రాత్రి ఆమెతో జరిగిన ప్రసంగం జ్ఞాపకం వచ్చింది. ఇద్దరి సంభాషణా యెంత తీవ్రరూపం దాల్చింది? యిద్దరూ రెండు విచిత్ర ప్రకృతుల్లా మాట్లాడారు. ఒకరి బరువును ఒకరు యెంత సాహసంతో మోస్తున్నారు! అతనికి నవ్వు వచ్చింది. ప్రపంచంలో యింతకంటే పెద్ద విషవలయం లేదనుకున్నాడు.

 

    తాను యెంత దూరంగా ఉందామన్నా, అంటీ అంటనట్లు పోదామన్నా రోజుకు ఏడెనిమిది సార్లయినా ఆమెను యెదుర్కొనక తప్పదు. ఉదయం కాఫీ యిచ్చేటప్పుడూ, స్నానందగ్గర, భోజనాలదగ్గర, తాంబూలం తీసుకురావటం, మధ్యాహ్నం కాఫీ, తిరిగి రాత్రి భోజనాల్ వద్ద. పడుకోబోయేముందు సరే సరి.

 

    అయితే ఆమె ఎంతవరకూ అవసరమో అంతే ముక్తసరిగా మాట్లాడుతుంది. రాత్రిళ్ళు యిరువురూ ఒకే మంచంపై పరుంటున్నా తమ సంబంధబాంధవ్యాలు చాలా పరిమితం. సాధారణంగా ఆమె పడుకుని నిద్రపోయాక గాని, అతను కదిలి వెళ్ళడు. రాత్రిలా సుదీర్ఘ సంభాషణ యే అమావాస్యకో, పౌర్ణానికో తప్ప జరుగదు.     

 

    సీత అందమైనదే అయితే, విద్యావతే అయితే, గడుసుపిల్లే అయితే తానామెను యిలా చుల్కన చేయటానికి వీలయేదా? తనను లొంగదీసుకుని ఉండేదేమో. ఆమె ఆకర్షణకు తాను గురి అయ్యేటట్లు చేసుకొనేదేమో.

 

    మధ్యాహ్నం పన్నెండు గంటలవేళ, భోజనమయాక కిటికీ దగ్గరగా నిల్చుని సిగరెట్టు కాల్చుకుంటున్నాడు శేషశాయి క్రిందకి చూస్తూ.

 

    సందులో జన సంచారమే లేదు. ఈపాటికి అందరూ భోజనాలు ముగించుకుని మధ్యాహ్నపు నిద్రలో ఉంటారు. పొలాల్లో పనికి వెళ్ళినవారు, అక్కడే భోజనం ముగించుకుని, విశ్రమించుతూ ఉండి ఉంటారు. ఎంత చప్పగా, నిస్సారంగా ఉంది యిక్కడి జీవితం! ఈవేళకే తాను ఆమెరికాలో ఉన్నప్పుడు యెలా ఉండేది? ఆవేశం,ఉద్రేకం, కోలాహలం...తను మళ్ళీ అనుభచించగలడా?"

 

    కిటికీలోంచి క్రిందకి చూస్తున్న అతను ఉన్నట్లుండి ఉలిక్కిపడ్డాడు. సీత తమ యింటి మెట్లు దిగి గబ గబ నడుచుకుంటూ ఉత్తరదిశగా వెళ్తున్నది.

 

    అతనికి అర్థంకాలేదు. యింత ఎండలో, వేళగాని వేళ సీత ఎక్కడకుపోతున్నది? ఎవరూ తోడు లేకుండా ఆమె యిల్లు విడిచిపెట్టి ఎక్కడకూపోదే? ఎంత సమాధానపడదామని చూసినా ఆమె చర్య అతనికి స్వాభావికంగా తోచలేదు. విషయమేమిటో తెలుసుకుందామని అతనిలో కుతూహలం తల ఎత్తింది. "ఎల్లమ్మా!" ఎల్లమ్మా!" అని పనిమనిషిని పిలిచాడు గట్టిగా.

 

    క్రింద గదిలో అమ్మగారి పాదాలకు నూనె రాస్తున్న యెల్లమ్మ "వస్తున్నా బాబూ!" అని ఆదరాబాదరాగా పైకి పరిగెత్తుకు వచ్చి "ఏమిటి అయ్యగారూ?" అని అడిగింది.

 

    "మీ చిన్నమ్మగారు ఎక్కడకు వెడుతున్నారు?"

 

    "దేవాలయానికి అయ్యగారూ! వేదితమ్మగారిని చూడాలని ఉందని ఈ మధ్య పెద్దమ్మగారు నాతో కబురంపారు. ఆయమ్మగారికి వంట్లో సులువుగా ఉండటం లేదట, అందుకని నాతో రాలేదు. ఇయాల చిన్నమ్మగారు మనసు బాగుండలేదని, కాసేపు గుళ్ళోకిపోయి వేదితమ్మ గారితో కబుర్లు చెప్పివస్తానని బయల్దేరినారు బాబుగారూ" అని చెప్పింది పనిమనిషి.

 

    "సరే, నువ్వెళ్ళు."

 

    అది వెళ్ళిపోయాక అతను ఆలోచిస్తూ నిలబడ్డాడు. యెప్పుడూ లేనిది సీతకు ఈ బుద్ధి ఎందుకు పుట్టింది? ఆమె వంటరిగా తిరిగే చొరవ, తెలివితేటలు గలది కాదే. రాత్రి ఆమె ప్రవర్తన, సంభాషణ గుర్తువచ్చింది. అతని అంతరంగంలో అవ్యక్తమైన అనురాగం పొడసూపింది. అంతలో అతనకి గోవిందాచార్యులుగారు ఊళ్లోలేరన్న సంగతి గుర్తుకు వచ్చింది. అవును, తన తల్లి మందుకోసం నిన్న కబురుచేస్తే ఆయన పనిమీద గ్రామాంతరం వెళ్ళాడనీ నాలుగయిదు రోజుల వరకూ తిరిగి రాడనీ సమాధానం వచ్చింది. ఈ విషయం గుర్తుకు రాగానే అతని అనుమానం మరీ దృఢపడింది. ఇంక వెనకా ముందు ఆలోచించకుండా చెప్పులు తొడుక్కుని తను వేసుకున్న పైజమా, లాల్చీలతోనే అతను బయల్దేరాడు.  

 

    సీత కాళ్ళకు చెప్పులైనా లేకుండా అంత ఎండలో నడిచివెళ్ళి దేవాలయంలో ప్రవేశించి, వేదిత కుటీరం దగ్గరకు చేరుకునేసరికి ఆమె చాప మీద కూర్చుని తంబూరా శృతి చేసుకుంటూ కనిపించింది. సీతను చూడగానే వేదిత ముఖం విప్పారింది. "రా అమ్మా! ఈ దీనురాలి కుటీరం మీద ఇంత దయ కలిగిందేం ఇవేళ?" అన్నది ఆదరపూర్వకంగా తంబూరా ప్రక్కకి పెడుతూ.

 

    సీత లోపలికి వెళ్ళి ఆమె ప్రక్కన కూర్చుంటూ అందరూ మిమ్మల్ని 'అమ్మా' అని పిలుస్తారు. నేను 'అక్కా' అని పిలుస్తాను అభ్యంతరమా?" అన్నది.

 

    వేదిత మందస్మిత వదనంతో "అభ్యంతరమా? ఈ వేదితకు అభ్యంతరాలూ, అహంకారాలూ లేవు తల్లీ. నన్ను పేరు పెట్టి పిలిస్తే మరీ సంతోషిస్తాను" అంది.

 

    "ఉహుఁ మిమ్మల్ని అక్కా అనే పిలుస్తాను. అదే నా కోరిక."

 

    "నీ ఇష్టమమ్మా, నిప్పులు చెరిగే ఎండలో నడిచి వచ్చావు. నీ లేత పాదాలు ఎంత కందిపోయాయో చూడు" అంది వేదిత సానుభూతిగా ఆమె పాదాల వంక చూస్తూ.

 

    "కందిపోనివ్వండి. నాలో ఎక్కడన్నా సున్నితత్వమా? పాడా? మోటుమనిషినాయె."

 

    "అదేమిటమ్మా? నీవు మోటుమనిషి వేమిటి? వజ్రాల తునకవు. బంగారు తల్లివి."

 

    "అలా పొగడకండి నన్ను. నేను చాలా దుర్మార్గురాలిననీ, హృదయంలేనిదానిననీ తెలుసుకునేసరికి సమయం మించిపోయింది మీకు."

 

    వేదిత మృదువుగా ఓ నవ్వు నవ్వి. "సమయం మించిపోతుందా? మంచిదే! ఆ సమయం కోసమే నేనూ చూస్తున్నాను" అంది.

 

    సీత కంగారుపడి "మీరు నా మాటల్ని అపార్థం చేసుకున్నట్టున్నారు. మిమ్మల్ని పూజించే వారిలో నేనూ ఒకర్ని" అంది గాద్గదిక కంఠంతో.

 

    వేదిత ఆదరంగా ఆమెను దగ్గరకు తీసుకుని శిరస్సు నిమురుతూ "తెలుసునమ్మా! నీలాంటి చెల్లెలుండటంవల్ల నేను ధన్యురాల్ని అయినాను. నా జీవితం యింత ప్రశాంతంగా గడిచిపోతే చాలుననే నేను సదా భగవంతుడ్ని ప్రార్థిస్తూ ఉంటాను" అంది ఆర్థ్రస్వరంతో.

 

    కాసేపటివరకూ సీత ఆమె కౌగిలిలో ముగ్ధబాలినిలా ఒదిగి ఉంది. బయటకు ఆమె ముఖం ప్రశాంతపద్మంలా, నిష్కపటంగా ఉంది. కాని ఆమె హృదయంలో ఎంత ఝుంఝూనిలం చెలరేగుతోందో, ఎన్ని ఆశనిపాతాలతో తూట్లుపడుతున్నాడో ఎవరికి తెలుస్తుంది?