్య అని,  బరువు తగ్గడానికి ప్రయత్నం చేయకపోవడం వల్ల వచ్చిన సమస్య అని అనుకుంటారు. కానీ ఇది శరీరంలో హార్మోన్ల మార్పుల వల్ల వచ్చిన సమస్య.

అవాంఛిత రోమాలు..

గడ్డం మీద వెంట్రుకలు, పై పెదవిపై సన్నని గీతలు, కడుపు లేదా ఛాతీపై వెంట్రుకలు పెరగడం ఇవన్నీ PCOS  సాధారణ లక్షణాలు. వైద్యులు దీనిని హిర్సుటిజం అని పిలుస్తారు. కానీ చాలా మంది మహిళలు దీనిని అర్థం చేసుకోరు. PCOSలో శరీరంలోని ఆండ్రోజెన్ స్థాయిలు పెరుగుతాయి. దీనివల్ల సాధారణంగా జుట్టు పెరగని ప్రదేశాలలో జుట్టు పెరుగుతుంది. తరచుగా వ్యాక్సింగ్ లేదా థ్రెడ్డింగ్ చేయడం వల్ల కొంత ఉపశమనం లభిస్తుంది. కానీ వెంట్రుకలు పదే పదే మందంగా,  ముతకగా తిరిగి వస్తే అది హార్మోన్ల మార్పులకు స్పష్టమైన సంకేతం.

తలజుట్టు..

PCOS లో  చాలా గందరగోళపరిచే విషయమిది.  శరీరంలో అవాంఛిత రోమాలు పెరుగుతున్నప్పటికీ, తలపై కూడా వెంట్రుకలు రాలడం జరుగుతుంది. చాలా మంది మహిళలు హెయిర్ ఫాల్ అవ్వడాన్ని, జుట్టు బాగా పలుచగా మారడాన్ని ఎదుర్కొంటారు. ఈ మార్పులు అకస్మాత్తుగా కాకుండా నెమ్మదిగా  జరుగుతాయి.  అధికంగా వెంట్రుకలు రాలడం, తల చర్మం పైకి కనిపించడం వంటివి కూడా జరుగుతాయి.

చర్మంపై మచ్చలు, గుర్తులు..

PCOS అంటే నెలసరి రాకపోవడమే కాదు..  కొన్నిసార్లు దీని లక్షణాలు  చర్మంపై కనిపిస్తాయి. మెడ వెనుక, చంకలు లేదా తొడలపై ముదురు, మృదువైన లేదా మందమైన మచ్చలు వస్తుంటాయి. దీనిని అకాంథోసిస్ నైగ్రికన్స్ అని పిలుస్తారు. ఇది ఇన్సులిన్ నిరోధకతకు సంకేతం. ఈ మచ్చలు హానిచేయవు. కానీ శరీరం రక్తంలో చక్కెరను నిర్వహించడంలో ఇబ్బంది పడుతోందని ఇవి సూచిస్తాయి.  ఇది PCOS లో కీలకమైన విషయం.

గర్బం సమస్యలు..

చాలా మంది మహిళలు గర్భం రాలేదని వైద్యులను సంప్రదించినప్పుడు  తమకు PCOS ఉందని తెలుసుకుంటారు. అండోత్సర్గము క్రమం తప్పకుండా జరగనందున, గర్భం దాల్చడం కష్టమవుతుంది. దీని అర్థం గర్భం అసాధ్యమని కాదు,  దీనికి కొంత సమయం పడుతుంది,  వైద్యుల సహాయం అవసరమవుతుంది.

                          *రూపశ్రీ.