"ముందు ముందు నా కోసం మీరు ధైర్యంగా నిలబడతానని హామీ యివ్వండి. నేవెళ్ళి ఆ ముసలాయనకు అంతా చెప్పేస్తాను"

 

    "ఓ.కే... డన్... మీ కోసం ఎలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో నయినా నిలబడతాను. నమ్మండి..."

 

    తరణి నవ్వింది ధైర్యం పుంజుకుంటూ.

 

    ఆంజనేయులూ నవ్వాడు ఎందుకో తెలీకపోయినా.

 

    అదే సమయంలో తలుపు దబదబా చప్పుడయింది.

 

    తలుపు తీశాడు ఆంజనేయులు.

 

    ఎదురుగా అప్పల్రాయుడు నిలబడున్నాడు.

 

    "అయ్యగారు పిలుస్తున్నారు బాబూ"

 

    "నేవెళ్ళి మాట్లాడి మిమ్మల్ని పిలుస్తాను. మీరు రండి" అని చెప్పేసి బయటికొచ్చాడు ఆంజనేయులు.

 

    అప్పటికే-

 

    హాల్లో భుజంగరావు, ఆ ప్రక్కన జిగురుమూర్తీ కూర్చుని వున్నారు.

 

    "పిలిచారా అంకుల్?" చేతులు కట్టుకుని నిలబడి అడిగాడు ఆంజనేయులు.

 

    "అవును! పిలిచాను"

 

    "ఇక్కడకు రాకముందే నీకు పెళ్ళయింది కదూ?"

 

    "కాలేదు సర్"

 

    "ఫ్రీగా ఇల్లు కొట్టేద్దామని చెప్పి నువ్వు నాటకం ఆడావు కదూ?"

 

    "లేదు సర్"

 

    "ఒక ప్రక్క నువ్వు, ఇంకో పక్క మీ ఆవిడా... మా ఆవిడ్ని, నన్నూ మోసం చేస్తున్నారు కదూ?"

 

    "లేదు సార్! అంతా అబద్ధం సార్!"

 

    "మిస్టర్ ఆంజనేయులూ! నేను అమాయకుడిగా కన్పిస్తున్నాననుకుని నాతో ఆట్లాడుతున్నారు... నేను మీరనుకునే అమాయకుడ్ని కాదు... గుర్తుంచుకో... మీకు పెళ్ళయినట్టు నా దగ్గర సాక్ష్యాధారాలున్నాయి. మీ ప్రవర్తన గత వారం రోజులుగా నిఘా వేసిన వ్యక్తి ఈయన... ప్రఖ్యాత డిటెక్టివ్ జిగురుమూర్తి... చూడూ! రెండే రెండ్రోజులు టైమిస్తున్నాను... ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో..."  

 

    "తరణి చెప్పేది కూడా ఒకసారి వినండి సార్... మాకు పెళ్ళి కాలేదని..."

 

    "నీ పెళ్ళాం నీ మాట ఆడకుండా నా మాట ఆడుతుందా వెర్రి వాడా... నేను నమ్మను వెళ్ళు..." సీరియస్ గా అనేయడంతో మౌనంగా అక్కడ నుంచి వచ్చేశాడు ఆంజనేయులు.

 

    "ఏమైంది..." గదిలోకి అడుగు పెట్టిన ఆంజనేయుల్ని అడిగింది తరణి.

 

    "మనకు పెళ్ళి కాలేదంటే నమ్మడంలేదు ఆయన. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోమంటున్నాడు."

 

    "ఒక్కసారి ఈ గొడవంతా పిన్నిగారితో చెప్పి చూస్తే?" అంది తరణి.

 

    "లేదు తరణీ! లేనిపోని గొడవ... ఆవిడ అదోరకం... రెండ్రోజులు టైమిచ్చాడు కదా ముసలోడు... ఏదో ఉపాయం ఆలోచిద్దాం"

 

    ఒక అరగంట సేపు ఆలోచిస్తూ కూర్చుని-

 

    "అలా బైటికెళ్ళొస్తాను" తరణితో చెప్పి బయటికొచ్చాడు ఆంజనేయులు.

 

    క్రాస్ రోడ్స్, ఇందిరాపార్క్ మీదుగా టాంక్ బండ్ కొచ్చి అక్కడ చపటా మీద కూర్చుని హుసేన్ సాగర్ వేపు చూస్తున్నాడు ఆంజనేయులు.

 

    "హేయ్ ఆంజనేయులుగారూ..."

 

    ఆ పిలుపు విని తల తిప్పి చూశాడతను.

 

    "ఏవిటీ... ఈ సమయంలో ఇక్కడ..." ఆ ప్రశ్న వేసిందే తడవుగా-

 

    "పెళ్ళికాని ఆడపిల్లల కార్యక్రమాలేమిటో ఒక్కసారి చెప్పండి?" ఎదురు ప్రశ్న వేసింది మాథ్యూస్.

 

    "నాకేం తెలుస్తాయి?"

 

    "ఊహించి చెప్పండి సార్..." ప్రక్కనే అతనికి తగులుతూ కూర్చుంటూ అంది మేరీ మాథ్యూస్.

 

    "ఇలా తగులుతూ కూర్చోవాలా... కొంచెం... కొంచెం దూరంగా కూర్చుంటే బావుంటుందేమో..." తను ప్రక్కకు జరగటానికి 'ప్లేస్' లేకపోవడంతో ఆనక తప్పింది కాదు అతనికి.

 

    "కొన్ని వస్తువుల్ని మనం మరమ్మతు చేయలేం..." అని అతని చేష్టకు విసుక్కుని-

 

    "చెప్పండి... నేనడిగిన ప్రశ్నకు జవాబు చెప్పండి..." అంది.

 

    "పెళ్ళికాని ఆడపిల్లల కార్యక్రమాలా... అడ్డమయిన చెత్త సినిమాలూ చూడడం... అడ్డమైన చెత్త టీవీ. సీరియల్సూ చూడడం, అడ్డమైన చెత్త పత్రికలన్నీ చదవడం..."

 

    "ఆపండాపండి... మున్సిపాలిటీ ఎంప్లాయిలాగా... చెత్త, బురద, చెదారం తప్ప మీ భాషలో మరో పదం లేదా?" విసుక్కుంది.

 

    "మరేవిటి?"

 

    "పెళ్ళికాని అమ్మాయి వెతుక్కునేది ప్రేమ కోసం."

 

    "ప్రేమను వెతుక్కుంటూ, తిరుగుతూ టాంక్ బండ్ మీద కొచ్చారన్న మాట! బాగానే వుంది... లిబర్టీ, బషీర్ బాగ్ చౌరస్తాల్లో అమ్మడానికి అదేమైనా స్వీట్ షాపుల్లోని కోవాలాంటిదనుకున్నారా?"

 

    "కొంతమంది జీవితంలో ప్రతిదాన్నీ కొనుక్కోవాలి... లేకపోతే అవి దొరకవు. అభిమానాన్ని కొనుక్కోవాలి... ఆత్మీయతను కొనుక్కోవాలి... సానుభూతిని కొనుక్కోవాలి... ఆఖరికి ప్రేమను కూడా కొనుక్కోవాలి. అంతే... కొంతమండి బతుకులింతే..."

 

    సహజంగా ఆ మాటలనేసినా, మేరీమాథ్యూస్ మాటల వెనుక ఎంతో ఆర్తి వుంది.

 

    "మొన్న నా బర్త్ డేనాడు మీరొస్తే సిన్మాకెళదామనుకున్నాను. కానీ వీలుపడలేదు. ఇవాళ దొరికారు... రండి మా ఫ్లాట్ కెళదాం" లేస్తూ అంది మాథ్యూస్.

 

    "మీ ఫ్లాట్ కా?" ఆశ్చర్యంగా అన్నాడు.

 

    "ఏం పర్వాలేదులేండి... అక్కడ మీ బ్రహ్మచర్యానికి వచ్చిన నష్టమేమీ లేదు... పూచీ నాది రండి."

 

    కాసేపు 'రిలీఫ్'గా గడపాలనుంది ఆంజనేయులికి.

 

    మరో మాట అనకుండా "పదండి" అన్నాడు లేస్తూ.

 

    ఆటోని పిలిచింది మేరీ.

 

    "సికింద్రాబాద్... నటరాజ్ చౌరస్తా" చెప్పింది మేరీ మాథ్యూస్.

 

    మరో ఇరవై నిమిషాల తర్వాత నటరాజ్ చౌరస్తా దగ్గరలోని అపార్ట్ మెంట్స్ లో ఓ ఫ్లాట్ లో ఉన్నారిద్దరూ.