సంధ్య కొద్దిగా కదిలింది. కళ్ళు చిట్లించింది. అప్పుడే స్పృహలోకి వస్తున్నట్లు కనపడింది.
    
    "నీ లాకెట్ నాకు దొరికింది" ఆమె చెవి దగ్గర నోరుపెట్టి చెప్పింది చాయ.
    
    సంధ్య కళ్ళు తెరుచుకున్నాయి. చాయ మాటలు అర్ధమవడానికి కాస్త టైం పట్టింది. అర్ధం అవగానే ఆమె ముఖంలో ఆనందం వెల్లువలా పొంగుకొచ్చింది.
    
                                                            * * *
    
    "గుడ్ మార్నింగ్ సర్!" నమ్రతగా కొద్దిగా తలవంచి, ఆత్మీయమైన స్వరంతో అంది లూసీ.
    
    "గుడ్ మార్నింగ్.....ఎనీ ఇంపార్టెంట్ కాల్స్?" రొటీన్ గా అడుగుతూ తన ఛాంబర్ లోకి నడిచాడు జయచంద్ర.
    
    "యా.....అంబర్ ఎక్విప్ మెంట్స్ ఎమ్.డీ.ని త్రీఓ క్లాక్ కి మీట్ అవ్వాలి. మిస్టర్ ధావన్ బేంగ్లూర్ నుండి ఫోన్ చేశారు...." అంటూ అతన్ని అనుసరించి అతని ఛాంబర్ లోకి వచ్చింది అతని పర్సనల్ సెక్రటరీ లూసీ.
    
    "కూర్చోండి" జయచంద్ర మర్యాదగా ఆమెకి సీట్ ఆఫర్ చేశాడు.
    
    "థాంక్యూ మిస్టర్ జే.సీ!" కూర్చుంటూ అంది లూసీ.
    
    యాభై ఏళ్ళు పైబడిన లూసీ జయచంద్రకి అతని తండ్రి హయాం నుండీ తెలుసు! చాలా ఏళ్లుగా ఆమె అక్కడ వర్క్ చేస్తోంది. వయసు ఆమె చురుకుదనం మీద, శ్రద్దమీదా ఇంకా తన ప్రభావం చూపెట్టలేకపోతోంది.
    
    ఫోన్ లో ఆమె కంఠం విని ఫ్లాట్ అయిపోయి, ఆఫీసుకొచ్చి ఖంగుతిన్న వాళ్ళెంతమందో!
    
    ఓ వైపు నెరిసిన జుట్టును డై చెయ్యకుండా అలాగే వదిలేసి "ఇందిరాగాంధీ స్టయిల్" అని నవ్వుతుంది.
    
    జయచంద్ర అడిగినప్పుడు మాత్రం "ఐ డోంట్ వాంట్ టూ డై జే.సీ! మీ దగ్గర మరో యాభై సంవత్సరాలు ఇలాంటి అధికారంతోనే పని చెయ్యాలనుంది" అని చిలిపిగా నవ్వుతుంది.
    
    ఆమె ఫ్రాక్ లో ఫ్రీగానూ, చీరలో కాస్త బిగుసుకుని, సిగ్గుపడుతూ వుంటుంది. ఎక్కువగా సిగ్గుపడాల్సిన అవసరాన్ని రానియ్యదు.
    
    జయచంద్ర టేబుల్ మీదున్న బొకేని చూస్తూ "ఇవేమిటీ?" అన్నాడు.
    
    "ఫ్లవర్స్" సీరియస్ గా అంది లూసీ.
    
    "అఫ్ కోర్స్......కానీ...."
    
    "తెలియదు. దానికో స్లిప్ గుచ్చబడి వుంది. ఆ స్లిప్ లో ఏం వుందో నేను చదవలేకపోయాను."
    
    "ఏం?" స్లిప్ కోసం వెదుకుతూ అన్నాడు జయచంద్ర.
    
    "అది తెలుగులో వ్రాసుంది" అంది లూసీ.
    
    జయచంద్ర కొద్దిగా ముఖం చిట్లించి తెలుగు అక్షరాల్లో వ్రాసున్న ఆ ఇంగ్లీష్ మేటర్ని పైకే చరివాడు. "నెవర్ సెనో టూ గుడ్ థింగ్స్ ఆఫ్ లైఫ్."
    
    "కరెక్ట్" అని నవ్వి "ఏ బేడ్ పర్సన్ ఈజ్ బెటర్ దెన్ నన్!" అంది లూసీ.
    
    "యూ మీన్ నన్!" క్రాస్ గుర్తు చూపిస్తూ కంగారు అభినయించాడు జయచంద్ర.
    
    "నో.....ఎన్ ఓ ఎన్ ఈ నన్!" నవ్వుతూనే చెప్పింది లూసీ.
    
    జయచంద్ర కూడా నవ్వేస్తూ బొకేని పక్కకి జరపబోయాడు. దాని వెనకాలవైపు ఇంకో స్లిప్ కనిపించింది. ఆ స్లిప్ కి చెవి రింగు గుచ్చబడి వేళ్ళాడుతోంది.
    
    "నేను ఒంటరిగా మిగిలాను. దయచేసి నా జోడును ప్రసాదించండి" అని వ్రాసుంది.
    
    జయచంద్ర ఆ రింగును చేతిలోకి తీసుకుని ఆలోచనగా చూశాడు. ఏమీ అంతుపట్టలేదు. అనాలోచితంగా దాన్ని కోటు జేబులో వేసుకున్నాడు.
    
    ఇంతలో లూసీ "ఈ రోజు మీ ఎంగేజ్ మెంట్స్ లో మొదటిగా...." అంటూ చదవడం మొదలుపెట్టింది.
    
                                            * * *
    
    "ఈరోజు చాలా అలిసిపోయినట్లున్నారు" అంది అలసిపోయినట్లున్న జయచంద్ర ముఖాన్ని చూస్తూ కాంచన.
    
    "అవును కాంచనా! ఊపిరి సలపనివ్వని పనులు" కోటు విప్పుతూ అన్నాడు జయచంద్ర.
    
    కాంచన అతనివెనుకగా నిలబడి కోటు అందుకుంటూ "ఆద్మీ కో జీనే కేలియే దో ఛీజ్ బస్ హై.....ఏక్ రోటీ ......దూస్ రీ లంగోటి! వాటికోసం ఇంత ప్రయాసపడాలా అన్నాడో పెద్దమనిషి" అని నవ్వింది.
    
    జయచంద్ర చాలా క్యాజువల్ గా "ఇంకోటి కూడా కావాలి. ఆ విషయం గురించే చెప్పలేదా ఆ పెద్దమనిషి" అన్నాడు.
    
    నవ్వుతున్న కాంచన ముఖంలో నవ్వు మాయం అయింది. ఠక్కున తల వంచుకుంది.
    
    ఆమె మాట్లాడపోయేసరికి వెనక్కి తిరిగిన జయచంద్రకి తను చేసిన తప్పేమిటో తెలిసింది.
    
    "మనిషికి ముఖ్యంగా కావాల్సింది మనశ్శాంతి కాంచీ!" అన్నాడు ఆమెను దగ్గరగా తీసుకుంటూ.
    
    "ఉండండి.....కోటు అల్మారాలో పెట్టొస్తాను" అంది దూరంగా జరుగుతూ కాంచన.
    
    "డాక్టర్ గారు ఈ రోజు హాస్పిటల్ కి రమ్మన్నట్లున్నారు.....వెళ్ళావా?" అడిగాడు.
    
    "ఆ.....వెళ్ళాను" అంది.
    
    "ఏవన్నారూ?"
    
    "అంతా మామూలే" నిర్లిప్తంగా అని వెళ్ళిపోయింది కాంచన.
        
    జయచంద్ర స్నానం చేసి వచ్చేసరికి కాంచన ఇంకా అల్మారా దగ్గరే నిలబడి ఏదో ఆలోచిస్తూ కనపడింది.
    
    ఆమెను అలా చూసేసరికి అతని హృదయాన్ని ఎవరో పట్టి మెలితిప్పుతున్నట్లుగా అనిపించింది. దగ్గరికి వెళ్లి ఆమె భుజాలు పట్టి తనవైపుకి తిప్పుకున్నాడు.
    
    "ఏమైంది కాంచనా? అలా వున్నావేం? డాక్టర్ గారు ఏవన్నారూ?" ఆమె తలని మృదువుగా నిమురుతూ అడిగాడు.

    ఆమె మాట్లాడలేదు. ఆమె వెచ్చని కన్నీరు అతని గుండెని తడిపేస్తోంది. కోటుతో బాటు వచ్చిన రెండో రింగును మొదటి రింగుతో జత కలిపి మళ్ళీ కోటుకే పెట్టేసినప్పటి నుండీ ఆమెకి మళ్ళీ గుండెల్లో నొప్పి మొదలయింది. అయినా ఆ బాధని ఆమె బయట పడనివ్వలేదు. మునిపంటితో పెదవిని బిగబట్టి బాధను ఓర్చుకోవడం ఆమెకు అలవాటే!
    
    తలుపులు బాహ్డుతున్న మృత్యువును ఆపుతూ తను ఎంతోకాలం ఇలా అడ్డంగా నిలబడలేనని జయచంద్రకి తెలుసు. ఆమె అందుకే బాధపడుతోంది అనుకున్నాడు.
    
    "నొప్పిగా వుందా?" లాలనగా అడిగాడు.