ఇక మీ చర్మం పొడిబారదు

 

వర్షాలు తగ్గుముఖం పట్టాయి. శ్రావణమాసం కూడా వచ్చేసింది. ఇక చలి కూడా మొదలైపోతుంది. చలి మొదలైందంటే రకరకాల చర్మసమస్యలూ పలకరిస్తాయి. ముఖ్యంగా చాలామంది పొడిబారిన చర్మంతో బాధపడుతూ ఉంటారు. గాలిలో తేమ తక్కువగా ఉండే హైదరాబాద్ వంటి నగరాలలో అయితే ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. మరి పొడిబారిన చర్మం నుంచి కాపాడే చిట్కాలే లేవా అంటే లేకేం! బోలెడు ఉన్నాయి....

ఇలా స్నానం చేయండి

మనం స్నానం చేసే తీరుతో చర్మం ప్రభావితం అవుతుందని ఎప్పుడన్నా గమనించారా!

- మరీ వేడి నీటితో స్నానం చేయడం వల్ల చర్మం మీద ఉండే కాస్త తేమ కూడా ఆవిరైపోయి, మరింత పొడిబారిపోతుంది. స్నానానికి చల్లటి నీరు లేదా గోరువెచ్చటి నీటిని మాత్రమే వాడాలి.

- చాలా సబ్బులు మన చర్మాన్ని మరింత పొడిబారేలా చేస్తాయి. కాబట్టి మాయిశ్చరైజర్లలా పనిచేసే సబ్బులనే వాడే ప్రయత్నం చేయండి. వీలైనంత వరకూ పొడిబారిన ప్రదేశాల మీద సబ్బుని ఎక్కువగా రుద్దకపోవడం మంచిది.

- పొడిబారిన చర్మం ఉన్నవారు స్నానాన్ని కాస్త త్వరగా ముగించడమే మంచిది. ఎంత ఎక్కువసేపు నీటిలో నానితే, మన చర్మం అంత ఎక్కువగా దెబ్బతినే ప్రమాదం ఉంది.

- స్నానం తర్వాత ఒంటిని తుడుచుకోవడంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. పొడిబారిన ప్రదేశాల మీద తువాలుని అదిమితే సరిపోతుంది. తువాలుతో గట్టిగా రుద్దడం వల్ల కూడా చర్మం తన సహజసిద్ధమైన తేమని కోల్పోయే ప్రమాదం ఉంది.

నీళ్లు ఎక్కువగా తాగండి

చలికాలం దాహం తక్కువగా వేసే మాట నిజమే! అందుకనే మనం అసలు నీరు తాగడమే మర్చిపోతుంటాము. కానీ దాహం వేసినా వేయకున్నా, తరచూ నీరు తాగుతూ ఉండాల్సిందే! లేకపోతే ఒంట్లోని విషపదార్థాలు (toxins) ఒంట్లోనే ఉండిపోతాయి. చర్మం, గోళ్లు, వెంట్రుకలకి తగినంత తేమ లభించక అవి పొడిబారిపోతాయి.

చలిగాలుల నుంచి దూరం

కాళ్లు, చేతులు పొడిబారిపోయే ఇబ్బంది ఉన్నవారు.... ఈ చలికాలం దాటిపోయేదాకా వాటిని కాపాడుకోవాల్సిందే. ఇంట్లో ఏసీ వేసినా, బయట చలిగాలిగా ఉన్నా... కాళ్లు, చేతులు పూర్తిగా కప్పి ఉండేలా చూసుకోవాలి. అవసరం అనుకుంటే కాస్త పొడవాటి సాక్స్ (stockings) వేసుకోవడానికి కూడా మొహమాటపడకూడదు.

సహజసిద్ధమైన ఆయిల్స్

పొడిబారిన చర్మం ఉందనగానే చాలామంది రకరకాల లోషన్లు పూసేస్తూ ఉంటారు. వీటికంటే సహజసిద్ధమైన ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె, బాదం నూనె లాంటి నూనెలను పొడిబారిన చర్మానికి పట్టిస్తే చాలా ఉపయోగం అంటున్నారు నిపుణులు.

ఇవి కూడా ఉపయోగమే!

- పాలల్లో దూది ముంచి పొడిబారిన ప్రాంతంలో ఆ దూదిని అద్దితే ప్రభావం కనిపిస్తుంది.

- చర్మానికి తేనెని మించి దివ్యౌషధం లేదు. కాబట్టి చర్మం గరుకుతేలిన చోట ఓ పదినిమిషాల పాటు తేనె రాసి కడిగేసుకోండి.

- చర్మానికి తిరిగి జీవం తీసుకురావడంలో అలోవెరాని మించినదేముంది! కాసిని అలోవెరా చక్రాలని పొడిబారిన ప్రదేశంలో ఉంచి చూడండి.

- పెట్రోలియం జెల్లీ (వేజ్లైన్) రాయడం వల్ల కూడా చర్మానికి తగినంత తేమ దొరుకుతుంది.

ఇంతేకాదు! తరచూ వ్యాయామం చేయడం, మంచి పోషకాహారాన్ని తీసుకోవడం వల్ల కూడా చర్మం ఆరోగ్యంగా, కాంతిమంతంగా ఉంటుంది.

- నిర్జర.