ఆ తర్వాత స్థిమితంగా కూర్చోలేకపోయాను.

 

    "నల్లులేమైనా కుడ్తున్నాయా? కుదురుగా కూర్చోకుండా అలా తన్నుకుంటున్నావు?" అంది అక్క.

 

    నేనేం మాట్లాడలేదు.

 

    ఇంటికొచ్చేటప్పుడు మళ్ళీ ఆటోలో నరకం. నా శరీరం అతనికి ఒరుసుకుపోతోంది. రోడ్లమీద గతుకులు కూడా అతనికి సహకరిస్తున్నాయి! పక్కన కొత్త పెళ్ళాంని పెట్టుకుని నన్నిలా తడిమి ఆనందించడం ఎందుకో నాకు అర్థం అవలేదు. ఇంట్లోకి రాగానే నీళ్ళ గదిలోకి వెళ్ళి శుభ్రంగా స్నానం చేశాను.

 

    "ఈ వేళప్పుడు స్నానమేమిటే?" అంది అమ్మ.

 

    "సినిమాహాల్లో బల్లులూ, తొండలూనమ్మా ఛీ! తలుచుకుంటేనే వెలపరంగా ఉంది!" అన్నాను.

 

    బావ చెవులపడ్డాయి ఆ మాటలు.

 

    తేలుకుట్టిన దొంగలా ఊరుకున్నాడు.

 

    అక్కని తీసుకుని బావ వెళ్ళిపోయినా ఈ సమస్య మీద నేను ఆలోచిస్తూనే ఉన్నాను. ఇలా ఆడపిల్లకి ఎందుకిన్ని సమస్యలు? వీళ్ళంతా మా చుట్టూ ఉన్నవాళ్ళు. తెల్లవారిలేస్తే ఎదురుపడే వాళ్ళు. ఎలా ఎదుర్కోవాలి? ఎలా తప్పించుకోవాలి?

 

    నాకు ఈ సమస్యకి పరిష్కారం లిల్లీ చెప్పింది!

 

    శనివారం గుడిలో చాలా రష్ గా ఉంది. అటు మగవాళ్ళూ, ఇటు ఆడవాళ్ళూ దడికట్టి నిలబడ్డారు. నేను ఒంటికాలిమీద నిలబడి మధ్యలోంచి తొంగిచూస్తూ దేవుడ్ని మొక్కుకొంటున్నాను.

 

    నాకు సడన్ గా వెనకాల ఏదో ఒత్తుకుంటున్నట్లుగా అనిపించింది. ఓ పక్క పూజారి తెచ్చే హారతి అద్దుకుంటూనే వెనక్కి తిరిగి చూశాను.

 

    యాభైపైబడి వుంటాయి. పంచె కట్టుకుని ఉన్నాడు. నన్ను దాదాపుగా ఆనుకుని నిలబడ్డాడు. నేను ఇంకాస్త ముందుకి జరిగాను. నేను జరుగుతున్నకొద్దీ నాతోపాటు జరుగుతున్నాడు.

 

    అతని శరీరం నా శరీరాన్ని హత్తుకుపోయినట్టు ఉంది. నేను విసుగ్గా చూస్తే... వెనకాల వాళ్ళమీద విసుగు నటిస్తున్నాడు. అతడికి తప్పకుండా నా ఈడు మనవరాళ్ళు ఉండి ఉండచ్చు! అదీ దేవుడి గుడిలో!

 

    ఏం చెయ్యాలో తోచక గబగబా లైన్ లోంచి బయటికి వచ్చేశాను. నవగ్రహాలకి ప్రదక్షిణం చేస్తుంటే -

 

    "హలో!" అని వినిపించింది.

 

    వెనక్కి చూస్తే లిల్లీ నవ్వుతూ పలకరిస్తోంది. నేనూ నవ్వుతూ పలకరించాను. ఇప్పుడు ఆ అమ్మాయి మీద నాకు జెలసీ లేదు.

 

    "దర్శనం అవకుండానే వచ్చాశావే?" అంది.

 

    నేను మాట్లాడకుండా ఇబ్బందిగా చూశాను.

 

    లిల్లీ దగ్గరకొచ్చి "ముసలాడు సతాయిస్తున్నాడు కదూ!" అంది.

 

    నేను ఆశ్చర్యంగా చూశాను.

 

    "ఓ రోజు నాతోకూడా అలాగేచేశాడు. ముసలాడు కదా అని ఒదిలేశాను. ఈ రోజు నిన్ను చూస్తుంటే వాడికిది రెగ్యులర్ ప్రాక్టీస్ అని తెలిసింది!" అంది.

 

    "రోగ్!" అన్నాను.

 

    "మరి రోగం కుదర్చాలిగా?" అంది.

 

    "అంటే!"

 

    తన మెడ దగ్గర్నుంచి సేఫ్టీ పిన్ తీసి "పద...వాడిపని చూద్దాం" అంది.

 

    "గుడిలోనా?" భయంగా అడిగాను.

 

    "దుష్టశిక్షణ చెయాల్సినచోటు ఇదే!" అంది.

 

    లిల్లీ వెనగ్గా వెళ్ళి నేనూ నిలబడ్డాను.

 

    ముసలాడు ఆదరాబాదరా మగపిల్లలిద్దర్ని తోసుకుంటూ మా దగ్గరికి వచ్చాడు.

 

    లిల్లీ పిన్ రెడీగా పట్టుకుంది.

 

    లిల్లీ వెనకాలకి వచ్చి ఆనుకుని నిలబడ్డాడు.

 

    ఆమె ఏం మాట్లాడలేదు.

 

    నేను వూపిరి బిగబట్టి చూస్తున్నాను.

 

    క్యూ ముందుకి కదుల్తోంది.

 

    ఇంతలో ముసలాడు గబుక్కున 'అబ్బా' అని అరుస్తూ క్యూలోంచి బయటికి పరిగెత్తాడు.

 

    లిల్లీ పిన్ దాచేసి చెంపలు వేసుకుంటూ ముందుకి నడిచింది. ఆమె ధైర్యానికి నేను విస్తుపోయాను.

 

    బయటికొచ్చి ప్రసాదం తింటూ వుండగా అడిగింది లిల్లీ "ఎందుకు నువ్వు ఇలాంటివాళ్ళని ఎదిరించవూ? వాళ్ళు ఇది నీకిష్టమనుకోరూ!"

 

    "అల్లరి అవుతుంది అని భయం" అన్నాను.

 

    "లుక్ ముక్తా... ముందు భయం అనే మాటని వదిలిపెట్టు. ఆడపిల్ల సోల్జర్ లా బ్రతకాలి. నువ్వు స్కౌట్స్ లో కానీ ఎన్.సి.సి.లో కానీ లేవా?" అడిగింది.

 

    నేను అడ్డంగా తలూపాను. ఆడపిల్ల అని సాగర్ ఎక్స్ కర్షన్ కి కూడా పంపలేదు ఎప్పుడూ మా ఇంట్లో.

 

    "మనం చాలా ఫాస్ట్ గా ఉండాలి. ఇలా పిరికిగా ఉంటే లాభంలేదు. ఎవరోవచ్చి మనని ఆపదల్నించి కాపాడ్తారని ఎదురు చూడకూడదు. ద్రౌపదిలా కాదు సత్యభామలా అస్త్రాల్ని చేతుల్లోకి తీసుకోవాలి!" అంది.

 

    అన్నీ తెలిసినట్లు అలా మాట్లాడుతున్న లిల్లీని చూస్తే నాకు ముచ్చటేసింది.

 

    "నాకో అక్క ఉంది తెలుసా? ఇప్పుడు ఆర్మీలో ఆఫీసర్ గా ఉంది. యూ.పి.లో పోస్టింగ్ వేశారు. నేనూ ఆర్మీలోకి వెళ్ళిపోతాను. జీనా హైతో మర్ నా సీఖో... కదమ్...కదమ్...పర్ లడ్ నా సీఖో!" అంది.

 

    నేను అపురూపంగా లిల్లీ వైపు చూశాను.